భూమి అంటే కాళ్ళు ఆన్చుకునే నేలమాత్రమే కాదు! సకలజీవరాశి మనుగడకీ అవసరమైన ఆహారాన్ని ఏదో ఒక రూపంలో నోటికందించే అమ్మే కదా! 
ఈ అమ్మ ఇచ్చే ధాన్యం గింజల్లో మనకి మాత్రమేనా పక్షులకూ వాటా వుందికదా! వాటికోసమే ధాన్యం కంకుల్ని కుచ్చులుగా అల్లి ఆలయాల్లో, ఇళ్ళ వసారాల్లో వేలాడదీయడం మనిషి భూతదయకు మేలిమ ప్రతీక అన్నట్టు వుండేది. పొలాలు అమ్ముకుని పట్టణం వచ్చేశాక భూతదయ ఏమిటో తెలియకుండా పోయింది. 
ముగ్గురున్న ఇంటికి ఐదేసి సెల్ కనెక్షన్లు వచ్చేశాక టవరుకీ ఫోనుకీ మధ్య సిగ్నల్స్ ఇచ్చే రేడియేషన్ దెబ్బకి ఒణికిపోతూ తిండికోసం తిప్పలు పడుతున్న బుల్లి పిట్టల విషయంలో దయమాటెలా వున్నా ప్రాయిశ్చిత్తమైనా లేకుండా పోయిందని అపుడపుడూ అనిపిస్తుంది
ఇందుకు సమాధానమన్నట్టు జర్నలిస్టు మిత్రుడు సూర్యచంద్రరావు కొంతమూరులో కొత్తగా కట్టుకున్న ఇంటికి ధాన్యం కంకులను కుచ్చుగా కట్టి వేలాడదీశారు
అది చూసిన మిత్రులు తమకూ కావాలని అడగగా వారితోపాటు నాకు కూడా ఆయనే స్వయంగా అల్లిన కుచ్చు ఒకటి తెచ్చి నిన్ననే ఇచ్చారు.
ఫస్టుఫ్లోరులో వున్న నా ఫ్లాటు గుమ్మం పక్కన కిటికీ పైన వేలాడదీసిన ఈ వరికంకుల కుచ్చు అదే. 
ఇది ఇక్కడవున్నట్టు పిట్టలు పసిగట్టాలి…సురక్షిత ప్రదేశమేనని ధైర్యం కుదరాలి…అపుడుగాని పక్షులు పిట్టలు బుల్లి బుల్లి నోళ్ళతో ధాన్యం గింజలు ఒలుచుకుతినడానికి రావు. ఇందుకు కొన్ని రోజులు పడుతుంది .ఒక సారి వాటికి ఇది అలవాటైతే మాకు రోజూ “పిట్టగళ సంకీర్తనలే”.
యికూబ్ గారు గారు నడుపుతున్న “కవిసంగమం” గ్రూపు ట్యాగ్ లైన్ గుర్తుకొస్తోంది – “నువ్వోక పచ్చని చెట్టవైతే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను!” 
పచ్చగా వుండే ప్రయత్నం చేద్దాం!!