గడువు ఆరు వారాలే! సీమాంధ్రులూ హుషార్!!


ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచిస్తున్నారా అని ఒక సమైక్యాంధ్ర జెఎసి (రాజమండ్రిలో నే 16 జెఎసిలు ఉన్నాయి) నాయకుడిని 20 రోజుల క్రితం అడిగినపుడు ఆయన నన్ను ఉద్యమ ద్రోహి అన్నంత కోపంగా చూశారు. 
ఇపుడా పరిస్ధితిలేదు. నాయకుల్లో నీరసపు నవ్వులు నిస్సహాయమైన ఆక్రోశాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రవిభజన జరిగే అవకాశమే లేదు అన్న నమ్మకం ఉద్యమకారులను ‘ఒక వేళ విడిపోతే’ అనే ఆలోచనే రానివ్వకుండా చేసింది. ఈ నమ్మకం 65 రోజుల అమూల్యమైన సమయాన్ని వృధాచేసేసింది. కార్యకర్తలు మాత్రం పేలవమైన ఉద్యమాన్ని కొనసాగిస్తూనే వున్నారు.
రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ నిర్ణయంతో మొదలైన ఆందోళన కేబినెట్ ఆమోదంతో ఏంచేయాలో దిక్కుతోచని స్ధితిలో పడిపోయింది. ఇప్పటికైనా ఆలోచనలు సమీక్షలు మొదలవ్వటంలేదు. ఒకవేళ రాష్ట్రవిభజన నిర్ణయం రద్దయిపోయిందే అనుకుందాం. అపుడు తెలంగాణా ప్రజల పరిస్ధితి ఏమిటి ? సీమాంధ్రులకే తప్ప తెలంగాణా ప్రజలకు మనోభావాలు వుండవా? 
కలసివుండలేము అని ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంలోనే మొదలైన తెలంగాణా వాదనను గాని పదేళ్ళుగా సాగుతున్న ఉద్యమాన్నీ ఆత్మబలిదానాలనూ పట్టించుకోకుండా విభజన నిర్ణయం వెలువడగానే ఆకస్మికంగా నిద్రలేచి “సమైక్యాంధ్ర” నినాదాన్ని డిమాండుని అందుకోవడంలో అసంబద్ధత గురించి ఇకనైనా ఆలోచించాలి. 
నిజమే! విభజన వల్ల కొన్ని నష్టాలు అనివార్యమే! మైండ్ సెట్ మార్చుకుని చూసినపుడు పరిస్ధితులు మరోలా కనబడుతాయి. రాష్ట్రం విడిపోతే నీళ్ళులేక సీమాంధ్ర ఎడారైపోతుంది అన్న వాదనలో కాస్త అతిశయోక్తులు వున్నాయి. నదీజలాలను ఎలా పంచుకోవాలో విధివిధానాలు ఇప్పటికే వున్నాయి. అవి కట్టుదిట్టంగా అమలుకాకపోతే దానికి పరిష్కారాలు వెతకాలి రెగ్యులేటరీ వ్యవస్ధను ఏర్పాటు చేయించుకోవాలి కర్నాటక మహారాష్ట్ర లనుంచి కృష్ణా గోదావరి జలాల సమస్య ను పరిష్కరించాలని ఇపుడు ఆంధ్రప్రదేశ్ మాత్రమే వత్తిడి చేస్తోంది. భవిష్యత్తులో తెలంగాణా, సీమాంధ్రప్రదేశ్ లు వత్తిడి చేస్తే పరిష్కారం వేగవంతం కాదా?
హైదరాబాద్ కట్టుకోవడం వల్లకాదన్నది మరోవాదన. 
రాజధాని అంటే హైదరాబాద్ లాగే వుండాలన్న చట్టం లేదుకదా? చెమటపట్టని ఊరు అయివుండటం,  చుట్టుపక్కల అపారమైన భూముల లభ్యతా, హైదరాబాద్ అంతగా విస్తరించింది. 
కోస్తాజిల్లాల్లో అంత భూమి అందుబాటులో లేదు. ఈ అంశాన్ని , అన్నీ హైదరాబాద్ లోనే కేంద్రీకరించిన ప్రస్తుత అనర్దాన్నీ కూడా దృష్టిలో వుంచుకుని కొత్త రాష్ట్రంలో వికెంద్రీకరణ ను అమలు చేయవచ్చు ఒకో నగరంలో కొన్ని కొన్ని అంశాల కార్య స్ధావరాలను ప్రోత్సహించవచ్చు. పాలనాంశాలు రాజధానిలో వుంచి విద్య వైద్యం పరిశ్రమలు మొదలైన రంగాలను వేర్వేరు ప్రాంతాల్లో పెంపొందించ వచ్చు. ఇందువల్ల అమెరికా మాదిరిగా రాజధానితో పాటు అనేక నగరాలు పెరుగుతాయి ఉపాధి అవకాశాలను ఇస్తాయి.
నిర్మాణాల వ్యవధి ఒకప్పుడు సంవత్సరాలైతే ఇపుడు వాలాలకు తగ్గించిన టెక్నాలజీలు వచ్చాయి. సాక్షి ఆఫీసుల మాదిరిగా నాలుగురోజుల్లో నిర్మించుకోగల ప్రీ ఫాబ్రికేటెడ్ ఆఫీసులు కుడా వున్నాయి. ఇవి 30 ఏళ్ళు మనగలుగుతాయి
భవిష్యత్తు ఇలాగే వుండాలని నా ఉద్దేశ్యం కాదు.ఇలాగ కూడా ఆలోచించవచ్చని చెప్పడమే నా ఉద్దేశ్యం. నిపుణులతో మాట్లాడితే ప్రజోపయోగమైన ఎన్నో అర్భుతమైన టెక్నాలజీలను వివరించగలుగుతారు. 
పిడివాదాలు ఒదులుకుని ఓపెన్ గా ఆలోచిస్తే చాలా పరిష్కారాలు వుంటాయి. దీనికి మించి సీమాంధ్రకు ఏంకావాలో ఇప్పటికైనా స్పష్టతకు రావాలి. వ్యవధి ముంచుకొస్తున్న స్ధితిలో స్పష్టత లేకపోవడమంటే మన భవిష్యత్తుని మనమే నాశనం చేసుకోవడం
విభజన విధివిధానాలు వాటాలు పంపకాలు ఖరాలు చేయడానికి 10 మంది కేంద్రమంత్రులతో కమిటీ ఏర్పడింది. 6 వారాల్లో కమిటీ  నివేదిక కేంద్ర ప్రభుత్వం కాలవ్వవధిని నిర్ణయించింది. ఇ ఈ కమిటీ ముందు సీమాంధ్రకు వనరులు ఆదాయాలు ఆస్ధుల పంపిణీలపై ప్రతిపాదనలు వత్తిళ్ళు చేయాలి. గడువు ఆరువారాలే ఈ లోగానే సీమాంధ్ర ప్రతిపాదనలు కమిటీ ముందుకి వెళ్ళకపోతే నిర్ణయాలు ఏకపక్షమైపోతాయి. మనకేమి కావాలో మనం ఆలోచించకమందే ఎవరో తమకు తోచినవి మనకి మంజూరు చేసే పరిస్ధితిని మనం తట్టుకోలేము. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. 
ఎలాగైనా విభజన నిర్ణయాన్ని రద్దు చేయిస్తామని నమ్మే , జనాన్ని నమ్మించే నాయకులు ఇప్పటికే 3రోజులు పూర్తయిన కమిటీ 6 వారాల గడువు పొడిగింపజేయడం మీదే ప్రయత్నాలు తక్షణం మొదలు పెట్టాలి. ఈ ఉపకారమైనా చేస్తే కాంగ్రెస్ నాయకులకు సీమాంధ్ర ప్రజలు కొన్ని తరాల పాటు రుణపడిపోయి వుంటారు 
సీమాంధ్ర ప్రజల ఉద్యమాన్ని ఎక్కడికక్కడ సమన్వయం చేస్తున్న జెఎసిలు వెంటనే సమావేశమై ఉద్యమ డిమాండు ను ‘సమైక్యాంధ్ర’ గానే వుంచాలా ‘సీమాంధ్ర ప్రదేశ్ హక్కులు వాటాల సాధన’ గా మార్చాలా అని నిర్ణయించుకోవాలి! 
పెద్దాడ నవీన్
రాజమండ్రి

%d bloggers like this: