శ్రీకిరణ్,

నువ్వు అడిగినట్టు బాబు టూర్ సక్సెస్ ఫెయిలా ఒక్క మాటలో చెప్పడం కుదరదు. చాలా అంశాలు…వాటి కూడికలు తీసివేతలు…పోలరైజేషన్లు…టూర్ లో నేను పరిశీలించిన వాటిని రాస్తున్నాను…ఇందులో తెలుగుదేశం ఆశా విశ్వాసాలు ….అందుకు కారణాలూ వున్నాయి..సమగ్రమైన ఇన్ పుట్స్ ఇచ్చాననే అనుకుంటున్నాను…నీకు ఒక అవగాహన ఏర్పడటానికి ఈ వివరాలు సరిపోతాయనుకుంటున్నాను.

చాలాకాలం తరువాత చేసిన ఈప్రొఫెషనల్ వర్క్ ని ప్రచురించడానికి పేపర్లు లేకపోయినా చదవడానికి నువ్వున్నావు. కోద్దిమంది ఫేస్ బుక్ మిత్రులు వున్నారు

ఈ టూర్ లో చాలా కాలం తరువాత చాలామంది జర్నలిస్టులు తెలుగుదేశం నాయకులు కలిశారు పాతరోజుల్ని గుర్తుచేసుకున్నాము. నాయకులకు పాత్రికేయులకూ మధ్యసంబంధాల్లో చాలా మార్పులు వచ్చేశాయని అర్ధమైంది. ఓపికుంటే మరెప్పుడైనా ఆవివరాలు రాస్తాను

సరే! చంద్రబాబు టూర్ గురించి చదువు. డౌట్ వుంటే ఫోన్ చెయ్యి (నా ప్రిఫరెస్సయితే లెటర్ రాయడమే …కానీ ఫోన్ చేయడానికికూడా తీరికలేని పిల్లలైపోయారు మీరు)

రాజకీయ అభిమానాలు కులాలవారీగా చీలిపోయిన, చీలిపోతున్న స్ధితిలో వీటికతీతంగా యువతులు మహిళలు తెలుగుదేశం పార్టీమీద ఆసక్తి,కుతూహలం,అభిమానం చూపిస్తున్నట్టు చంద్రబాబునాయుడు “మీకోసం వస్తున్నా” తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంలో బయటపడింది

చంద్రబాబు ఉపన్యాసంలో విమర్శలకు చప్పట్లు ఈలలు కేరింతల ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఎక్కువగానే వుందని ప్రతిచోటా కనబడుతూనే వుంది

ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీలేని సంకీర్ణ రాజకీయాలు జాతీయస్ధాయిలో బలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం పార్టీ మూడోరాజకీయ శక్తి నిలదొక్కుకుంటుందని పించినప్పటికీ ఆ పార్టీ బతికి బట్టకట్టలేక కాంగ్రెస్ లో కలసిపోయింది. ఆపార్టీని చిరంజీవి ప్రారంభించినప్పటినుంచీ రాజకీయాల్లో పునరేకీకరణలకు కులం కేంద్రబిందువైంది. ఆ కులస్ధుల ప్రభావం, సంఖ్యా విశేషంగా వున్న తూర్పుగోదావరిజిల్లా చంద్రబాబుకి ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? వారికి చంద్రబాబు తిరిగి ఎలాంటి సంకేతాలుపంపుతున్నారు?
అన్నదే ఈ జిల్లాలో “మీకోసం వస్తున్నా” ప్రాధాన్యత.

ప్రతిచోటా మహిళలు యువతులు బాబు మాటల్ని ఆసక్తిగా వింటున్నారు. బిసిలు హెచ్చుగా వుంటున్న ప్రాంతాల్లో జనం కిక్కిరిసి పోతున్నారు. ఎస్ సిలు కాపులు వుండే ప్రాంతాల్లో బాబు సభలకు అంతటి సాంధ్రత వుండటంలేదు. యువకులైతే దాదాపు కనిపించడమే లేదు.

ఈ స్పందన ఆనూహ్యం కాదని నాయకులు అంటున్నారు.కార్యక్రమం సజావుగా సాగిపోతూండటం వారికి హుషారుగావుంది. యనమల రామకృష్ణుడు నిమ్మకాయల చినరాజప్ప మురళీమోహన్ గోరంట్లబుచ్చయ్య చౌదరి, గన్నికృష్ణ, వాసిరెడ్డి రాంబాబు మొదలైన ఎందరెందరో నాయకులు బాబు పర్యటన బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు.

యువకుల భాగస్వామ్యం పెరగాలని 2004 నుంచీ చంద్రబాబు మొదలు ప్రతీ నాయకుడూ చెబుతూనే వున్నారు. రాజమండ్రి కి సంబంధించి పరిమివాసు,కురగంటి సతీష్, నక్కాదేవీ ప్రసాద్, బొత్సా శీను వంటి ఏడెనిమిది మంది యువకులు (పాతతరంలోని గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ తరువాత) ఆర్గనైజర్లుగా ఈవెంటు మేనేజర్లుగా ఎదిగారని ఈ పర్యటన బయటపెట్టింది.

“నా చెప్పుచేతల్లోనేపార్టీ నడవాలనే” ఆలోచననుంచి నాయకులు బయటపడితే మరెంతమందో యువకులు సమర్ధతను చాటుకునే అవకాశం వుంది. ఎన్ని మాటలు చెప్పినా నారా లోకేష్ లాంటి యువకులు ముదుకి వచ్చి నడిపిస్తే తప్ప యువతకి చొరవా పట్టూ దొరకవు. యువతను కూడగట్టే పనిని లోకేష్ త్వరలోనే ప్రత్యక్షంగా ప్రారంభించే అవకాశాలున్నాయి

అలాగే “తెలుగుదేశం కాపు డిక్లరేషన్” కు కూడా తూర్పుగోదావరి జిల్లానే అనుకూలమైన ప్రాంతం అవుతుంది

సభ – జనసంఖ్య – గెలుపు పొంతనలేని సంగతులే చాలా ఏళ్ళక్రితం లక్ష్మీ పార్వతి ఈ మధ్యే చిరంజీవి సభలకు జనం విరగబడటం చూశాం-వారి ఓటములూ చూశాం

తెలుగుదేశాన్ని మళ్ళీ ఆధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జనం మధ్య తిరుగుతున్న చంద్రబాబు రాజమండ్రిలో ఒక సభలో కాంగ్రెస్ ను తరిమికొడదామా అని ప్రశ్నించినపుడు జనం హుషారుగా చేతులెత్తేశారు. తెలుగుదేశాన్ని అధికారంలోకి తెద్దామా అని ఆ వెంటనే ప్రశ్నించినపుడు అన్ని చేతులు పైకి లేవలేదు

ఈయనకు నవ్వడమే రాదా అనుకునేటంత సీరియస్ గా చంద్రబాబు వుంటారు. అలాంటి బాబు జనం మధ్య చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆనవ్వులు రేపటి ఎన్నికలపై బాబు ఆశా విశ్వాసాలుగానే నాకు కనిపిస్తున్నాయి.

– ఇప్పటికి ఇంతే, వుంటాను