Search

Full Story

All that around you

Month

May 2013

ఫోటో జెనిక్ బ్లాగు!


డియర్ వేణూ,
తలషేపు, మొహం షేపులతో కలిపి ఎలా చూసినా అందంగా కనిపించడమే ఫొటోజెనిక్ అని ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ పట్నాయక్ వల్ల ఈ మధ్యే తెలిసింది. ఈ ప్రకారం ఎన్ టి ఆర్ , మహేష్ బాబు 9 ఏంగిల్స్ లోనూ, నాగార్జున , పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్ టి ఆర్ 8 ఏంగిల్స్ లోనూ ఎ ఎన్ ఆర్ 6 ఏంగిల్స్ లోనూ ….బాగుంటారు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ లగురించి మాట్లాడటంలేదు. వాళ్ళు మొహాలకు సర్జరీలు చేయించుకుసన్నారు కనుక.
బండముక్కు కారణంగా సైడ్ ఏంగిల్ లో ఫోటోలు అస్సలు తీయకూడని వారిలో కెసిఆర్ ఫస్ట్ అయితే నేను సెకెండ్..:)))))
ఇదంతా సరేగాని, మీ బ్లాగు చూస్తూంటేనే బాగుంది. మనసుకి హాయి అనిపించే అభిరుచులను ఆస్వాదిస్తున్నమీకు , ఆ ఆనందాన్ని అక్షరాలా మాకు పంచుతున్నందుకు కూడా అభినందనలు. 
సునిశితమైన పరిశీలన,తపస్సు లాంటి దీక్ష మీ బ్లాగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పోస్టులో ఇందులో మొదటి రెండు లైన్ల డిస్ క్లయిమర్ లో చమత్కారం ఓ చిరునవ్వుని మొలిపిస్తుంది.
ఎన్ టి ఆర్ మొహమంత/ముక్కంత  ఫొటో జెనిక్ గా వుంది మీ బ్లాగు

జీవితేచ్ఛ


తడి ఆర్చుకుపోయినపుడు, రక్తంలో అక్సిజన్ అంతరించి శరీరంలో ఏఅవయవానికీ పోషకపదార్ధం అందని స్ధితే వడదెబ్బకు మరణించడం అంటే. విపరీతమైన ఎండ శరీరంలో తడిని ఆవిరిచేస్తూంది. చెమటలు పట్టంలేదు కాబట్టి సురక్షితమనుకుంటే పొరపాటే! ఎండమండిపోతున్నా దాహంవేయడంలేదు కాబట్టి నీళ్ళుతాగఖ్ఖరలేదనుకుంటే ప్రాణాంతకమే! విజ్ఞానం సాధించిన మనుషులకు ఇది ఎంతవరకూ అర్ధమైందో తెలియదుకాని, ప్రకృతే నేర్పిన జ్ఞానంతో తేనెటీగలు తడారిపోకుండా తమను తాము కాపాడుకుంటున్న ఈ సన్నివేశం సమస్త ప్రాణులకూ ఎండలగండాన్ని సూచిస్తోంది.ఇంకా గౌరవంగా, కాస్తమర్యాదగా


పాతేస్తే మన్నూ, కాల్చేస్తే బూడిదా అనేమాటనిజమేకాని ప్రాణం పోయిన మనిషి అంతిమ యాత్ర ఇంత దారుణంగా వుండటం సమాజపు నాగరీకతకీ, మనిషి సంస్కారానికీ మాయని మచ్చలుగానే వుండిపొతాయి. తూర్పుగోదావరిజిల్లా లో రైలునుంచి జారిపడి చనిపోయిన వ్యక్తి పోస్టుమార్టమ్ కోసం సైకిల్ మీద వేలాడదీసి తరలిస్తున్న సన్నివేశమిది. అనాధమృతదేహాలకీ, ఎన్ కౌంటర్లలో చనిపోయినవారి మృతదేహాలకీ – చచ్చిపోయిన పశువుల్ని ఈడ్చేయడానికీ పెద్దతేడా వుండదు. సంక్షేమకార్యక్రమాలకి వేలు లక్షల కోట్లరూపాయలు ఖర్చుచేస్తున్నప్రభుత్వాలు మనిషి అంతిమ యాత్ర కాస్త మర్యాదగా కాస్త గౌరవంగా పూర్తయ్యే ఏర్పాట్లు చేస్తే బాగుండును!

అనుభూతి చెందితేతప్ప చిరునవ్వు, దుఃఖం లాంటి ఉద్వేగాలు మొహంమీద కనిపించవు….ఇపుడు చంద్రబాబు నవ్వగలుగుతున్నారు


అనుభూతి చెందితేతప్ప చిరునవ్వు, దుఃఖం లాంటి ఉద్వేగాలు మొహంమీద కనిపించవు. ఇవి తెలివితేటలకు సంబంధించినవి కావు. ఇవి హృదయానికి సంబంధించినవి. ఇపుడు చంద్ర బాబు నవ్వగలుగుతున్నారు


జర్నలిస్టునై వుండటంవల్ల చంద్రబాబు నాయుడుతో, ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ, ప్రతిపక్షనాయకుడిగా వున్నపుడూ చాలాసార్లు మాట్లాడే అవకాశం దొరికింది. చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగింది.

నవ్వకపోవడం చూసి, (అధికారంలో లేనపుడుకూడా) ప్రజలు అతిసమీపంలోకి వచ్చే అవకాశమే ఇవ్వకపోవడం చూసి ఈయనకి మెదడుతప్ప హృదయంలేదేమో అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఒకసారి అనిపించింది.

విక్టరీ కి చిహ్నంగా v ఆకారంలో రెండు వేళ్ళను చూపిస్తూ ప్రజలకు అభివాదం చేసేవారు. రెండు చేతులూ జోడించేవుంచి వేదికంతా తిరుగుతూ ప్రజల్ని పలకరించే (అందరి రాజకీయవాదుల మాదిరిగా) అలవాటు వున్న తెలుగుదేశం నాయకులే మనదికాని “విక్టరీ”అభివాదం చేయడానికి ఇబ్బంది పడేవారు.

మామూలుగా గంభీరంగా, అధికారులదగ్గర మరీ గంభీరంగా ప్రజల మధ్య చిరునవ్వులు చించించడానికి విఫల ప్రయత్నం చేసిన నాయకుడిగా రెండుదశాబ్దాలు గడిపేసిన చంద్రబాబు వ్యవహార శైలిలో బాడీ లాంగ్వెజిలో చాలా మార్పులే తెచ్చుకున్నారు. “మీకోసం వస్తున్నా” యాత్రలో నేను ఇదిగమనించాను

రెండు వేళ్లతో విక్టరీ సింబల్ చూపించే చంద్రబాబు ఇప్పుడు రెండు చేతులూ జోడించి దండం పెడుతున్నారు. ముఖంలో గాంభీర్యాన్ని వదిలేసి చిరునవ్వు చిందిస్తున్నారు. పాదయాత్రకు బయలుదేరినప్పటి నుంచే ఆయన శైలిని మార్చుకున్నప్పటికీ పాదయాత్ర పూర్తయ్యే సరికి అది సహజసిద్ధంగా వచ్చేసి స్థితికి చేరుకుంది.

హైటెక్ చంద్రబాబు అనే ముద్రను పోగొట్టుకుని ప్రజల మనిషిని అని చెప్పుకోవడానికి అవసరమైన శైలిని అలవరుచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుంది .

గంజి పెట్టి ఇస్త్రీ చేసిన చొక్కాను నలగనిచ్చేవారు కాదు. క్రాఫ్ కొద్దిగా కూడా చెదిరేది కాదు. నిత్యం నల్లగా నిగనిగలాడే బూట్లతో కనిపించేవారు. జన సమూహాలకు ఒక అడుగు దూరంలో ఉండి మాట్లాడేవారు. దగ్గరికి వచ్చినవారి భుజంపై చేయి వేసి మాట్లాడే అలవాటు తక్కువగా ఉండేది.

ఇప్పుడు బాబులో ఎన్నో మార్పులు. చొక్కా నలిగినా, జుట్టు చెదిరినా పట్టించుకోవడం లేదు. పాదయాత్ర మొదలు తన వద్దకు వచ్చిన వారి భుజాలపై చేయి వేసి నడుస్తూ మాట్లాడుతున్నారు. గంభీరంగా ఉండాలని ప్రయత్నం చేయకుండా నవ్వుతూ వారితో కలిసి ప్రయత్నం చేస్తున్నారు.

పాదయాత్ర చేస్తూనే పార్టీ వ్యవహారాలను కూడా చక్కదిద్దే పనిచేశారు.దాంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. అయినా సంయమనం పాటించారు. నాయకులపై బహిరంగంగానే ఫిర్యాదు చేసిన కార్యకర్తల మనోగత భావాలను సంయమనంతో శ్రద్ధగా అర్ధంచేసుకుని ప్రతీనియోజక వర్గ సమావేశంలోనూ స్వయంగా నోట్స్ రాసుకున్నారు. తీవ్రమైన కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు ఉన్నా మొండిగా పాదయాత్ర చేశారు. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

మొక్కని దేవుడు లేడు, పలకరించని మనిషి లేడు అన్నట్లు చంద్రబాబు నాయుడి “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర సాగింది.

పాదయాత్రలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రికార్డును ఆయన బద్దలు కొట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు రెట్టింపు దూరం నడిచి రికార్డు సృష్టించారు.

సరిగ్గా దశాబ్దం కిందట పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి 1356 కి.మీ. నడిచారు. అప్పుడు ఆయన వయసు 53 ఏళ్లు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు. 11 జిల్లాల్లోని 33 అసెంబ్లీ నియోజక వర్గాలను ఆయన సందర్శించారు. ఆయన పాదయాత్ర 55 రోజులపాటు సాగింది.

చంద్రబాబు 63 ఏళ్ల వయసులో పాదయాత్రను చేపట్టారు. తన 64వ పుట్టిన రోజును కూడా ఆయన పాదయాత్రలోనే జరుపుకొన్నారు. చంద్రబాబు పాదయాత్ర సుదీర్ఘంగా 208 రోజులపాటు సాగింది. అంతే సుదీర్ఘంగా ఆయన 2,817 కి.మీ. నడిచారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మొదలు పెట్టి విశాఖ నగరంలోని శివాజీ నగర్లో ముగించారు.

ఈ యాత్ర సందర్భంగా చంద్రబాబు 16 జిల్లాల్లోని 86 అసెంబ్లీ నియోజక వర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లు, 162 మండలాలు, 1,253 గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు.

చంద్రబాబుకు మించిన పాదయాత్ర చేసిన వాళ్లు దేశంలో ఒక్కరే ఉన్నారు.మాజీ ప్రధాని చంద్రశేఖర్ రికార్డు స్థాయిలో పాదయాత్ర చేశారు. ఆయన కన్యాకుమారి నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని మహాత్మ గాంధీ సమాధి రాజ్ఘాట్ వరకు పాదయాత్ర చేశారు. ఆరున్నర నెలలపాటు 4,260 కిలోమీటర్లు నడిచారు. ఆయన చంద్రబాబు మాదిరిగా ఇన్ని గ్రామాలు పర్యటించలేదు.

208 రోజుల కఠోర దీక్షలో ఈ లక్షణాలన్నీ బాబు వ్యక్తిత్వంలో భాగమైపోయాయనే నాకు అనిపిస్తూంది. కలివిడి తనం తక్కువగా వుండి, ప్రజల నుంచిగాక అవకాశాలనుంచి ఉన్నత స్ధానాలకు ఎదిగిన బాబుకి రెండు ఓటములు ఆత్మపరిశీలనను తెచ్చిపెట్టాయి. ఆపరిణామం నుంచి సంభవించిన టా్రన్స్ ఫర్ మేషన్ లేదా పరివర్తన బాబు పాదయాత్రలో పరిశీలకులకు స్పష్టంగా కనిపించింది

బాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు కాకపోవచ్చు. కానీ ఆయనలో పెద్ద పరివర్తనైతే సంభవించింది

మనం జీవిస్తున్న వస్తువినియోగ విధానం తాను సృష్టంచగలిగినదానికంటే ఎక్కువ వనరులనుఖర్చుచేస్తుంది…భూమిని ఖాళీగావుంచకుండా అడవిలా నిరంతరం పచ్చగావుంచుతూ వ్యవసాయం చేయడమేపరిష్కారం…సంక్షేమ రాజ్యంపేరుతో అనుత్పాదక వ్యయాల్ని కేవలంఓట్లకోసమే వెదజిమ్మే ధోరణినుంచి ఉత్పాదకత ద్వారా ప్రజలజీవన ప్రమాణాల్ని పెంచే ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన చంద్రబాబు " కానికాలంలో విత్తనాలు చల్లిన రైతులా"దెబ్బతిని రెండుదఫాలు ఓడిపోయారు.


విజనరీకి 64 ఏళ్ళు


నేడు అరవైనాలుగోయేడు వచ్చిన నారాచంద్రబాబునాయుడు, ఆయన తెలుగుదేశం పార్టీ “అస్ధిత్వ సమస్య” ను ఎదుర్కోడానికి ఆశావిశ్వసాలతో, ఉత్సాహంగా శ్రమిస్తున్నారు. వరుసగా రెండుదఫాలు అధికారంలోకి లేని పరిస్ధితి మళ్ళీవస్తే పార్టీ మనుగడ దుర్భమైపోతుంది. అధినాయకుడిగా ఆవిషయం చెప్పలేని స్ధితిలో వున్న బాబు”ఈసారి గెలిచితీరాలి” అని మాత్రం గట్టిగా చెబుతున్నారు. ఇది అధికారంకోసం వెంపర్లాట కాదు. పార్టీని కాపాడుకునే ఆరాటం మాత్రమే

చంద్రబాబు 18 ఏళ్ళక్రితం మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పుట్టిన వారు-ఊహతెలిసినవారి వయసు ఇపుడు 18 ఏళ్ళనుంచి 30 వరకూ వుంటుంది. ఈ ఏజ్ గ్రూప్ వారిని కొత్తగా తెలుగుదేశం పార్టీవైపు ఆకర్షింప చేయలేకపోవడం పార్టీ సీనియర్లలోపం. ఇందువల్ల తెలుగుదేశం వృద్ధుల పార్టీ అన్న అభిప్రాయం వ్యాపిస్తోంది…మరోవైపు జైల్లోవున్న జగన్…జనంలోవున్న షర్మిళ…మనుషుల్లో లేని వై ఎస్ జ్ఞాపకాలు యువకుల్ని ఆపార్టీవైపు ఆకర్షిస్తున్నట్టే కనబడుతోంది.

ప్రజల అభిమానం వుంది…పనిచేసే శక్తి మాకుంది…నాయకులతోనే సమస్య… అని ప్రతీ నియోజకవర్గంలోనూ కార్యకర్తలు నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదులు చేస్తూండటాన్ని బట్టి “పాతుకుపోయిన నాయకులే పార్టీకి భారమైపోతున్నారని స్పష్టమైపోతోంది

సంక్షేమ రాజ్యంపేరుతో అనుత్పాదక వ్యయాల్ని కేవలంఓట్లకోసమే వెదజిమ్మే ధోరణినుంచి ఉత్పాదకత ద్వారా ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచే ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన చంద్రబాబు ” కానికాలంలో విత్తనాలు చల్లిన రైతులా” దెబ్బతిని రెండుదఫాలు ఓడిపోయారు. సంస్కరణలకు ప్రజలు మానసికంగా సంసిద్ధత లేని పరిస్ధితి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా వుపయోగపడింది. బాబు చేపట్టిన సంస్కరణల ఫలాలు ప్రత్యక్షంగా ప్రజలకు అందుతున్నాయి. పరోక్షంగా రాష్టా్రనికే మౌలిక సదుపాయాలయ్యాయి. సంపదలయ్యాయి.

ప్రజల అభిమానం వుంది…పనిచేసే శక్తి మాకుంది…నాయకులతోనే సమస్య… అని ప్రతీ నియోజకవర్గంలోనూ కార్యకర్తలు నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదులు చేస్తూండటాన్ని బట్టి “పాతుకుపోయిన నాయకులే పార్టీకి భారమైపోతున్నారని స్పష్టమైపోతోంది

చంద్రబాబు జీవితంలో అతిపెద్దవివాదం “వ్యవసాయం దండగమారి” అని ఆయన అన్నారనే! ఆవ్యాఖ్య వెంటనే వివాదం కాలేదు. కాలక్రమంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలకు ముందు ఆ మాటల్ని తవ్వితీసి,నిప్పుపెట్టి రాజేశారు.

ఒకే కమతం మీద ఎక్కవమంది ఆధారపడటం వల్ల వ్యవసాయం దండగమారిదైందని అవసరాలకు మించివున్న మానవవనరులను మళ్ళించడానికి సర్వీసు సెక్టార్ ని సమాయత్తం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. నిజానికి అదే జరిగింది…జరుగుతోంది. గ్లోబలైజేషన్ కిముందే 40/30 ఏళ్ళ క్రితమే మొదలైన అర్బనైజేషన్ వల్లే రైతులు పొలాలను కౌలుకిచ్చి పట్టణాలకు వలసలు పోవడం మొదలైంది. తరువాత కౌలుదారులకూ సాగుదల గిట్టుబాటు కాకుండా పోయింది.

కోడిపిల్లను మళ్ళీ గుడ్డుగా మార్చేయడం అయ్యేపనేనా? ఈ సమస్యకు సర్వీసు సెక్టరే ప్రత్యామ్నాయమని చంద్రబాబు అంటే అది దారుణంగా అపార్ధం చేసుకోబడింది. అయితే ఆయన ఓటమికి ఇదీ కారణమేమోగాని ఇదొక్కటే కారణం కాదు!

రాజకీయంగానూ ప్రజాజీవనపరంగానూ బాబు తప్పులు చేసివుండొచ్చు. అయితే ఒక ప్రణాళికా బద్ధంగా ఒక కంపెనీని అభివృద్ధి చేసినట్టు రాష్టా్రన్ని ప్రగతి వైపు నడిపించిన మరో ముఖ్యమంత్రి ఇంతవరకూ రాష్టా్రనికి లేరు.

*ప్రధానంగా ప్రకృతి ఇష్టాయిష్టాలకు లోబడివున్న వ్యవసాయిక ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు
ఫార్మాస్యూటికల్ హబ్ గా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి హబ్ గా మార్చేశారు – వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి లక్షలకోట్ల రూపాయలు ఎకానమీలోకి పంప్ అయ్యేలా చేశారు-ఇది వేలాది కుటుంబాల పేదరికాన్ని తొలగించింది-విద్యాబుద్ధులతో ఆకుటుంబాల తరువాత తరం లైఫ్ స్టయిల్ ను మార్చేసింది

*వ్యవసాయంతో పాటు ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ సెక్టార్ల లను అభివృద్ధిచేయడం ద్వారా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలను చంద్రబాబు సృష్టించారు.

*ఒకప్పుడు బీహార్ లా వెనుకబడి వున్న ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక వాతావరణాన్ని చంద్రబాబు సృష్టించి ప్రోత్సహించడం వల్ల ఆయన హయాంలోనే మహారాష్ట్రకు ధీటుగా మన రాష్ట్రం నిలబడింది

* పారదర్శకతను పరోక్షంగా ప్రజల భాగస్వామ్యాన్నీ పెంచే ఇ – గవర్నెన్స్ ను దేశంలోనే మొదటిసారిగా తీసుకువచ్చింది చంద్రబాబే

* బ్యాంకు బ్రాంచిలంత విసృ్తతంగా ఇ సేవా కేంద్రాలు ఇచ్చి ప్రజలకు అధికారుల్ని జవాబుదారీలుగా మార్చింది చంద్రబాబే

* ఆదరణ పధకాల ద్వారా బిసి ల కుటుంబాల సామాజిక ఆర్ధిక రాజకీయ స్ధాయిని దేశంలో మరెక్కడా లేనంత వున్నతంగా తీర్చిదిద్దింది చంద్రబాబే.

* విద్యుత్ సంస్కరణలు చేపట్టి 5000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయించించి చంద్రబాబే

*32 ఇంజనీరింగ్ కాలేజీలను 210 కి పెంచి ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీఫ్రంట్ లో తెలుగు పిల్లలు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో మంచి ఆదాయాలతో ఉన్నత స్ధానాల్లో వుండేలా చేసింది చంద్రబాబే.

*మహిళా సాధికారికత కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను స్ధాపించి 65 లక్షల మంది స్త్రీల వికాసానికి బాటలు వేసింది చంద్రబాబే

1978లో రాజకీయాలలోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు – అంజయ్య, భవనం, కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్ లలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశంలో ప్రవేశించి అత్యంత క్రియాశీల పాత్ర పోషించి 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి అయ్యారు. రెండువేల నాలుగు వరకు రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ఆ తర్వాత తొమ్మిదేళ్లుగా విపక్ష నేతగా కూడా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మూడువేల కిలోమీటర్ పాదయాత్రలో ఉండి మరో కొత్త రికార్డు సృష్టించారు.

బాబు యాత్ర *పార్టీకి హుషారు*క్యాడర్ కి భరోసా*స్త్రీలు తక్కువ* కాపులు దూరం*యువత శూన్యం*


తూర్పుగోదావరి జిల్లాలో 11నియోజకవర్గాల్లో 16 మండలాలు, 2మున్సిపల్ కారొ్పరేషన్లు, 3మున్సిపాలిటీలు, 78గ్రామాల మీదుగా 23 రోజులపాటు 247 కిలో మీటర్లు నడచిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీలో అపూర్వమైన ఉత్తేజాన్ని నింపారు. పార్టీ కార్యకర్తల సమస్యల్ని నియోజకవర్గాల వారీగా విన్నారు. వందలాది మందిని పేరుపెట్టి పలకరించి కార్యకర్తలే పార్టీకి ప్రాణసమానులన్న సంకేతం ఇచ్చారు. ది్వతీయశ్రేణి కార్యకర్తలకు గుర్తింపు గౌరవాలను తెచ్చారు. పార్టీలో ప్రజాభిమానానికీ, అంకితమైన కార్యకర్తలకూ లోటులేక పోయినప్పటికీ నాయకులతోనే సమస్యలున్నాయన్న ఫిర్యాదులను దాదాపు ప్రతీ నియోజకవర్గ సమావేశంలోనూ విన్నారు. పరిస్ధితిని చక్కదిద్దుతామని భరోసాయిచ్చారు. నాయకత్వానికి కార్యకర్తలకూ మధ్య అగాధాన్ని అర్ధం చేసుకోడానికి ఈ యాత్ర బాబుకి ఉపయోగపడింది


పాదయాత్ర చంద్రబాబుకి కూడా గొప్ప అనుభవాన్నిచ్చింది. అతిసామాన్య ప్రజల వద్దకే వెళ్ళి నేరుగా మాట్లాడటం వల్ల వాళ్ళ జీవితాల్ని ప్రత్యక్షంగా అర్ధంచేసుకోడానికీ అనుభూతి చెందడానికీ అవకాశమొచ్చింది.

అయితే జిల్లానుంచి పక్కజిల్లా విశాఖ లోకి ప్రవేశించే ముందు తూర్పుగోదావరి సమస్యల పరిష్కారానికి ఆయన ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేయడానికి ఎన్ని వేల కోట్ల రూపాయల అవసరమౌతాయో లెఖ్ఖ చేసినట్టు లేదు. ఈ తరహా హామీలు నాయకుడి మీద పుట్టుకొచ్చిన ఆసక్తి కుతూహలాలను సహజంగానే చంపేస్తాయి. ప్రజా సమస్యలను అర్ధం చేసుకోడానికన్న ఈ యాత్ర ఎన్నికలప్రచారానికేనన్న భావనే విరివిగా వ్యాపిస్తూంది.

యాత్రలో మహిళలు పెద్దగా కనిపించలేదు. కాపులు దూరంగా నే వున్నారు. ఎస్ సిలలో అత్యధిక సంఖ్యాకులైన మాలలు దూరంగావుండగా మాదిగలు తెలుగుదేశం పట్ల సానుభూతితోవున్నట్టు అర్ధమౌతోంది

చంద్రబాబు మొదటసారి 18 ఏళ్ళక్రితం ముఖ్యమంత్రిఅయ్యారు. అప్పుడు, అంతకుముందు ఓ పదేళ్ళ క్రితం పుట్టిన వారు అంటే ఇపుడు 25 నుంచి 30 ఏళ్ళ వయసువారిమీద తెలుగుదేశం ముద్ర, చంద్రబాబు ముద్రలేదు. ఆవయసు గ్రూపు వారు చంద్రబాబు పర్యటనలో పెద్దగా కనిపించకపోవడాన్ని బట్టి యువకులు తెలుగుదేశం వైపు అంతగా లేరా అన్న అనుమానం కలుగుతోంది. ఈ గ్యాప్ ను బిజినస్ ప్రొఫెషనల్ యువకుడు, చంద్రబాబు కొడుకు నారా లోకేష్ భర్తీ చేయగలరా?

కాగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కాకరాపల్లిలో చంద్రబాబు తుని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జిల్లా పర్యటన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక డిక్లరేషన్ ప్రకటించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి ప్రాంతంలో రెండు పంటలకు సాగు నీరు అందించడంతో పాటు ఏలేరు ఆధునీకీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పుష్కర, చాగల్నాడు పధకాలను పూర్తి చేస్తామని, గోదావరి డెల్టాను ఆధునీకీకరిస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ-రాజమండ్రి ప్రాంతాన్ని వ్యవసాయ ఆధారిత కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఐటి రంగంలో ఈ రెండు నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు.

కేజి బేసిన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ను పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాలో కడియం నర్సరీలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ను నిర్మిస్తామని చెప్పారు. కాకినాడ నుండి విశాఖపట్నం వరకు ఆరు లైన్ల రహదారిని అభివృద్ధి చేస్తామని, కత్తిపూడి నుండి కృష్ణా జిల్లా పామర్రు వరకు 214 నెంబర్ జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాకినాడ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించి యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేస్తామన్నారు. అమలాపురంలో కోకోనెట్ బోర్డు ఏర్పాటు చేసి కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పారు. జిల్లాలో సహజ వనరులను అభివృద్ధి చేసి స్థానిక నిరుద్యోగులకు స్థానికంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని తెలియజేశారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అంతకు ముందు ఉదయం 10 గంటలకు చంద్రబాబుకు హైదరాబాద్ నుండి వచ్చిన డాక్టర్ రాకేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు కాలి నొప్పితో బాధపడుతుండడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని పాదయాత్రను నిలిపివేయాలంటూ వైద్యులు సూచించారు. అయినప్పటకీ చంద్రబాబు పాదయాత్రను కొనసాగించాలనే నిర్ణయించారు. అయితే షెడ్యూల్ ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసి విశాఖ జిల్లాలో మాత్రం యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు. శుక్రవారం రాత్రికే విశాఖ జిల్లాకు చేరుకున్న బాబు శృంగవరం వరకు పాదయాత్ర నిర్వహించి రాత్రి అక్కడే బస చేశారు. ఈ శని, ఆదివారాల్లో పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ నుండి చంద్రబాబు యధావిధిగా విశాఖ జిల్లాలో పర్యటిస్తారని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఫేస్ బుక్ ప్రభావం ఇది ఈనాడు విశ్లేషనాత్మక కథనం
ఎన్నికల సీన్ మార్చే ఫేస్ బుక్?


బిజెపి-కాంగ్రెస్ పార్టీల మధ్య ఉత్తర భారత దేశంలో “ట్విట్టర్” యుద్ధమే జరుగుతోంది. 140 అక్షరాల కు పరిమితమైన ట్విట్టర్ ఎందువల్లనో దక్షిణ భారతదేశానికి అంతగా విస్తరించలేదు. 


అయితే కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రల్లో ఫేస్ బుక్ విస్తరణ అపారంగా పెరిగిపోతోంది. యువతీ యువకులను కట్టి పడేసి, నడివయసు స్త్రీ,పురుషులను వశపరచుకుని ఐదు పదులు పైబడినవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రో యాక్టివ్, పాజిటివ్ ధింకింగ్ లాంటి నమూనాల నుంచి డిజైన్ అయిన ఫేస్ బుక్ లో “లైక్” (నచ్చడం) మాత్రమే వుంటుంది. నచ్చకపోతే ప్రత్యేకంగా కామెంటు రాయడమే తప్ప “డిస్ లైక్” లాంటి ఆప్షన్ ఏదీ వుండదు.

అంటే ఒక ప్రతిపాదన (పోస్టింగ్) నచ్చితే లైక్ పెట్టడమో, నచ్చకపోతే ఆ పోస్ట్ ని వదిలేయడమో మాత్రమే జరుగుతుంది. అంటే ఏ అంశం మీదైనా పాజిటివ్ అభిప్రాయాలు మాత్రమే లెఖ్ఖలోకి వస్తుంది. ఏకంగా ఇన్ని లైకులా అని “లైక్” మార్క్ చేసేవారిసంఖ్య తక్కువేమీకాదు.

దీని ప్రభావం చాలా ఎక్కువ. నరేంద్రమోడీ ప్రధానిగా వుండాలన్న అభిప్రాయం అతివేగంగా విస్తరించడానికి ఇలాంటి సోషల్ సైకాలజీ ప్రధాన కారణం. ఈ సూత్రాన్ని గుర్తించి మోడీ ప్రచారవ్యూహంలో ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ మొదలైన మీడియాల్లో ఆయనకోసం పనిచేసే ప్రొఫెషనల్స్, మద్దతుదారులు ముందుగా చొరబడిపోయారు. కాస్త ఆలస్యంగా కాంగ్రెస్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంది. అప్పటికే మోడీకి ఒక ఊపు వచ్చేసింది. చదువుకున్న వాళ్ళలో మధ్యతరగతి లో ప్రచారానికి సంబంధించినంత వరకూ మోడీ క్యాంపెయిన్ కి సోషల్ మీడీయా పెద్ద వేదిక అయ్యింది.

నిజమో అబద్ధమో తెరముందో తెరవెనుకో ఎవరైనా పూనుకుంటే ఫేస్ బుక్ లో అదే పనిగా ప్రచారమైపోతున్న ధోరణి ప్రస్తుతంవుంది. ఇందుకు ‘కొత్తపిచ్చి’ , ‘వేలం వెర్రి’ ప్రధాన కారణాలైతే. ఏకపక్ష వాదనను వ్యతిరేకించే (డిస్ లైక్) ఆవకాశం డిజైన్ చేయబడకపోవడం ముఖ్యకారణం. ఒకరి ప్రతిపాదన (పోస్టింగ్)ను అదే పోస్టులో కామెంటుగా ఖండించడం, వ్యతిరేకించడం సభ్యత కాదన్న సంస్కారం మరో కీలకమైన కారణం.
ఇందువల్ల హిడెన్ అజెండాలతో ఫేస్ బుక్ లో తిష్టవేసి
“బంతిని ఏకపక్షంగా దొర్లించుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే” అదేమంత కష్టంకాదు. మోడీ మద్దతు దారులు ఆయన ఇమేజ్ టి్రమ్మింగ్ కోసం ఇలాంటి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. వెంట పడిన కాంగ్రస్ వారు వెనుకే వుండిపోయారు.

ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, భారత ఇంటర్నెట్, మొబైల్ సంఘం ‘సోషల్ మీడియా’ లోక్సభ ఎన్నికలు’ పేరిట అధ్యయనం జరిపారు. ఈ నేపధ్యంలోనే…

దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాల్లో 160 స్థానాలపై సోషల్ మీడియా అత్యంత ప్రభావం గల లోక్సభ నియోజకవర్గాలుగా సర్వే గుర్తించింది. మొత్తం ఓటర్లలో 10 శాతానికి పైగా లేదా గత లోక్సభ ఎన్నికల్లో విజేతకు వచ్చిన మెజారిటీ సంఖ్య కన్నా ఎక్కువ మంది ‘ఫేస్బుక్’ ఖాతాదారులున్న నియోజకవర్గాన్ని అత్యంత ప్రభావం గల నియోజకవర్గంగా వర్గీకరించింది. ఈ స్థానాల్లో అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించడంలో ఫేస్బుక్ ఖాతాదారుల తీర్పే కీలకం కానుందని సర్వే అభిప్రాయపడింది. ఈప్రకారం మన రాష్ట్రంలో ఫేస్బుక్ ప్రభావం పడనున్న లోక్ సభ నియోజకవర్గాలు: హైదరాబాద్,విశాఖపట్నం,విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కరీంనగర్, నరసారావుపేట, చిత్తూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు
ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 21, తరువాత గుజరాత్ లో 17 లోక్ సభానియోజక వర్గాల్లో ఈ ప్రభావం వుంటుందని అభిప్రాయపడింది.

ఉత్తరప్రదేశ్-14, కర్నాటక-12, తమిళనాడు-12, ఆంధ్రప్రదేశ్-11, కేరళ-10, మధ్యప్రదేశ్-9, ఢిల్లీ-7,హర్యానా-5, పంజాబ్-5, రాజస్ధాన్-5, బీహార్-4, చత్తీస్ ఘడ్-4, జమ్మూకాశ్మీర్-4, ఝార్కండ్-4, పశ్చిమబెంగాల్-4, ఈ స్ధానాల్లో కూడా ఫేస్ బుక్ ప్రభావం హెచ్చుగా వుంటుందని, దేశవ్యాప్తంగా మరో 67 స్ధానాల్లో ఈ ప్రభావం ఒక మోస్తరుగా వుండవచ్చని , 60 స్ధానాల్లో కనీస ప్రభావం వుండవచ్చనీ సర్వే తెలియచేసింది.

దేశవ్యాప్తంగా 256 లోక్ సభాస్ధానాల్లో ఫేస్ బుక్ ప్రభావం ఏమాత్రం వుండదని కూడా సర్వే తేల్చేసింది

ఫేస్ బుక్ లో ప్రతిపాదన అందుకు పలువురి ఆమోదం అనేది ఒక డిజైన్ గా వుంటే ట్విట్టర్ లో ఒక అభిప్రాయానికి ఆమోదం లేదా తిరస్కారం లేదా అభిప్రాయం ఏదైనా 140 అక్షరాల పరిమితిలో రాయాలి అక్కడ “లైక్” అనే ఆప్షన్ లేక పోవడంవల్ల ఒక అభిప్రాయంపై ఆలోచనే తప్ప ఫేస్ బుక్ లో మాదిగిగా అంకెల మద్దతు అది పెరిగిపోతూ వుండటమనేదే వుండదు.

Create a free website or blog at WordPress.com.

Up ↑