Search

Full Story

All that around you

Month

May 2013

ఆధ్వానీ కి ఇది రిటైర్ మెంటు టైమే!ఉన్నది కాంగ్రెస్ లో షికారు జగన్ తో మరో 38 మంది ఎమ్మల్యేలు!


ఏకంగా 47 మంది కాంగ్రెస్ ఎమ్మల్యేలు వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరుకాకపోవటం చిన్న విషయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యల తీవ్రతను బయటపెట్టేదే. గైర్ హాజరైన వారి సంఖ్యను మీడియా పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా వుంది 

కాంగ్రెస్ ఎమ్మెల్యెల్లో ఇప్పటికే బయట పడిన వారు మినహా మరో 38 మంది మద్దతు జగన్ కి వుంటుందనీ లేదా వారంతా కిరణ్ కుమార్ ని వ్యతిరేకిస్తున్నారనీ అర్ధమౌతోంది
తిరగబడిన శత్రువుకంటే లోపలే వుండి వ్యతిరేకించే శక్తులే అధికార పీఠానికి ప్రమాదకరం. క్రమంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి లోపలే వుండి వ్యతిరేకించేవారి సంఖ్య పెరుగుతున్నట్టుంది.
34మంది మంత్రులు పాతికమంది ఎమ్మెల్సీలు హాజరైన నిన్నటి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి 146 మంది ఎమ్మేల్యేలలో 65 మందే హాజరయ్యారని జర్నలిస్ట్ మిత్రుడొకరు చెప్పారు. 47 మంది మీటింగ్ ఎగ్గొట్టారు.
అవిశ్వాస తీర్మానం విషయంలో తెలుగుదేశంపార్టీ తటస్ధత ను పాటించడం తో కిరణ్ కుమార్ ఆపార్టీ మద్దతుకూడా పరోక్షంగా పొందినట్టయింది. ఇందిరమ్మబాట లాంటి ఇంటరాక్టివ్ యాత్రలు నామినేటెడ్ ముఖ్యమంత్రిని
ప్రజల్లోకితీసుకువెళుతున్నాయి. సహకారఎన్నికలు ఆయన్ని ఢిల్లీలో కాలర్ ఎగరేసుకునేలా చేశాయి. ఎస్ సిలకు ప్రవేశపెట్టిన సబ్ ప్లాన్ సమాజంలో అన్ని వర్గాలూ కిరణ్ వైపు ఆసక్తిగా ఆశగా చూసేలాచేసింది. జనరల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి మార్చే అవకాశాలు వుండవని కూడా అందరికీ తెలిసిందే.
ఇన్ని అనుకూలతలు బలపడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సి ఎల్ పి సమావేశానికి 47 మంది వెళ్ళకపోవడం రెండు విధాలుగా అర్ధమౌతోంది
ఒకటి అందరినీ కలుపుకుని వెళ్ళలేని కిరణ్ కుమార్ స్వభావం. సమావేశానికి వెళ్ళకపోయినా పదవులు ఊడిపోవు కనుక అటువంటి నాయకుడి వద్దకు వెళ్ళడానికి ఆత్మాభిమానం అడ్డు పడటం
రెండు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్న ప్రజాభిమానం చూసి ఆపార్టీవైపు చేరిపోవాలన్న ఆలోచనతో మరిన్ని’బంధాలు’ తగిలించుకోకుండా గైర్ హాజరవ్వడం
కారణమేదైనా కాంగ్రస్ నుంచి ఎన్నికైన వారిలో 47 మంది గోడమీద పిల్లుల్లా వున్నరనుకోవలసి వస్తోంది. వీరిలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన 9 మందినీ మినహాయిస్తే 38 మందీ జగన్ పార్టీ వైపు చూస్తున్నారనే అర్ధమౌతోంది

‘మగ’నామోషీ పక్కన పెడితే…..


…కౌన్సెలింగ్ కు సిద్ధమైతే
దాంపత్య సమస్య చాలావరకూ పరిష్కారం?

ప్రతీ జ్ఞాపకమూ ఏ ఒకరికో ఉత్తేజభరితమే! స్ఫూర్తవంతమే! త్యాగి, యోధుడు, ఆచరణశీలి, గాంధేయవాది నాతండ్రిపెద్దాడ రామచంద్రరావుగారి స్మృతి మా కుటుంబానికే గాక మరికొందరికైనా ఆదర్శప్రాయమే అని నానమ్మకం…


పశ్చిమగోదావరి జిల్లా స్వాతంత్ర సమరయోధుల చరిత్రను గ్రంధస్ధం చేస్తున్న డాక్టర్ గాదం గోపాలస్వామి కొద్ది నెలల క్రితం ఫోన్ లో పరిచయం చేసుకుని మానాన్నగారి జైలు వివరాలు ఇతర అంశాను ప్రస్తావించి ధృవీకరణ కోసమే ఫోన్ చేసినట్ట వివరించారు


జైలు సంవత్సరాలు తేదీలు నాకు గుర్తులేవు అవన్నీ పలురికార్డులలో వున్నాయని గోపాలస్వామిగారే నాకు చెప్పారు ఇతర అంశాలకు సంబంధించి వివరాలు నేను చెప్పాను

మా అమ్మను వివాహమాడటానికి మా నాన్నగారు తల్లిదండ్రుల అనుమతి కోసం ఎదురు చూసింది 13 ఏళ్ళ కాదు మూడున్నర ఏళ్ళే మానాయనమ్మగారు పోయేటప్పడికి మానాన్నగారికి వయసు మూడేళ్ళే. పెంచిన అక్కగారు మొదట, మంచం మీదున్న తండ్రిగారు చివరికి అనుమతి యిచ్చారు.

బ్రిటీషు వాళ్ళని ఎదిరించి అనేక సార్లు జైలుకి వెళ్ళడం కష్టమనిపించలేదు కాని, కులాన్ని ఎదిరించి నిలబడటం వల్లకాలేదు అని నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా నాన్నగారు చెప్పారు. 

అలా వీరవాసరంలో వుండలేక చల్లచింతలపూడి, తాడువాయి, జంగారెడ్డిగూడేలకు మా వలసలు సాగాయి. మేము తాడువాయిపొలంలో వున్నపుడు నేను 4 వ మాతమ్ముడు 2వ తరగతి. క్షురకులు రజకులు మా యింటికి రాకపోవడం వల్ల మమ్మల్ని స్టూలు మీద కూర్చోబెట్టి  మానాన్నగారే మాకు క్రాఫ్ వేసేవారు. మాఅమ్మ నాన్నలు బట్టలు ఉతకడం చూసి తమ్ముడూ నేనూ అనుకరించేవాళ్ళం. 

ఇద్దరు పాలేర్లు వుండేవారు ఇంటి పనులు వాళ్ళకి చెప్పేవారుకాదు. ప్రతీ ఆదివారం మాలపేటకో మాదిగ గూడేనికో వెళ్ళి వీధులు (రెండేసే వుండేవి) ఊడ్చి చెత్తను తట్టల్లో నింపి నెత్తికెత్తుకుని దూరంగా పెట్టించిన పెంటపోగులో కలుపుతున్న మా అమ్మనీ నాన్నగారినీ చూస్తూ తమ్ముడూ నేనూ చేతులు పట్టినంత చెత్తని మోస్తూ సాయపడటం గుర్తొస్తోంది. 

టౌనుకెళ్ళడానికి రోజూ రెండు బస్సులు ఆరుసార్లు తిరిగేవి. ఒక బస్సు వాళ్ళు మమ్మల్ని ఎక్కించుకునేవాళ్ళుకాదు ఇంకోబస్ వాళ్ళు ఎక్కించుకునేవారు. “అసుంటా” నిలబడవలసి వచ్చేది. 

మా హైస్కూల్ చదువులకోసం జంగారెడ్డిగూడెం మకాం మారాము. అది పట్టణం వల్లో ఏమో కులం గోల తక్కువే వుండేది. ఒక సెలవుల్లో మానాన్నగారిని పెంచిన అక్క మా పెద్ద మేనత్తగారి యింటికి వెళ్ళాము. అప్పుడు నేను 8  క్లాస్. మమ్మల్ని అక్కడ దింపేసి మానాన్నగారు బొంబాయిలో సర్వోదయ సమ్మేళనానికి వెళ్ళారు. 

మేనత్తగారి యింట్లో మా భోజనాలు పశువుల పాకలో… అవమానమేమిటో నాకు మొదటి సారి అపుడే తెలిసింది. 

మా అమ్మ మాలది అనిపించుకున్నందుకు ఎపుడూ బాధపడలేదు అవమానమనుకోలేదు. మైకాకాగితంలో చుట్టి వుంచిన (భీమవరం కాంగ్రెస్ ఆఫీసులో 21 జంటలకు ఆదర్శ వివాహం అని పేర్లతో సహా ఆచ్చయిన)ఆంధ్రపత్రిక నేను ఇంటర్ లోకి వచ్చేవరకూ మా అమ్మకు పెద్ద ఆస్ధి. సంవత్సరాల తరబడి “ఇది పంతులుగారు లేపుకొచ్చిన మాలది” అన్న  మాటల కంటే మా అమ్మను దుఃఖ పెట్టిన బాధ ఇంకొకటి వుండి వుండదు. 

నేను యాక్టివ్ జర్నలిస్టుగా వున్నప్పుడూ అంతకుముందూ,ఆతరువాత, నాతల్లిదండ్రుల గురించి అన్ని పేపర్లూ చాలాసార్లు వార్తలు రాశాయి. నేను ఒక్క వార్తకూడా రాయలేదు. మా గురించి నువ్వు రాస్తే చదవాలని వుంది అని ఓసారి  మా అమ్మ అంది. సరే అన్నాను గాని అసలు ప్రయత్నమే చేయలేదు. ఇపుడు లోటని పిస్తోంది. ఇదంతా చదవడానికి మా అమ్మలేనందుకు.

నేను డిగ్రీలో వున్నపుడు కొన్నిసార్లు స్నేహితులతో కలసి చాలా సార్లు బీరు కొన్ని సార్లు బ్రాందీ విస్కీ రమ్మ జిన్ను తాగాను. ఎవరైనాఏదైనా చెప్పదలచుకుంటే రాత్రిభోజనాలకు ముందు అందరినీ సమావేశపరచే ఆశ్రమ సాంప్రదాయం ఒక సారి మానాన్నగారు చెప్పగా విన్నాను నేను తాగడం నాకే నచ్చక నాలుగురోజులు  ఆలోచించి “క్షమాపణ సమావేశం” ఏర్పాటు చేశాను. మా నలుగురితోపాటు మరో ముగ్గురు సర్వోదయ కార్యకర్తలు కూడా వున్నారు. నేను తాగిన విషయం చెప్పి ఇకపై తాగను అని క్షమాపణ అడిగాను 

మా నాన్నగారు ఒక రోజంతా నిరాహారంగా వున్నారు ( ఇలాంటి ప్రాయిశ్చిత్తం గాంధీ ఆశ్రమ సాంప్రదాయమే) మూడవరోజు ఒక ఉత్తరం నాకు ఇచ్చి చదవమన్నారు. అది అఖిలభారత మధ్యపాన నిషేధ మండలి జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా. ఇంకప్పుడూ తప్పుచేయను రాజీనామా వద్దని భయంగా అడిగాను ఆయన చాలా ప్రశాంతంగా మన నైతికతను ముందు కూడదీసుకుందాం అదిలేకుండా మనమేమీ చేయలేము. నువ్వు చదువు పూర్తిచేసుకున్నాక ఒక్కరితో మద్యం మాన్పించగలిగితే అదే పెద్దనిర్మాణ కార్యక్రమం అవుతుంది అన్నారు

ఆతరువాత నేను తాగలేదు. ఇద్దరితో లిక్కర్ మానిపించగలిగాను. 


మా తల్లిదండ్రుల ఆదర్శాలు విలువలు మేము పాటించలేకపోయాము. డబ్బు పరమైన కష్టాలు పడ్డాము ఇందులో నాతమ్ముడి కష్టాలే చాలా ఎక్కువ. అయినా డబ్బుకోసం అపుడూ ఇపుడూ మేము వెంపర్లాడలేదు. మోసపోయామేమోకాని ఏప్రలోభాలకూ లోనుకాలేదు. చట్ట బద్ధంగా నీతిమంతంగా, సవ్యంగా బతుకుతున్నాము 

అపసవ్యంగా బతకకపోవడం తప్ప మేము మా తల్లిదండ్రుల కిస్తున్న నివాళి ఏమీలేదు

(గోపాలస్వామిగారు మా నాన్నగారి గురించి రాసిన వ్యాసాన్ని మాతమ్ముడు స్కాన్ చేసి పంపాడు. 
చీఫ్ సబ్ ఎడిటర్ గా ,  చీఫ్ రిపోర్టర్ గా వార్త ఎంతుండాలో ఎక్కడ ఆపాలో నాకు తెలిసినంతగా (నా సమకాలీనుల్లో )మరెవ్వరికీ తెలియదని  ఓ పేరుంది. ఈ పోస్టింగ్ సైజు నా వృత్తి నైపుణ్యానికి చిన్న వెక్కిరింతే!
వ్యక్తిగత ఎమోషన్లు ఎంత ఆపుకుందామనుకున్నా ఆగని అవస్తే యిది)అవును వేణు గారూ!
గుర్తింపు గౌరవాలతో కష్టాలు కాస్త ఉపశమిస్తాయి! మా అమ్మా నాన్నల విషయంలో నాన్నగారికి వచ్చిన గుర్తింపు గౌరవం అమ్మకిరాలేదు. పురుషాధిక్య ప్రపంచంలో ఇంతకంటే ఏమీ ఆశించలేము కదా!
*అవును సుధాకర్ గారూ! స్వాతంత్రానంతరం మా తండ్రిగారు నిర్వహించిన నిర్మాణ ఉద్యమాల ప్రస్తావన లేదు. గాంధీ నిర్మాణ సిద్ధాంతాల పరిధిలో మన రాష్ట్రంలో “సర్వోదయపాత్ర” ఉద్యమానికి  మానాన్నగారు,బిసిహెచ్ రంగారెడ్డిగారు, డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు రూపకల్పన చేశారు.
మనకున్నది ఇతరులతో పంచుకోవడం (మనకున్నది ఇతరులకు ఇవ్వడం కాదు పంచుకోవడం) ఈ కాన్సెప్టు. ఇందులో ఒక చిన్న వెదురు బుట్ట ఇంటింటికీ ఇస్తారు. ఆఇంటి గృహిణి ఎసరు వేయడానికి తీసిన బియ్యం నుంచి పిడికెడు బియ్యం తీసి బుట్టలో వెయ్యాలి. (బియ్యం డబ్బానుంచి కాదు) అంటే తింటున్న దానినే ఇవ్వడమన్నమాట. ఉద్యమ కార్యకర్తలు వారానికోసారి ఈ బియ్యాన్ని తీసుకు వెళ్ళి అమ్ముతారు ఆసొమ్ము వంచితులు,వితంతువుల కు వృత్తివిద్యల్లో శిక్షణ, పునరావాసాలకు వినియోగించేవారు. సంపన్న వితంతువులకు కూడా కుటుంబ ఆదరణ లేని కాలం అది. ఈ ఉద్యమం కొన్ని ప్రాంతాల్లో చాలా బాగా జరిగింది. కాలక్రమంలో అంకితైన కార్యకర్తలు లేక విఫలమైంది.
మానాన్నగారు నాస్తికుడు హేతువాది కూడా..అయితే సహచరమిత్రులందరూ ఆస్తికులే అయినప్పటికీ పరస్పరం ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించుకునే అండర్ స్టాండింగ్ వల్ల కలసి చసే పనిలో సమస్యలు రాలేదు.
సుధాకర్ గారూ! 2) సుదీర్ఘకాలం జైలులో వున్న గౌతులచ్చన్న గారిని, నడింపల్లి తిరుపతిరాజుగారినీ ( అని గుర్తు ఖచ్చితంగా చెప్పలేను) మానాన్నగారినీ కేంద్రప్రభుత్వం జైలు సర్టిఫికెట్లు లేని స్వాతంత్ర సమరయోధులను గుర్తించే అధికారాన్ని యిచ్చింది.వీరిలో ఎవరు సర్టిఫై చేసినా వారికి తామ్ర పత్రం, పెన్షన్ లభించేది. ఆసమయంలో విపరీతమైన వత్తిడి …నాకూ నా తమ్ముడికీ విపరీతమైన ప్రలోభాలు …మా నాన్నగారి జ్ఞాపకశక్తి గొప్పది సర్టిఫికెట్ కోసం వచ్చిన వారిని ప్రశ్నలతో స్కౄటినీ చేసేవారు కన్విన్స్ కాకపోతే మీరు స్వాతంత్రసమరయోధుడు కాదు ఇలాంటి పనులు వద్దు అని పంపేసేవారు. అల్లురామలింగయ్యగారికి సర్టిఫికేట్ ఇవ్వాలని ఎందరెందరో పెద్దవాళ్ళు, కొన్ని సంఘాల ప్రతినిధులు వత్తిడి పెట్టేవారు. ఆయన ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చాలా చురుకైన కళాకారుడు. అద్దేపల్లి వారిసత్రంలో ఉద్యమ కారులు కళాకారులు కలుసుకునేవాళ్ళం ఆవిధంగా స్వాతంత్ర ఉద్యమ కారులతో సాన్నిహిత్యమే తప్ప ఆయన స్వాతంత్ర ఉద్యమ కారుడు కాదు అని నిష్కర్షగా మానాన్నగారుతేల్చి చెప్పేశారు. సహనం కోల్పోయిన తాతబ్బాయి అనే అల్లు అభిమాని నువ్వు ఆపితే ఆగదు అంటూ ఏకవచనంలో నిందించడం మొదలు పెట్టినపుడు నేనూ నాతమ్ముడూ అతన్ని మడపట్టి బయటకు గెంటేశాము. ఆగుంపు మొత్తం విలేకరి వెంకటరత్నం వద్దకు వెళ్ళి సర్టఫికెట్ ఇవ్వడాని పెద్దాడ రామచంద్రరావు లంచం అడిగాడని పిటీషన్ ఇవ్వగా దాన్ని వాళ్ళముందే చింపసి పొమ్మని ఆవిలేకరి పంపేశారని కొంతకాలం తరవాత తెలిసింది. తాతబ్బాయి గుంపు అన్నట్టే వాళ్ళ పని ఆగలేదు. కేంద్రమంత్రి రంగయ్యనాయుడుగారు స్వయంగా పూనుకుని ఒకటి రెండు నియమాలను సడలింపచేశాక మహాకళాకారుడైన అల్లు రామలింగయ్యగారి కి తామ్రపత్ర గౌరవానికి ఆటంకంతొలగిపోయింది
సుధాకర్ గారూ! 3) జయప్రకాష్ నారాయణ్ గారి సంపూర్ణ విప్లవ ఉద్యమం లో మానాన్నగారు దాదాపు 10 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్నారు. లోక్ సంఘర్ష్ సమితి వార్తా పత్రిక వితరణ నా బాధ్యత. మురళిగారు నా పనులపై నాకు సూచనలు ఇచ్చేవారు. ఆవివరాలు ఉత్సాహంగా మానాన్నగారికి చెప్పబొయినపుడు ఆయన నివారించారు. క్రమశిక్షణ  చాలాముఖ్యమని రహస్య ఉద్యమంలో ఇదితప్పితే అనేకమంది దొరికిపోయి ఉద్యమం విఫలమైపోతుందని హెచ్చరించారు. ఆ కాలంలో మా అమ్మ జీతం ఆపేశారు మాపొలం పంపు కరెంటు కనెక్షన్ తీసేశారు ఏమిటని మా అమ్మ వెళ్ళి అడిగితే పైనుంచి ఆర్డర్స్ అని చెప్పారట ఆసమయంలో బియ్యం అయిపోతే ఇల్లంతా వెతికి చిల్లర పోగుజేసి మహంకాళి రామూగారి కొట్టుకి వెళ్ళి రెండుకిలోలు బియ్యం అడిగా విషయం తెలుసుకుని ఆయన అరమూట బియ్యం కూలీకి కూలీ డబ్బులుకూడా యిచ్చి  ఇంటికి పంపారు. తరువాత చాలాకాలనికి ఆ బాకీ తీరచాము. ఆఏడాది నా చదువు ఆగిపోయింది. చివరిలో ముళిగారు నన్ను సత్యాగ్రహం చేసి అరెస్టయిపొమ్మని సూచించారు. దండవేసుకుని మెయిన్ రోడ్డు నుంచిఇందిరాగాంధీ కి వ్యతరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ కివెళ్ళాను.ఎస్ ఐ నన్ను అరెస్టు చేయలేదు మీనాన్న గారు జైల్లో, టీచరుగారు (మా అమ్మ) కష్టపడుతూంటే నువ్వుకూడా జైలుకెళ్తే ఎలా, ఆవిడ కష్టాలు పెంచకుండా ఇంటికిపో అని కసిరేశారు
సుధాకర్ గారూ! 4)గోపాలస్వామిగారి రచనలు స్వాతంత్ర ఉద్యమ కాలానికి పరిమితం చేసుకున్నారో లేక స్ధలాభావమో …. ఎండలు తగ్గాక గోపాలస్వామిగారిని కలసి వస్తాను ఆ వ్యాసంతో ప్రచురించిన మా నాన్నగారి ఫొటో మా యింట్లో లేదు. కృతజ్ఞతలు చెప్పడం తోపాటు ఆఫొటో ఆయన వద్దే వుంటే కాపీ చేయించి తెచ్చుకోవాలనుకుంటున్నాను
డియర్ సుధాకర్! పేరుతో సహా నా తమ్ముణ్ణి కూడా గుర్తుంచుకున్నవు ధాంక్స్ సుధీర్ ఇప్పుడు బాగున్నాడు సంవత్సరాలతరబడి ఆర్ధిక ఇబ్బందులు పడ్డాడు స్ధలాలు కొనుగోళ్ళు అమ్మకాల ఏజెంటగా లిటిగేషన్లు లేని నమ్మకమైన మధ్యవర్తిగా అతనికి గౌరవ మర్యాదలు వున్నాయి

ఆటమాయ-గెలుపుమాయ-ఓటమిమాయ-అంతా మాఫియామాయే అని తేటతెల్లమైపోయాక ఇంతకాలమూ ఎంతమొసపోయామూ అనే నిర్వేదమేమిగులుతోంది


అక్కడ ఫిక్సింగ్…ఇక్కడ బెట్టింగ్…అక్కడ దొరికితేనే దొంగలు…ఇక్కడ అప్పులపాలు, ఆస్తుల అమ్మకాలు, ఆత్మహత్యలు-ఇదంతా ఐపిఎల్ వికృత విస్తరణ పర్యావసానమే.


ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)మ్యాచ్ ల సీజన్ లో దినపత్రికల జిల్లా ఎడిషన్లు జోనల్ పేజీల్లో “ముంచేసిన క్రికెట్ బెట్టింగ్” వార్తలు తరచు కనబడుతున్నాయి. అప్పులపాలై రాత్రికిరాత్రే పారిపోవడమో, టూవీలర్లు, ఆటోలు అమ్మేసుకోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో, దొంగతనానికి పాల్పడి పట్టుబడిపోవడమో జరుగుతోంది.

ఆట లక్ష్యం గెలుపు అయివుండాలి. ఓడినా కూడా క్రీడాపటిమ కొత్త ఆటగాళ్ళకు స్ఫూర్తివంతమైవుండాలి. అయితే లలిత్ మోడి సారధ్యంలో ఐపిఎల్ క్రికెట్ ప్రయోజనాలే మారిపోయాయి. టివి లైవ్ రిలేలు భారీ ఆడ్వర్టయిజ్ మెంటులకు అతిపెద్ద స్పాన్సర్ షిప్పులకూ దారితీసాయి. అప్పటికి కోట్లరూపాయలలోవున్న క్రికెట్ లావాదేవీలు వేల కోట్లరూపాయల సైజుకి పెరిగిపోయాయి. 

వాస్తవికతలు అనుకూలతలను పట్టించుకోని విధాననిర్ణేతలు ముందుచూపులేకుండా, అసలు ఏచూపూలేకుండా గుడ్డిదర్భారు ఆమోదముద్రలు పడిపోవడంతో ఐపిఎల్ – కేంద్ర క్రీడామంత్రిత్వశాఖకీ, భారత్ క్రికెట్ కంటో్రలు బోర్డు చేయిదాటిపోయాయి.

కి్రకెట్ ఆటకు విలువ పెంచి వినోదాన్ని జోడించి ఈ క్రీడను 
“ఇన్ ఫోటెయిన్ మెంటు”గా మార్చేశామని లలిత్ మోడీ జబ్బలు చరచుకున్నారు. అపుడాయనకు సక్సెస్ ఫుల్ సినిమా హీరోలతో సరిసమానమైన ఫాన్స్ వుండేవారు ఇప్పటికే ఆయన అభిమానుల సంఖ్య తక్కువేమీకాదు.

ఇంత భారీ ఎకనామిక్స్ జతపడటం వల్ల క్రికెట్ క్రీడా స్పూర్తే నాశనమైపోతూందని ఆరంగం పెద్దలు అప్పట్లో వెలిబుచ్చిన ఆందోళన అరణ్యరోదనమే అయ్యింది. పైగా ఈ మాటలన్నవారిని అభివృద్ధి నిరోధకులుగా మోడీ వీరాభిమానులు దుమ్మెత్తిపోశారు.

విరివిగా డబ్బు చెలామణి అయ్యే ప్రతిచోటా మాఫియాలుదిగుమతి ఐపోతూంటాయి. మ్యాచ్ ఫిక్సింగ్ అవకాశాలగురించి, అనుమానాలగురించి ఇంటర్నేషనల్ క్రికెట్ కంటో్రలు బోర్డు బిసిసి ని ఎప్పుడో హెచ్చరించింది.
అయితే ఐపిఎల్ ఎవరి అదుపుకీ అందనంత “ఎత్తు”కి అప్పటికే ఎదిగిపోయింది.

ఐపిఎల్ క్రీడాకారులకు అధికారికంగానే ముట్టజెప్పే డబ్బుదెబ్బకి క్రికెట్ లో ఆరితేరిన వెస్ట్ ఇండీస్ కుదేలైపొయింది. “అంతడబ్బిచ్చుకోలేము ప్లీజ్ మన జట్టుకోసం ఆడండి అని సొంత క్రీడాకారులనే ఆదేశం అడుక్కోవలసిన దౌర్భాగ్యం దాపురించింది. ఐపిఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఏజట్లూ అంతర్జాతీయ క్రికెట్ ఆడవు. ఆడితే ఆదేశం జట్లనే ఐపిఎల్ కొనేసి పరువుతీసేస్తుందన్న ఆయా దేశాల క్రికెట్ కంటో్రలు వ్యవస్ధల భయమే ఇందుకు కారణం.

టెస్ట్ మ్యాచ్ లకుముందు ఫిట్ నెస్ లేనివారంతా విచిత్రంగా ఐపిఎల్ మ్యాచ్ లసమయానికే వెల్ ఫిట్ అయిపోవడాన్ని చూస్తే “డబ్బు మందుతో గాయాలూ నిమిషాల్లోనే మాయమైపోతాయా” అని ఆశ్చర్యమేస్తూంది.

మనకా సంకోచమే లేదు.ఎందుకంటే పేరుకే తప్ప కంటో్రలు వ్యవస్ధే మనకి లేదు. వుండివుంటే పర్యావసానాలను కనీసంగా కూడా ఆలోచించకుండా క్రికెట్ ను ఉద్ధరిస్తున్నానన్న భ్రమతో ఐపిఎల్ మౌలిక స్వభావాన్నే ఒంటి చేత్తో మార్చేసిన దుందుడుకు లలిత్ మోడి తోక కత్తిరించేవారే  

ఆటగాళ్ళని లక్షలు పెట్టి కొనేసుకుకుంటున్న తొలిరోజుల్లో ఈ కొనేసుకోవడమేమిటో అర్ధమ్యేదికాదు. నా చిన్నప్పుడు అడ్వాన్సు గా డబ్బులిచ్చి పాలేర్లని రైతులు కొనుక్కునేవారు. ఎంతో అవసరమైతేతప్ప సెలవుఇచ్చేవారు కాదు. చెప్పకుండా మానేస్తే తన్నుకుంటు ఈడ్చుకొచ్చేవారు. కట్టుబానిసత్వం అలానే వుండేది. వీళ్ళు  క్రికెట్ క్రీడాకారులా కొనుక్కున్న కంపెనీల కట్టుబానిసలా అనిపించేది. అయితే వీళ్ళు బహిరంగంగా కొనుక్కున్నవారికిగాక అనైతికంగా కొనుక్కున్న వారికే బానిసలు అవుతున్నారని ఇపుడే అర్ధమౌతోంది. ఇలా కొనుక్కున్న కంపెనీల్లో ఒకటైన డెక్కన్ క్రానికల్ మునిగి పోడానికి కూడా ఫిక్సింగే కారణం కాదుకదా అనే అనుమానమొస్తూంది. 

డబ్బే సర్వస్వం అయినప్పుడు అవసరం మనుషుల నీతిని పతనం చేస్తుంది. ఈ పనిచేసేవారూ సాటి మనుషులే “సాటి మనుషుల్ని” చేరదీసి కూడగట్టి పనిచేయించే మాఫియాల ఈ డబ్బు సైజుని లక్షలకోట్లకు పెంచేశాయి. 
ఇది అర్ధమౌతూంటే శ్రీశాంత్ మరో యిద్దరూ కేవలం టుమీ్రలేనని లెక్కతేలిపోయింది. ఇపుడిక ఏమ్యాచ్ చూడాలన్నా అనుమానమే!ఏ షాటైనా అనుమానమే! ఏబాలైనా అనుమానమే 

నగరాలనుంచీ,పట్టణాలనుంచీ,గ్రామాలవరకూ క్రీడోత్సాహం యిచ్చే ఉద్వేగపు నమ్మకం తో జరుగుతున్న కోటాను కోట్లరూపాయల బెట్టింగుల వెనుకవున్నదంతా కృత్రిమంగా రూపొందించబడిన న క్రీడావేశం అనితెలిసిపోవడం, ఆటలో హీరోచితాలు కేవలం డబ్బు సంపాదనకే సృష్టించబడిన సెట్టింగులేనని తెలిసిపోవడం నెత్తిమీద పిడుగు పడటం కాక ఇంకేమిటి?
మన జాతీయక్రీడ హాకీ అని మరచిపోయేటంతగా విశ్వరూపమన్నట్టు విస్తరించిన ఐపిఎల్ ఈగకెలుకుతున్న పుండంత జుగుప్సాకరంగావుంది.


భక్తిశ్రద్ధలతో నమస్కరించుకుంటున్నాను


నాకు జన్మనీ, జీవితాన్నీ ఇచ్చిన నా తల్లిదండ్రుల్ని సందర్భమొచ్చినపుడు ఎంత ప్రేమగా, గౌరవంగా, భక్తిగా స్మరించుకుంటానో, …..నేనువున్న నేలకు పచ్చధనాన్ని, నేలనేనమ్ముకున్నవారికి సిరిసంపదల్నీ, స పశుపక్ష్యాది సపరివారంగా చల్లటి జీవితాన్నీ యిచ్చిన సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుణ్ణి కూడా నేడు…ఆయన 210 వజయంతి నాడు అంతే భక్తిశ్రద్ధలతో నమస్కరించుకుంటున్నాను 

మోజున్న పనులు చేసేటప్పుడు అపశకునాల్ని, అభ్యంతరాల్నిఏమాత్రం పట్టించుకోని అభ్యుదయవాదులు కదామనుషులంటే!


డియర్ వేణూ!


నూజివీడు అనగానే మామిడిరసాలు, నోటిలోనీటిని ఊరించేస్తూంటాయి. ఏడాదికోసారే వచ్చే సీజను పండు కదా అనే సమర్ధన షుగరుమాత్రయిపోతూంది. ఇంకో కిలోమీటరు నడిచేద్దామన్న భరోసా రాజకీయవాగ్ధానంలా చొచ్చుకువచ్చేస్తూంది 

జరిగేపని చూడు అని ఈసడిస్తున్నట్టు బద్ధకం అపశకునంలా ఓసారి తలెత్తి యధావిధిగా నిద్రతూంది. 

మోజున్న పనులు చేసేటప్పుడు 
అపశకునాల్ని, అభ్యంతరాల్నిఏమాత్రం పట్టించుకోని అభ్యుదయవాదులు, ప్రగతి శీలురే కదా మనుషులంటే!

ఇదంతా కాదుగాని, ఏదిఏమైనా వచ్చే 2 వారాల్లో ఒక ఆరు బంగినపల్లి మామిడిపళ్ళు తినితీరాలని మీరు “నూజివీడు” నుంచి ఇంటికి వెళ్ళాక రాసిన మెయిలు చదివాక నిర్ణయించేసుకున్నాను.

ఒక ఫ్రీలాన్సర్ కి వుండే ఏమాత్రంతీరికలేనితనం, ఏపనీలేనితీరికా నన్నుఏకకాలంలో సతమతం చేస్తూనే వుంటాయి. అయినా మీకు ఉత్తరం రాయడమో బదులివ్వడమో భలే ఉత్సాహంగా వుంటుంది. మీరు భక్తిశ్రద్ధలతో పుస్తకాలు చదువుకుంటూ వున్నారన్న గౌరవ ప్రేమావాత్సల్యాలే ఇందుకుకారణమేమో!

తిక్కన గారి పద్మవ్యూహం మీద మీరు రాసిన వ్యాసం నేను కూడా చదివానని మీకు తెలియజేయడమే తప్ప ఆమెయిలులో తతిమా విషయాలు అంత ప్రాధాన్యమైనవేమీకాదు

ఒకలాంటి ఉబలాటమూ, చదవేనన్న ఉత్సాహమూ, రాసినవారికి అకనాలెడ్జ్ చేయాలన్న హుషారూతప్ప “అభిప్రాయాలు” అనదగ్గ సాధికారికమైన ఆలోచనలుగాని, అందుకవసరమైన విజ్ఙానపు పునాదులో నాకులేవు. 

అసలు ఇదంతా మీకు ఉత్తరం రాయడం కాదేమో! నేను డైరీ రాసుకోవడమేనేమో!….తెలియడం లేదు

వుంటాను
పెన

అధోజగత్తు బిడ్డలు -బతుకు అరగదీసి సానపడితే ముత్యాలమ్మలౌతారు.


దగాలనుంచీ,దోపిడులనుంచీ, మోసాలనుంచీ, అణచివేత నుంచీ పుట్టుకొచ్చిన అధోజగత్తు బిడ్డలు -బతుకు  అరగదీసి సానపడితే ముత్యాలమ్మలౌతారు. సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్న పెద్దప్లీడర్లు గట్టిగా తత్వాలు చెబుతారు. స్పందించే సంస్కారం వున్న మూర్తులు చాలాసార్లు నిషి్క్రయాపరులగానే ఏం చేసినా ముత్యాలమ్మలే చెయ్యాలి. ఏంచేసినా పెద్దప్లీడర్లే చెయ్యాలి. 


జీవితంలో సజీవత ఇదే. ఈ “చిరంజీవులను “మనముందుంచిన రావిశాస్త్రిగారూ చిరంజీవే. సామాజిక వాతావరణానికీ, సాహిత్యవాతావరణానికీ అతీతమైన కథ రావిశాస్త్రిగారిది. నేపధ్యాలూ, ఎత్తుగడలూ, పద్ధతులూ  మారివుండోచ్చేమోగాని మూలాలు వందేళ్ళుగా అవే. అవసరం చూసి మనుషుల్ని వాడేసుకునే మనుషులున్నంతవరకూ ఈ మూలాలే వుండిపోతాయి.(అరువులుపెట్టి దొంగలెఖ్ఖలు చెప్పి పిల్లల డబ్బులన్నీ లాగేసుకోడానికి హైస్కూలు పక్కన జీళ్ళు పప్పుండలు అమ్ముకునే రాములమ్మ ప్లేసులో టై కట్టుకుని ఇంగ్లీషు మాటలతో వచ్చిన వోడాఫోన్ వాడు రకరకాల ఫోనాటలతో పిల్లల డబ్బులన్నీ లాగేసుకుంటున్నట్టు)

చేపనుచేప మింగేసే ఆటలో గడుసుతనాల మీద రావిశాస్త్రిగారివన్నీ వెటకారపు బాణాలే. అవి భలే తగిలేశాయని 50 ఏళ్ళతరువాత కూడా కులుక్కోడానికి మనకి అవకాశమిచ్చి పోయిన ఆ పెద్దమనిషి (రాచకొండ విశ్వనాధ శాసి్త్ర 30-7-1922 – 10-11-1993) మీద  
పుస్తక ప్రేమికుడు, అపురూపమైన పాఠకుడు, మర్యాదస్తుడైన సమీక్షకుడు
నా మిత్రుడు వేణు పరిశీలన –  “వాకిలి” లో రావిశాస్త్రి గారి “మాయ” కథ మీద ఆయన రాసిన  ‘కథనకుతూహలం’ లో చదవొచ్చు ఏంచదివినా, ఏమి విన్నాకూడా వార్త మూసలో తిరగరాయడమే తప్ప ఆవార్త ప్రయోజనమేమిటో ఆలోచించడం చేతకాని టె్రయినీదశలో "పాత్రికేయ ఇంగితం" ఏమిటో నాకు బోధపరచిన వారిలో నిన్న దివంగతులైన గుండిమెడ కేశవరామయ్య గారుముఖ్యులు.


ఏంచదివినా, ఏమి విన్నాకూడా వార్త మూసలో తిరగరాయడమే తప్ప ఆవార్త ప్రయోజనమేమిటో ఆలోచించడం చేతకాని టె్రయినీ దశలో “పాత్రికేయ ఇంగితం” ఏమిటో నాకు బోధపరచిన వారిలో నిన్న దివంగతులైన గుండిమెడ కేశవరామయ్య గారు ముఖ్యులు. 


1979 ఆక్టోబరు 22 న ఈనాడు విజయవాడ ఎడిషన్ మఫిషియల్ డెస్క్ లో టె్రయినీ సబ్ ఎడిటర్ గాచేరాను. కేశవరామయ్యగారు ఆ డెస్క్ ఇన్ చార్జ్. కొమ్మనేని శ్రీనివాసరావుగారు, కాకాని సాంబశివరావుగారు, గోవిందరాజుల చక్రధర్ గారూ షిప్టు ఇన్ చార్జులు. వీళ్ళ వీక్లీ ఆఫుల్లో సెలవుల్లో వెల్లంకి అరుణ్ కుమార్ షిఫ్టు ఇన్ చార్జితనం చేసేవారు. మోటూరి వెంకటేశ్వరరావుగారు న్యూస్ ఎడిటర్. 

నాకు ఆషిఫ్టు ఈ షిఫ్టు అనిలేదు ఎడిషను అయ్యాకే రూముకి…మెళుకువవచ్చాక ఆఫీసుకి… ఎన్నో అనుమానాలు…తీర్చుకుందామని వస్తే పెద్దవాళ్ళంతా బిజీబిజీ గా వుండేవాళ్ళు. వాళ్ళ ఎదురుగా కూర్చుంటే చాలు చిన్నగా సంభాషణ మొదలైనపుడు నా అనుమానాలు తీర్చుకునే వాణ్ణి. కేశవరామయ్యగారు అందరిలోకీ పెద్ద. అయినా ఆయన గొప్ప ప్రోత్సాహకుడు…స్నేహశీలి అవ్వడం మూలాన ఎక్కువ అనుమానాలు ఆయన దగ్గరే తీరేవి. వార్తను చిక్కగా  తిరగరాయడం అతిక్లుప్తమైన శీర్షిక పెట్టడంలో చక్రధర్ గారు చాలా ప్రయోగాలు చేశేవారు. ఒక్క పదం కూడా తీయడానికి వీలులేనంత దట్టింపు ఆయనది. పదం రిపీట్ ఆయితే ఊరుకునేవారు కాదు మళ్ళీ రాయించేవారు. (ఆ శైలి నాకుఇష్టం. నేను అలాగే రాస్తున్నానని రాయాలనీ అనుకుంటూవుంటాను) 

ఈ శైలి గురించి ఒకరోజు క్యాంటీన్ దగ్గర ప్రస్తావించినపుడు- ఎవరిపద్ధతివారికుంటుంది నువ్వుకూడా చాలా బాగానే రాస్తావు కాకపోతే ఏవార్తకు సామాజిక ప్రయోజనం వుందో, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో (కాపీ సైజు లోగాని పేజి మేకప్పులోగాని) సరిగా తూకం వయలేకపోవడమే నీలోపం- అని వివరించారు. వార్తాపలమైన ఇంగితజ్ఞానాన్ని ఆవిధంగా ఆయన మూలంగానే అలవరచుకోగలిగాను

తరువాత రెండునెలలలోపలే ” పేజికి వెళ్ళే వార్తల ఎంపికలో సి్ప్రంగ్ కాటా అంత ఖచ్చితంగా వుండనఖ్ఖరలేదు. మఫిషిల్ వాళ్ళంకదా ఎండనకా వాననకా తిరిగి వార్తలు పంపే విలేఖరుల కష్టం కూడా గుర్తుంచుకో” అని సలహా యిచ్చారు.

అప్పుడే హైదరాబాద్ లో టె్రయినింగయిన కొత్త బ్యాచ్ వచ్చింది. నందిరాజు రాధాకృష్ణగారూ, మిమిక్రీ కళాకారుడైన రాజశేఖరపాండే గారూ, కోటేశవరరావుగారూ అమరావతి  సత్యనారాయణగారూ ఆ బ్యాచ్ లో వున్నారు. రాధాకృష్ణగారు మినహా మిగిలిన వాళ్ళగురించి చెప్పడానికి (నాదగ్గర పెద్దగా) ఏమీలేదు.

రాధాకృష్ణగారు అనర్ఘళంగా ఇంగ్గీషు మాట్లాడేవారు. ఏసబ్జక్టు ప్రస్తావనకు వచ్చినా లోతుల వరకూ తీసుకెళ్ళేవారు. రాధాకృష్ణగారి జ్ఞానం పరంపరగా వచ్చనదనీ, కాకాని సాంబశివరావుగారి జ్ఞానం ఆయన ధృక్పధం నుంచి వచ్చిందని ఆదశలో నాకు అర్ధమయ్యేలా చెప్పింది కేశవరామయ్యగారే. రాధాకృష్ణగారిలా ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకుంటాను నన్ను కూడా హైదరాబాద్ టె్రయినింగ్ కు రికమెండు చేయమని అనేకసార్లు నేను అడిగినపుడు ఓ సారి క్యాంటీన్ కు తీసుకువెళ్ళి ఇదంతా వివరించారు. అపుడు ఇదంతా బోధపడలేదు కాని నన్ను హైదరాబాద్ పంపబోరనిమాత్రం తెలిసిపోయింది

తిరుపతి ఎడిషన్ పెట్టడం,కొమ్మినేనిగారిని మఫిషియల్ ఇన్ చార్జ్ గా పంపడం ఏడాదిలోనే ఆయన పెళ్ళి జరిగి సైంటిస్ట్ అయిన కొమ్మినేని గారి భార్య శ్రీమతి రాజ్యలక్షి్మకి తిరుపతిలో ఉద్యోగావకాశంలేక కొమ్మనేనిని తిరిగి విజయవాడ బదిలీచేసి ఆ స్ధానంలో నన్ను పంపడం జరిగాయి.

నేను రేపు తిరుపతి బయలుదేరుతాననగా ఇవాళ ఉదయం కేశవరామయ్యగారు ఆయనింట్లో చెప్పిన మాటలు ఆయన మరణించారని విన్నాక మళ్ళీ గుర్తొస్తున్నాయి. 

“నువ్వు కాస్త ఎమోషనల్ గా వుంటావు అవేమీ నీ పనిలో రిఫ్లెక్ట్ కాకుండా చూసుకో పుస్తకాలు కొనికాకుండా లైబ్రీ నుంచితెచ్చుకుని చదువుకో ఆడబ్బు నెలనెలా పోస్టాఫీస్ లో వేసుకో పెళ్ళయ్యాక పిల్లకు పనికి వస్తుంది” ఇదే కేశవరామయ్యగారి మాటల సారాంశం

తరువాత నాలుగైదుసార్లు కలసినా కుశల ప్రశ్నలేతప్ప మేము పెద్దగా మాట్లాడుకున్నదిలేదు.

కేశవరామయ్యగారి అన్నగారికుమారుడు రామచంద్రశర్మ ఫోన్ లో మరణవార్తను చెప్పారు. కేన్సర్ అందులోనూ పెద్దవయసులో చాలా బాధాకరమంటారు. గురువుగారు విముక్తులయ్యారనిపించింది. శాంతి!శాంతి!శాంతి!

Create a free website or blog at WordPress.com.

Up ↑