మా దిగులంతా…
చదువవ్వగానే బస్సెక్కి హైదరాబాద్ చేరుకుని స్నేహితుల రూంలోనో,బంధువుల ఇంటిలోనో దిగి, మూడునాలుగు నెలలు అమీర్ పేటలో ఏదైనా టె్రయినింగ్ తీసుకుని ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకునే పిల్లల భవిష్యత్తు ఏమిటన్నదే
ఊళ్ళలో వృత్తలు పనులు లేకుండా పోయాయి. హైదరాబాద్ పరాయిఊరైపోయింది. సీమాంధ్ర లో చిన్న చిన్న హైదరాబాద్ లు మొలకెత్తి పిల్లలకు నీడనివ్వడానికి ఎంతనీరుపోసినా పదేళ్ళకు తక్కువపట్టదు. అంతవరకూ లక్షల మంది పిల్లలకు దిక్కూదివాణం వుండని పరిస్ధితి తలచుకుంటేనే ముద్దదిగడం లేదు. కునుకు పట్టడంలేదు
ఒక పాడిగేదె వుంటే చిన్న కుటుంబం బతికెయ్యవచ్చన్న భరోసాని చెరిపేసుకున్నాము. పళ్ళు యిచ్చే నాలుగు చెట్లువుంటే ఒబ్బిడిగా జీవించవచ్చన్న ధైర్యాన్ని నరికేసుకున్నాము. రెండెకరాల పొలం వుంటే రెండుతరాలు సుఖంగా జీవించవచ్చన్న ఆసరాని అమ్మేసుకున్నాము. 
వెళ్ళలేని, వెనక్కివచ్చిన పిల్లలు పిసుక్కుందామన్నా మట్టి్ట లేకుండా చేసేసుకున్నాము. 
ఇందుకు  సోనియాగాంధీగారినో కెసిఆర్ గారినో తిట్టుకోవడంలేదు. మా కష్టానికి మేము దుఃఖపడుతున్నాము అంతే. ఎవరిని, ఎన్నిశాపనార్ధాలు పెడితే మాత్రం ఈకష్టం తీరేదికాదుగదా
చేయనితప్పుకి శిక్షపడుతున్న పిల్లల కష్టం మరపురావడంలేదు. ఎటు ఒత్తిగిలిగా గుండె కలుక్కుమంటూన్నట్టుంది. ఈ బరువు ఎన్ని గుండెల్ని ఆపేస్తూందో? ఎన్ని కుటుంబాల ఉసురుపోసుకుంటుందో?