Search

Full Story

All that around you

Month

June 2013

నచ్చిన కధ "చీకటి"


మిలటరీ నుంచి డిశ్చార్జయిన కెప్టెన్ వర్మ తన వేటకుక్క సీజర్ తో కలిసి బాతుల వేటకు బయలుదేరాడు. ఇల్లూ వాకిలీ లేని దేశదిమ్మరి డిబిరిగాడు తన నత్తగొట్టు (ఒక జాతి కొంగ) తో నీటి పక్షుల వేటకు బయలుదేరాడు. వీళ్ళిద్దరూ తారసపడతారు. 
అల్లం శేషగిరిరావుగారు రాసిన “చీకటి” కధలో పాత్రలు ఈ నాలుగే. కధ చదువుతూంటే అది నీటి చిట్టడవుల నేపధ్యమని కథకుడు ప్రత్యేకంగా చెప్పడకుండానే అర్ధమైపోతుంది. నాకైతే కొల్లేరు కళ్ళముందు మెదిలింది. 
చలిమంటవేసి డిబిరిగాడు అతని జీవితాన్ని చెబుతాడు.
ఆకలి,శృంగారం, పోలీసు క్రౌర్యం, తండ్రి ఉరితీర మొదలైన ఏ ఘట్టాన్నయినా రాగద్వేషాలకు అతీతంగా అనుభవిస్తాడు. బాధ శోకాలతోపాటు  జీవితంలో ఉండవలసిన ఉత్సాహం డిబిరిగాడిలో చెక్కుచెదరదు 
ఈ కథ చదివినప్పుడల్లా డిబిరిగడిలో వున్న సహజవిలువల నుంచి నాగరీక మనుషులమైన మనలో విలువలు ఎంత కృతకమైపోయాయోనన్న నిట్టూర్పే మిగులుతుంది. 
నాకు బాగా నచ్చిన కథల్లో ఒకటైన “చీకటి” కథ-నేపధ్యం 1 ఇ పుస్తకంలో చదివాను అది వున్నచోటు 

బిసి రిజర్వేషన్లు – భూ, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు విస్మృత నేత – పివి జయంతి


అంతగా కీర్తించబడని దివంగత ప్రధాని, మేధావి, నిస్వార్ధ రాజకీయవేత్త, నిరాడంబరుడు, “ఏరుదాటాక కాంగ్రెస్ పార్టీ తగలబెట్టిన తెప్ప” పాములపర్తి వేంకట నరసింహారావు గారి జయంతి (28/9/13) ఈరోజే.
పదవులను సమాజహితం కోసం ఉపయోగించడంలో, పాములపర్తివేంకటనరసింహారావుముందుండేవారు.ముఖ్యమంత్రిగా కొద్దికాలమే ఉన్నా తనకున్న పరిమితులతో సుపరిపాలనను అందించారు. 1972లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో 70శాతం సీట్లను వెనుకబడిన తరగుతల వారికి ఇచ్చి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణల అమలుకు కఠిన చర్యలు తీసుకున్నారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కూడా పీవీ ప్రవేశపెట్టిందే. పెద్దరైతులు ఆదుగ్ధతోనే  పివిని దించేయడానికి జై ఆంధ్రా ఉద్యమాన్ని వాడుకున్నారన్న విశ్లేషణ ఇప్పికీ వినిపిస్తూనే వుంటుంది
ప్రధాని హోదాలో పీవీ తీసుకున్న ఆర్థిక సంస్కరణల అమలు నిర్ణయం.. భారత సమాజాన్ని యావత్ ప్రపంచానికి దగ్గర చేసింది. 1991కాలంలోనే ఆయన కంప్యూటర్  వాడకంలో నిష్ణాతుడిగా ఉండేవాడు. అల్లకల్లోలంగా ఉన్న పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణిచివేసి శాంతిని స్థాపించడంతో పాటు  మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపిన ఘనత కూడా పీవీదే. ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తెచ్చి ఆర్థికమంత్రిని చేసిన ఘనత కూడా పీవీదే. అలా ఆయన చూపిన బాటలో సాగిన మన్మోహన్  ప్రధాని స్థాయికి చేరుకున్నారు.
పీవీ నరసింహారావు.. వరంగల్ జిల్లా.. నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించిన పీవీ. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ను దత్తత తీసుకున్నారు. అప్పటినుంచే ఆయన ఇంటిపేరు పాములపర్తిగా మారింది.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1938లో అంటే తన 17వ ఏటే కాంగ్రెస్ లో చేరారు. డిగ్రీ చదువుతున్న సమయంలో నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని ఆలపించడం వల్ల ఉస్మానియా వర్శిటీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్  విశ్వవిద్యాలయంలో చేరి 1944వరకు ఎల్ ఎల్ బీ చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పీవీ పాల్గొన్నారు.
బూర్గుల రామకృష్ణారావు శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పీవీ.. నాటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, చవాన్, వీరేంద్ర పాటిల్  తదితరులతో కలిసి పని చేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యత్వం పొందారు. 1957లో మంథని నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ.. ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర స్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1962లో తొలిసారి మంత్రి అయ్యారు.
1962 నుంచి 1971వరకు న్యాయ, సమాచార, దేవాదాయ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లారిన తర్వాత.. ఈ ప్రాంతానికి చెందిన గ్రూపు రాజకీయాలకు అతీతుడైన పీవీని కాంగ్రెస్ అధిష్ఠానం.. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. తర్వాత కొంత కాలానికే రాజకీయ కారణాల వల్ల పీవీ ప్రభుత్వం రద్దైంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆయన రాజకీయ కార్యకలాపాలు ఢిల్లీకి మారాయి. మొదటిసారి హన్మకొండ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
రెండోసారీ అక్కడి నుంచే గెలిచారు. మూడోసారి మహారాష్ట్రలోని రాంటెక్  నుంచి విజయం సాధించారు. 1980-89మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రిగా కొనసాగారు. 1991సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్న పీవీని.. అనుకోకుండా ప్రధానమంత్రి పదవి వరించింది. రాజీవ్  గాంధీ హత్యతో.. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు అతీతుడిగా ఉన్న పీవీని ప్రధానిగా ఎన్నుకున్నారు.
సాహిత్య పరంగా కూడా పీవీ సమాజానికి తన సేవలను అందించారు. దాదాపు 16భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడమే కాకుండా ఆయా భాషల్లోని సాహిత్యంతో పీవీకి పరిచయం ఉండేది. విశ్వనాథ రాసిన వేయిపడగలు రచనను హిందీలో సహస్రఫణ్ పేరిట అనువదించారు. దీనికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇన్ సైడర్ పేరిట తన జీవిత కథను రాసుకున్నారు. పీవీ నరసింహారావు జీవితంలో కొన్ని మరకలున్నా.. భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, బీసీలకు రాజకీయావకాశాలు కల్పించడం ద్వారా సమాజానికి తన వంతు విశిష్ట సేవలు అందించారు. ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు.
ఆధునిక భారత రూపశిల్పి, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు, పాములపర్తి వేంకట నరసింహారావు. వింధ్య పర్వత శ్రేణుల దిగువనుంచి భారత ప్రధాని స్థాయికి ఎదిగిన ఏకైక రాజనీతి కోవిదుడు. వంగర గ్రామం నుంచి ఢిల్లీ దర్బారు దాకా ఎదిగిన ఈ నిరాడంబర మేధావి.
సంస్కరణల గురించి ఘనంగా చెప్పుకునే కాంగ్రెస్ అందుకు ఆద్యుడైన పివిని ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించంది. దేశరాజధానిలో ప్రధానులకు జరిగే అంత్యక్రియల ఆనవాయితీ సోనియా కు నచ్చనికారణంగా పివి విషయంలో తప్పిపోయింది. 

క్రైసిస్ మేనేజిమెంటులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగావుపయోగపడుతుంది. మోడికి, బాబుకి వున్న ఈ అవగాహన కిరణ్కు లేకపోవడం ఉత్తరాఖండ్ తెలుగు బాధితుల దౌర్భాగ్యం.


ఆపదొచ్చినపుడు ఆదుకోలేని కిరణ్ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏంచేయాలి??
క్రైసిస్ మేనేజిమెంటులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగావుపయోగపడుతుంది. మోడికి, బాబుకి వున్న ఈ అవగాహన కిరణ్ కు లేకపోవడం ఉత్తరాఖండ్ తెలుగు బాధితుల దౌర్భాగ్యం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఢిల్లీలో ఒక స్ధావరం వుంది. చిన్నదో పెద్దదో ఒక యంత్రాంగముంది. ప్రభుత్వానికి శాటిలైట్ ఫోన్లున్నాయి. ఆఘమేఘాలమీద ఎక్కడికైనా వెళ్ళడానికి విమానాలున్నాయి. డబ్బు ఇబ్బందులున్నా ఆపదల్లో అక్కరకు రానంత దిక్కుమాలిన దరిద్రం మాత్రం లేదు.
ఉన్నదల్లా ఆలోచనల దరిద్రమే…ఉన్నదల్లా నిలువెత్తు ఉదాసీనమే…ఉన్నదల్లా మనవల్లకాదన్న అలక్ష్యమే!
ఉత్తరాఖండ్ వెళ్ళాలన్న మాటటుంచి అక్కడివిపత్తులో బతికిబయటపడి ఢిల్లీ లో ఆంధ్రాభవన్ చేరుకున్న తెలుగు బాధితులకు అధికారులు వసతులు ఏర్పాటుచేయలేకపోయారు భోజనానికి కూడా (మొదట్లో)డబ్బులు వసూలు చేశారు. హైదరాబాద్ నుంచి స్పష్టమైన సూచనలు ఆదేశాలు ఎపి భవన్ కి ముందుగా వెళ్ళకపోవడమే ఈ దౌర్భాగ్యానికిమూలం.
కమ్యూనికేషన్ వ్యవస్ధ అద్భుతంగా వికసించిన కాలంలో కూడా ఇలాంటి నిస్సహాయ పరిస్ధితులు పదేపదే తప్పడంలేదంటే సదుపాయాల్ని – అవసరాలకు తగినట్టుగా సమన్వయం చేసుకోలేని వెనుకబాటుతనమో చేతగానితనమో నాయకుల్లో అధికారుల్లో పేరుకుపోవడమే మూలం. ఆలోచన అంటూవుంటే అమలుచేసే మార్గాలూ అవే క్యూలో నిలబడుతాయి. 
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందరు(సుమారుగా)యాత్రికులు చార్ ధామ్ యాత్రకు వెళ్ళారో ప్రభుత్వానికి స్పష్టతలేదు. ఇలాంటి సుదూర / అరుదైన యాత్రలకు వెళ్ళే వారిలో 90 శాతం మంది టూరిస్ట్ ప్యాకేజీలద్వారా , 10 శాతం మంది గ్రూపులుగానో బయలుదేరుతారు. టూరిస్టు సంస్ధలనుంచి ఆవివరాలు సేకరించడం పెద్ద విషయం కాదు. జిల్లాకొక టోల్ ఫ్రీ నంబరు పెట్టి యాత్రకు వెళ్ళిన కుటుంబాల వారినుంచి యాత్రీకుల వివరాలు సేకరించడం కష్టం కాదు. ఈ ఏర్పాట్లు జరగాలేకాని గంటలవ్యవధిలోనే మొత్తం సమాచారం తెలియజెప్పే మొబైల్ ఫోన్లు, సమాచారాన్ని విశ్లేషించే కమ్యూనికేషన్లు మనకున్నాయి. ఎటొచ్చీ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చన్న బుద్ధీ జ్ఞానాలే ముఖ్యమంత్రి మొదలు ఆయనకు సలహాలు ఇచ్చే సీనియర్ అధికారుల వరకూ ఎవరికీలేవని అర్ధమౌతోది
ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీతోనే సమస్యలు పరిష్కారం కావు. సమస్య తీవ్రతను తెలుసుకోడానికి ఈ టెక్నాలజీ అద్భుతంగా వుపయోగపడుతుంది. దాన్ని వినియోగించుకుని ఎలా పనిచేయాలన్న దృష్టి నాయకులకూ అధికారులకూ వుండాలి.
ఒడిషా తుఫాను విపత్తులో ఆదుకోడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మన అధికారులను పంపారు. పనిలో మన బృందాల అవగాహనను, ఐటి తోట్పాటుని ఒడిషా ముఖ్యమంత్రే ప్రస్తుతించారు
ఇపుడు గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ స్వయంగా ఉత్తరాఖండ్ వెళ్ళారు రెండు విమానాల్లో ఆరాష్ట్రం బాధితులను వెంటతీసుకువెళ్ళారు. రెండు విమానాలతో సమస్యమొత్తంతీరిపోదు.ముఖ్యమంత్రే స్వయంగా బాధ్యత తీసుకోవడం అధికారుల నిమగ్నతను పెంచుతుంది.
గుజరాత్ అధికారులకు వారిరాష్టా్రనికి చెందిన బాధితుల మీద ఒక అవగాహన వుండటానికి ప్రధాన కారణం నాయకత్వమే అయితే రెండోకారణం ఐటి కల్పించిన అవగాహనే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ స్వయంగా వెళ్ళలేకపోయినా బాధితులకు ఢిల్లీ ఎపి భవన్ లో ఉచిత భోజన వసతులు కల్పించడంతో బాటు విమానాలుకాకపోయినా ప్రత్యేక రైలుబోగీలైనా ఏర్పాటుచేయించలేక పోవడం దారుణం. కనీసం రైలుటికెట్టు ఏర్పాటుచేయగలిగినా బాధితులకు పెద్ద ఉపకారమే అవుతుంది.
కష్టకాలంలో ప్రభుత్వం ఏంచేయాలో చంద్రబాబుకి అవగాహనవుంది. (కమ్యూనికేషన్ వ్యవస్ధ ఇపుడున్నంత గాలేని)1996 తుపాను సమయంలో ఆయన ప్లానింగ్, ఫాలో అప్ ల విశ్వరూపాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో జర్నలిస్టులు అతిసమీపంనుంచి చూశారు. ఇంప్లిమెంటులో అక్కడక్కడా లోపాలు వుంటే వేరేసంగతి. 
ఢిల్లీ ఎపిభవన్ లో చంద్రబాబు ధర్నాచేయడం అక్కడి ఏర్పాట్లు పరిస్ధితులపై తీవ్రమైన నిరసనగానే అర్ధమౌతోంది. రాజకీయాధికారమే ఆయన లక్ష్యం కావచ్చు..అంతమాత్రాన ప్రభుత్వ వైఫల్యంమీద అసహనాన్ని వ్యక్తం చేస్తే అదికూడా రాజకీయమంటే ఎలా? (మాట వరసకి ఇదీ రాజకీయమే అనుకుందాం! రాజకీయవేత్తలు రాజకీయాలు మానేసి కబాడీ క్రికెట్టు ఆడరు కదా! గుజరాత్ ప్రభుత్వం లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అకేషన్ కి రైజ్ అయివుంటే తిట్లు, శాపనార్ధాలూ, ధర్నాలు వుండవు కదా!)
అద్భుతమైన కమ్యూనికషన్లున్న 2013 లో అసలు క్రైసిస్ మేనేజిమెంటు ప్లానే లేని కిరణ్ కుమార్ ప్రభుత్వం నెత్తిమీదుండటం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమే!

తూర్పుకోస్తా ప్రయాణానికి గోదావరి అడ్డుపడినప్పుడు మౌనంగా వీపున మోసిన "హేవలాక్ వంతెన" ఐదుతరాల కథకుఅసలైన హీరో!


కమ్మరి సూరన్న కొలిమిలో తయారైన కత్తి మంగలి నూకరాజు చేతిలో మెత్తగా మారి చినకాపు పాపారావు గెడ్డం గీస్తున్న సమయంలో పాపారావు మేనల్లుడు సుందర్ చేతిలోకి రేజర్ తోసహా సెవెన్ ఓ క్లాక్ బ్లేడు వచ్చేసింది…
మెత్తగా కాళ్ళను వత్తుతున్న చెప్పుల అనుభవంతో వెంకడి పనితనాన్ని స్టాఫంతటికీ తరచు రికమెండు చేస్తూండే హెడ్మాష్టర్ దక్షిణామూర్తి కాళ్ళు ఓరోజు నిగనిగలాడుతున్న నల్లబూటుల్లోకి దూరిపోయాయి.
టకప్పులు, మెటల్ బొత్తాలు, సిల్కు చొక్కాలు, ట్వీడ్ పాంటులు…ఇలా మనుషుల వేషభాషలు …ఆలోచనలు… దృక్పధాలు… రూపాంతరం చెందడంలో “హేవలాక్” వంతెన పాత్ర 5 తరాలపాటు గాఢంగా వుంది. 
సోషల్ ఇంజనీరింగ్ ను ఈ వారధి మౌలికంగా మార్చేసింది. జాతీయభావాన్నీ  అభ్యుదయాన్ని సంస్కరణనూ మనుషుల మధ్య బదిలీ చేసిందికూడా ఈ వంతెనే!
అదే పనిగా రుద్ది రుద్ది కొండలనే కరగించి ఇసుకగా మార్చడానికి నదికి వేల సంవత్సరాలు పడితే, ఆంగ్లేయుల హిందూదేశపు ముఖ్యపట్టణం కలకత్తా, తూర్పుకోస్తాలో చెన్నపట్టణం మధ్య  ప్రత్యక్షంగా, – ఉత్తరాది, దక్షిణాదుల మధ్య పరోక్షంగా అనేక మార్పులను బట్వాడా చేయడానికి “హేవలాక్” వంతెనకు ఐదు తరాలు పట్టింది.
గోదావరి మీద కొవ్వూరు రాజమండ్రిల మధ్య జవసత్వాలుడిగిన మొదటివంతెనను ఒక స్మారకంగా కాపాడాలన్న ప్రజా ఉద్యమం మొదలౌతున్న నేపధ్యంలో చారిత్రక వాస్తవాలు విశ్లేషిస్తే  ఈ వంతెన రవాణా ఉపకరణంగా కంటే ప్రజలజీవితాల్లో పెనుమార్పుల వారధిగానే చివరివరకూ ఉపయోగపడిందని స్పష్టమౌతోంది.
1887 లో నిర్మాణం మొదలై ఇరవయ్యో శతాబ్దం మొదట్లో అంటే 1900 సంవత్సరంలో ప్రారంభమైంది.
న్యూస్ ఛానళ్ళూ మొబైల్ ఫోన్లూ లేని ఆరోజుల్లో ఈ వంతెన ద్వారానే పారిశ్రామిక విప్లవ అనంతర యూరప్ పరిణామాలూ, భారతదేశంలో స్వాతంత్రోద్యమ భావాలు, సాంఘిక సంస్కరణలు బట్వాడాఅయ్యాయి. 
19 శతాబ్దంలో (1800 – 1900 సంవత్సరాలమధ్య ) బ్రిటీషర్లు మనదేశంనుంచి చవకగావస్తువులను కొని యూరప్ లోలాభసాటిగా అమ్ముకునే వ్యాపారం చేసేవారు. అందుకు పరిమితమైన వసతులు ఏర్పాటు చేసుకోవడం మినహా ఆకాలంలో పెద్దగా మనదేశంలో మౌలికవసతులు ఏర్పాటుకాలేదు. 
ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవ ఫలితంగా వస్తూత్పత్తి విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని అమ్ముకోడానికి భారతదేశం పెద్ద మార్కెట్ గా కనబడింది. దేశవ్యాప్తంగా పెద్దనదులపై వంతెనలు కట్టాలని 1896 లో బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించి పనులు మొదలుపెట్టింది. 1900 సంవత్సరంలో దేశమంతటా ఒకేసారి 31 భారీవంతెనలు ప్రారంభంకాగా , అందులో హేవలాక్ వంతెన ఒకటి. ఈ వారధులన్నీ కలసి అప్పటివరకూ ఎగుమతులదేశంగా వున్న  భారతదేశాన్ని దిగుమతుల దేశంగా మార్చేశాయి.
మా తాత పెద్దాడ పేర్రాజు గారు(1873-1948) హయాంలో సిల్కు చొక్కా ట్వీడ్ ఫాంటు క్లాతింగ్ కి బొంబాయి వెళ్ళవలసి వచ్చేదని చెప్పేవారని అవేగుడ్డలు 1930 ల్లోనే నిడదవోలు భీమవరం తాడేపల్లిగూడెం లాంటి పట్టణాల్లో దొరికేవనీ రెండు అణాలకు సిల్కు చొక్కా, మూడున్నర అణాలకు ట్వీడ్ ఫాంటు కొనుక్కున్న అనుభవాన్ని మానాన్నపెద్దాడరామచంద్రరావు గారు (1911-1997)
చెప్పారు.
వంతెనల వల్ల  రైళ్ళు హోల్ సేల్ వ్యాపార కేంద్రాలనీ, ఆకేంద్రాల నుంచి కాల్వల వల్ల గూడుపడవలు రిటైల్ వ్యాపారాన్నీ పెంచాయి. ఈ విధంగా 20 శతాబ్దం కన్సూమరిజం వ్యాప్తితోనే మొదలైంది. విద్యావ్యాప్తి కూడాజరిగింది .ఇది మన సోషల్ ఇంజనీరింగ్ ను మార్చేసింది.
హౌరానుంచి మద్రాసుకి వస్తువులతోపాటే కొత్త ఆలోచనలూ రవాణా అయ్యాయి. రైలుప్రయాణాలంత వేగంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. జాతీయోద్యమంలో ఉరూవాడా సభలు సమావేశాలు పెరగడానికి ఈ వంతెన ప్రముఖ సదుపాయమయ్యంది. కందుకూరి వీరేశలింగం చిలకమర్తి లక్ష్మీ నరశింహం వంటి నాయకుల సంస్కరణ భావాలు, జాతీయ లక్ష్యాలు తూర్పుకోస్తాఅంతటా ప్రభావం చూపించాయంటే గోదావరిదాటి ఎక్కడికైనా వేగంగా వెళ్ళిపోడానికి వీపుపరచిన హేవలాక్ వంతెనే ముఖ్యకారణం!
అప్పటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్ధర్ ఎలిబంక్ హేవలాక్ పేరు వంతెనకు పెట్టారు. చీఫ్ ఇంజనీర్ ఫెడ్రిక్ ధామస్ గ్రాన్ విల్లే వాల్టన్ ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయించారు. మూడేళ్ళు పట్టిన ఈ నిర్మాణం అంచనా వ్యయం 50 లక్షలరూపాయలుకాగా (మద్రాసీ?) కాంటా్రక్టర్ 47 లక్షలకే పనిపూర్తిచేశారట! నీటి ప్రవాహవేగాన్ని లెక్కగట్టి వందేళ్ళు వుంటుందన్న అంచనాతో అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ గా రాయి సున్నాలతో స్టీలు గర్డర్లతో కట్టిన హేవలాక్ వంతెనపై రాకపోకలను సరిగ్గా వందేళ్ళకు 1997 లో నిలుపుదల చేశారు. రైల్వేశాఖ వంతెనలో ఇనుమును వేలం వేయాలని నిర్ణయించింది. గర్డర్లు తొలగించాక రాతిస్ధంభాలు కాలక్రమంలో నదిలోకి ఒరిగిపోతాయి.
హేవలాక్ వంతెనను పరిరక్షించాలని, టూరిస్టుకేంద్రంగా వృద్ధిచేయాలనీ, జాతీయ స్మారకంగా వుంచాలనీ రాజకీయాలకతీతంగా ఉద్యమనిర్మాణానికి ప్రజలను కూడగట్టే ప్రయత్నాలు రాజమండ్రిలో మొదలయ్యాయి. 
హేవలాక్ వంతెన సంస్కృతినీ దృక్పధాలనీ దేశమంతటికీ రవాణా చేసిన వారధిఅవ్వడంవల్లే వంతెన కూల్చివేత ఆలోచనే ఒక  ఉద్వేగమౌతోంది. 
ఏకథైనా ఆసక్తికరమే. సమాజం చరిత్రకంటే ఆసక్తిదాయకమైన కథవుండదు. శరవేగంగా మార్పులను అందుకుని అందుకు అనుగుణంగా తనను తాను మలచుకున్న తూర్పుకోస్తా ప్రయాణానికి గోదావరి అడ్డుపడినప్పుడు మౌనంగా వీపున మోసిన “హేవలాక్ వంతెనే” ఐదుతరాల కథకు అసలైన హీరో!
ఈజ్ఞాపకాల ఉద్వేగాన్ని భౌతికరూపంతో ఒక స్మృతి చిహ్నంగా మార్చుకోవడం చిన్న విషయం కాదు. అది విజయవంతమైతే చరిత్రను పదిలపరచుకునే దారికికూడా హేవలాక్ వంతెన మళ్ళీ వారధే అవుతుంది.

డబ్బున్న వాళ్ళని ద్వేషించే పరిస్ధితి సామాన్యుల్లో వ్యాపించడం సమాజశ్రేయస్సుకే హానికరం


ఆంధ్రజ్యోతి ABN టివి ఈ రోజువుదయం నుంచి గోలగోలగా ఒక సెటిల్మెంటు కథనాన్ని చెబుతోంది. ఇందులో నాకు అర్ధమైన అంశాలు-
1) కెసిఆర్ కొడుకు కెటిఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ వాళ్ళ వాళ్ళ అనుచరులతో ఎవరో ఒక కాంటా్రక్టర్ ను ఎత్తుకుపోయి చితకబాది 87 లక్షలరూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి బదిలీ చేయించుకున్నారు
2) అదే పనిగా విసిగిస్తున్న ఈ కథనం స్పస్టంగాలేదు.అర్ధమయ్యేలా లేదు. ఛానల్ వాళ్ళ వెర్రి ఉత్సాహపు వ్యాఖ్యానాలు, వర్ణనలు అసలు విషయాన్ని పక్కదారిపట్టిస్తున్నట్టు అనిపిస్తోంది
3) ఉద్రేకంవల్ల జరిగే హింసను అర్ధంచేసుకోవచ్చు. అధికార/పలుకుబడులను అడ్డంపెట్టుకుని డబ్బుకోసం మనుషుల్ని హింసించడం దారుణం
4) చావుదెబ్బలు తిని 87 లక్షలు బదిలీ చేసిన వాడి మీద సానుభూతి రావాలి …కాని నాకు సానుభూతి కలగడంలేదు. 35 ఏళ్ళ కష్టపడి ఒక పద్ధతిగా బడ్జెట్ లో సదుపాయంగా జీవిస్తున్న నాకు 87 లక్షలరూపాయలు ఊహకు అందడంలేదు. మరోవైపు అడ్డగోలుపనులకు  లక్షలు కోట్ల రూపాయలు బదిలీ చేసేసి అదేవ్యక్తులు అన్యాయమైపోతున్నామని ఏడవడం చికాకుగావుంది
బహుశ మా బాగా అయ్యిందన్న భావన కూడా నాలో మొదలైందో ఏమో! ఇందువల్లే లక్షలు కోట్లు పోగొట్టుకున్న వారిపట్ల సానుభూతి కలగడం లేదేమో!
నూరుగొడ్లనుతిన్న రాబందు గాలివానకు పోతుందన్నది అనే సామెత నిజమే అనిపిస్తుంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని హింసించి ఇలా డబ్బుచేసుకునే రాజకీయవేత్తలు వరుసబెట్టి జైలుకి వెళ్ళడం కూడా మనం చూస్తూనే వున్నాం
5) తప్పు ఎవరు చేసినా నిలదీయాలి-ఎవరు అన్యాయంగా బాధపడినా సానుభూతి కలగాలి ఈ విలువ పతనమైపోడానికి మూలం విపరీతంగా పెరిగిపోతున్న ఆర్ధిక అసమానతలే! 
6) డబ్బున్న వాళ్ళని ద్వేషించే పరిస్ధితి సామాన్యుల్లో వ్యాపించడం సమాజశ్రేయస్సుకే హానికరం

శ్రీశ్రీ మరణాన్ని మరణవార్తగా కాక ఉద్వేగభరితమైన అనుభూతిగా పాఠకుల ముందుంచిన అనుకోని/యాధృచ్ఛికఈనాడు "ప్రయోగం"లో నేను కూడా చిన్న భాగస్వామినే!


ఆమహాకవి 30 వర్ధంతి జూన్ 16 అన్న ఫేస్ బుక్ ప్రస్తావన చూశాక ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి టెలిప్రింటర్ ఆపరేటర్ గుండిమెడ (రామచంద్ర) శర్మతో ఫోన్ లో మాట్లాడి వివరాలు ధృవీకరించుకున్నాక ఇది రాస్తున్నాను
అప్పుడు నేను తిరుపతి ఈనాడు ఎడిషన్ మఫిషియల్ డెస్క్ ఇన్ చార్జని. కెఎన్ వై పతంజలి గారు జనరల్ డెస్క్ ఇన్ చార్జ్….ఆరోజురాత్రి 7 గంటల ప్రాంతం…బోయ్ ఏకాంబరం వచ్చి ప్రకాష్ సార్ పిలుస్తున్నారంటే జనరల్ డెస్క్ కి వెళ్ళా. షిఫ్ట్ ఇన్ చార్జ్ ప్రకాష్ ఫస్ట్ ఎడిషన్ డ్యూటీ అయిపోయింది. ఇంకో షిఫ్ట్ ఇన్ చార్జ్ రామశేషుగారు నైట్ ఎడిషన్ల డ్యూటీకి వచ్చేశారు. సబ్ ఎడిటర్లు రామశేషుగారు, ప్రకాష్ గారు, విలాసిని గారూ గంభీరంగా వున్నారు. 
శ్రీశ్రీ మద్రాస్ లో పోయారు. వార్తతెప్పించండి అని ఓ టెలిప్రింటర్ మెసేజ్ నా చేతికిచ్చారు. అది విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చింది. శ్రీశ్రీ మరణవార్తను చలసాని ప్రసాద్ గారు ఫోన్ లో చెప్పారు. వార్తతెప్పించండి అని అందులోవుంది. 
మద్రాస్ లో సితార కు మిక్కిలినేని జగదీష్ బాబు రిపోర్టర్. మద్రాసు ఈనాడు ఆఫీస్ కి జగదీష్ బాబు ఇంటికీ, ఆరుద్రగారి ఇంటికీ(నెంబరు ప్రకాష్ ఇచ్చారు) ట్రంకాల్ బుక్ చేశాను. (బహుశ ఈ విషయం ప్రపంచానికి నేనే చెప్పాలన్న బాధ్యత అధికారాలను ఒలకబోస్తూ) ప్రెస్ కాల్ అర్జంట్ అని ఆపరేటర్ నిఅడిగాను. విషయం చెప్పాను. శ్రీశ్రీ ఎవరు అని అతను అడిగాడు.
జగదీష్ బాబు రిపోర్టు ఇవ్వగలరన్న నమ్మకమైతే నాకులేదు. యు ఎన్ ఐ ఏజెన్సీ కాపీకోసమే చూడాలి అని ప్రకాష్ తో అంటే పక్కనే వున్న రామశేషుగారు ఏం ఫరవాలేదు మనవాళ్ళు రాసేస్తారు అన్నారు. 
అంతలో కరెంటుపోయింది. ఎవరో “మహాప్రస్ధానం” పుస్తకాన్ని తీసుకు వచ్చారు. కొవ్వొత్తి వెలుగులో శర్మ ఒకో కవితనీ బిగ్గరగా చదువుతూంటే నా డెస్క్ లో సబ్ ఎడిటర్ దాట్ల నారాయణ మూర్తిరాజు కావలసిన లైన్ లను నోట్ చేసుకున్నారు. నా డెస్క్ లో కళత్తూరు సుధాకరరెడ్డి బయటికి వెళ్ళి ఎక్కడినుంచో ఖఢ్గసృష్టి పుస్తకం తెచ్చి ప్రకాష్ కి ఇచ్చారు
ఆరుద్రగారినుంచి కాల్ వచ్చింది నేను రాసుకుంటూనే సైగచేసేస్తే ఏకాంబరం వెళ్ళి ప్రకాష్ ని తీసుకువచ్చారు. ఆయన సంతాపసందేశాన్ని పూర్తిగా రాసుకున్నారు.
ఇంతలో నా డెస్క్ నుంచి నామిని సుబ్రమణ్యం నాయుడు ఓ రిపోర్టు రాసుకొచ్చాడు. శ్రీశ్రీ మరణానికి ఆకాశం బోరున ఏడుస్తోందని…అప్పటి వరకూ బయట పెద్దవాన పడుతోందన్న స్పృహే మాకెవరికీ లేదు. ఆరిపోర్టుని కంపోజింగ్ కు ప్రకాష్ పంపించారు.
శ్రీశ్రీ గారి కవితలనే కోట్ చేస్తూ మరణవార్తను దాట్లనారాయణ మూర్తిరాజు రాశారు. చర్చించుకుని చిన్న మార్పులు చేశారు మొత్తం కాపీ 25/30 పేజీలు వచ్చింది.  శర్మ, సత్యనారాయణా ఇతర ఎడిషన్లకు పంపడానికి ఇదంతా టెలిప్రింటర్లలో టైప్ చేశారు. 
అది లెటర్ కంపోజింగ్ ఫోర్ మన్ నారాయణ గారు అనేకమంది కంపోజిటర్లకు వార్తను విభజించి యిచ్చి శరవేగంతో కంపోజింగ్ చేయించారు. మామూలుగా ఇచ్చే ప్రూఫ్ గ్యాలు రెండయితే ఆసారి పదో పదిహేనో తీసి అందరికీ ఇచ్చారు. 
నా డెస్క్ లో శశాంక్ మోహన్, సుధాకరరెడ్డి, మునిమోహన పిళ్ళే జిల్లాల వార్తలు ప్రచురణకు తిరగరాయడంలో నిమగ్నమైవున్నారు.
ఇంతలో మేనేజర్ నుంచి నాకు ఫోన్ కాల్ “వార్తలు ముఖ్యమే కాని అవసరంమేరకే ట్రంకాల్స్ బుక్ చేయమని” సలహాలాంటి అధికారాన్ని చూపిస్తూ…(మేనేజర్లు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఇలాగే వుంటారేమో) నాకు చికాకు వచ్చి ఇంకో ఫోన్ వచ్చింది తరువాత మాట్లాడుతానని పెట్టేశా!
హైదరాబాద్ ఈనాడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డునుంచి వర్మగారు నాకు ఫోన్ చేసి “ఎట్టి పరిస్ధితుల్లోనూ మాస్ట్ హెడ్ (ఈనాడు లోగో) దించడానికి వీల్లేదని చెప్పు” అన్నారు. రేపు మీ ఎడిషన్ కే మార్కులు వస్తాయి బ్యేలెన్స్  మెయింటెయిన్ చేయండి అన్నారు. 
మాస్ట్ హెడ్ కూడా దించవచ్చుకదా తట్టనేలేదు అంని ప్రకాష్ అంటే నవ్వుకున్నాము. అపుడు రామశేషుగారు – బ్యానర్ వార్తేగాని మాస్ట్ హెడ్ దించవలసింది కానేకాదు అని తెగేసి చెప్పారు. (ఆ ఎడిషన్ రామశేషుగారు ఇవ్వవలసింది. ప్రకాష్ బృందం ఉద్వేగాన్ని గౌరవించి వారికి బాధ్యతలు అప్పగించేసి పక్కనే వుండి మొత్తం పరిస్ధితిని ఫాలోఅవుతున్నారు.
“మహాకవి శ్రీశ్రీ మహాప్రస్ధానం” అని బ్యానర్ రాశారు.ఇది అందరికీ అర్ధమౌతుందా అని నాకు అనుమానమొచ్చంది. ఈ అనుమానాన్నే శర్మ అడిగితే “శ్రీశ్రీ గురించి తెలిసిన వాళ్ళకి ఇది అర్ధమౌతుంది” అని రామశేషుగారు రూలింగ్ యిచ్చారు.
ఈ మొత్తం ప్రక్రియలో ప్రకాష్, దాట్ల, రామశేషు గార్లదే యాక్టివ్ రోల్. డెస్క్ ఎదురగా దూరంగా వుండే ఇన్ చార్జ్ సీటులో పతంజలిగారు కూర్చుని కొవ్వోత్తి వెలుగులో ఆలోచిస్తూ రాసుకుంటున్న రూపం మెదులుతున్నట్టువుంది. మామూలుగా ఫస్ట్ ఎడిషన్ పేజీలు ఇచ్చేశాక పతంజలి వెళ్ళిపోతారు. ఆరోజు ఆయన తిరుపతి టౌన్ కి వెళ్ళారనీ(ఎడిషన్ ఆఫీస్ రేణిగుంటలో వుంటుంది) ఫలానాఫలానా చోట వుండొచ్చనీ రిపోర్టర్ వల్లీశ్వర్ గారికి ఫోన్ చేసి పతంజలిగారికి కబురందేలా చూడాలనీ ప్రకాష్ గారు నన్ను అడిగినట్టు లీలగా గుర్తుంది..లేట్ గా ఆయన వచ్చారో లేక రాలేదో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు అయితేవార్త మొత్తం కాపీ తయారు చేసింది దాట్లగారే! మెరుగులు దిద్దింది ప్రకాష్ గారే! తుదిమెరుగులన్నీ పతంజలిగారివేననీ, ఆయన విజయవాడ న్యూస్ ఎడిటర్ వాసుదేవరావుగారూ చాలాసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారనీ నాకు లీలగా గుర్తొస్తోంది. శర్మ మాత్రం ఆ రాత్రి పతంజలిగారు కనబడలేదని గట్టిగాచెబుతున్నారు. నేనైతే దాట్ల ముడి సరుక్కి ఉద్వేగాన్ని అద్దింది పతంజలిగారేనని గట్టిగా నమ్ముతున్నాను
విజయవాడ, విశాఖ, హైదరాబాద్, ఎడిషన్లకు కూడా తిరుపతి ఎడిషన్ వార్తే బ్యానర్ అయితే డిస్పేలు మాత్రం వేరువేరుగా వున్నాయి.
ఎడిషన్ అయిపోయాక చాలాసేపు వుండిపోయాము. టీలు సిగరెట్లూ తీసుకురావడానికి ఏకాంబరం ఆరోజు కనీసం 60/70 సార్లయినా పైకీ కిందికీ తిరిగివుంటాడు.
మూడోరోజుకల్లా చైర్మన్ గారి(రామోజీరావుగారు) కామెంట్స్ వచ్చాయి. “బాగుంది. శ్రీశ్రీ కుటుంబ వివరాలు లేవు.సామాన్యపాఠకులకు ఈ వార్త అర్ధమౌతుందా” అని పేపర్ మీద పచ్చసిరాతో ఆయన రాశారు.
వార్తకు ఒక ఫార్మేట్ వుంటుంది. దాన్నిపక్కన పెట్టి శ్రీశ్రీగారి జీవితాన్ని మరణం వరకూ ఆయన పద్యాలతోనే వివరించిన ఉద్వేగపూరితమైన ఆ కథనం అనుకుని గాక యాధృచ్చికంగా జరిగిందే. అది ఈనాడుకి మంచిపేరు తెచ్చింది. అందులో రాసినవారి ఎమోషన్ తోబాటు కవిత్వాన్ని మామూలు మనిషి ఆలోచనల్లోకి తెచ్చిన శ్రీశ్రీముద్రలో లోతులుకూడా వున్నాయి.
73 ఏళ్ళు జీవించిన శ్రీశ్రీ మరణించి ఇవాల్టికి(16/6/13 నాటికి) సరిగ్గా 30 ఏళ్ళు. ఆయన 30/40 ఏళ్ళవయసులో రచనా వ్యాసాంగం ఉధృతంగా సాగింది..ఆయన మరణించిన నాటికి పుట్టిన వారి వయసు 30 ఏళ్ళు వారిలో ఏకొందరికో  శ్రీశ్రీ పేరుతెలుసు.అయన చురుగ్గా రాస్తున్న కాలంలో పుట్టిపెరిగిన నా వయసు వాళ్ళమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శ్రీశ్రీ ప్రభావంగట్టిగావుంది. నా ఏజ్ గ్రూప్ లో వున్న వాళ్ళలో ఒక్కసారైనా కవిత్వం రాయని వారు వుండరు. అది శ్రీశ్రీ ముద్రే! ఈ ముద్రే ఈనాడుకి “మహాకవిశ్రీశ్రీ మహాప్రస్ధానం” చాలాకాలం గొప్ప స్కోరై మిగిలింది

ఛార్లెస్ మనోడే!


మూతపడుతున్న టెలిగ్రామ్…కొన్ని వివరాలు


వలసలకు బ్రేక్ విశ్లేషణ


ఇటీవల అనర్హత వేటుకు గురైన 15 మంది శానససభ్యుల పరిస్థితి అయోమయంలో పడడంతో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు ఆగిపోతాయనే ప్రచారం ఊపందుకుంది. 


ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోవడం, మాజీలుగా మిగలాల్సి రావడంతో మరింత మంది జగన్ పార్టీలో చేరడానికి వెనకాడుతున్నట్లు చెబుతున్నారు. ఏడాదిలో లోపలే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండడంతో ఖాళీ అయిన 15 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జగన్ పార్టీలో ఇప్పుడే చేరితే ఏడాదంతా మాజీలుగా ఉండిపోవాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. దానికితోడు తమ పార్టీలోకి వస్తే ఇప్పుడే రావాలని, లేకుంటే సీటు గ్యారంటీ ఇవ్వలేమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అగ్ర నాయకత్వం కచ్చితంగా చెబుతోందని అంటున్నారు. 

దీంతో కాంగ్రెస్ పార్టీని వీడలేక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లే ధైర్యం చేయలేక విలవిలలాడుతున్నట్లు సమాచారం. జగన్ పార్టీ వైపు వెళ్తారని కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలపై పడ్డ ముద్ర పడింది. పార్టీలో ఉన్నా వచ్చే ఎన్నికల్లో టికెట్ లభిస్తుందనే గ్యారంటీ లేదు. దీంతో అటువంటి ఎమ్మెల్యేలు తీవ్రమైన సమస్యతో సతమతమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఎవరెవరు వెళ్తారనే విషయంపై క్షేత్ర స్థాయిలో కాంగ్రెసు పార్టీ వివరాలు సేకరించినట్లు సమాచారం. 

జగన్ వర్గీయులుగా ముద్ర పడిన కాంగ్రెసు శానససభ్యులు ఏం చేయాలో తోచక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి నిత్యం తమ పార్టీలోకి వలసలు సాగుతుంటే పార్టీ బలంగా ఉందనే సంకేతాలు వస్తాయని అనుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం ఒత్తిడి వ్యూహాన్ని అనుసరిస్తోంది. వస్తే ఇప్పుడు రండి, లేదంటే ఆశలు వదులుకోండని చెబుతోంది. ఈ ఒత్తిడి వ్యూహంలో ఇతర పార్టీల శాసనసభ్యులు సతమవుతున్నారు. తమ పార్టీలో చేరే శానససభ్యులకు జగన్ సీటు గ్యారంటీ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. 

పైగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు బలమైన నాయకులను కూడా తీసుకుంటోంది. కొణతాల రామకృష్ణకు ఏ మాత్రం గిట్టని దాడి వీరభద్రరావును జగన్ పార్టీలో చేర్చుకున్నారు. దీనివల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే కూడా భద్రతలేని వాతావరణం ఏర్పడుతుందనే భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, ఉన్నచోటనే ఉండలేక, జగన్ పార్టీలో చేరలేక పలువురు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. 

Create a free website or blog at WordPress.com.

Up ↑