Search

Full Story

All that around you

Month

October 2013

తీరాన్ని కూల్చిన కెరటం (1996 చీకటి జ్ఞాపకం)


కాపాడుకోలేనితనం నుంచి వచ్చే అసహాయత ఎంత భయంగా వుంటుందో, నాయకుడి ఆర్తి-ఆసహాయులకు ఎంత ధైర్యంగా వుంటుందో 1996 తుపానులో చూశాను. అనుభూతి చెందాను. ఆజ్ఞాపకాలు మూటగట్టి వుంచినట్టు ఇంకా భారంగా మెదులుతూనే వున్నాయి. 
1000 మంది చనిపోయి మరో 1000 మంది గల్లంతైన ఆబీభత్సం లో తీరమంతటా ఉబ్బిపోయి పడున్న మనుషుల శవాలు, వాటిని రాబందులు కుక్కలు పీక్కునితినడం ఇంకా కనిపిస్తున్నట్టే వుంది.
నాకుటుంబం మరో మిత్రుడి కుటుంబం పదకొండు రోజుల దక్షిణ కర్నాటక టూర్ ముగించుకుని తిరుపతినుంచి బస్సులో బయలుదేరి జడివానల వల్ల 12 గంటలు ఆలస్యంగా 1996 నవంబరు 6 రాత్రి ఏడు గంటలకు రాజమండ్రిలో ఇల్లు చేరుకున్నాము. మనుషులు తడిసి మూటలుగా మారిపోయినా ‘చచ్చినట్టు’ వొండుకోవలసిన (కర్రీపాయింట్లు లేని)కాలమది. అలా కాస్తతినేసి ఒళ్ళ తెలియకుండా నిద్రపోయాము. తెల్లారి చూసేసరికి ఇంటి ఎదురుగా చెట్టు కూలిపోయివుంది. కరెంటు వైర్లు తెగిపోయాయి. స్తంభాలు వంగిపోయాయి. జనం రోడ్లమీదే వున్నారు. వీధిలోకి వచ్చి చూస్తే చెట్లన్నీ విరిగి పడి వున్నాయి. సముద్రతీరానికి 85 కిలోమీటర్లదూరంలో వున్న దానవాయిపేటంతా….రాజమండ్రంతా ఇదే సన్నివేశం. 1990 తుపాను బీభత్సాన్ని కృష్ణాజిల్లాలో కవర్ చేసిన జర్నలిస్టుని అయివుండటం మూలాన ఎంతనష్టమో అని దిగులేసింది. 
తూర్పుగోదావరి జిల్లావాసులకి రెండు రోజులవరకూ ఇది అద్భుతం 40/50 ఏళ్ళవయసున్న చెట్లు కూలిపోవడమంటే గాలితీవ్రత ఎంతుంటుందన్నదే అప్పటి ప్రశ్న. తీరగ్రామాల కష్టాలు నష్టాలూ ఒకొక్కటీ బయటపడుతూంటే జనం గుండెలు చెరువైపోయిన అనుభవాలు వందలు వేలే…
అపుడు నేను ఈనాడు రాజమండ్రి ఎడిషన్ చీఫ్ రిపోర్టర్ని. ఉభయగోదావరిజిల్లాలో దాదాపు 120 మంది విలేకరుల బృందాన్ని సమన్వయం చేయడం ప్రత్యేక వార్తాకధనాలకు అసైన్ మెంట్లు ఇవ్వడం నా బాధ్యతల్లో ముఖ్యమైనది.
కరెంటుపోయింది. ఫోన్లు పనిచేయవు. బయటిప్రపంచంతో సంబంధాలు లేవు. ఒకొక్క వివరమూ తెలిసే కొద్దీ భయంతో ఆశ్చర్యంతో నోటమాట వచ్చేదికాదు. సముద్రతీర ప్రాంతం నుంచీ 80 కిలోమీటర్ల వరకూ తుపాను ప్రభావం కనిపించింది. రోడ్లన్నీ కూకటి వేళ్ళతో పెకలించబడిన మహావృక్షాలతో నిండిపోయాయి. వాటిని ముక్కలు చేసి పక్కకి ఈడ్చి రోడ్లను క్లియర్ చేయడానికి 4/5 రోజులు పట్టింది. ఎక్కడికక్కడ ప్రజలే ఈ పని చేసుకున్నారు. రవాణాకు దారులు ఏర్పడ్డాకే అధికారుల వాహనాలు లోపలికి వెళ్ళి నష్టాలలెక్కలు రాసుకోవడం బియ్యం కిరోసిన్ మొదలైనవి పంపిణి చేశారు. 
కాటే్రనికోన మండలం లో భారీ నష్టం జరిగింది సముద్రానికీ ఉప్పుటేర్లకూ మధ్య దీవిలా వుండే మగసానితిప్ప, నడుస్తూంటే సరుగుడుతోటలు మధ్య ఇసుకలో కాళ్ళూ కూరుకుపోతున్నట్టుండే బ్రహ్మదేవుడి గుడివున్న బ్రహ్మసమేధ్యం (నోరుతిరగక ఈ ఊరిని బ్రహ్మ సముద్రం అంటారు) బలుసువానితిప్ప, లక్షీ్మపాలెం ….ఇంకా చాలా ఊళ్ళు పేర్లు గుర్తుచేసుకోడానికి రాత్రినుంచీ పెనుగులాడుతున్నాను వల్లకావడంలేదు
ఆనాలుగైదు రోజులూ తీరగ్రామాల పరిస్దితి నరకం పశువులు మనుషుల శవాలు భరించలేని వాసనతో తేలుతుండగా బతికున్న మనుషులు ఆపక్కనే మెరక నేల మీద బిక్కుబిక్కుమంటూ గంటల్ని యుగాలుగా గడిపారు. హెలికాప్టర్లు జారవిడిచిన పేకెట్లు శవాల గుట్టల్లో, మలమూత్రాల మధ్య పడిపోయినపుడు కడుపుకాలి నకనకలాడిపోయారు. 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడితో హెలికాప్టర్ లో నేను ఫొటోగ్రాఫర్ 5 రోజులు ఈ ప్రాంతాలకు వెళ్ళాము. కాటే్రనికోన మండలంలో ఒక గ్రామం వద్ద ఈ పరిస్ధితి చూసి నాకు దుఃఖం ఆగలేదు. చంద్రబాబు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. కనకం అనే ఆవిడ నా తలమీద చెయ్యివేసి చంద్రబాబు చేయి పట్టుకుని ఓదార్చింది. గంగతల్లికి కోపమొచ్చంది మనమేమి చేస్తం అని ధైర్యం చెప్పింది
బ్రహ్మ సముద్రం దగ్గర తీరం వెంబడి 4 కిలోమీటర్లపొడవునా ఆరవై ఎనిమిది శవాలని నేనూ మరో విలేకరీ చూశాము. మేమే ఫొటోలు తీశాము. 
కోరంగిదగ్గర మడ (బురద లో చిన్నచిన్న మానులతో మెత్తటి కలప గల చెట్లు,  పొదలు వుండే సముద్రపు) అడవులలోకి బోటు ఏర్పాటు చేసుకుని వెళ్ళాము. పోగులు పడి కుళ్ళిపోతున్న మనుషులు పశువుల శవాలు 
వాసనా వాతావరణాల్ని భరించలేక బయటపడుదామంటే అది వేగంగా పరిగెట్టలేని నాటు పడవ. దీనికి తోడు దారితప్పి గంటన్నర పాటు అక్కడక్కడే తిరుగుతూ వుండిపోయాము.
విషయాల సేకరణ, ఒకఎత్తయితే వార్తలన్నీ చీకటి పడముందే ఈనాడుకి చెర్చడం పెద్ద ప్రయాన అయ్యేది. ఇందుకు ఆయాకేంద్రాలనుంచి విలేకరులు పడిన శ్రమ అంతా యింతా కాదు సైకిళ్ళమీదా నడిచీ కూడా ప్రయాణాలు చేసిన సందర్భాలు వున్నాయి. నేను ఒక రోజు 13 కిమీ మరో రోజు 17 కిమీ నడిచాను రోడ్డుకి అడ్డంగా పడివున్న చెట్లను ఎక్కి, దిగి దాటుకుంటూ…
తూర్పుగోదావరి జిల్లాలో
అప్పటి గాలి వేగం 150 నుంచి 300 కీమీ , వర్షం  30 సెంమీ , మృతులు 978 , గల్లంతయిన వారు 1300 మందికి పైగా …., తీరంలో మండలాలు 13 గ్రామాలు గ్రామాలు 78
ప్రభావం తీరం నుంచి 100 కిమీ …నష్టాలు తీరంలో సర్వనాశనం 
తీరం నుంచి దూరమయ్యేకొద్దీ చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోవడం మొత్తం మీద పూర్తిగానో పాక్షికంగానో మూడున్నర లక్షల ఇళ్ళు ధ్వంసం ……తీరంనుంచి ఇరవై కిలోమీటర్ల వరకూ పొలాల్లో కి ఉప్పునీటి కయ్యల ద్వారా సముద్రం చొరబడి మూడేళ్ళు పంటలేలేకుండా పోయాయి.
కరెంటు స్ధంబాలను నిలబెట్టి వారానికో నెలకో రెండు నెలలకో కరెంటు ఇచ్చారు గాని మొక్కలను నాటించలేదు 1996 తుపాను విద్వంసం తరువాత ఈ జిల్లా మైదాన ప్రాంతాల్లో చెట్లు లేకుండా పోవడం పెద్ద నష్టం
తక్షణ పునరావాసం మొదలవ్వడానికే వారం రోజులు పట్టింది. నష్టాల నమోదు పూర్తవ్వకడానికి నెల పట్టింది. 
ఆర్ధిక సహాయాలకోసం ఎక్కడికక్కడ రాజకీయనాయకులు నష్టాలను ఎక్కువగా చూపించి నమోదు చేయించారు. విరుచుకు పడిన బీభత్సం ముందు ఎంత డబ్బిస్తే మాత్రం జీవితాలు కుదుట పడతాయి అనిపించి నష్టాల నమోదులో అతిశయోక్తుల గురించి నాకు తెలిసిన సంఘటనలని కూడా వార్తగా యివ్వలేదు. సహచర రిపోర్టర్లు యిచ్చిన వాటిని వద్దనలేదు.
ఆరునెలల తరువాత శాశ్వత పునరావాస నిర్మాణాలు మొదలయ్యాయి. 
ఇంత పెనుతుపాను వచ్చిన నెలలోనే మరో 20 రోజుల తరువాత నవంబరు 26 న మరో తుపాను హెచ్చరిక వచ్చింది. తీరంలో వున్నవారికి ఓపిక లేకపోవడం వల్ల నిండా మునిగిపోయి వున్నందువల్లా ఈ హెచ్చరిక భయపెట్టలేకపోయింది.తీరానికి దూరంగా వున్న వారిని గజగజా వణికించింది. అది 11 రోజులపాటు సముద్రంలోనే నింపాదిగా కదలుతూ డిసెంబరు 6 న మద్రాస్ దగ్గర తీరం దాటింది. ఇంత సుదీర్ఘ కాలం సముద్రంలో సంచరించిన తుఫాన్ బంగాళా ఖాతంలో ఇంకొకటి లేదు. 
అప్పటికే విశాఖ వాతావరణ కేంద్రంలో రామకృష్ణ అనే అధికారి పరిచయ మయ్యారు. రోజూ ఫోన్ చేస్తే వివరాలు చెప్పేవారు. మీ వైజాగ్ రిపోర్టర్ ఒకటి చెబితే ఇంకోటి రాస్తున్నారు మీరు కరెక్టు గా ఫాలో అవుతున్నారని మీ ప్రశ్నల్ని బట్టి తెలుస్తుది. రోజూ మీరే ఫోన్ చేయండి మీరే రాయండి అని సూచించారు. నా గుండెల్లో రాయిపడింది. అనుకున్నట్టే ఆరిపోర్టర్ తన రాజ్యంలోకి నేను ఎంటరయిపోయాని ఫిర్యాదు చేశారు. మేనేజర్లు ఎంటరయ్యాక సీన్ మారిపోతుంది. (యూజువల్ గా) వాళ్ళు సూదుల్ని మొయ్యడానికి దూలాలు వెతుక్కుంటారు. ఆదూలాలకు సూదుల్ని గుచ్చి వాటిని విజయవంతంగా మోసేస్తారు. ఈ విషయంలోనూ అదే జరిగింది. 
డెస్క్ లో మిత్రులకు తుపాను గురించి నాకు తెలిసిన సమాచారం వివరిస్తున్నపుడు ఉపద్రష్ట కామేశ్వరరావు విశేష ఆసక్తి కనబరచారు. ఒక వ్యాసం రాయమని నాకు సూచించారు. ఆయన దగ్గర వున్న విషయం చూసి మీరే రాయండి అని చిన్న వత్తిడి పెట్టాను. బాగారాశారు.అది ఆయన పేరుతో ఎడిట్ పేజీలో అచ్చయింది. అప్పట్లో ఈనాడు ఇన్ సైడర్ల వ్యాసాలు ప్రచురించేవారు కాదు.
ఈ సైక్లోన్ కవరేజి ఈనాడుకి విశేషమైన గుర్తింపు తెచ్చిన సంఘటనల్లో ముఖ్యమైంది. నాకు కూడా పేరు తెచ్చింది. ఈనాడులోపలా బయటా జర్నలిస్టులు ” నవీన్ కేంటి చెప్పుకోడానికి 96 సైక్లోన్ కవరేజివుంది, పాశర్లపూడి బ్లోఅవుటుంది” అనేవారు
అప్పుడు డెస్క్ లో పిఎస్ఆర్, మల్లిఖార్జునరావు, శర్మ, సారధి, కామేశ్వరరావు, సుబ్రమణ్యం వుండేవారు
విలేకరుల కష్టాల్ని చెప్పడానికి ఇదంతా రాయడం లేదు. కేవలం మానవ ప్రయత్నం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేని 1996 నాటి పరిస్ధితులను వివరించడానికే ఇదంతా. 
ఈ 17 ఏళ్ళలో చాలా మార్పులు వచ్చాయి. కమ్యూనికేషన్లు అద్భుతంగా వికసించాయి. ఇందువల్ల భారీ ప్రాణనష్టం వుండదు. ప్రొక్రయిన్లు ఎర్్తమూవర్లు ఇపుడు అందుబాటులో వున్నాయి. పెనుగాలికి కూలిపోయే చెట్లనయినా, ఇళ్ళనయినా మరే అవరోధాలనైనా నిమిషాల్లో ఎత్తి పక్కన పెట్టే సాధనా సంపత్తులు ఇపుడున్నాయి. అవసరమైతే అధికారులు వీటిని ఎంత సమర్ధంగా వినియోగించుకోగలరన్నదే ప్రశ్న.
రెండు రోజులనుంచీ తీర ప్రాంతాల్లోని జర్నలిస్టు మిత్రులతో ఫోన్ లో మాట్టాడుతున్నాను. 96 తుపాను తరువాత తీరగ్రామాల వారు వలసలుపోవడం పెరిగిందని మత్య్సకారవృత్తిలోకి పిల్లలు రాకపోవడమే ఇందుకు మూలమని మిత్రులు విశ్లేషిస్తున్నారు. దేశమంతటా సాంప్రదాయిక వృత్తులు అంతరించిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పల్లెలు హైదరాబాద్ కు వలసపోతున్నాయి.(సీమాంధ్రలో ప్రస్తుత ఆందోళనకు మూలం ఇదే) 
ఇల్లుకూలి,కోడీ మేకా గేదే పోయి, పడవ చితికి, వలచిరిగి, కౌలుభూమి కుళ్ళినపుడు కేవలం రెక్కల కష్టం మీదే బతికే మనిషే తొందరగా తేరుకున్నాడు. తుపాను షెల్టర్లలో సర్కారు ఆహారంకొసం పడిగాపులు పడకుండా ఇంకో పనిచేస్తే జీవితమిచ్చే పట్టణానికి బతుకుదారి పట్టాడు. 1990, 1996 తుపానులను, అనంతర తాత్కాలిక శాశ్వత పునరావాసాలను గమనించాక ఇది నాకు అర్ధమైంది. 
ప్రతీ తుపానూ తీరప్రాతాల్లో చాలా కుటుంబాల లక్ష్యాల్నీ గమ్యాల్నీ మార్చేస్తుందని నాకు అర్ధమైంది 
ఏమైనా భయం అన్ని వేళలా గొంతుచించుకోదు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరినట్టు గుండెల్లో గూడుకట్టుకుని వుంటుంది. ముసురు పట్టినట్టు గుబులు గుబులుగా వుంటుంది. తుపాను అనగానే దిగులు భయపెడుతోంది. నురగలై కవ్వించి పాదాల కింద కితకితలు పెట్టే సముద్ర కెరటం వెయ్యికోరలతో విరుచుకు పడి మనుషుల్ని సమూహాలుగా మింగేసే సన్నివేశపు జ్ఞాపకమే వెన్నులో చలిపుట్టించేలా భయపెడుతూంది. 
ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోయే విపత్తు  ఒంటరితనాన్నే కాదు జన సమ్మర్ధాన్ని కూడా భయపెడుతూంది.
 

కొత్త వస్తువుల పరిచయం!


ఉన్న కాసిని డబ్బుల్నీ వీలైనన్ని ఎక్కువసార్లు ఖర్చు పెట్టడం నాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఘనమైన సరదా 
ఈ సరదా రూపం షాపింగ్. నా భార్యని షాపింగ్ కి తీసుకు వెళ్ళి, కూడా తిరుగుతూ చివర్లో బిల్లుకట్టడం మాత్రమే ఈ మధ్యవరకూ నేను ఇన్వాల్వ్ అయిన షాపింగ్. 
ఈ మధ్యే నాకు కూడా షాపింగ్ / విండో షాపింగ్ వ్యసనం అంటుకుంది. ఇబే ఇండియా, ఫ్లిప్ కార్ట్, రీడిఫ్ షాపింగ్- వగైరా ఆన్ లైన్ షాపుల్లో గంటల తరబడి తిరగడం అలవాటైంది. ప్రతీ కేటగిరీలో వస్తువుల్ని చూస్తూ డిసి్ర్కప్షన్స్ చదువుతూంటే చిన్న చిన్న ఐడియాలు, టెక్నాలజీలు ఎంత సౌకర్యాన్ని యిస్తున్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది
వారం రోజులకు సరిపడా మాత్రలు దాచుకోడానికి 2/3/4 అరలు ఉన్న టాబ్లెట్ డిస్పెన్సర్ బాక్సులు గిఫ్టుగా ఇవ్వడానికి తెప్పంచాను. బిపి షుగర్ వగైరా సమస్యలకు రోజూ మందులు మింగే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఒకోరోజు మాత్రలు మరచిపోవడం మామూలే. ఈ బాక్సు రిమైండర్ గా కూడా పనిచేస్తుంది. మామూలు మార్కెట్ లో కనిపించని ఇలాంటి చిన్న వస్తువులు ఎన్నెన్నో ఆన్ లైన్ విండో షాపింగ్ లో చూస్తున్నాను. 
మీరూ చూడండి కొత్త కొత్త వస్తువులు పరిచయమౌతాయి!

గడువు ఆరు వారాలే! సీమాంధ్రులూ హుషార్!!


ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచిస్తున్నారా అని ఒక సమైక్యాంధ్ర జెఎసి (రాజమండ్రిలో నే 16 జెఎసిలు ఉన్నాయి) నాయకుడిని 20 రోజుల క్రితం అడిగినపుడు ఆయన నన్ను ఉద్యమ ద్రోహి అన్నంత కోపంగా చూశారు. 
ఇపుడా పరిస్ధితిలేదు. నాయకుల్లో నీరసపు నవ్వులు నిస్సహాయమైన ఆక్రోశాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రవిభజన జరిగే అవకాశమే లేదు అన్న నమ్మకం ఉద్యమకారులను ‘ఒక వేళ విడిపోతే’ అనే ఆలోచనే రానివ్వకుండా చేసింది. ఈ నమ్మకం 65 రోజుల అమూల్యమైన సమయాన్ని వృధాచేసేసింది. కార్యకర్తలు మాత్రం పేలవమైన ఉద్యమాన్ని కొనసాగిస్తూనే వున్నారు.
రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ నిర్ణయంతో మొదలైన ఆందోళన కేబినెట్ ఆమోదంతో ఏంచేయాలో దిక్కుతోచని స్ధితిలో పడిపోయింది. ఇప్పటికైనా ఆలోచనలు సమీక్షలు మొదలవ్వటంలేదు. ఒకవేళ రాష్ట్రవిభజన నిర్ణయం రద్దయిపోయిందే అనుకుందాం. అపుడు తెలంగాణా ప్రజల పరిస్ధితి ఏమిటి ? సీమాంధ్రులకే తప్ప తెలంగాణా ప్రజలకు మనోభావాలు వుండవా? 
కలసివుండలేము అని ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంలోనే మొదలైన తెలంగాణా వాదనను గాని పదేళ్ళుగా సాగుతున్న ఉద్యమాన్నీ ఆత్మబలిదానాలనూ పట్టించుకోకుండా విభజన నిర్ణయం వెలువడగానే ఆకస్మికంగా నిద్రలేచి “సమైక్యాంధ్ర” నినాదాన్ని డిమాండుని అందుకోవడంలో అసంబద్ధత గురించి ఇకనైనా ఆలోచించాలి. 
నిజమే! విభజన వల్ల కొన్ని నష్టాలు అనివార్యమే! మైండ్ సెట్ మార్చుకుని చూసినపుడు పరిస్ధితులు మరోలా కనబడుతాయి. రాష్ట్రం విడిపోతే నీళ్ళులేక సీమాంధ్ర ఎడారైపోతుంది అన్న వాదనలో కాస్త అతిశయోక్తులు వున్నాయి. నదీజలాలను ఎలా పంచుకోవాలో విధివిధానాలు ఇప్పటికే వున్నాయి. అవి కట్టుదిట్టంగా అమలుకాకపోతే దానికి పరిష్కారాలు వెతకాలి రెగ్యులేటరీ వ్యవస్ధను ఏర్పాటు చేయించుకోవాలి కర్నాటక మహారాష్ట్ర లనుంచి కృష్ణా గోదావరి జలాల సమస్య ను పరిష్కరించాలని ఇపుడు ఆంధ్రప్రదేశ్ మాత్రమే వత్తిడి చేస్తోంది. భవిష్యత్తులో తెలంగాణా, సీమాంధ్రప్రదేశ్ లు వత్తిడి చేస్తే పరిష్కారం వేగవంతం కాదా?
హైదరాబాద్ కట్టుకోవడం వల్లకాదన్నది మరోవాదన. 
రాజధాని అంటే హైదరాబాద్ లాగే వుండాలన్న చట్టం లేదుకదా? చెమటపట్టని ఊరు అయివుండటం,  చుట్టుపక్కల అపారమైన భూముల లభ్యతా, హైదరాబాద్ అంతగా విస్తరించింది. 
కోస్తాజిల్లాల్లో అంత భూమి అందుబాటులో లేదు. ఈ అంశాన్ని , అన్నీ హైదరాబాద్ లోనే కేంద్రీకరించిన ప్రస్తుత అనర్దాన్నీ కూడా దృష్టిలో వుంచుకుని కొత్త రాష్ట్రంలో వికెంద్రీకరణ ను అమలు చేయవచ్చు ఒకో నగరంలో కొన్ని కొన్ని అంశాల కార్య స్ధావరాలను ప్రోత్సహించవచ్చు. పాలనాంశాలు రాజధానిలో వుంచి విద్య వైద్యం పరిశ్రమలు మొదలైన రంగాలను వేర్వేరు ప్రాంతాల్లో పెంపొందించ వచ్చు. ఇందువల్ల అమెరికా మాదిరిగా రాజధానితో పాటు అనేక నగరాలు పెరుగుతాయి ఉపాధి అవకాశాలను ఇస్తాయి.
నిర్మాణాల వ్యవధి ఒకప్పుడు సంవత్సరాలైతే ఇపుడు వాలాలకు తగ్గించిన టెక్నాలజీలు వచ్చాయి. సాక్షి ఆఫీసుల మాదిరిగా నాలుగురోజుల్లో నిర్మించుకోగల ప్రీ ఫాబ్రికేటెడ్ ఆఫీసులు కుడా వున్నాయి. ఇవి 30 ఏళ్ళు మనగలుగుతాయి
భవిష్యత్తు ఇలాగే వుండాలని నా ఉద్దేశ్యం కాదు.ఇలాగ కూడా ఆలోచించవచ్చని చెప్పడమే నా ఉద్దేశ్యం. నిపుణులతో మాట్లాడితే ప్రజోపయోగమైన ఎన్నో అర్భుతమైన టెక్నాలజీలను వివరించగలుగుతారు. 
పిడివాదాలు ఒదులుకుని ఓపెన్ గా ఆలోచిస్తే చాలా పరిష్కారాలు వుంటాయి. దీనికి మించి సీమాంధ్రకు ఏంకావాలో ఇప్పటికైనా స్పష్టతకు రావాలి. వ్యవధి ముంచుకొస్తున్న స్ధితిలో స్పష్టత లేకపోవడమంటే మన భవిష్యత్తుని మనమే నాశనం చేసుకోవడం
విభజన విధివిధానాలు వాటాలు పంపకాలు ఖరాలు చేయడానికి 10 మంది కేంద్రమంత్రులతో కమిటీ ఏర్పడింది. 6 వారాల్లో కమిటీ  నివేదిక కేంద్ర ప్రభుత్వం కాలవ్వవధిని నిర్ణయించింది. ఇ ఈ కమిటీ ముందు సీమాంధ్రకు వనరులు ఆదాయాలు ఆస్ధుల పంపిణీలపై ప్రతిపాదనలు వత్తిళ్ళు చేయాలి. గడువు ఆరువారాలే ఈ లోగానే సీమాంధ్ర ప్రతిపాదనలు కమిటీ ముందుకి వెళ్ళకపోతే నిర్ణయాలు ఏకపక్షమైపోతాయి. మనకేమి కావాలో మనం ఆలోచించకమందే ఎవరో తమకు తోచినవి మనకి మంజూరు చేసే పరిస్ధితిని మనం తట్టుకోలేము. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. 
ఎలాగైనా విభజన నిర్ణయాన్ని రద్దు చేయిస్తామని నమ్మే , జనాన్ని నమ్మించే నాయకులు ఇప్పటికే 3రోజులు పూర్తయిన కమిటీ 6 వారాల గడువు పొడిగింపజేయడం మీదే ప్రయత్నాలు తక్షణం మొదలు పెట్టాలి. ఈ ఉపకారమైనా చేస్తే కాంగ్రెస్ నాయకులకు సీమాంధ్ర ప్రజలు కొన్ని తరాల పాటు రుణపడిపోయి వుంటారు 
సీమాంధ్ర ప్రజల ఉద్యమాన్ని ఎక్కడికక్కడ సమన్వయం చేస్తున్న జెఎసిలు వెంటనే సమావేశమై ఉద్యమ డిమాండు ను ‘సమైక్యాంధ్ర’ గానే వుంచాలా ‘సీమాంధ్ర ప్రదేశ్ హక్కులు వాటాల సాధన’ గా మార్చాలా అని నిర్ణయించుకోవాలి! 
పెద్దాడ నవీన్
రాజమండ్రి

Blog at WordPress.com.

Up ↑