Search

Full Story

All that around you

Month

July 2013

వేర్పాటుకే పోరాటాలు సమైక్యతకు ఉద్యమాలుండవు 2తెలుగు రాషా్ట్రల్లో వచ్చే ఎన్నికలు!!


ప్రజల ఇష్టప్రకారం రాజ్యాలు ఏర్పడిన చరిత్ర ఒక్కటీలేదు.ఏచరిత్రలోనైనా యుద్ధాలు, సంధులే రాజ్యాల్ని సృష్టించాయి. హద్దుల్ని నిర్దేశించాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా అందుకు భిన్నమైన పరిస్ధితి వుండదు. ఇక్కడ యుద్దాలంటే వత్తిళ్ళే! సైనికులంటే నాయుల్ని అనుసరించే సహచరులు అనుచరులు కార్యకర్తలే ! కాంగ్రెస్ పదేళ్ళ నిర్ణయరాహిత్యం వల్ల /కాలయాపనవల్ల/ ఉదాసీనతవల్ల ఈ మూడింటి వల్లా వత్తిళ్ళు పెరిగి ఉద్వేగాలై ప్రజల్లోకి ప్రవహిస్తున్నాయి. 
వేర్పాటుకే ఉద్యమాలూ పోరాటాలు వుంటాయితప్ప సమైక్యతకు అలాంటివి వుండే అవకాశమేలేదు. కెసిఆర్ తెలంగాణా సెంటిమెంటుని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఉద్యమాన్ని నిర్మించారు. ఆందోళనలు చేశారు. ప్రతీసారీ సీమాంధ్రనాయకులు వెటకారపు ఖండనలు, హేళనా పూర్వకమైన విమర్శలు, టివిల్లో ముచ్చట్లేతప్ప రాష్ట్రం కలసి వుండవలసిన అవసరాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలే చేయలేదు. ఇందువల్ల తెలంగాణా ప్రజల్లో రెండో ఆలోచనే లేకుండాపోయింది. అప్పటికే ఉద్వేగంతో వున్న తెలంగాణా వారికి సీమాంధ్ర నాయకుల ప్రకటనలు హేతుబద్ధతలేని నినాదాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. రాజకీయకార్యకర్తలు, పార్టీలు సంస్ధల కార్యకర్తలు, విద్యార్ధులు మినహా సామాన్య ప్రజలెవరూ సమైక్యాంధ్ర కోసం ఆందోళనల్లో పాల్గొనలేదు.
1969 తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రులు 1972 జై ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణావారూ మౌనంగానే వుండిపోయారు. ఇపుడూ దాదాపు అంతే…
అసలు రాష్టా్రలు విడిపోవడమో కలసివుండటమో ప్రజల ఇష్టప్రకారం జరగవు. వత్తిళ్ళే హద్దుల్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుత కాలంలో అధికారంలో వున్న పాలకుల అవసరాలు అనివార్యతలే ఈ అంశాన్ని నిర్దేశిస్తాయి. తెలంగాణా వత్తిడి విభజన ప్రకటనకు దారితీయగా సీమాంధ్ర లాబీయింగ్ ఆప్రకటనను నిలుపుదల చేయించడం వరకే ఉపయోగపడింది.ఈ తమాషాను పదేళ్ళుగాచూస్తున్న కాంగ్రెస్ ఇపుడు కళ్ళుతెరచినట్టే కనిపిస్తోంది.
దేశాన్ని పరిపాలిస్తున్న ముందుముందుకూడా పాలించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అవసరం రాష్ట్రవిభజన అంశాన్ని ఈసారి గట్టిగానే ముందుకి తెచ్చింది. తెలంగాణాలో పాకిపొయిన సొంత రాష్ట్రం సెంటిమెంటును సొమ్ముచేసుకోడానికి టి ఆర్ ఎన్ ఇప్పటికే ముందుంది. అందులో పెద్దవాటా తనదేనంటూ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కాళ్ళు లాగేస్తోంది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్రకే పరిమితం చేస్తే తెలంగాణా ప్రాంతంలోనైనా ఆధిక్యత తెచ్చుకోవాలన్నది కాంగ్రెస్ లెఖ్ఖ. 
ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కోర్ కమిటీలో తెలంగాణ అంశంపై చర్చించారు. ఇతర కీలక అంశాలతో పాటు తెలంగాణపై వర్కింగ్ కమిటీలో చర్చించారు. తెలంగాణపై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాల్సిన నేపథ్యంలో శుక్రవారం జరిగిన భేటీ అత్యంత ప్రాధాన్య సంతరించుకుంది. యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి యుపిఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్ నాథ్, అహ్మద్ పటేల్, ఆంటోనీ తదితరులు హాజరయ్యారు. గంటపాటు ఈ బృందం సమాలోచనలు జరిపింది. 
పార్లమెంటు సమావేశాల్లోపే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీడబ్ల్యూసీ సమావేశం ఎప్పుడు అనేది వచ్చే వారం నిర్ణయించనున్నారు. మరోవైపు తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ భోపాల్ లో శుక్రవారం మధ్యాహ్నాం ఓ ప్రటకన చేశారు.
తెలంగాణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు. గత వారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలోనే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని భావించినా, బంతిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోర్టులోకి నెట్టేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఈనెల 26న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సమాయత్తమవుతోంది. సీడబ్ల్యూసీ భేటీ తర్వాత రెండు మూడు రోజులకు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాస్తుంది
అదే సమయంలో ఈనెల చివరి వారంలో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించి తెలంగాణపై నిర్ణయం పూర్వాపరాలను వివరిస్తారనీ, భాగస్వామ్య పక్షాల అనుమతితో బిల్లు రూపకల్పనకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్  వర్గాలన్నాయి. తెలంగాణ అంశంపై క్యాబినెట్ లో చర్చించి ఆ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉందని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఆగస్టు తొలి వారంలో రాష్ట్రపతి కార్యాలయానికి తెలంగాణ ఏర్పాటు బిల్లును పంపించి ఆగస్టు 15లోగా అసెంబ్లీ తీర్మానం కోసం మన రాష్ట్రానికి పంపవచ్చని సమాచారం. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసన సభ ఆమోదించవలసిన తీర్మానం గురించి దిగ్విజయ్ సింగ్ నాదెండ్ల మనోహర్తో చర్చించారంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో శాసన సభ తీర్మానం ఒక మలుపు లాంటిది. తీర్మానాన్ని చర్చకు చేపట్టే సమయంలో స్పీకర్ అత్యంత మెలుకువతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 2009 డిసెంబర్ 9న అప్పటి హోం శాఖ మంత్రి పి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు దీనికోసం రాష్ట్ర శాసన సభ ఒక తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను అదేశించినట్లు చెప్పటం తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర శాసన సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే తీర్మానం చర్చకు రాకముందే తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసన సభ్యులు రాజీనామా చేయటం, ఆ తరువాత పెద్ద ఎత్తున గొడవ జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి శాసన సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపాదించి చర్చించటం గొడవతో కూడుకున్న విషయం అనేది అందరికి తెలిసిందే. అందుకే దిగ్విజయ్తో నాదెండ్ల జరిపిన చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర శాసన సభలో పార్టీల బలాబలాల గురించి కూడా వారు చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తివేస్తేనే… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే మొదట ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తి వేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగంలోని 371 డి ప్రకారం ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధలను ఆరు సూత్రాల పథకం పేరుతో జారీ చేయటం తెలిసిందే. 1969 తెలంగాణ ఉద్యమం తరువాత ఈ ఆరు సూత్రాల పథకాన్ని జారీ చేస్తూ దీనికోసం రాజ్యాంగాన్ని సవరించారు. లోక్సభలో రాజ్యాంగ సవరణకు మూడింటా రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ వారం, పది రోజుల క్రితం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడారని అంటున్నారు.
ఇక 10జిల్లాల తెలంగాణ, 12జిల్లాల రాయల తెలంగాణలపై కూడా అధిష్టానం కసరత్తు చేస్తోంది. పది జిల్లాల తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలన్నది కాంగ్రెస్ యోచన. రాయల తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోవచ్చని కాంగ్రెస్  అనుమానిస్తోంది. ఈ కారణంగానే టీఆర్ఎస్ అగ్రనేతలను తరచూ సంప్రదిస్తూనే ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంశంపైనా కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ వర్గాలన్నాయి. మొత్తానికి 2014లో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోందని ప్రచారం సాగుతోంది.
ఇదంతా అర్ధమవ్వడంవల్లే సమైక్యాంధ్ర వుండాలన్న కాంగ్రెస్ వాదులు “యు” టర్న్ తీసుకున్నారు.విడిపోయినా ఫరవాలేదుగాని సభల్లో చర్చజరగాలని రాజమండ్రి ఎంపి ఉండవిల్లి అరుణ్ కుమార్ కొత్తపల్లవి అందుకున్నారు..ఇది మాటమార్చే ప్రక్రియలో పక్కదారి చూపించడమేతప్ప పెద్దచర్చకు కాంగ్రెస్ అవకాశమీయదని ఆయనకీ తెలుసు
విడిపోవాలన్న వారి కోరికతీరుతుంది కాబట్టి కలిసుందామనేవారు మెరుగైన పాకేజి కోసం పట్టుబట్టడమే మిగిలివుంది

‘నా పక్షాన లేకపోవడమంటే నా శత్రుపక్షాన వున్నట్టే’ –అమెరికానీతి


తినేతిండిలో సగం దిగుమతి చేసుకుంటున్నప్పుడు, నిరుద్యోగం నలభైశాతానికి పెరిగిపోయినపుడు, జనం కడుపుమంట మంటలు రేపక తప్పదు. ఇదే అదనుగా “పెద్దన్న” అమెరికా (తెరవెనుకే వుండి) ఈజిప్టు అధ్యక్షుడు ముర్సీని దించేసింది. ఆయన చేసిన నేరమల్లా ప్రాంతీయ శక్తిగా ఎదగాలని అనుకోవడమే…స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవడమే… ‘నా పక్షాన లేకపోవడమంటే నా శత్రుపక్షాన వున్నట్టే’ అనే అమెరికానీతి ప్రపంచంలో ఒక ప్రాచీన దేశమైన ఈజిప్టులో కాలుపెట్టి మరో అధ్యక్షుణ్ణి తొక్కేసింది… 

స్త్రీ పట్ల ఆలోచనల కాలుష్యం – దృక్ఫధాల్లో మార్పు


సహజమైన కుతూహలం కలిగించేవి (స్త్రీ కి పురుషుడు-పురుషుడికి- స్త్రీ), మనసుల్నిఆహ్లదపరచేవీ, ప్రకృతి పరమైన సహజత్వానికి దూరమై, డబ్బు సంపాదించే వ్యాపార వస్తువులుగా మారిపోవడం వల్ల జీవన సంసృ్కతి కలుషితమైపోతోంది. మహిళలపై, మైనర్ బాలికలపై, చివరికి బడిపిల్లలపై లైంగిక అత్యాచారాలకూ, అఘాయిత్యాలకూ, మూలమీ నైతిక, సాంస్కృతిక కాలుష్యమే!
ఉప్పు పప్పు నూనె బియ్యం లాంటి వినియోగవస్తువుల జాబితాలోకి మనుషుల ఉద్వేగాలతో ముడిపడివున్న వినోదం కూడా చాలాకాలం క్రితమే చేరిపోయింది. అమ్మకాలు కొనుగోళ్ళ మద్య వ్యాపారవస్తువైపోయిన “ఫన్” డిమాండు పెంచడానికి అందులో ఉత్తేజాలనూ, ఉద్రేకాలనూ కలిపేస్తున్నారు.
స్త్రీపట్ల పురుషుడికీ, పురుషుడి పట్ల స్త్రీ కి స్వాభావికంగా వుండే ఆసక్తి, కుతూహలాలను కృత్రిమంగా రెచ్చగొట్టే విధంగా సినిమాలు వస్తున్నాయి. మనుషులకు సహజసిద్ధమైన లైంగికేచ్ఛ ‘లిబిడో’ ని ప్రకోపింపజేసే వాతావరణాన్ని రూపొందిస్తున్న ప్రతీ ముడిసరుకూ వ్యాపారవస్తువే. బెల్టు షాపులు, లైసెన్సు లేని బార్లు, లైసెన్సువున్న బార్లు, పబ్బులు, ఔటింగులు, డేటింగులు, రేవ్ పార్టీలు మొదలైనవి చివరికి లైంగిక సంతోషాల వైపే దారిచూపిస్తున్నాయి. 
సెక్స అనేది ఆనందపడటమే, ధ్రిల్ ఆస్వాదించడమే అన్న దృక్పధం వున్న పరిపక్వ/సంపన్న/న్యూరిచ్ క్లాస్  యువతీయువకుల విషయం పక్కన పెడితే ఈ ఆనందాల వేటలో ప్రలోభాల, భ్రమల ఎరకు చిక్కుకునేది మధ్యతరగతి, పేదతరగతి యువతులూ, మహిళలే – వీరిలో హెచ్చుమంది చివరి మజలీ వ్యభిచారమే అయిపోతోంది.
దీనికితోడు టెక్నాలజీ విస్పోటనం నుంచి వచ్చిన సోషల్ నెట్ వర్కింగ్ కుటుంబ సంబంధాల్లో సామాజిక బంధనాల్లో, మానవసంబంధాల్లో తీవ్రమైన మార్పులనే తీసుకువస్తోంది. 
ఏకాంతంలో వుండే, వుండవలసిన మధురిమలు బట్టబయలవుతున్నాయి. ఎదుటివారితో ప్రశంసలు పొందాలన్న మనుషుల ఇచ్ఛ స్త్రీలలో పురుషులలో వెర్రితలలు వేసి ఎగ్జిబిషనిజం అవుతోంది. 
ఇక్కడ విశేషమేమంటే వర్చువల్ మాయా ప్రపంచపు మనుషులు అవసరమనుకుంటే నిజంగా ప్రత్యక్షమైపోవడమే. మోహం మొత్తాక మాయమైపోవడమే.
మనుషులే సృట్టించిన ఇంటర్నెట్ లోకంలోకూడా మానవప్రపంచంలో వున్న మంచీచెడులన్నీ వున్నాయి. అయితే ఇది మంచి ఇది చెడు అని హితవుచెప్పే పెద్దమనుషుల వ్యవస్ధ అక్కడవుండదు. క్లిక్కులు, టా్రఫిక్కు, హిట్సే అక్కడ లాభనష్టాల లెఖ్ఖ. 
పురుషాధిక్య సమాజపు “స్త్రీ పట్ల కుతూహలం” ఇంటర్నెట్ లో పెద్ద వ్యాపారవస్తువు. మానవసమూహాల మధ్యగాక ప్రయివేటుగా కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్టుల తెరలమీద మాత్రమే కనిపించే వీలుండటంవల్ల స్త్రీని విశృంఖలంగా చూపించడానికి, చూడటానికి చిన్నపాటి సంకోచమైనా వుండటంలేదు.
ఇలాంటి “థ్రిల్” ఆఫ్ లైన్ లో, ఇంటర్నెట్ కనెక్షన్ కి అవకాశమే లేని ఫీచర్ మొబైల్ ఫోనుల్లో కూడా శరవేగంతో విస్తరిస్తోంది. మెమరీ కార్డుల్లో బూతు సినిమాలునింపి అమ్ముకునే వ్యాపారం గ్రామాల్లో పెరిగిపోతోంది. 
వీటన్నిటి ప్రభావంగా మెదళ్ళల్లో సెక్స్ శక్తివంతమైన ముద్రతో స్ధిరపడిపోతోంది. ఇందువల్ల  ఏ స్త్రీ ని అయినా లైంగిక దృష్టితో చూడటమే జరుగుతోంది. మనిషి వేషంలో వున్న కోర్కెల మృగాల మధ్య మహిళలు తిరుగుతున్నారన్న ఆలోచనే వొళ్ళు జలదరింపజేస్తుంది. 
మహిళలు యువతులు చివరికి చిన్నపిల్లలపై లైంగికదాడులకు మూలాలు ఇవే.
వంటలో ఉప్పో పులుపో కారమో ఎక్కవైతే పాలో పెరుగోకలిపి వాటిని విరిచేసి రుచికరంగా చేసే చిట్కాలు అమ్మకు తెలుసు. వరదప్రవాహంలా ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి చిట్కాలు చాలవనే అనిపిస్తుంది.
పాపికొండలు దాటాక దిగువవైపు గోదావరి వడి అంతా ఇంతాకాదు. గట్లను ఎలా కోసేయగలదో ఆ వేగం చూస్తేనే అర్ధమౌతుంది.గట్టుగ్రామాల్లో నివాసముండే గిరిపుత్రులు వెదురు బొంగులను ఒక కోణంవుండేలా చెక్కి ఒక మైలు దూరంలో ఏడెనిమిది వుండేలా నదిలో నాటేవారు. వెదురు కోణం, వాటిని నాటిన దిశలనుబట్టి ప్రవాహం దిశమారుతుంది. అంటే గట్టు కోతపడుతున్నచోటుని మార్చడమే. ఇందులో మహాప్రవాహం ఆగలేదు. చిన్న చిట్కాతో  ఒక మళ్ళింపు ద్వారా కోతపడే ప్రదేశాన్ని కాపాడుకోవడమే!
“నిర్భయ” లాంటి కఠిన చట్టాలు విషఫలాలను మాత్రమే రూపుమాపగలవు. మూలాలను నిర్వీర్యం చేయనంతకాలం ఆడవారిపై అఘాయిత్యాలను ఆపడం” నిర్భయ” వల్లకాదు. 
చట్టబద్ధతకూ, నైతికతకూ హద్దే చెరిగిపోయి, నీతి ఉనికే ప్రశ్నార్ధకమవ్వడంవల్ల ఈ తరం యువతరానికి “తప్పు”, “తలవంపు” అనే స్పృహే తెలియకుండా పోయింది. మనిషిమీద మనిషికి గౌరవ మర్యాదల సంస్కారాన్ని మళ్ళీ తీసుకురాగలిగితే దృక్పధాల్లోనే తప్పక మార్పువస్తుంది. ఇది చట్టాలూ, సామాజిక సంస్ధలపనికాదు. పూర్తిగా తల్లిదండ్రుల పనే. ఏ లైంగిక ఆగడం గురించి చదివినా, విన్నా- కన్నవారు జాగ్రత్తలు చెప్పేది కేవలం కూతుర్లకే…”కొడుకులూ! మీ ఆలోచనలూ నడకలూ జాగ్రత్త” అనాలనే ఆలోచనకూడా తల్లిదండ్రులకు రాకపోవడమే స్త్రీ అభద్రతకు పునాది అవుతోంది
సాంస్కృతిక కాలుష్యం మీద పాలకుల తో సహా అన్ని పార్టీలు, సామాజిక సంస్ధలు దృష్టిపెట్టాలి. ఒక సాంస్కృతిక విధానాన్నిరూపొందించుకోవాలి. నేరస్ధులను శిక్షించడంతోపాటు స్త్రీ పట్ల దురవగాహనపెంచే మూలాలపై చైతన్యం తేవాలి. నీచమైన ఆలోచనలు ఒక రుగ్మత అనే స్పృహ పెంచాలి. ఇదంతా అంతతేలికేనా అనేఆనుమానం ఎదురౌతుంది. ఆదేసమయంలో గోదావరి ప్రవాహాన్ని మళ్ళించి గట్టు కాపాడుకునే గిరిజనుల అనుభవాన్ని కూడా గుర్తు చేసుకోవాలి 
-పెద్దాడ నవీన్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రాజమండ్రి 

Create a free website or blog at WordPress.com.

Up ↑