కెసిఆర్ మాటల్ని తిప్పికొట్టడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ సరైన జోడీ అని మనం చప్పట్లు కొట్టేస్తూ వుంటాం! అయితే ఇపుడు ఆదశ దాటిపోయింది. హైదరాబాద్ ని శాశ్వతంగా కోల్పోవాలన్న పరిస్ధితిలో రగిలిపోతున్న ఆంధ్రులకు ఇపుడు కావలసింది మార్గదర్శనం. దశాదిశల నిర్దేశనం. రాజమండ్రిలో ఉండవల్లి ఉపన్యసించబోతున్నారని కాంగ్రస్ ఆఫీసు తెలియజేయడంతో రాష్ట్రప్రజలు ఆదుర్దాగా కుతూహలంగా 24 గంటలు నిరీక్షించారు. టివిలు లైవ్ ప్రసారాలను ఏర్పాటుచేశాయి. తీరా అరుణ్ కుమార్ ఉపన్యాసం ముగిశాక ఆయన ఇచ్చిన సందేశం సంకేతం అర్ధమేకాలేదు. 
అసెంబ్లీ తీర్మానం లేకుండా పార్లమెంటులో విభజన తీర్మానం ఆమోదించబడే అవకాశమేలేదని తాను నమ్ముతున్నట్టు ఆయన చాలా గట్టిగా చెప్పారు. అందుకే సీమాంధ్ర ప్రాంతం లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ రాజీనామా చేయనే కూడదని వారంతా శాసనసభకు హాజరై విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించాలని పిలుపుయిచ్చారు. వీరికోసం 300 పేజీల నోట్సు తయారు చేస్తున్నామని ఎమ్మెల్యే రెండేసి పేజీల నోట్సు చదివి వ్యతిరేకంగా ఓటు చేస్తే చాలని వివరించారు. 
అయితే ఇదే సూత్రం పార్లమెంటు సభ్యులకు ఎందుకు వర్తించదో ఎమ్మెల్యేలను రాజీనామా చేయవద్దన్న అరుణ్ కుమార్ తానెందుకు రాజీనామా చేశారో ప్రజలను కన్విన్స్ చేయలేకపోయారన్నది టివిలో ఆయన ఉపన్యాసం చూసిన వారి మౌలిక ప్రశ్న.
అసెంబ్లీ తీర్మానమే విభజనకు ప్రాతిపదిక అయితే ఏ రాష్ట్రవిభజనా జరగదు. విడిపోవాలని ఉభయులూ ఏకకాలంలో కోరుకోవడం దాదాపు అసాధ్యం కాబట్టి 
విభజన – కలయిక లకోసం అసెంబ్లీ నిమిత్తం లేనివిధంగా ఆర్టికల్ 3 ని రూపొందించారు.. 40 జిల్లాల రాష్ట్రం నుండి నాలుగు జిల్లాలు విడిపోవాలనుకుంటే మిగిలనవి ఒప్పుకోవు కాబట్టి – రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం అవసరం లేకుండా, కేవలం లోక్-సభ సాధారణ ( ఒక్క వోటు ) మెజార్టీ తో ఏర్పాటు చేసేసాలా మన రాజ్యంగా నిర్మాతలు రూపొందిచారు .. వీటికి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ని తొలగించే లాగా 2/3 మేజార్టీలు అక్కర్లేదు .
అసెంబ్లీ మెజారిటీతో నిమిత్తం లేకుండా పార్లమెంటు తీర్మానంతో రాష్ట్ర విభజన జరుగుతుందని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశాక కూడా అరుణ్ కుమార్ అసెంబ్లీలో తీర్మానం జరగకపోతే విభజన సాధ్యం కాదని ఎలా అన్నారో ఆయనకే తెలిసుండాలి.
ఏమైనా ఆందోళనకారులకు అరుణ్ కుమార్ నిరాశ కలిగించినట్టే కనబడుతోంది. ఒక దారిచూపగలరనుకున్న మేధావి, నాయకుడు చివరికి ఇచ్చిన సందేశమేదో స్పష్టంకాని ఉద్యమకారులు ఈ రోజు ఆయన్ని పట్టించుకోనే లేదు. ఆయనతోపాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులూ జనం మధ్యకు రానేలేదు. ప్రజలు మాత్రం సంఘాలవారీగా సమూహాలవారీగా ఎక్కడికక్కడే సంఘటితులై విభజనకు నిరసన ప్రదర్శనలు చేశారు. నాయకులతో పనిలేదన్నట్టు ఉద్వేగంగా వ్యవహరించారు. ‘ఇంతకీ అరుణ్ కుమార ఏం చెప్పినట్టూ’ అన్న ప్రస్తావనలు అనేకచోట్ల వినిపించాయి. 
రాష్ట్రం విడిపోదు అని పెద్దస్వరంతో అన్న అరుణ్ ఎందుకు విడిపోదో వివరించలేకపోయారు.
మళ్ళీ మళ్ళీ సమస్యలు రాకుండా రాయలసీమ ఆంధ్రా ప్రాంతాల విషయం కూడా ఇపుడేతేలిపోవాలి అన్న అరుణ్ వ్యాఖ్యానాన్ని అందరూ ఆమోదిస్తారు. దేశానికి రెండోరాజధానిగా హైదరాబాద్ ను వుంచాలన్న అంబేద్కర్ ని ఉటంకించిన అరుణ్ కుమార్ ఉద్దేశ్యం ఆభావనను ప్రజల్లో ప్రవేశపెట్టడమేనని అర్ధమౌతోంది. అయితే అందుకు కృషిచేయడానికి ఎంతోకొంత ఉపయోగపడే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని బట్టి(ఉద్వేగభరితమైన నేపధ్యం దృషా్ట్య ఈ రాజీనామాలు వెంటనే ఆమోదించబడకపోవచ్చు) యుద్ధం మొదలయ్యే సమయంలో అరుణ్ కుమార్ తెరవెనక్కి వెళ్ళిపోతున్నారా అనే అనుమానమొస్తుంది…
తెరవెనక్కి వెళ్ళినా కూడా అరుణ్ కుమార్ కాంగ్రెస్ కి పనికొచ్చే పనిలో వుంటారని ఆయన్ని బాగా గమనించే వారికి తేలిగ్గానే అర్ధమౌతుంది. ఏమైనా ఉద్వేగాలు రగులుకుంటన్న సీమాంధ్ర మనోభావాలకు ఈ మేధావి ప్రస్తుతానికి అందుబాటులో లేరు. ఎంపిపదవికి రాజీనామా ప్రకటించడంద్వారా ఈ వ్యవహారంలో ప్రభుత్వానికీ దూరమేనన్న సంకేతం ఇస్తున్నారు. 
ఏమైనా సీమాంధ్రప్రజలకు అరుణ్ కుమార్ ఇపుడు “అక్కరకు రాని చుట్టమే”! 
-పెద్దాడ నవీన్
రాజమండ్రి, 5-7-201