ఇటీవల అనర్హత వేటుకు గురైన 15 మంది శానససభ్యుల పరిస్థితి అయోమయంలో పడడంతో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు ఆగిపోతాయనే ప్రచారం ఊపందుకుంది. 


ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోవడం, మాజీలుగా మిగలాల్సి రావడంతో మరింత మంది జగన్ పార్టీలో చేరడానికి వెనకాడుతున్నట్లు చెబుతున్నారు. ఏడాదిలో లోపలే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండడంతో ఖాళీ అయిన 15 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జగన్ పార్టీలో ఇప్పుడే చేరితే ఏడాదంతా మాజీలుగా ఉండిపోవాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. దానికితోడు తమ పార్టీలోకి వస్తే ఇప్పుడే రావాలని, లేకుంటే సీటు గ్యారంటీ ఇవ్వలేమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అగ్ర నాయకత్వం కచ్చితంగా చెబుతోందని అంటున్నారు. 

దీంతో కాంగ్రెస్ పార్టీని వీడలేక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లే ధైర్యం చేయలేక విలవిలలాడుతున్నట్లు సమాచారం. జగన్ పార్టీ వైపు వెళ్తారని కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలపై పడ్డ ముద్ర పడింది. పార్టీలో ఉన్నా వచ్చే ఎన్నికల్లో టికెట్ లభిస్తుందనే గ్యారంటీ లేదు. దీంతో అటువంటి ఎమ్మెల్యేలు తీవ్రమైన సమస్యతో సతమతమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఎవరెవరు వెళ్తారనే విషయంపై క్షేత్ర స్థాయిలో కాంగ్రెసు పార్టీ వివరాలు సేకరించినట్లు సమాచారం. 

జగన్ వర్గీయులుగా ముద్ర పడిన కాంగ్రెసు శానససభ్యులు ఏం చేయాలో తోచక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి నిత్యం తమ పార్టీలోకి వలసలు సాగుతుంటే పార్టీ బలంగా ఉందనే సంకేతాలు వస్తాయని అనుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం ఒత్తిడి వ్యూహాన్ని అనుసరిస్తోంది. వస్తే ఇప్పుడు రండి, లేదంటే ఆశలు వదులుకోండని చెబుతోంది. ఈ ఒత్తిడి వ్యూహంలో ఇతర పార్టీల శాసనసభ్యులు సతమవుతున్నారు. తమ పార్టీలో చేరే శానససభ్యులకు జగన్ సీటు గ్యారంటీ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. 

పైగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు బలమైన నాయకులను కూడా తీసుకుంటోంది. కొణతాల రామకృష్ణకు ఏ మాత్రం గిట్టని దాడి వీరభద్రరావును జగన్ పార్టీలో చేర్చుకున్నారు. దీనివల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే కూడా భద్రతలేని వాతావరణం ఏర్పడుతుందనే భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, ఉన్నచోటనే ఉండలేక, జగన్ పార్టీలో చేరలేక పలువురు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.