లోక్‌పాల్ ఆలోచన మొట్టమొదట అంకురించింది స్వీడన్ దేశంలో. “ఆంబుడ్స్మన్” అన్న భావన నుంచి 1809లో స్వీడన్ అక్కడి ప్రాధాన్యాలకు అనుగుణంగా లోక్‌పాల్ వ్యవస్థను రూపొందించుకుంది. తదనంతరం 1919లో ఫిన్లాండ్, 1955లో డెన్మార్క్, 1962లో న్యూజిలాండ్, 1967లో ఇంగ్లాండ్ తదితర దేశాల్లో ఈ వ్యవస్థను పోలిన సంస్థలు ఉన్నాయి. ఆ తర్వాత పోలాండ్, జపాన్, వెస్ట్ జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశాల్లో వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ఆయా దేశాల్లో అవినీతి నిర్మూలన అంతమైందా అంటే సమాధానం చెప్పలేం. కానీ, అవినీతిపరుల బారి నుంచి కొంతలోకొంత రక్షణ లభించినట్టు ఆయా దేశాలు చెప్పాయి. ఈ దేశాల అనంతరం 1959లో సి.డి.దేశ్‌ముఖ్ భారతదేశంలో “లోక్‌పాల్” వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అనేక సార్లు లోక్‌పాల్ బిల్లును ప్రస్తావించినా కార్యరూపం దాల్చలేదు. భారత పరిపాలనా సంస్కరణల సంఘం 1969 నివేదికలో లోక్‌పాల్ ప్రస్తావించడం గమనించాలి. అలాగే రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త వ్యవస్థలను ఏర్పరచాలని కూడా సూచించింది. ఆ తర్వాత 1968లో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ మొదటిసారి లోక్‌పాల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు లోక్‌సభ ఆమోదించింది. కానీ రాజ్యసభ ఆమోదం పొందక ముందే, రాష్ట్రపతి 1970లో లోక్‌సభ రద్దు చేయడంతో బిల్లు వీగిపోయింది.
ఆ తర్వాత ఎనిమిదిసార్లు ఈ బిల్లు కోసం పట్టుబట్టారు. రెండు, మూడు, నాలుగు బిల్లులు లోక్‌సభ రద్దు కావడంతో పోయింది. ఐదో బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆరు, ఏడు బిల్లులకు 11వ, 12వ లోక్‌సభలు రద్దు కావడం, 8వ బిల్లు 2001లో 13వ లోక్‌సభ రద్దు కావడం వల్ల వీగిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న 14వ లోక్‌సభ ముందుకు కొత్త బిల్లు రానుంది. ఇలా బిల్లు మొత్తంగా తొమ్మిది సార్లు లోక్‌సభ గడప తొక్కినా ఫలితం మాత్రం దక్కలేదు. లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రి , ప్రధాన న్యాయమూర్తి, లోకాయుక్తలను చేర్చే విషయంలోనే రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయలు నెలకొని వున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అయినప్పటికీ పటిష్టమైన లోక్‌పాల్ బిల్లుకు అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. శనివారం లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లుపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చర్చించిన అంశాలపై ఆయన లోక్‌సభ నేత హోదాలో ప్రణబ్ ముఖర్జీ ఒక ప్రకటన చేశారు. లోక్‌పాల్ ముసాయిదా తయారీ కమిటీ తొమ్మిది సార్లు సమావేశమైందన్నారు. ఇందులో అన్నా బృందం పెట్టిన 40 షరతుల్లో 20 డిమాండ్లను అంగీకరించినట్టు చెప్పారు. ఆరు షరతులపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. అలాగే లోకాయుక్తను ఏర్పాటు చేయడంలోనూ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయలు ఉన్నాయని సభకు తెలిపారు. ప్రస్తుతం లోక్‌పాల్ బిల్లుపై లోపలా బయటా చర్చ జరుగుతుందన్నారు. గత మే 31వ తేదీనే లోక్‌పాల్‌పై అభిప్రాయం తెలుపాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం జరిగిందని, దీనిపై 21 మంది ముఖ్యమంత్రులు స్పందించారని చెప్పారు.
Recent Comments