Search

Full Story

All that around you

Month

February 2014

శుబోదయం కాదు దుర్దనమే :-(


చెట్టునీ నీటినీ ఆకాశాన్నీ వెలుగునీ చూసుకుంటూ ఉదయం వేళ నేలమీద మీద నడుస్తున్నపుడు బయటా లోపలా వున్న పంచభూతాలు పలకరించుకుంటున్నట్టు వుంటుంది. రోజూ ఇది ఒక ఉత్సవమే అనిపిస్తుంది.
ఇవాళమాత్రం ఇవేమీ కనబడలేదు. విడిపోతున్నామన్న ఎమోషన్ వేటాడుతోంది. ఉద్యమించి, సాధించుకున్న తెలంగాణా అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకూ మనసారా అభినందనలు చెప్పాలన్న మర్యాద, సంస్కారం ఒక అవమానంతో నిస్సహాయంగా రగిలిపోతున్నాయి.
హైదరాబాద్ ఎదుగుదలలో ఖచ్చితంగా నా వాటావుంది. విడిపోయాక నా వాటా ఏమిటో నా రాజధాని ఏమిటో ఒక్కమాటైనా చెప్పకుండా ముందు నువ్ బయటకు నడువ్ నీకూ న్యాయం చేస్తా అని మెడపట్టి గెంటేస్తున్న దుర్మార్గపు పెద్దరికం మీద రక్తంమరుగుతున్నట్ట వుంది. 
ప్రశాంతత ఆహ్లాదాలు పెంచే మార్నింగ్ వాక్ లోనూ మొట్టమొదటి సారి బిపి పెరిగింది. 
నాకు రేపు జరిగే న్యాయం నా హక్కు కాదు. నా గౌరవంకాదు. అది మూర్ఖ కాంగ్రెస్ రాజు నాకు, సమస్త సీమాంధ్ర కు వేసే ముష్టి, చేసే అవమానం. 

తలుపుతీయగానే పోపు ఘుమఘుమలు


చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. నాన్న పొలం వస్తూండటం చూసి అమ్మ వంటింట్లో రెడీ అయిపోయేది. గోలెంలో చెంబుముంచి నీళ్ళు తీసి కాళ్ళు కడుగుతూండగా మూకుడులో తాలింపు వేగుతూండేది. మొహంతుడుచుకుంటూ ఇంట్లో అడుగు పెడుతూండగా ఇల్లంతా ఘుమఘుమలు వ్యాపించేవి. ఆకలితో తృప్తిగా భోజనం చేసేవారు. నేనూ తమ్ముడూ ఒకోసారి ఆ ఘాటుకి ఇబ్బంది పడేవాళ్ళం…”ముందే వండేస్తూంది కదా నాన్న కాళ్ళుకడిగేటపుడే పోపుఎందుకుపెడుతూందో” అని అపుడు మేము అడగలేదు. ఇందుకూ అని అమ్మ చెప్పనూ లేదు.
ఇపుడు ఇంట్లోకి వస్తూ తలుపుతీయగానే అపుడే వేస్తున్న పోపు చిన్నపాటి ఘాటుని, ఒకప్పటి ఘుమఘుమలను (కూడా) స్పురణకు తెచ్చింది. 
సూపుల ఎపిటైజర్లతో కబూర్లు నంజుకుంటూ ఆకలిపుట్టేదాకా రెస్టారెంట్లలో వేచివుండవలసిన “ఆకలి వెయ్యని” అవస్ధకు తాలింపే అసలైన మందని ఇప్పటి పిల్లలకు తెలియనే తెలియదు. 
భుజించే వంటకాలకు వేడిగా సువాసనలు ఆపాదించడం  – లాలాజలాన్ని ఉత్పత్తి చేయడం కొన్ని క్షణాల పనే అని eఏజ్ పిల్లకు తెలియదు 

పచ్చగా వుందాం!


భూమి అంటే కాళ్ళు ఆన్చుకునే నేలమాత్రమే కాదు! సకలజీవరాశి మనుగడకీ అవసరమైన ఆహారాన్ని ఏదో ఒక రూపంలో నోటికందించే అమ్మే కదా! 
ఈ అమ్మ ఇచ్చే ధాన్యం గింజల్లో మనకి మాత్రమేనా పక్షులకూ వాటా వుందికదా! వాటికోసమే ధాన్యం కంకుల్ని కుచ్చులుగా అల్లి ఆలయాల్లో, ఇళ్ళ వసారాల్లో వేలాడదీయడం మనిషి భూతదయకు మేలిమ ప్రతీక అన్నట్టు వుండేది. పొలాలు అమ్ముకుని పట్టణం వచ్చేశాక భూతదయ ఏమిటో తెలియకుండా పోయింది. 
ముగ్గురున్న ఇంటికి ఐదేసి సెల్ కనెక్షన్లు వచ్చేశాక టవరుకీ ఫోనుకీ మధ్య సిగ్నల్స్ ఇచ్చే రేడియేషన్ దెబ్బకి ఒణికిపోతూ తిండికోసం తిప్పలు పడుతున్న బుల్లి పిట్టల విషయంలో దయమాటెలా వున్నా ప్రాయిశ్చిత్తమైనా లేకుండా పోయిందని అపుడపుడూ అనిపిస్తుంది
ఇందుకు సమాధానమన్నట్టు జర్నలిస్టు మిత్రుడు సూర్యచంద్రరావు కొంతమూరులో కొత్తగా కట్టుకున్న ఇంటికి ధాన్యం కంకులను కుచ్చుగా కట్టి వేలాడదీశారు
అది చూసిన మిత్రులు తమకూ కావాలని అడగగా వారితోపాటు నాకు కూడా ఆయనే స్వయంగా అల్లిన కుచ్చు ఒకటి తెచ్చి నిన్ననే ఇచ్చారు.
ఫస్టుఫ్లోరులో వున్న నా ఫ్లాటు గుమ్మం పక్కన కిటికీ పైన వేలాడదీసిన ఈ వరికంకుల కుచ్చు అదే. 
ఇది ఇక్కడవున్నట్టు పిట్టలు పసిగట్టాలి…సురక్షిత ప్రదేశమేనని ధైర్యం కుదరాలి…అపుడుగాని పక్షులు పిట్టలు బుల్లి బుల్లి నోళ్ళతో ధాన్యం గింజలు ఒలుచుకుతినడానికి రావు. ఇందుకు కొన్ని రోజులు పడుతుంది .ఒక సారి వాటికి ఇది అలవాటైతే మాకు రోజూ “పిట్టగళ సంకీర్తనలే”.
యికూబ్ గారు గారు నడుపుతున్న “కవిసంగమం” గ్రూపు ట్యాగ్ లైన్ గుర్తుకొస్తోంది – “నువ్వోక పచ్చని చెట్టవైతే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను!” 
పచ్చగా వుండే ప్రయత్నం చేద్దాం!! 

కేండిల్ లైట్ విందు…


ఇన్ స్టాంట్ జూస్ లు వచ్చే సరికి తాగెయ్యడమే తప్ప తినడం ఆగిపోయింది. చీల్చేపనిని దంతాలు నమిలే పనిని పళ్ళూ మరచిపోయాయి. జర్నలిస్టు మిత్రుడు సూర్యచంద్రరావు చెరుకుగడలను స్వయంగా కత్తిపీటతో చీల్చి ముక్కలు కోసి కాలేజీనుంచి వచ్చే కూతురు తినడానికి సిద్ధం చేస్తున్నపుడే, మంగళవారం (28/01/2014) చీకటిపడేవేళ నేను నా భార్యా వాళ్ళింటికి వెళ్ళాం. అంతలోనే కరెంటుపోయింది. చిన్నదీపం వెలుగులో , చల్లటిగాలిలో వరండాలో కూర్చున్నాం. తోలు వొలిచి  ముక్కలుగా కోసిన చెరకు ముక్కలను మాముందుంచారు…నేనైతే ఎక్కువ ముక్కలే తిన్నాను…చెరకు నమిలి రసాన్ని మింగడంలో ఆనందాన్ని చాలా ఏళ్ళ తరువాత సంపూర్ణంగా ఆస్వాదించాను 
స్టార్ హొటల్ లో ఖరీదైన కేండిల్ లైట్ డిన్నర్ ఇవ్వని ఇవ్వలేని సంతృప్తి ఇక్కడదొరికింది. శ్రీ సూర్య శ్రీమతి స్వర్ణ మంచి హోస్టులు, ప్రేమాస్పదమైన మనుషులు… — feeling nostalgic.

Create a free website or blog at WordPress.com.

Up ↑