(సాంఘిక నాయకత్వం లేకపోవడం దేశమంతటా వుంది ఈ పరిస్ధితికూడా సీమాంధ్ర లో నాయకత్వ శూన్యతకు ఒక మూలం)
1972 లో ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో  కొస్తాఆంధ్రాలో అన్ని రాజకీయపార్టీలూ ఒక్కటై రాషా్ట్రన్ని విభజించాలని పోరాడాయి. అప్పట్లో 
రాజకీయ నాయకులకు వారిపార్టీతో సమాంతరంగా సొంత గుర్తింపు వుండేది.అంతకుముందే వారు స్వాతంత్యోద్యమంలో పాల్గొని వుండటం ఆ గుర్తింపునకు ఒకకారణమైవుండొచ్చు  
తెన్నేటి విశ్వనాధం గౌతులచ్చన్న జూపూడి యజ్ఞనారాయణ మొదలైన వారు ఇందుకు ఉదాహరణలు
ఇపుడు సీమాంధ్ర ఉద్యమంలో రాషా్ట్రన్ని విడగొట్టకూడదన్న అలజడి ప్రజల్లో మొదలైంది.రాజకీయపార్టీలకు ప్రజలను అనుసరించక తప్పని పరిస్ధితి ఏర్పడింది. వచ్చే ఎన్నికలే ముఖ్యమనుకుంటున్న రాజకీయపార్టీలు ఐక్యంగా ఉద్యమించే అవకాశంలేదు. 
విడిపోవడానికి పోరాటాలు వుంటాయి. విడగొట్టవద్దనే డిమాండ్లు వుండొచ్చు. సమైక్యత కోసం ఉద్యమాలూ పోరాటాలు వుండవు.
ప్రజలతో ప్రత్యక్ష సంబంధం వుండే పాలనా వ్యవహారాలు కోర్టులావాదేవీలు మొదలైనవి ప్రజల భాషలో వుంచడానికే భాషా ప్రయుక్త రాషా్ట్రలు ఏర్పాటు అవసరంకాగా తెలుగు మాట్లాడే వారితో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో వుండటం తెలంగాణాకు మొదటినుంచీ ఇష్టంలేదు. 
భాషఒకటే అయినా మాండలికాలు వేరు. అంతకుమించి చరిత్ర సంస్కృతుల్లో తెలంగాణాకు,రాయలసీమకు, కోస్తా ఆంధ్రకు ప్రత్యేకతలు సొంత అస్ధిత్వాలు వున్నాయి. తెలంగాణా భాషా సంస్కృతులమీద ముస్లింల ప్రభావంవుంటే సీమాంధ్రపై ఆంగ్లేయుల ప్రభావం వుంది. ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినపుడు అందులో తెలంగాణా కలవడానికి ఇష్టపడలేదు. ఆందుకు చారిత్రక సాంసృ్కతిక అంశాలే ఒక కారణం కావచ్చు. అప్పటి తెలంగాణా విముఖతను ఫజుల్ ఆలీ కమీషన్ కూడా నివేదికలో ధృవీకరించింది. 
1972 వేర్పాటు ఉద్యమం విఫలమయ్యాక సీమాంధ్ర ప్రాంతాలనుంచి హైదరాబాద్ కు వలసలు ప్రారంభించింది మొదట రిటైర్డ్ అధికారులు, అధికారులు, సంపన్నులు…ఇందుకు ప్రధాన కారణం చెమట పట్టని హైదరాబాద్ వాతావరణమే. ఆనగరం చుట్టూ రికార్డులు సవ్యంగా లేని లక్షల ఎకరాల భూమి వుండటం హైదరాబాద్ “ఆకర్షణ”కు ఆర్ధిక కారణం. అలా పెరగడం మొదలైన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కే ఏకైక ఉపాధి నగరమన్నంతగా ఎదిగింది. వ్యవసాయరంగం నుంచి ఆదాయాలు కుంచించుకు పోతూండటంవల్ల సీమాంధ్రలో మధ్యతరగతి వారి పిల్లలకు ఏదో ఒక పని ఇచ్చే నగరంగా హైదరాబాద్ స్ధిరపడింది. 
మొదటినుంచీ ఆంధ్రప్రదేశ్ లో వుండటానికి ఇష్టంలేని తెలంగాణా సెంటిమెంటు కాంగ్రెస్ రాజకీయాలకే ఉపయోగపడింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి, పివినరసింహారావుని ముఖ్యమంత్రి పదవినుంచి దించడానికి, వైఎస్ రాజశేఖరరెడ్డి హైకమాండ్ ను హెచ్చరించడానికీ మాత్రమే పనికొచ్చిన తెలంగాణా సెంటిమెంటుకి మూలాలు వెతికి కెసిఆర్ ప్రాణం పోశారు. 
ఆయనకు మంత్రిపదవి ఇచ్చివుంటే ఇదంతా జరిగేదికాదని చంద్రబాబుతోసహా పలువురు రాజకీయవేత్తలు సమాచారసాధనాలు విశ్లేషించడం హ్రస్వదృష్టేనని నా అభిప్రాయం. ఈ సమస్య భాష సంస్కృతులతో ముడిపడివుందని గుర్తించకుండా రాజకీయమే సర్వరోగనివారిణి అనే హ్రస్వదృష్టే అంతటా వ్యాపించివుంది.
భాషా సంసృ్కతులే భావసమైక్యతకు చోదకశక్తులని గుర్తించిన కెసిఆర్ ప్రతిసందర్భంలోనూ వాటిని టచ్ చేస్తూనే వచ్చారు. ఆయన కుమార్తె కవిత జాగృతి సంస్ధద్వారా అదే పనిమీదున్నారు. దశాబ్దంగా సాగుతున్న  తెలంగాణా సంసృ్కతి ప్రస్తావనే మొదట ప్రవాస తెలంగాణావారిలో తరువాత తెలంగాణా గ్రామీణుల్లో – కవులు కళాకారులు సాహితీవేత్తల్లో భావసమైక్యతను తెచ్చింది. ఒక ఉద్వేగమై నిలచింది.
సీమాంధ్రవైపు చూస్తే రాజకీయ నాయకత్వం మొహం చాటుచేసుకుని వుంది. సాంఘిక నాయకత్వం లేకుండా పోయింది. భాషా సంసృ్కతుల ప్రస్తావనే ఎక్కడా లేదు. ప్రజలు తమకు తామే నాయకత్వం వహించుకుని ఎక్కడికక్కడ జరుపుతున్న ఆందోళనల్లో కళా రూపాలను ప్రదర్శిస్తున్నారు. కవిసమ్మేళనాలు జరుపుకుంటున్నారు. ఇదంతా ఇంకా భావసమైక్యతగా రూపుదిద్దుకోలేదు. 
సీమాంధ్రుల్లో తమ డిమాండు పట్ల ఇంకా స్పష్టత రాలేదు. “హైదరాబాద్ నుంచి / తెలంగాణా నుంచి వెళ్ళేదిలేదు” , “హైదరాబాద్ మాదే” లాంటి డిమాండ్లు సహేతుకమైనవి. అంతేతప్ప “జై సమైక్యాంధ్ర” లాంటి మనసులో లేని నినాదాలు చికాకు పెడుతున్నాయి.  వాళ్ళ వాదాన్ని వినిపించుకునే ఓపికే లేకుండా సమైక్యత జిందాబాద్ అనడం మూర్ఖత్వమే అవుతుంది. 
అయితే సీమాంధ్రలో ప్రజల ఆందోళన / ఉద్యమం పూర్తిగా స్వచ్చందం. హృదయపూర్వకం. దీన్ని సమన్వయం చేసి నడిపించడానికి నాయకత్వం లేకపోవడం దురదృష్టకరం. ముందుగా డిమాండులో స్పష్టత రావాలి. ఆతర్వాతే ఆందోళన ఉద్యమమౌతుంది పోరాటమౌతుంది ఆదశలో నాయకత్వ శూన్యత వుండదు. ఉండవిల్లి అరుణ్ కుమార్ లాంటివాళ్ళు ఎవరో ఒకరు ఆ శూన్యతని భర్తీ చేస్తారు.