సహజమైన కుతూహలం కలిగించేవి (స్త్రీ కి పురుషుడు-పురుషుడికి- స్త్రీ), మనసుల్నిఆహ్లదపరచేవీ, ప్రకృతి పరమైన సహజత్వానికి దూరమై, డబ్బు సంపాదించే వ్యాపార వస్తువులుగా మారిపోవడం వల్ల జీవన సంసృ్కతి కలుషితమైపోతోంది. మహిళలపై, మైనర్ బాలికలపై, చివరికి బడిపిల్లలపై లైంగిక అత్యాచారాలకూ, అఘాయిత్యాలకూ, మూలమీ నైతిక, సాంస్కృతిక కాలుష్యమే!
ఉప్పు పప్పు నూనె బియ్యం లాంటి వినియోగవస్తువుల జాబితాలోకి మనుషుల ఉద్వేగాలతో ముడిపడివున్న వినోదం కూడా చాలాకాలం క్రితమే చేరిపోయింది. అమ్మకాలు కొనుగోళ్ళ మద్య వ్యాపారవస్తువైపోయిన “ఫన్” డిమాండు పెంచడానికి అందులో ఉత్తేజాలనూ, ఉద్రేకాలనూ కలిపేస్తున్నారు.
స్త్రీపట్ల పురుషుడికీ, పురుషుడి పట్ల స్త్రీ కి స్వాభావికంగా వుండే ఆసక్తి, కుతూహలాలను కృత్రిమంగా రెచ్చగొట్టే విధంగా సినిమాలు వస్తున్నాయి. మనుషులకు సహజసిద్ధమైన లైంగికేచ్ఛ ‘లిబిడో’ ని ప్రకోపింపజేసే వాతావరణాన్ని రూపొందిస్తున్న ప్రతీ ముడిసరుకూ వ్యాపారవస్తువే. బెల్టు షాపులు, లైసెన్సు లేని బార్లు, లైసెన్సువున్న బార్లు, పబ్బులు, ఔటింగులు, డేటింగులు, రేవ్ పార్టీలు మొదలైనవి చివరికి లైంగిక సంతోషాల వైపే దారిచూపిస్తున్నాయి. 
సెక్స అనేది ఆనందపడటమే, ధ్రిల్ ఆస్వాదించడమే అన్న దృక్పధం వున్న పరిపక్వ/సంపన్న/న్యూరిచ్ క్లాస్  యువతీయువకుల విషయం పక్కన పెడితే ఈ ఆనందాల వేటలో ప్రలోభాల, భ్రమల ఎరకు చిక్కుకునేది మధ్యతరగతి, పేదతరగతి యువతులూ, మహిళలే – వీరిలో హెచ్చుమంది చివరి మజలీ వ్యభిచారమే అయిపోతోంది.
దీనికితోడు టెక్నాలజీ విస్పోటనం నుంచి వచ్చిన సోషల్ నెట్ వర్కింగ్ కుటుంబ సంబంధాల్లో సామాజిక బంధనాల్లో, మానవసంబంధాల్లో తీవ్రమైన మార్పులనే తీసుకువస్తోంది. 
ఏకాంతంలో వుండే, వుండవలసిన మధురిమలు బట్టబయలవుతున్నాయి. ఎదుటివారితో ప్రశంసలు పొందాలన్న మనుషుల ఇచ్ఛ స్త్రీలలో పురుషులలో వెర్రితలలు వేసి ఎగ్జిబిషనిజం అవుతోంది. 
ఇక్కడ విశేషమేమంటే వర్చువల్ మాయా ప్రపంచపు మనుషులు అవసరమనుకుంటే నిజంగా ప్రత్యక్షమైపోవడమే. మోహం మొత్తాక మాయమైపోవడమే.
మనుషులే సృట్టించిన ఇంటర్నెట్ లోకంలోకూడా మానవప్రపంచంలో వున్న మంచీచెడులన్నీ వున్నాయి. అయితే ఇది మంచి ఇది చెడు అని హితవుచెప్పే పెద్దమనుషుల వ్యవస్ధ అక్కడవుండదు. క్లిక్కులు, టా్రఫిక్కు, హిట్సే అక్కడ లాభనష్టాల లెఖ్ఖ. 
పురుషాధిక్య సమాజపు “స్త్రీ పట్ల కుతూహలం” ఇంటర్నెట్ లో పెద్ద వ్యాపారవస్తువు. మానవసమూహాల మధ్యగాక ప్రయివేటుగా కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్టుల తెరలమీద మాత్రమే కనిపించే వీలుండటంవల్ల స్త్రీని విశృంఖలంగా చూపించడానికి, చూడటానికి చిన్నపాటి సంకోచమైనా వుండటంలేదు.
ఇలాంటి “థ్రిల్” ఆఫ్ లైన్ లో, ఇంటర్నెట్ కనెక్షన్ కి అవకాశమే లేని ఫీచర్ మొబైల్ ఫోనుల్లో కూడా శరవేగంతో విస్తరిస్తోంది. మెమరీ కార్డుల్లో బూతు సినిమాలునింపి అమ్ముకునే వ్యాపారం గ్రామాల్లో పెరిగిపోతోంది. 
వీటన్నిటి ప్రభావంగా మెదళ్ళల్లో సెక్స్ శక్తివంతమైన ముద్రతో స్ధిరపడిపోతోంది. ఇందువల్ల  ఏ స్త్రీ ని అయినా లైంగిక దృష్టితో చూడటమే జరుగుతోంది. మనిషి వేషంలో వున్న కోర్కెల మృగాల మధ్య మహిళలు తిరుగుతున్నారన్న ఆలోచనే వొళ్ళు జలదరింపజేస్తుంది. 
మహిళలు యువతులు చివరికి చిన్నపిల్లలపై లైంగికదాడులకు మూలాలు ఇవే.
వంటలో ఉప్పో పులుపో కారమో ఎక్కవైతే పాలో పెరుగోకలిపి వాటిని విరిచేసి రుచికరంగా చేసే చిట్కాలు అమ్మకు తెలుసు. వరదప్రవాహంలా ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి చిట్కాలు చాలవనే అనిపిస్తుంది.
పాపికొండలు దాటాక దిగువవైపు గోదావరి వడి అంతా ఇంతాకాదు. గట్లను ఎలా కోసేయగలదో ఆ వేగం చూస్తేనే అర్ధమౌతుంది.గట్టుగ్రామాల్లో నివాసముండే గిరిపుత్రులు వెదురు బొంగులను ఒక కోణంవుండేలా చెక్కి ఒక మైలు దూరంలో ఏడెనిమిది వుండేలా నదిలో నాటేవారు. వెదురు కోణం, వాటిని నాటిన దిశలనుబట్టి ప్రవాహం దిశమారుతుంది. అంటే గట్టు కోతపడుతున్నచోటుని మార్చడమే. ఇందులో మహాప్రవాహం ఆగలేదు. చిన్న చిట్కాతో  ఒక మళ్ళింపు ద్వారా కోతపడే ప్రదేశాన్ని కాపాడుకోవడమే!
“నిర్భయ” లాంటి కఠిన చట్టాలు విషఫలాలను మాత్రమే రూపుమాపగలవు. మూలాలను నిర్వీర్యం చేయనంతకాలం ఆడవారిపై అఘాయిత్యాలను ఆపడం” నిర్భయ” వల్లకాదు. 
చట్టబద్ధతకూ, నైతికతకూ హద్దే చెరిగిపోయి, నీతి ఉనికే ప్రశ్నార్ధకమవ్వడంవల్ల ఈ తరం యువతరానికి “తప్పు”, “తలవంపు” అనే స్పృహే తెలియకుండా పోయింది. మనిషిమీద మనిషికి గౌరవ మర్యాదల సంస్కారాన్ని మళ్ళీ తీసుకురాగలిగితే దృక్పధాల్లోనే తప్పక మార్పువస్తుంది. ఇది చట్టాలూ, సామాజిక సంస్ధలపనికాదు. పూర్తిగా తల్లిదండ్రుల పనే. ఏ లైంగిక ఆగడం గురించి చదివినా, విన్నా- కన్నవారు జాగ్రత్తలు చెప్పేది కేవలం కూతుర్లకే…”కొడుకులూ! మీ ఆలోచనలూ నడకలూ జాగ్రత్త” అనాలనే ఆలోచనకూడా తల్లిదండ్రులకు రాకపోవడమే స్త్రీ అభద్రతకు పునాది అవుతోంది
సాంస్కృతిక కాలుష్యం మీద పాలకుల తో సహా అన్ని పార్టీలు, సామాజిక సంస్ధలు దృష్టిపెట్టాలి. ఒక సాంస్కృతిక విధానాన్నిరూపొందించుకోవాలి. నేరస్ధులను శిక్షించడంతోపాటు స్త్రీ పట్ల దురవగాహనపెంచే మూలాలపై చైతన్యం తేవాలి. నీచమైన ఆలోచనలు ఒక రుగ్మత అనే స్పృహ పెంచాలి. ఇదంతా అంతతేలికేనా అనేఆనుమానం ఎదురౌతుంది. ఆదేసమయంలో గోదావరి ప్రవాహాన్ని మళ్ళించి గట్టు కాపాడుకునే గిరిజనుల అనుభవాన్ని కూడా గుర్తు చేసుకోవాలి 
-పెద్దాడ నవీన్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రాజమండ్రి