తెలియని ప్రపంచం ఎక్కడో వుందని మొదటినుంచీ మనుషులకు అనుమానమే! గాంధర్వ కిన్నెర లెందరో దేవలోకపు అలకాపురిలో యుగయుగాలుగా జీవిస్తున్నరనే  మన ఆశ! బొందితో కైలాసంచేరినవారూ, నిచ్చెనలెక్కి స్వర్గం చేరినవారూ మన పురాణల్లో ఎదురౌతూనే వుంటారు. చుక్కలు చేరిన ధృవుడూ, పోటీగా త్రిశంకు స్వర్గాన్ని సృష్టంచిన విశ్వామిత్రుడూ ఇతిహాసాల్లోని మనుషులే.
ఈ గాధల పరంపరనుంచే చందమామలో కుందేలూ, పెద్దమర్రి చిటారుకొమ్మగుండా మాయాలోకం చేరికా కథలు తరతరాలుగా మనల్ని ఇష్టపూర్వకంగా వెంబడిస్తూనే వున్నాయి. ఇలాంటి స్ఫుర్తులతో తెగువతో సాహసంచేసిన మనిషికి ఎన్నెన్నో అద్భుతాలు ఎదురయ్యాయి. కొలంబస్ కు అమెరికా ఇలాగే దొరికింది. 
అయితే మనలాంటి మనుషులకోసం అంతరిక్షమంతా గాలిస్తున్న పరిశోధనలకు ఎటుచూసినానిర్మానుష్యమే 
తేమలేని మట్టే..అయినా మనిషి తపన మానదు…ఏటికి ఎదురీత ఆగదు..
ఈ భూమి మీద 700 కోట్ల మంది మానవులున్నారు. అనేక వేల కోట్ల ఇతర జీవులు ఉన్నాయి.ఈ విశ్వం అనంతం. అం దులో మనకు తెలిసి 17 వేల కోట్ల నక్షత్ర మండలాలు. ఆ నక్షత్ర మండలాల్లో మన పాలపుంత ఒకటి మాత్రమే. మన పాలపుంతలో 40 వేలకు పైగా నక్షత్రాలు. వాటిలో మన సూర్యుడు ఒక చిన్న నక్షత్రం. ఆ సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల్లో మన భూమి ఒక గ్రహం. ఆ భూమి మీద మనం నివసిస్తున్నాం. ఇంత పెద్ద విశ్వంలో మనం ఒక్కరమే బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నామా? విశ్వంలో ఇంకెవరైనా ఉన్నారా? పోనీ గతంలో ఉండేవారా? భూమి మీది మానవులే ఇతర గ్రహాలకు వెళ్లి అక్కడ నివసించే అవకాశాలున్నాయా? భూమిపై మానవ జీవనానికి ఉపయోగపడే ఖనిజ సంపద ఏమైనా ఇతర గ్రహాల్లో ఉందా? అని రకరకాలుగా పరిశోధిస్తున్నారు. ఎన్నో ఆసక్తులతో, ఎన్నో లక్ష్యాలతో ఇలాంటి అన్వేషణలెన్నో జరిగాయి, జరుగుతున్నాయి.
అలాంటి ఒక అన్వేషణలో ఇస్రో ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసింది. మన పాలపుంతలోనే, మన సౌర కుటుంబంలోనే, మన భూమికి పక్కనే ఉన్న అంగారక గ్రహంపై ఏముందో తెలుసుకునేందుకు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) పేరిట ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ అనంత విశ్వాన్వేషణలో ఎంత పెద్ద అడుగైనా చిన్నదే. 
కానీ భారత్కు ఇది చాలా పెద్ద విజయం. ఎందుకంటే మంగళ గ్రహం మిస్టరీ ఛేదించేందుకు గతంలో అనేక దేశాలు ప్రయత్నించాయి. కానీ అలాంటి ప్రయోగాల్లో విజయాల కంటే అపజయాలే అధికం. అభివృద్ధిలో శరవేగంతో దూసుకుపోతున్న చైనా కూడా 2011లో మార్స్ మిషన్ ప్రయోగంలో చతికిలబడింది. కానీ భారత్ అతి స్వల్ప కాలంలో ఈ ఘనతను సాధించి తొలి దశను విజయవంతంగా పూర్తిచేసింది. మంగళవారం మధ్యాహ్నం పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్ ద్వారా ప్రయోగించిన మామ్ ఉపగ్రహం కచ్చితంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంది. ఇది సుమారు నెల రోజులపాటు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆ తర్వాత అవసరమైన వేగాన్ని పుంజుకుని అంగారకుడివైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. 68 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి 2014 సెప్టెంబర్లో అంగారకుడి కక్ష్యలోకి చేరుకుంటుంది. అయితే దాదాపు ఏడాదిపాటు సాగాల్సిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో కీలకమైన దశలు, అడ్డంకులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి మంగళగ్రహాన్ని చేరి, ఆశించిన సమాచారాన్ని సేకరించగలిగితేనే ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైనట్లు భావించగలం.
నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రివరకూ టివికి దూరంగా వున్నాను. ప్రయోగం ఏమైందోని ఆదుర్దా ఆరు సార్లయినా ఇంటికి ఫోన్ చేసివుంటాను. చివరి దశకుముందు కరెంటుపోయింది. ఏమైతేనేమి గెలిచాము. మనిషి ఆనంత ఆసక్తి కుతూహలాల ప్రయాణంలో ఇంకో ముందడుగు వేశాము.