Search

Full Story

All that around you

Month

August 2013

ప్రజల్ని వదిలేసిన పార్టీలు!


రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో పెల్లుబికిన ఆగ్రహం ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెంది దశాదిశా తోచక కార్యక్రమంలేక పలచబడిపోతూండగా రాజకీయపార్టీలు ఈ స్ధితిని సొమ్ముచేసుకునే పనికే తెగబడుతున్నాయి. 
ఇలాతంటాలు పడటలో  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండగా ఇబ్బంది పడుతూనే తెలుగుదేశం దాన్ని అనుసరిస్తున్నట్టుంది. ఎక్కడో దాచుకున్న ముఖాలను ప్రజలముందు ఎలాబయటపెట్టాలో దారితోచక కాంగ్రెస్ వాళ్ళు ఈ వెంపర్లాటలో వెనకబడిపోయారు
రాజకీయ పార్టీల మద్య వత్తిడి పోటీలను చాలా తీవ్రంగా ఈ స్ధితిలో పైకి మాత్రం సమైక్యవాదన వినిపిస్తున్నా అసలు ప్రయత్నమంతా ప్రజలలో రేకెత్తిన సమైక్య భావనను ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకోవడమే .అందులో ప్రధాన పాత్రను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ,టిడిపిలు పోషిస్తుండగా, కాంగ్రెస్ నేతలు కూడా శక్తి వంచన లేకుండా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
సమైక్య రాష్ట్రం కోరుతూ ఇంతగా ప్రజలలో మనోభావాలు వ్యక్తం అవుతాయని మొదట రాజకీయ పార్టీలు ఊహించలేదు. మంత్రి టిజి వెంకటేష్ ఒక సందర్భంలో ప్రజలు రోడ్లమీదకు రాకపోతే తాము రాష్ట్ర సమైక్యత గురించి ఎలా వాదిస్తామని చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనంగా ఉంటుంది.అయితే క్రమేపి ఉద్యమం పుంజుకుని ఇప్పుడు సర్వం బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది.కొంతకాలం క్రితం కడపలో సమైక్యాంధ్ర జెఎసి సమావేశంలో రాజీనామాల పర్వం ఆరంభమైంది. ఆ తర్వాత సీరియస్ గా కడప జిల్లాకే చెందిన ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.దాంతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా (విజయమ్మ తప్ప) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.దాంతో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.ఆ తర్వాత జూలై ముప్పైన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ చేసింది.
దాంతో పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి.సీమాంధ్ర మంత్రులు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.టిడిపి అదినేత చంద్రబాబు కొంత సంయమనం పాటించి విభజనకు అనుకూలంగా మాట్లాడి కొత్త రాజధానికి నాలుగైదు లక్షల కోట్లు ఇవ్వాలని సూచించారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా సిడబ్ల్యుసి తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ కు సీమాంద్రలో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు తన వైఖరిలో కొంత మార్పు చేసుకుని ప్రధానికి ఒక లేఖ రాస్తూ విభజన సందర్భంగా సీమాంద్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నించలేదని విమర్శించారు.అందులో కేంద్రాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.కిరణ్,చంద్రబాబుల వ్యూహాన్ని తిప్పికొట్టడానికిగాను విజయమ్మ ఎమ్మెల్యే పదవికి, జగన్ ఎమ్.పి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఒక బహిరంగ లేఖ రాశారు.అందులో సవాలక్ష సమస్యలను ప్రస్తావించి సమైక్యవాదానికి దాదాపు దగ్గరగా వెళ్లిపోయారు. దానిపై చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి కేంద్రంపై,కాంగ్రెస్ ఐ ఘాటుగా ధ్వజమెత్తి తెలుగుదేశం ను దెబ్బతీయడానికే తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు.అంతేకాక చంద్రబాబు స్వయంగా ఆయా వర్గాల వారితో చర్చలు ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఇక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసి విజయమ్మ ఆమరణ దీక్ష ప్రకటించారు.రాష్ట్ర సమైక్యం కోసం ఆమె దీక్షకు దిగుతున్నారు.ఈ వార్త విన్నామో,లేదో టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు.రెండువేల తొమ్మిది డిసెంబరులో కూడా సీమాంధ్ర అంతటా అనేకమంది నాయకులు పార్టీలకు అతీతంగా ఆమరణ దీక్షలకు దిగారు.అప్పుడు కంటే ఇప్పుడు పోటాపోటీ వాతావరణం ఏర్పడింది.ఎన్నికల ముందు జనంలో తమ ముద్ర వేసుకోవడానికి ఆయా పక్షాలు తీవ్రంగా యత్నిస్తున్నాయని భావించవచ్చు.
ఇక పార్లమెంటులో కూడా కాంగ్రెస్,టిడిపి ఎమ్.పిలు పోటాపోటీ ఆందోళనలకు దిగుతున్నారు.ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు.కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులు ఆందోళనలలో స్వయంగా పాల్గొనడం లేదు కాని, రాస్ట్రంలోని సీమాంధ్ర మంత్రులు ఆందోళనలలో కూడా పాల్గొంటున్నారు.సీమాంధ్రలో తమ భవిష్యత్తు ఏమిటో తెలియని పరిస్థితిలో వీరు తమ ప్రయత్నం తాము చేస్తున్నారు.వైఎస్.ఆర్.కాంగ్రెస్,టిడిపిలు మాత్రం సీమాంద్రలో సమైక్యబాణితో పోటాపోటీ రాజకీయానికి సిద్దపడుతున్నాయని అనుకోవచ్చు.
కాంగ్రెస్ అధిష్టానం నయానా భయానా దారికి తెచ్చుకుంటన్న ఒత్తిడితో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

బదులేది?


సమైక్య ఉద్యమ/పోరాట నాయకులూ!
ఇవి పదేళ్ళుగా అలజడి,పదిరోజులుగా వత్తిడి పడుతున్న నడివయసు సగటు మనిషి ప్రశ్నలు
# మీతో కలసి ఉండలేం విడిపోతాం అన్న ప్రాంతాన్ని కలసి ఉండాలని బలవంతపెట్టడం సమైక్యత అవుతుందా?
# రెండుసార్లు రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన తర్వాత, ఇప్పుడు ఇంకా ఈ రాషా్ట్రం సమైక్యంగా ఉంటుందా? అలా ఉంచడం సాధ్యమేనా?
# తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తే, ఆటువైపు ఉద్యమం మళ్లీ ఉధృతం కాదా? దాన్ని అణచివేయడం సాధ్యమేనా? తెలంగాణ ఉద్యమం మళ్లీ తలెత్తకుండా చేస్తామని చెప్పగలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా? 
# బలవంతంగా రెండు ప్రాంతాలను కలిపి ఉంచే ప్రయత్నం చేసినా ‘అపనమ్మకాల టైంబాంబ్’ మీద మనుగడ సాగిస్తున్న ఈ రాష్ట్రంలో మరో పదేళ్ల తర్వాతో, ఇరవై ఏళ్ల తర్వాతో జై తెలంగాణ అనో జై ఆంధ్ర అనో మళ్లీ ఉద్యమం లేవదన్న గ్యారెంటీ ఉందా? ఆ పూచీ ఎవరైనా ఇవ్వగలరా?  (1972 జై ఆంధ్రా ఉద్యమం కాంగ్రెస్ నాయకుల ఉద్యమ ద్రోహం వల్ల నీరుగారిపోయినపుడు ఎదురైన ఇదే ప్రశ్న నాలుగు దశాబ్దాల తరుతాత ఇపుడు చిక్కుముడి అయ్యింది)
# భౌగోళికంగా తెలంగాణలో ఉండి, ఒకటి, లేదా రెండు తెలంగాణ జిల్లాలను దాటితే తప్ప చేరుకోలేని హైదరాబాద్ ను సీమాంధ్రకు కూడా శాశ్వత ఉమ్మడి రాజధాని చేయడం సాధ్యమేనా? 
# ఒక రాష్ట్ర రాజధాని మరో రాష్ట్రంలో ఉండడం ఎలా కుదురుతుంది? కుదిరినా అది విమానాల్లో తిరిగవారికే తప్ప మామూలు ప్రజలకు అందుబాటులో ఎలా వుంటుంది 
# బలవంతపు సమైక్యతకు ఆటవిక సమాజంలోనైనా సాగుతుందా? ఇదంతా మీకు తెలియదని అనుకోవడంలేదు. (మీరు ఏమార్చడం వల్ల) ఆకస్మికంగా విరుచుకు పడిన పరిణామాల వల్ల ఆగ్రహంతో ఆవేదనతో ఆక్రోశంతో రగిలిపోతున్న మమ్మల్ని ఇపుడు కూడా మీరు ప్రచ్ఛన్నంగా ఎగదోస్తూనేవున్నారు.
దయచేసి మీరు దాచేసుకున్న ముఖాల్ని బయటికి తీయండి. ఈ విద్వేషాలను ఇకనైనా ఆపేయడానికి పూనుకోండి. ఆంధ్రాలో చదువుకుంటున్న తెలంగాణ పిల్లలుగానీ, తెలంగాణలో హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో నివసిస్తున్న సీమాంధ్రులు కానీ తీవ్ర అభద్రతా భావానికి, మానసిక వ్యథకు లోనవుతున్న సంగతిని వెంటనే గుర్తించండి
విభజన నిర్ణయం వచ్చేసింది దాన్ని ఆమోదించడమో, సవరణలు చేయడమో, ఇంకా మంచి ప్రతిపాదన చేయడమో తప్ప కాలంతీరిన సమైక్యవాదం పరిష్కారం కాదని మాలాంటి సామాన్యులకే అనిపిస్తూంది
మరి మీకేమీ అనిపించడం లేదా? 
ఇట్లు
ఓ నడివయసు సగటు మనిషి
ఇంకో సంగతి: ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ప్రత్యామ్నాయాలూ పరిష్కారాలూ కూడా మీకేతెలుసు. కాకపోతే వాటిని ఢిల్లీలో మీ పలుకుబడీ ప్రాపకాలు పెంచుకునే బేరసారాల్లో వాడుకుంటారు. మాకు ముందుగా ఒక సూచన కూడా ఇవ్వరు. ఎందుకంటే మీదృష్టిలో మేము ప్రజలము కాము. కేవలం ఓట్లమే. ఎన్నికలవేళకు మీరు ఎలాగైనా ఏమార్చుకోగల ఓటర్లమే!
  

రొద


రొద మార్మోగిపోతున్నా 
అది పెనునిశ్శబ్దమే నని 
నీ హృదయమూ భాషా 
నా నినాదాన్ని విసురుగా 
విసిరేస్తున్నప్పుడే,
నాగొంతు నీ చెవిలో 
మూగపోయినపుడే 
నా జ్ఞాపకంలో నువ్వూ 
నీ ఆలోచనలో నేను లేమని
ఎరుకై ఒక శూన్యమే మిగిలింది.
ఎక్కడివైనా, ఎక్కడైనా
వికసించి గుబాళించవలసిన 
జీవితాలు అర్ధతరంగా 
కాలిపోతే నేలరాలిపోతే 
చిన్న చెమరింపూ లేని 
స్వరాలు ఓదార్పు గీతాలు కాలేవుకదా!
నీటిపంపకాలు సరే! అంతకంటే ముందు 
కన్నీటిని పంచుకోవాలనిపించకపోవడం 
ఏప్రాంతానికైనా నేరమే!
ప్రాయిశ్చిత్తాన్ని శూన్యపోరాటంలోకి వొంపుకుంటే 
ఇంతటి అలజడిలోకీ ఒక నిజాయితీ పాకి 
జ్ఞాపకాల్లోకీ ఆలోచనల్లోకీ వ్యాపిస్తుంది.
నిజం తనను తాను తెలియపరచుకుంటుంది.
అందుకు మనుషులకీ మనుషులకీ 
మధ్య ఇంత వైశాల్యం అవసరమౌతుంది.
( ఇది రాశాక చింపేయని మొదటి కవిత?? నవీన్)

నాయకులూ నిజంలోకి రండి!


అన్ని పార్టీల సీమాంధ్రనేతలకు,
సమైక్యాంధ్ర ఉద్యమంలో మీవైఖరి భయాన్నీ అనుమానాన్నీ కలిగిస్తున్నది. పదేళ్ళనుంచీ మీరు ఒకటే మాట “ఏమీ అవ్వదులే” అనే చెబుతున్నారు. విభజన నిర్ణయం జరిగిపోయాక, ప్రజల్లో వ్యతిరేక ఉబకడం మొదలయ్యాక-ఇపుడు కాస్త మాటమార్చి’విభజన ఆపించేస్తాం’ అంటున్నారు. 
తెలంగాణా ఉద్యమం మొదలయ్యాక ఈ 13 ఏళ్ళలో అటువైపు పరిణామాల్ని మీరు అసలు పట్టించుకోనే లేదని అనుమానమొస్తోంది. అదేజరిగివుంటే అపుడపుడూ మీ అనుచరులు సహచరులతో ఎపుడో ఒకప్పుడు ప్రజలతో సభల్లో ఆవిషయాలు ప్రస్తావించి వుండేవారే. 
ప్రాంతీయ అసమానతలవల్లా, హైదరాబాద్ మీదే సర్వస్వం కేంద్రీకరించడం వల్లా సమస్యలు ముంచుకొస్తాయని 13 ఏళ్ళ తెలంగాణా ఉద్యమం చూస్తున్న మీకు ఒక్కసారి కూడా అనిపించకపోవడం నిజంగా మిప్రాంతాల ప్రజల దౌర్భాగ్యం.
విభజన అంశాన్ని మీరేగనుక పసిగట్టివుంటే మీప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన ఇన్ పుట్స్ సమీకరించుకునేవారు. వ్యూహాలను సిద్ధం చేసుకునేవారు. పంపకాలపై వాటాల కు బేరసారాలను సిద్ధం చేసుకునేవారు. 
మీ పట్టించుకోనితనంవల్లో ఏమీజరగదనే ఉదాసీనం వల్లో అంతా జరిగిపోయాక  మీరు ఆకస్మిక అయోమయంలోకి వెళ్ళిపోయినట్టు అర్ధమౌతోంది.
సమైక్యత తప్ప మరేదీ ఒప్పుదలకాదని మీరు ఆలోచనల్ని మూసివేయడం కూడా ఇందుకు కారణేమో తెలియదు.
మార్గాలను మార్గాంతరాలనూ మీరు మీసహచరులతో కూడా ఆలోచించకుండా వుంటాన్ని బట్టి “ఏదో అద్భుతం” వల్లే విభజన ఆగిపోతుందనే విష్ ఫుల్ ధింకింగ్ లో మీరు దిగబడిపోయారేమో ననిపిస్తోంది.
ఆభ్రమ నుంచి మీరు నిజంలోకి రాకపోతే మీ ప్రాంతానికి కావలసిందేమిటో చెప్పే అవకాశం కూడా మీకు మిగలదు
నమస్కారం
ఇట్లు
రాయలసీమ కోస్తా ఆంధ్రప్రాతాల పౌరులు
ఇంకోమాట: ఈ ఉత్తరంలో మీ పట్ల మా అవగాహన సరైనది కాకపోవచ్చేమో గాని విభజనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు రాజకీయేతర సంస్ధలు చేతికందిన ఆయుధాలతో సిద్ధమై పోతూంటే మీరు తలోదిక్కూ అయోమయపు చూపులు చూస్తున్నది నిజం 

కోస్తా మనేద


మా దిగులంతా…
చదువవ్వగానే బస్సెక్కి హైదరాబాద్ చేరుకుని స్నేహితుల రూంలోనో,బంధువుల ఇంటిలోనో దిగి, మూడునాలుగు నెలలు అమీర్ పేటలో ఏదైనా టె్రయినింగ్ తీసుకుని ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకునే పిల్లల భవిష్యత్తు ఏమిటన్నదే
ఊళ్ళలో వృత్తలు పనులు లేకుండా పోయాయి. హైదరాబాద్ పరాయిఊరైపోయింది. సీమాంధ్ర లో చిన్న చిన్న హైదరాబాద్ లు మొలకెత్తి పిల్లలకు నీడనివ్వడానికి ఎంతనీరుపోసినా పదేళ్ళకు తక్కువపట్టదు. అంతవరకూ లక్షల మంది పిల్లలకు దిక్కూదివాణం వుండని పరిస్ధితి తలచుకుంటేనే ముద్దదిగడం లేదు. కునుకు పట్టడంలేదు
ఒక పాడిగేదె వుంటే చిన్న కుటుంబం బతికెయ్యవచ్చన్న భరోసాని చెరిపేసుకున్నాము. పళ్ళు యిచ్చే నాలుగు చెట్లువుంటే ఒబ్బిడిగా జీవించవచ్చన్న ధైర్యాన్ని నరికేసుకున్నాము. రెండెకరాల పొలం వుంటే రెండుతరాలు సుఖంగా జీవించవచ్చన్న ఆసరాని అమ్మేసుకున్నాము. 
వెళ్ళలేని, వెనక్కివచ్చిన పిల్లలు పిసుక్కుందామన్నా మట్టి్ట లేకుండా చేసేసుకున్నాము. 
ఇందుకు  సోనియాగాంధీగారినో కెసిఆర్ గారినో తిట్టుకోవడంలేదు. మా కష్టానికి మేము దుఃఖపడుతున్నాము అంతే. ఎవరిని, ఎన్నిశాపనార్ధాలు పెడితే మాత్రం ఈకష్టం తీరేదికాదుగదా
చేయనితప్పుకి శిక్షపడుతున్న పిల్లల కష్టం మరపురావడంలేదు. ఎటు ఒత్తిగిలిగా గుండె కలుక్కుమంటూన్నట్టుంది. ఈ బరువు ఎన్ని గుండెల్ని ఆపేస్తూందో? ఎన్ని కుటుంబాల ఉసురుపోసుకుంటుందో?

కోస్తా ఆంధ్రలో మళ్ళీ వ్యవసాయం కళకళ లాడుతుంది…రాష్ట్రవిభజన ఈ పరిణామాన్ని వేగవంతం చేస్తుంది…


డియర్ శ్రీకిరణ్,
రాష్ట్రవిభజన విషయంగా నీ ప్రశ్నలకు సంపూర్ణంగా కాదుగాని రేఖామాత్రంగా దొరికిన సమాధానాలను నీముందుంచడానికే ఈ ఉత్తరం.
ఒకరంగులకల రోజూకనబడుతోంది. ఆకలలో కోస్తాజిల్లాలన్నీ మళ్ళీ వ్యవసాయంతో పచ్చగా కళకళలాడిపోతున్నాయి. అయితే ఈ సాగుదల మునుపటిలాగ వుండదు. బ్రాండెడ్ షార్ట్్స, టీషర్ట్్స, కేప్స్, గాగూల్స్ ధరించిన రైతులు పొలాల్లో కనిపిస్తారు…నేను చెబుతున్నది ఏసంక్షేమమూ ఆధారమూ లేని జీవనవిధానమైన వ్యవసాయం వాణిజ్యవ్యవసాయంగా రూపాంతరం చెందాక కనిపించే దృశ్యాల గురించి.
వొద్దనుకున్న ప్రపంచీకరణ అనివార్యమైపోయాక అందులో ఉపయోగపడే అంశాలమీద దృష్టికేంద్రీకరిస్తే ఫలితాలు అందుకోవచ్చు. ఓపెన్ ఆప్షన్స్ ని మెదడుకెక్కంచుకుంటే, మైండ్ సెట్ మార్చుకుంటే సౌకర్యవంతంగా జీవించవచ్చు. ఈ కోణంనుంచి విషయాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యి.
భారతదేశానికీ జపాన్, ఇండోనేషియా, ధాయ్ లాండ్, సింగపూర్, వియత్నాం, మొదలైన ఆగ్నేయాసియా దేశాలకూ మధ్య 2009 ఆగస్టులో ఫ్రీటే్రడ్ (FTA)అగ్రిమెంటయ్యింది. దీనిప్రకారం వ్యవసాయోత్పత్తులతో సహా 400 రకాల వస్తువులను తయారీదారులు నేరుగా ఆయా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఇందుకు నౌకావాణిజ్యాన్ని వృద్ధిచేసుకుంటే కోస్తా ఆంధ్రా తీరమంతా ఓడరేవులైపోతుంది.  
ఈ పని ఇప్పటికే మొదలయ్యింది. విశాఖరేవు విస్తరణ జరుగుతోంది. కాకినాడ రేవునుంచి ఎగుమతి దిగుమతులు పెరుగుతున్నాయి. మచిలీపట్నం రేవుని పునరుద్ధరించవలసివుంది. వోడరేవు-నిజాంపట్నం-కృష్ణపట్నం (వాన్ పిక్) రేవులకు సధలంకేటాయింపు వివాదంలో పడింది. ఇవన్నీ క్లియర్ అయితే బ్రహా్మండమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తయారౌతుంది. ఈ రేవులనుంచి ఇప్పటికే వున్న 5 వనెంబరు జాతీయరహదారికి, దానికి సమాంతరంగా వున్న రైల్వేమార్గపు స్టేషన్లకీ విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు అప్రోచ్ మార్గాలు వేసుకుంటే కోస్తాఆంధ్రతీరం ప్రపంచానికి 24 గంటల దూరానికి దగ్గరౌతుంది.
ఇదంతా విభజన సమస్యవల్ల జరుగుతున్నది కాదు చాలాకాలంగా నత్తనడక నడుస్తున్నదే. న్యూస్ టివిలు పేపర్లు ‘వాన్ పిక్’ కుంభకోణానికి మాత్రమే ప్రాధాన్యత యిచ్చాయి. ఓడరేవులకు అనుబంధ పరిశ్రమలకోసం ఏర్పాటు చేసిన సెజ్ లలో కూడా లొసుగులకు మాత్రమే ప్రాధాన్యత యిచ్చిన మీడియా అవిసజావుగా వుంటే కలిగే ప్రయోజనాలగురించి ప్రజలకు వివరించలేదు.
ఇక్కడ వలసల గురించి కూడా మాట్లాడుకోవాలి. బతకడానికో సంపాదించడానికో సాధించడానికో వలసలు పోయిన సమాజాలు చెడిపోయిన చరిత్ర ప్రపంచంలోనేలేదు. కృష్ణా గుంటూరు జిల్లాలనుంచి మొదట బళ్ళారి ప్రాంతానికీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకూ వలసలు పోయిన రైతులు అక్కడే స్ధిరపడిపోయారు. స్ధానిక సమాజాల్లో పలుకుబడి గల శక్తులుగా ఎదిగారు. వారిప్రధాన వ్యాపకం ఇప్పటికీ వ్యవసాయమే.
వ్యవసాయంలో మిగిలిన అదనపు లాభాలను వ్యవసాయేతర సంపదలుగా ఆస్ధులుగా మార్చే కొత్తరూపాంతరం ఏకకాలంలో జరిగింది. 1972 లో జైఆంధ్ర ఉద్యమం విఫలమయ్యాక ఈ టా్రన్స్ఫర్మేషన్ హైదరాబాద్ కి వలసలు వెళ్ళడం ద్వారా చాలా వేగంగా జరిగింది. పెద్దరైతులైన కృష్ణా జిల్లా కమ్మవారూ, పశ్చిమగోదావరి జిల్లా రాజులు వ్యాపారంగంలోకి, సర్వీసు రంగంలోకి, మాన్యుఫాక్చర్ రంగంలోకి 30/40 ఏళ్ళక్రితమే ప్రవేశించారు. వారిభూములు స్వస్ధలాల్లో అలాగే వున్నాయి. వీరిసంఖ్యతక్కువే అయినా సంపదలు ఆదాయాల రీత్యా వీరిప్రభావాలు చాలా ఎక్కవ. 
రాష్ట్రం విడిపోవడమే అనివార్యమైనపుడు హైదరాబాద్ లో కోస్తాజిల్లాల వారి కొత్త/అదనపు వ్యాపకాలు వుండవు. సొంతప్రాంతాల్లో నూతన రాష్ట్రం నిర్మాణం రీత్యా వీరంతా స్వస్ధలాలకు మళ్ళుతారు. కౌలుకిచ్చిన భూముల్లో భారీగా వాణిజ్య వ్యవసాయాన్ని మొదలు పెడతారు. 
FTA ద్వారా విదేశాలకు ఎగుమతులు చేస్తారు. ఈప్రభావం బక్కచిక్కిపోతున్న చిన్న మధ్య తరగతి రైతులకు కూడా ఊతమిస్తుంది. ఇందుకే కోస్తాలో వ్యవసాయం మళ్ళీ కళకళలాడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
ధాన్యం దిగుబడిలో పశ్చిమగోదావరిని  కరీంనగర్ అధిగమించింది. ఆ ‘తెలంగాణా’జిల్లా ఏసింగపూరో బియ్యం ఎగుమతి చేయాలంటే ఆంధ్రాకోస్తా లో ఏదో ఒకరేవునుంచే సరుకు ఓడెక్కించాలి
గత ఐదు వందల సంవత్సరాలుగా సాగరతీర నగరాలలోనే అభివృద్ధి,విజ్ఞానం, నాగరికతలు పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. 
అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నిటికీ సాగరతీరం ఒక సహజ వరంగా ఉంది. న్యూయార్క్, బోస్టన్, లాస్ ఏంజెల్స్, రోటెర్డామ్, లండన్, సెయింట్ పీటర్స్ బర్గ్, లిస్బన్, కైరో, ఇస్తాంబుల్, హాంకాంగ్, సింగపూర్, దుబాయి, షాంఘై, ముంబై, కోల్కతా, చెన్నై మహానగరాలే ఇందుకు నిదర్శనం. ఈ నగరాలన్నీ తమ పోషక ప్రాం తాల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. 
ఇది ఇంకా బాగా అవగతమవ్వడానికి ప్రపంచ పటంలో సాగర వాణిజ్యమార్గాలను ఒకసారి చూడు.
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందే బ్రిటిష్ వారి చొరవతో కోస్తాలో వాణిజ్య వ్యవసాయం జరిగింది. కృష్ణా, గోదావరి ఆనకట్టల నిర్మాణం తర్వాత ఆహార పంట వరి వాణిజ్యపంటగా మారింది. విజయవాడ లాంటి రైల్వే జంక్షన్ ఈ వాణిజ్య వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లింది. క్రిస్టియన్ మిషనరీల వల్ల విద్యారంగంలో కృష్ణా, గుంటూరు   ప్రగతి సాధించాయి. చదువుల్లో పురోగతి వచ్చిన అనంతరం  ఆ స్ఫూర్తితో సంఘ సంస్కరణోద్యమాలు వచ్చాయి. వ్యవసాయిక మార్పులు సరికొత్త మధ్య తరగతి ఆవిర్భావానికి దారితీశాయి. కోస్తా రేవు పట్టణాల నుంచి ఆనాడు బర్మా తదితర దేశాలకు బియ్యం ఎగుమతి అయ్యాయి. టెలిగ్రాముల సౌకర్యంతో బర్మాలో బియ్యం ధరలు ఇక్కడికి ముందుగానే తెలిసేవి.
ఏప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమౌతుంది. రాష్ట్రవిభజనతోనే ఈ కలసాకారమవ్వడం మొదలౌతుంది.
వుంటాను
పెద్దాడ నవీన్
ఇంకొక విషయం: ఏ జీవన విధానమైనా ఒక ఇల్లే కేంద్రంగా మనుగడసాగిస్తుంది. ‘నాది’ అన్నభావనే హద్దుల్ని ఏర్పరస్తుంది. ఎదుగుదలకు కొలమానాల్ని నిర్దేశిస్తుంది. మనిషికైనా సమాజానికైనా ఈ సూత్రమే వర్తిస్తుంది. జీవితమంటే డబ్బుమాత్రమే కాదు…డబ్బు కూడా…జీవితమంటే భావోద్వేగాలు మాత్రమే కాదు…భావోద్వేగాలు కూడా. నాదగ్గర డబ్బు  వుండి వుంటే నువ్వూ నీ పిల్లలూ వ్యవసాయం చేసుకోడానికి కాస్త భూమి కొనే వాణ్ణే!
 

లెక్క జాగ్రత్త!


చెన్నైనుంచో ముంబాయినుంచో ఢిల్లీనుంచో వచ్చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చేయడానికి చాలాతేడావుంది. మిగిలిన నగరాలలో నివశించినందుకు వృత్తిపన్ను, ఇంటిపన్ను, నీటిపన్ను వగైరా సర్వీసులకు మాత్రమే పన్ను చెల్లిస్తాము. హైదరాబాద్ లో వున్నవారుకూడా ఈపన్నులన్నీ చెల్లించవలసిందే. అయితే హైదరాబాద్ లో వున్నవారు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రజలందరూ చెల్లించిన పన్నుల నుంచే హైదరాబాద్ ప్రపంచంలోనే ముఖ్యమైన నగరంగా ఎదిగింది. 
హైదరాబాద్ కి ధీటైన మరోనగరం ఆంధ్రప్రదేశ్ లో లేదు. అది తెలంగాణా లో వుండిపోతుంది కనుక దాని విలువ లెఖ్ఖగట్టి పన్నులు ఆదాయాల దామాషాలో  రాయసీమ కోస్తాప్రాంతాలకు జమచేయాలి. డబ్బుయిచ్చినా రాజధాని కవసరమైన మౌలికసదుపాయాలతో నగరనిర్మాణం వెంటనే జరగదు కాబట్టి నిర్మాణం పూర్తయ్యే వ్యవధిని లెక్కించి ఆప్పటి అంచనాలమేరకు ఈ జమ అవ్వాలి. 
అన్ని ప్రాంతాల్లోనూ హైదరాబాద్ అంతకాకపోయినా ఒక మోస్తరు నగరాలున్నా విస్తరణలకు అవకాశం ఎక్కువే. అయితే ఆపరిస్ధితి లేకపోవడమే ఆంధ్రప్రదేశ్ విచిత్రం. కొత్తరాష్ట్రం/రాషా్ట్రల రాజధాని/రాజధానుల నిర్మాణం పునాదులనుంచీ ప్రారంభం కావలసివుంది. 
అన్ని ప్రాంతాల ఆదాయాలూ హైదరాబాద్ లో కేంద్రీకరించి వుండటంవల్లే ఆమహానగరంలో పెట్టిన పెట్టుబడుల్లో ఎవరివాటా ఎంత ఆనే లెక్క చూడవలసిన పరిస్ధితి అనివార్యమౌతున్నది. 
చెన్నైనుంచి వట్టిచేతులతో కర్నూలుకి అక్కడినుంచి అలాగే హైదరాబాద్ కి వెళ్ళ ఆరుదశాబ్దాలు సుఖదుఃఖాలతో కష్టసుఖాలతో జీవించి మళ్ళీ వట్టిచేతులతో మిగిలిపోయిన దేశదిమ్మరులకు కొత్తయింటికోసం ఈ మాత్రం వాటాపంచడానికి మహానగరాన్ని మిగుల్చుకున్న తెలంగాణా నాయకత్వానికిగాని విడగొట్టేద్దామన్న కేంద్రానికి గాని అభ్యంతరముండటానికి వీలులేదు 
ఆంధ్రప్రదేశ్ విభజన లేదా తెలంగాణా ఏర్పాటు అంటే ఎవరైనా మరో రాష్ట్రం ఏర్పడటమే కదా అంటారు. ఇందుకింత ఆలస్యమా అని ఆశ్చర్యపోతారు. అయితే విభజన అంటే రాయలసీమ, ఆంధ్రా ప్రజలకు అరవై ఏళ్ళుగా వున్న తెలంగాణా నేల పరాయిదైపోవడమే. ఆందుకే సీమాంధ్రలో ఇంతటి ఉద్వేగం…ఆక్రోశం… అయిందేదో అయిపోయింది. చిరకాలవాంఛ నెరవేరినందుకు తెలంగాణా వారు సంతోషంగా వున్నారు. కొత్తఇల్లు కట్టుకోడానికి రాయలసీమ ఆంధ్రా ప్రాంతాలవారికి న్యాయమైన ధర్మమైన వాటాల ప్రకారం ప్యాకేజీలు యివ్వాలి. ఈ ప్రాంతాల పెద్దలు హేతుబద్ధమైన లెఖ్ఖలు వేయకపోతే ఈ రెండు ప్రాంతాలూ పంపకాల్లో నష్టపోయి నిలదొక్కుకోడానికి కొన్నేళ్ళు పడుతుంది.

సమైక్యవాదులూ డిమాండు మార్చండి!


హైదరాబాద్ తో మినహా మిగిలిన తెలంగాణాతో మనకి భౌతిక బాంధవ్యాలు, మానసిక అనుబంధాలు లేవు.
30 లక్షల మంది మనవాళ్ళున్న హైదరాబాద్ మనది కదనుకుంటే బాధ… అక్కడున్న మన వాళ్ళకి రక్షణ వుండదని భయం…హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని గా చేయాలన్న డిమాండుతో రాజమండ్రి అర్బన్ దళిత ఐక్యవేదిక ఉద్యమిస్తోంది. మన భయాలకు ఇదో పరిష్కారమే!
మన పన్నుసొమ్మును మన ప్రాంతాల అభివృద్ధికే వినియోగించుకోకుండా ఇంకెంతకాలం హైదరాబాద్ ను(తెలంగాణా) పోషించాలని తాడేపల్లిగూడెంలో సాఫ్ట్ వేర్ నిపుణుడు వెంకట్ మైలవరపు ప్రశ్నిస్తున్నారు. కాలంతీరిన సమైక్యాంధ్ర పై  “రాయలాంధ్రుల” చేస్తున్నఉద్యమ డిమాండ్లు మారుతాయని సామాజిక అర్ధిక రాజకీయాల విశ్లేషకుడు, చదువుకున్న జర్నలిస్టు డానీ అంచనావేశారు.
తెలంగాణా ఉద్యమం న్యాయబద్ధమైనదనీ రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలు విడివిడిగా సొంతంగా రాషా్ట్రలు నిర్మించుకోవడం అవసరమనీ నేను గట్టిగా నమ్ముతున్నాను.
సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమానికి కొత్త ఎజెండాను ప్రతిపాదించిన రాజమండ్రి దళిత ఐక్యవేదికకు, కళ్ళుతెరవండని వెటకారంగా హెచ్చరించిన వెంకట్ మైలవరపు గారికీ కృతజ్ఞతలు అభినందనలు!
సమైక్య వాదానికి కాలం తీరిందనడానికి గుర్తుగా ముందుగా రాలిన ఈ రెండు చినుకులూ కుంభవృష్టి కావాలనే కోరుకుంటున్నాను

సీమాంధ్రకు అక్కరకు రాని చుట్టం-ఉండవల్లి


కెసిఆర్ మాటల్ని తిప్పికొట్టడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ సరైన జోడీ అని మనం చప్పట్లు కొట్టేస్తూ వుంటాం! అయితే ఇపుడు ఆదశ దాటిపోయింది. హైదరాబాద్ ని శాశ్వతంగా కోల్పోవాలన్న పరిస్ధితిలో రగిలిపోతున్న ఆంధ్రులకు ఇపుడు కావలసింది మార్గదర్శనం. దశాదిశల నిర్దేశనం. రాజమండ్రిలో ఉండవల్లి ఉపన్యసించబోతున్నారని కాంగ్రస్ ఆఫీసు తెలియజేయడంతో రాష్ట్రప్రజలు ఆదుర్దాగా కుతూహలంగా 24 గంటలు నిరీక్షించారు. టివిలు లైవ్ ప్రసారాలను ఏర్పాటుచేశాయి. తీరా అరుణ్ కుమార్ ఉపన్యాసం ముగిశాక ఆయన ఇచ్చిన సందేశం సంకేతం అర్ధమేకాలేదు. 
అసెంబ్లీ తీర్మానం లేకుండా పార్లమెంటులో విభజన తీర్మానం ఆమోదించబడే అవకాశమేలేదని తాను నమ్ముతున్నట్టు ఆయన చాలా గట్టిగా చెప్పారు. అందుకే సీమాంధ్ర ప్రాంతం లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ రాజీనామా చేయనే కూడదని వారంతా శాసనసభకు హాజరై విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించాలని పిలుపుయిచ్చారు. వీరికోసం 300 పేజీల నోట్సు తయారు చేస్తున్నామని ఎమ్మెల్యే రెండేసి పేజీల నోట్సు చదివి వ్యతిరేకంగా ఓటు చేస్తే చాలని వివరించారు. 
అయితే ఇదే సూత్రం పార్లమెంటు సభ్యులకు ఎందుకు వర్తించదో ఎమ్మెల్యేలను రాజీనామా చేయవద్దన్న అరుణ్ కుమార్ తానెందుకు రాజీనామా చేశారో ప్రజలను కన్విన్స్ చేయలేకపోయారన్నది టివిలో ఆయన ఉపన్యాసం చూసిన వారి మౌలిక ప్రశ్న.
అసెంబ్లీ తీర్మానమే విభజనకు ప్రాతిపదిక అయితే ఏ రాష్ట్రవిభజనా జరగదు. విడిపోవాలని ఉభయులూ ఏకకాలంలో కోరుకోవడం దాదాపు అసాధ్యం కాబట్టి 
విభజన – కలయిక లకోసం అసెంబ్లీ నిమిత్తం లేనివిధంగా ఆర్టికల్ 3 ని రూపొందించారు.. 40 జిల్లాల రాష్ట్రం నుండి నాలుగు జిల్లాలు విడిపోవాలనుకుంటే మిగిలనవి ఒప్పుకోవు కాబట్టి – రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం అవసరం లేకుండా, కేవలం లోక్-సభ సాధారణ ( ఒక్క వోటు ) మెజార్టీ తో ఏర్పాటు చేసేసాలా మన రాజ్యంగా నిర్మాతలు రూపొందిచారు .. వీటికి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ని తొలగించే లాగా 2/3 మేజార్టీలు అక్కర్లేదు .
అసెంబ్లీ మెజారిటీతో నిమిత్తం లేకుండా పార్లమెంటు తీర్మానంతో రాష్ట్ర విభజన జరుగుతుందని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశాక కూడా అరుణ్ కుమార్ అసెంబ్లీలో తీర్మానం జరగకపోతే విభజన సాధ్యం కాదని ఎలా అన్నారో ఆయనకే తెలిసుండాలి.
ఏమైనా ఆందోళనకారులకు అరుణ్ కుమార్ నిరాశ కలిగించినట్టే కనబడుతోంది. ఒక దారిచూపగలరనుకున్న మేధావి, నాయకుడు చివరికి ఇచ్చిన సందేశమేదో స్పష్టంకాని ఉద్యమకారులు ఈ రోజు ఆయన్ని పట్టించుకోనే లేదు. ఆయనతోపాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులూ జనం మధ్యకు రానేలేదు. ప్రజలు మాత్రం సంఘాలవారీగా సమూహాలవారీగా ఎక్కడికక్కడే సంఘటితులై విభజనకు నిరసన ప్రదర్శనలు చేశారు. నాయకులతో పనిలేదన్నట్టు ఉద్వేగంగా వ్యవహరించారు. ‘ఇంతకీ అరుణ్ కుమార ఏం చెప్పినట్టూ’ అన్న ప్రస్తావనలు అనేకచోట్ల వినిపించాయి. 
రాష్ట్రం విడిపోదు అని పెద్దస్వరంతో అన్న అరుణ్ ఎందుకు విడిపోదో వివరించలేకపోయారు.
మళ్ళీ మళ్ళీ సమస్యలు రాకుండా రాయలసీమ ఆంధ్రా ప్రాంతాల విషయం కూడా ఇపుడేతేలిపోవాలి అన్న అరుణ్ వ్యాఖ్యానాన్ని అందరూ ఆమోదిస్తారు. దేశానికి రెండోరాజధానిగా హైదరాబాద్ ను వుంచాలన్న అంబేద్కర్ ని ఉటంకించిన అరుణ్ కుమార్ ఉద్దేశ్యం ఆభావనను ప్రజల్లో ప్రవేశపెట్టడమేనని అర్ధమౌతోంది. అయితే అందుకు కృషిచేయడానికి ఎంతోకొంత ఉపయోగపడే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని బట్టి(ఉద్వేగభరితమైన నేపధ్యం దృషా్ట్య ఈ రాజీనామాలు వెంటనే ఆమోదించబడకపోవచ్చు) యుద్ధం మొదలయ్యే సమయంలో అరుణ్ కుమార్ తెరవెనక్కి వెళ్ళిపోతున్నారా అనే అనుమానమొస్తుంది…
తెరవెనక్కి వెళ్ళినా కూడా అరుణ్ కుమార్ కాంగ్రెస్ కి పనికొచ్చే పనిలో వుంటారని ఆయన్ని బాగా గమనించే వారికి తేలిగ్గానే అర్ధమౌతుంది. ఏమైనా ఉద్వేగాలు రగులుకుంటన్న సీమాంధ్ర మనోభావాలకు ఈ మేధావి ప్రస్తుతానికి అందుబాటులో లేరు. ఎంపిపదవికి రాజీనామా ప్రకటించడంద్వారా ఈ వ్యవహారంలో ప్రభుత్వానికీ దూరమేనన్న సంకేతం ఇస్తున్నారు. 
ఏమైనా సీమాంధ్రప్రజలకు అరుణ్ కుమార్ ఇపుడు “అక్కరకు రాని చుట్టమే”! 
-పెద్దాడ నవీన్
రాజమండ్రి, 5-7-201

Create a free website or blog at WordPress.com.

Up ↑