చెన్నైనుంచో ముంబాయినుంచో ఢిల్లీనుంచో వచ్చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చేయడానికి చాలాతేడావుంది. మిగిలిన నగరాలలో నివశించినందుకు వృత్తిపన్ను, ఇంటిపన్ను, నీటిపన్ను వగైరా సర్వీసులకు మాత్రమే పన్ను చెల్లిస్తాము. హైదరాబాద్ లో వున్నవారుకూడా ఈపన్నులన్నీ చెల్లించవలసిందే. అయితే హైదరాబాద్ లో వున్నవారు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రజలందరూ చెల్లించిన పన్నుల నుంచే హైదరాబాద్ ప్రపంచంలోనే ముఖ్యమైన నగరంగా ఎదిగింది. 
హైదరాబాద్ కి ధీటైన మరోనగరం ఆంధ్రప్రదేశ్ లో లేదు. అది తెలంగాణా లో వుండిపోతుంది కనుక దాని విలువ లెఖ్ఖగట్టి పన్నులు ఆదాయాల దామాషాలో  రాయసీమ కోస్తాప్రాంతాలకు జమచేయాలి. డబ్బుయిచ్చినా రాజధాని కవసరమైన మౌలికసదుపాయాలతో నగరనిర్మాణం వెంటనే జరగదు కాబట్టి నిర్మాణం పూర్తయ్యే వ్యవధిని లెక్కించి ఆప్పటి అంచనాలమేరకు ఈ జమ అవ్వాలి. 
అన్ని ప్రాంతాల్లోనూ హైదరాబాద్ అంతకాకపోయినా ఒక మోస్తరు నగరాలున్నా విస్తరణలకు అవకాశం ఎక్కువే. అయితే ఆపరిస్ధితి లేకపోవడమే ఆంధ్రప్రదేశ్ విచిత్రం. కొత్తరాష్ట్రం/రాషా్ట్రల రాజధాని/రాజధానుల నిర్మాణం పునాదులనుంచీ ప్రారంభం కావలసివుంది. 
అన్ని ప్రాంతాల ఆదాయాలూ హైదరాబాద్ లో కేంద్రీకరించి వుండటంవల్లే ఆమహానగరంలో పెట్టిన పెట్టుబడుల్లో ఎవరివాటా ఎంత ఆనే లెక్క చూడవలసిన పరిస్ధితి అనివార్యమౌతున్నది. 
చెన్నైనుంచి వట్టిచేతులతో కర్నూలుకి అక్కడినుంచి అలాగే హైదరాబాద్ కి వెళ్ళ ఆరుదశాబ్దాలు సుఖదుఃఖాలతో కష్టసుఖాలతో జీవించి మళ్ళీ వట్టిచేతులతో మిగిలిపోయిన దేశదిమ్మరులకు కొత్తయింటికోసం ఈ మాత్రం వాటాపంచడానికి మహానగరాన్ని మిగుల్చుకున్న తెలంగాణా నాయకత్వానికిగాని విడగొట్టేద్దామన్న కేంద్రానికి గాని అభ్యంతరముండటానికి వీలులేదు 
ఆంధ్రప్రదేశ్ విభజన లేదా తెలంగాణా ఏర్పాటు అంటే ఎవరైనా మరో రాష్ట్రం ఏర్పడటమే కదా అంటారు. ఇందుకింత ఆలస్యమా అని ఆశ్చర్యపోతారు. అయితే విభజన అంటే రాయలసీమ, ఆంధ్రా ప్రజలకు అరవై ఏళ్ళుగా వున్న తెలంగాణా నేల పరాయిదైపోవడమే. ఆందుకే సీమాంధ్రలో ఇంతటి ఉద్వేగం…ఆక్రోశం… అయిందేదో అయిపోయింది. చిరకాలవాంఛ నెరవేరినందుకు తెలంగాణా వారు సంతోషంగా వున్నారు. కొత్తఇల్లు కట్టుకోడానికి రాయలసీమ ఆంధ్రా ప్రాంతాలవారికి న్యాయమైన ధర్మమైన వాటాల ప్రకారం ప్యాకేజీలు యివ్వాలి. ఈ ప్రాంతాల పెద్దలు హేతుబద్ధమైన లెఖ్ఖలు వేయకపోతే ఈ రెండు ప్రాంతాలూ పంపకాల్లో నష్టపోయి నిలదొక్కుకోడానికి కొన్నేళ్ళు పడుతుంది.