డియర్ శ్రీకిరణ్,
రాష్ట్రవిభజన విషయంగా నీ ప్రశ్నలకు సంపూర్ణంగా కాదుగాని రేఖామాత్రంగా దొరికిన సమాధానాలను నీముందుంచడానికే ఈ ఉత్తరం.
ఒకరంగులకల రోజూకనబడుతోంది. ఆకలలో కోస్తాజిల్లాలన్నీ మళ్ళీ వ్యవసాయంతో పచ్చగా కళకళలాడిపోతున్నాయి. అయితే ఈ సాగుదల మునుపటిలాగ వుండదు. బ్రాండెడ్ షార్ట్్స, టీషర్ట్్స, కేప్స్, గాగూల్స్ ధరించిన రైతులు పొలాల్లో కనిపిస్తారు…నేను చెబుతున్నది ఏసంక్షేమమూ ఆధారమూ లేని జీవనవిధానమైన వ్యవసాయం వాణిజ్యవ్యవసాయంగా రూపాంతరం చెందాక కనిపించే దృశ్యాల గురించి.
వొద్దనుకున్న ప్రపంచీకరణ అనివార్యమైపోయాక అందులో ఉపయోగపడే అంశాలమీద దృష్టికేంద్రీకరిస్తే ఫలితాలు అందుకోవచ్చు. ఓపెన్ ఆప్షన్స్ ని మెదడుకెక్కంచుకుంటే, మైండ్ సెట్ మార్చుకుంటే సౌకర్యవంతంగా జీవించవచ్చు. ఈ కోణంనుంచి విషయాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యి.
భారతదేశానికీ జపాన్, ఇండోనేషియా, ధాయ్ లాండ్, సింగపూర్, వియత్నాం, మొదలైన ఆగ్నేయాసియా దేశాలకూ మధ్య 2009 ఆగస్టులో ఫ్రీటే్రడ్ (FTA)అగ్రిమెంటయ్యింది. దీనిప్రకారం వ్యవసాయోత్పత్తులతో సహా 400 రకాల వస్తువులను తయారీదారులు నేరుగా ఆయా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఇందుకు నౌకావాణిజ్యాన్ని వృద్ధిచేసుకుంటే కోస్తా ఆంధ్రా తీరమంతా ఓడరేవులైపోతుంది.  
ఈ పని ఇప్పటికే మొదలయ్యింది. విశాఖరేవు విస్తరణ జరుగుతోంది. కాకినాడ రేవునుంచి ఎగుమతి దిగుమతులు పెరుగుతున్నాయి. మచిలీపట్నం రేవుని పునరుద్ధరించవలసివుంది. వోడరేవు-నిజాంపట్నం-కృష్ణపట్నం (వాన్ పిక్) రేవులకు సధలంకేటాయింపు వివాదంలో పడింది. ఇవన్నీ క్లియర్ అయితే బ్రహా్మండమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తయారౌతుంది. ఈ రేవులనుంచి ఇప్పటికే వున్న 5 వనెంబరు జాతీయరహదారికి, దానికి సమాంతరంగా వున్న రైల్వేమార్గపు స్టేషన్లకీ విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు అప్రోచ్ మార్గాలు వేసుకుంటే కోస్తాఆంధ్రతీరం ప్రపంచానికి 24 గంటల దూరానికి దగ్గరౌతుంది.
ఇదంతా విభజన సమస్యవల్ల జరుగుతున్నది కాదు చాలాకాలంగా నత్తనడక నడుస్తున్నదే. న్యూస్ టివిలు పేపర్లు ‘వాన్ పిక్’ కుంభకోణానికి మాత్రమే ప్రాధాన్యత యిచ్చాయి. ఓడరేవులకు అనుబంధ పరిశ్రమలకోసం ఏర్పాటు చేసిన సెజ్ లలో కూడా లొసుగులకు మాత్రమే ప్రాధాన్యత యిచ్చిన మీడియా అవిసజావుగా వుంటే కలిగే ప్రయోజనాలగురించి ప్రజలకు వివరించలేదు.
ఇక్కడ వలసల గురించి కూడా మాట్లాడుకోవాలి. బతకడానికో సంపాదించడానికో సాధించడానికో వలసలు పోయిన సమాజాలు చెడిపోయిన చరిత్ర ప్రపంచంలోనేలేదు. కృష్ణా గుంటూరు జిల్లాలనుంచి మొదట బళ్ళారి ప్రాంతానికీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకూ వలసలు పోయిన రైతులు అక్కడే స్ధిరపడిపోయారు. స్ధానిక సమాజాల్లో పలుకుబడి గల శక్తులుగా ఎదిగారు. వారిప్రధాన వ్యాపకం ఇప్పటికీ వ్యవసాయమే.
వ్యవసాయంలో మిగిలిన అదనపు లాభాలను వ్యవసాయేతర సంపదలుగా ఆస్ధులుగా మార్చే కొత్తరూపాంతరం ఏకకాలంలో జరిగింది. 1972 లో జైఆంధ్ర ఉద్యమం విఫలమయ్యాక ఈ టా్రన్స్ఫర్మేషన్ హైదరాబాద్ కి వలసలు వెళ్ళడం ద్వారా చాలా వేగంగా జరిగింది. పెద్దరైతులైన కృష్ణా జిల్లా కమ్మవారూ, పశ్చిమగోదావరి జిల్లా రాజులు వ్యాపారంగంలోకి, సర్వీసు రంగంలోకి, మాన్యుఫాక్చర్ రంగంలోకి 30/40 ఏళ్ళక్రితమే ప్రవేశించారు. వారిభూములు స్వస్ధలాల్లో అలాగే వున్నాయి. వీరిసంఖ్యతక్కువే అయినా సంపదలు ఆదాయాల రీత్యా వీరిప్రభావాలు చాలా ఎక్కవ. 
రాష్ట్రం విడిపోవడమే అనివార్యమైనపుడు హైదరాబాద్ లో కోస్తాజిల్లాల వారి కొత్త/అదనపు వ్యాపకాలు వుండవు. సొంతప్రాంతాల్లో నూతన రాష్ట్రం నిర్మాణం రీత్యా వీరంతా స్వస్ధలాలకు మళ్ళుతారు. కౌలుకిచ్చిన భూముల్లో భారీగా వాణిజ్య వ్యవసాయాన్ని మొదలు పెడతారు. 
FTA ద్వారా విదేశాలకు ఎగుమతులు చేస్తారు. ఈప్రభావం బక్కచిక్కిపోతున్న చిన్న మధ్య తరగతి రైతులకు కూడా ఊతమిస్తుంది. ఇందుకే కోస్తాలో వ్యవసాయం మళ్ళీ కళకళలాడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
ధాన్యం దిగుబడిలో పశ్చిమగోదావరిని  కరీంనగర్ అధిగమించింది. ఆ ‘తెలంగాణా’జిల్లా ఏసింగపూరో బియ్యం ఎగుమతి చేయాలంటే ఆంధ్రాకోస్తా లో ఏదో ఒకరేవునుంచే సరుకు ఓడెక్కించాలి
గత ఐదు వందల సంవత్సరాలుగా సాగరతీర నగరాలలోనే అభివృద్ధి,విజ్ఞానం, నాగరికతలు పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. 
అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నిటికీ సాగరతీరం ఒక సహజ వరంగా ఉంది. న్యూయార్క్, బోస్టన్, లాస్ ఏంజెల్స్, రోటెర్డామ్, లండన్, సెయింట్ పీటర్స్ బర్గ్, లిస్బన్, కైరో, ఇస్తాంబుల్, హాంకాంగ్, సింగపూర్, దుబాయి, షాంఘై, ముంబై, కోల్కతా, చెన్నై మహానగరాలే ఇందుకు నిదర్శనం. ఈ నగరాలన్నీ తమ పోషక ప్రాం తాల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. 
ఇది ఇంకా బాగా అవగతమవ్వడానికి ప్రపంచ పటంలో సాగర వాణిజ్యమార్గాలను ఒకసారి చూడు.
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందే బ్రిటిష్ వారి చొరవతో కోస్తాలో వాణిజ్య వ్యవసాయం జరిగింది. కృష్ణా, గోదావరి ఆనకట్టల నిర్మాణం తర్వాత ఆహార పంట వరి వాణిజ్యపంటగా మారింది. విజయవాడ లాంటి రైల్వే జంక్షన్ ఈ వాణిజ్య వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లింది. క్రిస్టియన్ మిషనరీల వల్ల విద్యారంగంలో కృష్ణా, గుంటూరు   ప్రగతి సాధించాయి. చదువుల్లో పురోగతి వచ్చిన అనంతరం  ఆ స్ఫూర్తితో సంఘ సంస్కరణోద్యమాలు వచ్చాయి. వ్యవసాయిక మార్పులు సరికొత్త మధ్య తరగతి ఆవిర్భావానికి దారితీశాయి. కోస్తా రేవు పట్టణాల నుంచి ఆనాడు బర్మా తదితర దేశాలకు బియ్యం ఎగుమతి అయ్యాయి. టెలిగ్రాముల సౌకర్యంతో బర్మాలో బియ్యం ధరలు ఇక్కడికి ముందుగానే తెలిసేవి.
ఏప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమౌతుంది. రాష్ట్రవిభజనతోనే ఈ కలసాకారమవ్వడం మొదలౌతుంది.
వుంటాను
పెద్దాడ నవీన్
ఇంకొక విషయం: ఏ జీవన విధానమైనా ఒక ఇల్లే కేంద్రంగా మనుగడసాగిస్తుంది. ‘నాది’ అన్నభావనే హద్దుల్ని ఏర్పరస్తుంది. ఎదుగుదలకు కొలమానాల్ని నిర్దేశిస్తుంది. మనిషికైనా సమాజానికైనా ఈ సూత్రమే వర్తిస్తుంది. జీవితమంటే డబ్బుమాత్రమే కాదు…డబ్బు కూడా…జీవితమంటే భావోద్వేగాలు మాత్రమే కాదు…భావోద్వేగాలు కూడా. నాదగ్గర డబ్బు  వుండి వుంటే నువ్వూ నీ పిల్లలూ వ్యవసాయం చేసుకోడానికి కాస్త భూమి కొనే వాణ్ణే!