సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలకు మాత్రమే న్యూస్ పేపర్ లకు సెలవులుండేవి. పాతికేళ్ళక్రితం వినాయక చవితికూడా పేపర్లకు సెలవే. ఇపుడు ఆసెలవుని పునరుద్ధరించారు. 
ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా న్యూన్ పేపర్ యాజమాన్యాలు/అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. 
న్యూస్ పేపర్ ప్రాధాన్యత తగ్గదు అయితే రూపంమారుతోంది. అమెరికా ఇంగ్లండ్ మొదలైన దేశాల్లో 150 ఏళ్ళకు పైబడిన దినపత్రికలు పేపర్ ఎడిషన్లను మూసేస్తున్నాయి. ఇంటర్ నెట్ ఎడిషన్లను విస్తరిస్తున్నాయి. 
ఈ స్ధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో న్యూస్ టివిలు ఆక్రమిస్తున్నాయి. మరే రాష్ట్రంలోనూ లేనన్ని న్యూన్ టివిలు మనకే వున్నాయి. ఇవి అస్తవ్యస్ధంగా వున్నాయి. 
ప్రతి వార్తా సమాచారమే…ప్రతీ సమాచారమూ వార్తకాదు. తెలుగు న్యూస్ టివిలు అదేపనిగా 24 గంటలూ సమాచారాన్ని ప్రసారం చేస్తూండటం ఒక విధమైన గందరగోళాన్ని రూపొందిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో అస్తవ్యస్ధత తలఎత్తుతోంది. 
దురదృష్టవశాత్తూ దినపత్రికలు వాటి నాణ్యత పెంచుకునే ప్రయత్నం చేయకుండా కధనాల్లో ఫీచరింగ్ లో టివిలతో పోటీపడే పనిలో వున్నాయి. దీనికితోడు టివిలకు, పత్రికలకు సొంత రాజకీయ ఎజెండాలు వున్నాయి. ఈ కారణాలన్నిటివల్లా పేపర్ చదువుతూంటే (టివిలో చూసి వుండటం వల్ల) ఇది మనకి ముందే తెలుసుకదా అనిపిస్తోంది. అలాగని ఒక స్పష్టతో ఒక అభిప్రాయమో రావడంలేదు.
ఒక రోజు పేపర్ రాకపోయినా వెలితి అనిపించకపోవడానికి మూలాలు ఇవే. (సొంతరాజకీయ ఎజెండాలతో పోటీపడే) న్యూస్ పేపర్ యాజమాన్యాల ఐక్యత ఇంకా వర్ధిల్లి ప్రతీ ఆదివారం పేపర్లకు సెలవు యివ్వాలని, ఆబాటలోనే న్యూస్ టివిలు ఆదివారం సెలవు  ఇవ్వాలనీ కోరుకుంటున్నాను.
వారానికి ఒకరోజైనా ప్రశాంతంగా వుండటం ఎవరికైనా ఆరోగ్యమే కదా!