సమైక్య ఉద్యమ/పోరాట నాయకులూ!
ఇవి పదేళ్ళుగా అలజడి,పదిరోజులుగా వత్తిడి పడుతున్న నడివయసు సగటు మనిషి ప్రశ్నలు
# మీతో కలసి ఉండలేం విడిపోతాం అన్న ప్రాంతాన్ని కలసి ఉండాలని బలవంతపెట్టడం సమైక్యత అవుతుందా?
# రెండుసార్లు రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన తర్వాత, ఇప్పుడు ఇంకా ఈ రాషా్ట్రం సమైక్యంగా ఉంటుందా? అలా ఉంచడం సాధ్యమేనా?
# తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తే, ఆటువైపు ఉద్యమం మళ్లీ ఉధృతం కాదా? దాన్ని అణచివేయడం సాధ్యమేనా? తెలంగాణ ఉద్యమం మళ్లీ తలెత్తకుండా చేస్తామని చెప్పగలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా? 
# బలవంతంగా రెండు ప్రాంతాలను కలిపి ఉంచే ప్రయత్నం చేసినా ‘అపనమ్మకాల టైంబాంబ్’ మీద మనుగడ సాగిస్తున్న ఈ రాష్ట్రంలో మరో పదేళ్ల తర్వాతో, ఇరవై ఏళ్ల తర్వాతో జై తెలంగాణ అనో జై ఆంధ్ర అనో మళ్లీ ఉద్యమం లేవదన్న గ్యారెంటీ ఉందా? ఆ పూచీ ఎవరైనా ఇవ్వగలరా?  (1972 జై ఆంధ్రా ఉద్యమం కాంగ్రెస్ నాయకుల ఉద్యమ ద్రోహం వల్ల నీరుగారిపోయినపుడు ఎదురైన ఇదే ప్రశ్న నాలుగు దశాబ్దాల తరుతాత ఇపుడు చిక్కుముడి అయ్యింది)
# భౌగోళికంగా తెలంగాణలో ఉండి, ఒకటి, లేదా రెండు తెలంగాణ జిల్లాలను దాటితే తప్ప చేరుకోలేని హైదరాబాద్ ను సీమాంధ్రకు కూడా శాశ్వత ఉమ్మడి రాజధాని చేయడం సాధ్యమేనా? 
# ఒక రాష్ట్ర రాజధాని మరో రాష్ట్రంలో ఉండడం ఎలా కుదురుతుంది? కుదిరినా అది విమానాల్లో తిరిగవారికే తప్ప మామూలు ప్రజలకు అందుబాటులో ఎలా వుంటుంది 
# బలవంతపు సమైక్యతకు ఆటవిక సమాజంలోనైనా సాగుతుందా? ఇదంతా మీకు తెలియదని అనుకోవడంలేదు. (మీరు ఏమార్చడం వల్ల) ఆకస్మికంగా విరుచుకు పడిన పరిణామాల వల్ల ఆగ్రహంతో ఆవేదనతో ఆక్రోశంతో రగిలిపోతున్న మమ్మల్ని ఇపుడు కూడా మీరు ప్రచ్ఛన్నంగా ఎగదోస్తూనేవున్నారు.
దయచేసి మీరు దాచేసుకున్న ముఖాల్ని బయటికి తీయండి. ఈ విద్వేషాలను ఇకనైనా ఆపేయడానికి పూనుకోండి. ఆంధ్రాలో చదువుకుంటున్న తెలంగాణ పిల్లలుగానీ, తెలంగాణలో హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో నివసిస్తున్న సీమాంధ్రులు కానీ తీవ్ర అభద్రతా భావానికి, మానసిక వ్యథకు లోనవుతున్న సంగతిని వెంటనే గుర్తించండి
విభజన నిర్ణయం వచ్చేసింది దాన్ని ఆమోదించడమో, సవరణలు చేయడమో, ఇంకా మంచి ప్రతిపాదన చేయడమో తప్ప కాలంతీరిన సమైక్యవాదం పరిష్కారం కాదని మాలాంటి సామాన్యులకే అనిపిస్తూంది
మరి మీకేమీ అనిపించడం లేదా? 
ఇట్లు
ఓ నడివయసు సగటు మనిషి
ఇంకో సంగతి: ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ప్రత్యామ్నాయాలూ పరిష్కారాలూ కూడా మీకేతెలుసు. కాకపోతే వాటిని ఢిల్లీలో మీ పలుకుబడీ ప్రాపకాలు పెంచుకునే బేరసారాల్లో వాడుకుంటారు. మాకు ముందుగా ఒక సూచన కూడా ఇవ్వరు. ఎందుకంటే మీదృష్టిలో మేము ప్రజలము కాము. కేవలం ఓట్లమే. ఎన్నికలవేళకు మీరు ఎలాగైనా ఏమార్చుకోగల ఓటర్లమే!