Search

Full Story

All that around you

Month

March 2014

♥️ రాజమండ్రిమీద ఆడపడుచుల ఆపేక్ష ♥️ ఉగాది : తెలుగు వారు అందరి (సంవత్సరాది) పండగ ♥️ సోమాలమ్మ పండగ : exclusively రాజమండ్రి లోకల్ పండగ


ఉగాదికి ముందురోజు వచ్చే అమావాస్యనాడు ఆతల్లికి నైవేద్యాలు పెట్టి చల్లగా చూడమని కోరుకుంటారు. రాజమండి్ర ఆడపడుచులంతా సోమాలమ్మకు నివేదన చేసి దణ్ణాలు పెట్టుకుంటారు. 

నేను కొడుకూ, పోలింగ్ కు వెళ్ళడానికి సిద్ధమైపోయాము. వచ్చాక వండుకుందువు బయలు దేరమంటే “మీరు వెళ్ళండి పనయ్యాక నేను వెళ్తా” అంది నా భార్య. వచ్చాక  పనిచేసుకోవచ్చులే అంటే సోమాలమ్మకే కోపం వస్తుందన్నంత గా చికాకు పడిపోయింది. 

గారెలు వండుతోంది తరువాత బూరెలు వండాలట. తెలగపిండి కూర, పెసరపప్పు అప్పటికే వండేసింది.సోమాలమ్మకు ఇదే మెనూ ఎందుకు అంటే నాకు మా అమ్మ చెప్పింది అమ్మకు వాళ్ళమ్మ చెప్పింది అమ్మమకు వాళ్ళమ్మ…ఇక విసిగించకు అని విసుక్కుంది. 

(పనిలో వున్నభార్యల  కాళ్ళకీ చేతులకీ అడ్డం పడిపోవడం భర్తలకు కర్తవ్యం లాంటి లక్షణం కదా:)

ఇప్పుడు సోమాలమ్మ గుడికి  వెళ్ళక్కరలేదు కదా అని అనుమానంగా అడిగితే “ఎన్నేళ్ళయినా కొత్తేనా.చేసే పనిలో భక్తీ శ్రద్ధా వుండక్కరలేదా? “అని కసురుకుంది. 

అవసరం లేదు. గుడికి వెళ్ళనవసరంలేదు. గోడకు కుంకుమ బొట్టు పెడితే అదే సోమాలమ్మతల్లి. ఆమెముందు వండినవి పెట్టి చీరా జాకెట్టూ వుంచి అమ్మా తల్లీ ఊరుని చల్లగా చూడు అని దణ్ణం పెట్టుకోవడమే!

తరువాత ఆ నైవేద్యాన్ని ఇరుగూ పొరుగున పంచి మనం తిని ఆవిడ చీరకట్టుకుంటే పండగ అయిపోయినట్టే !!

ఇది ప్రతీ కొత్త అమావాస్య నాడూ జరిగేదే. ఈ ఆచారంలో రాజమండ్రి ఆడపడుచులకు కన్న ఊరిమీద ఆపేక్ష మమకారాలు కనబడుతాయి. ఎక్కడెక్కడో అత్తారిళ్ళలో వున్న రాజమండ్రి  స్త్రీలు ఈ పండుగకోసమే పుట్టింటికి రావడం ఆనవాయితీ. ఊరిని చల్లగా చూడమన్నదే ఈ పండుగలో ఏకైక వేడుకోలు. 

(కుల మతాలకతీతంగా  విస్తరించిన ఈ  సాంస్కృతిక సాంప్రదాయం ఇపుడు పల్చబడిపోవడం వేరే కథ) 

ఉరిని చల్లగా చూడు అనే కొరికకు అదనంగా “నిరాడంబరమైన సామాన్యులు కూడా మున్సిపాలిటీ లో పోటీ చేయగల అవకాశం ఇవ్వు తల్లీ అని కూడా సామాలమ్మను వేడుకుందామని నిశ్చయించుకున్నాను:) 

ఆతరువాతే ఓటేయడానికి వెళ్తాం!

ఇది ఆశ్చర్యాల రంగు పండగ!


ఎండ పేటే్రగిపోతున్నపుడు, కణంకణం తడారిపోతున్నపుడు విచిత్రంగా చిగురుపట్టిన ఆకులు ముదురు నారింజ రంగు బాల్యంనుంచి, రాగిరంగు యవ్వనంలోకి ఆపై ఆకుపచ్చని పరిపూర్ణతలోకి మారిపోతున్నాయి. లేత మొగ్గలు రంగుల మిశ్రమాల్ని మార్చుకుంటూ  చిత్రకారుడి ఊహకే అందనంత మేని సొగసులతో వికసిస్తున్నాయి.

మొన్నటి వానను, నిన్నటి మంచును ఇముడ్చుకుని  “మధువు”గా మార్చుకున్న మొక్కా, చెట్టూ- అన్నీ రాలి శక్తిహీన అయ్యాయనుకున్నాక ఆమధువు ఉత్తేజంతోనే చిగురించి పూయడం మొదలుపెట్టాయి. అందుకేనేమో ఇది “మధు”(చైత్ర)మాసం అయ్యింది. రుతువలయంలో, కాలభ్రమణంలో మనుషుల సౌలభ్యానికి ఒక మొదలు వుండాలి కాబట్టి ఆమొదలే ఉగాది అయ్యింది. పిలుచుకోడానికి పేరుంటే బాగుంటుంది కాబట్టి ఈసారి “జయ” నామసంవత్సరమైంది.వసంత రుతువుతో మొదలైంది.

రంగులరాట్నంలా, రోలర్ కేస్టర్ లా, ఆగకతిరిగే కాలాన్ని అందుకుని ఆనందించడంలో మనుషులం భంగపడుతున్నాం! భగ్నమౌతున్నాం!! కలకాలం ఎండాకాలాన్నే మిగుల్చుకుంటున్నాం “అన్నీ నాకే” నన్న వెంపర్లాటలో మనుషులుగానే ఎండిపోతున్నాం. 

మొక్కనీ, ఆకునీ,  పువ్వునీ, లోకంలో రంగుల్నీ చూస్తే రుతువులు రుతువుల్లాగే వున్నాయని తెలిసిపోతుంది. మనుషులే గతితప్పి శాశ్వత ఎండాకాలాలైపోతున్నారని అర్ధమైపోతుంది.

మొక్కకి “మధువు” ఆలంబన అయినట్టు “పచ్చ”త/ధనమే మనల్ని ఆదుకోవాలి.  

ఇది అందరం అర్ధం చేసుకోవాలని ఆశతో,  మిత్రులందరికీ “జయ” ఉగాది శుభాకాంక్షలు తెలియజసుకుంటున్నాను -పెద్దాడ నవీన్

నమ్మకమిచ్చే నాయకులు కావాలి


రాజమండ్రికి (ఏ ఊరికైనా కూడా) కొంచెం నమ్మకమిచ్చే నాయకులు కావాలి…ఆశల చెట్లెక్కించే వారుకాక  నేలమీద దారులు చూపే మార్గదర్శులు కావాలి…ఓటును డబ్బుకి, కులానికి, భ్రమలకు, ప్రగల్భాలకు బలిపెట్టకుండా వివేకానికి, విజ్ఞతకు కట్టబెట్టాలి. ఊరుని పచ్చగా శుభ్రంగా వుంచడం మీద శ్రద్ధాసక్తులు వున్నవారిని అందలమెక్కించాలి ఇవాళ మార్నింగ్ వాక్ లో, నిన్నా మొన్నా నా ఆలోచనల్లో ఈ ఆశలు మెదిలాయి. మెరిశాయి. 
మున్సిపాలిటీలకు రేపే ఎన్నికలు ఏఊరి అవసరాలు ఎలావున్నాయి. ఆఊరి కొత్తపాలకుల ముందున్న బాధ్యతలు ఏమిటి అనే అంశాలపై ఈనాడు విస్తృతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. అందులో రాజమండ్రి సమావేశంలో పాల్గనే అవకాశం నాకు కూడా లభించింది. సమావేశం లో అందరూ వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశాన్ని ఈనాడు తూర్పుగోదావరి జిల్లాలో ప్రచురించింది. ఆసక్తివుంటే చూడండి

నమ్మకమిచ్చే నాయకులు కావాలి


రాజమండ్రికి (ఏ ఊరికైనా కూడా) కొంచెం నమ్మకమిచ్చే నాయకులు కావాలి…ఆశల చెట్లెక్కించే వారుకాక  నేలమీద దారులు చూపే మార్గదర్శులు కావాలి…ఓటును డబ్బుకి, కులానికి, భ్రమలకు, ప్రగల్భాలకు బలిపెట్టకుండా వివేకానికి, విజ్ఞతకు కట్టబెట్టాలి. ఊరుని పచ్చగా శుభ్రంగా వుంచడం మీద శ్రద్ధాసక్తులు వున్నవారిని అందలమెక్కించాలి ఇవాళ మార్నింగ్ వాక్ లో, నిన్నా మొన్నా నా ఆలోచనల్లో ఈ ఆశలు మెదిలాయి. మెరిశాయి. 
మున్సిపాలిటీలకు రేపే ఎన్నికలు ఏఊరి అవసరాలు ఎలావున్నాయి. ఆఊరి కొత్తపాలకుల ముందున్న బాధ్యతలు ఏమిటి అనే అంశాలపై ఈనాడు విస్తృతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. అందులో రాజమండ్రి సమావేశంలో పాల్గనే అవకాశం నాకు కూడా లభించింది. సమావేశం లో అందరూ వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశాన్ని ఈనాడు తూర్పుగోదావరి జిల్లాలో ప్రచురించింది. ఆసక్తివుంటే చూడండి
రేపటి ఆశలు

రుతువుల సాక్షి – కానుగ చెట్టు!


వెళ్ళిపోతున్న శిశిరాన్ని కాలుమోపుతున్న వసంతాన్ని ఒకే కొమ్మ మీద చూపిస్తున్న రుతువుల సాక్ష్యమై నిలబడింది కానుగ చెట్టు…
ఏ కానుగ చెట్టుని చూసినా ఇలాగే కనిపిస్తూంది. వారంక్రితం అన్నీ ఎండుటాకులే…పచ్చబొట్లు అన్నట్టు అక్కడక్కడా చిగుళ్ళు. ఇపుడు గట్టిగా గాలివీస్తే చినిగిపోతాయేమో అనిపించేటంత కోమలంగా ఎదుగుతున్న లేత ఆకుపచ్చ ఆకులు, ఆపక్కనే ముట్టుకుంటే పొడై రాలిపోతాయన్నంతగా ఎండిపోయిన పండుటాకులు…
ఈ సన్నివేశం చూస్తున్నపుడే ఒక ఆశమొలిచింది. పచ్చగా వున్న ప్రకాశంనగర్ లో ఇంకా మొక్కలు నాటింపజేయాలి. పరిశుభ్రతను పూలతోటంత శ్రద్ధగా సాకుకునేలా చేయాలి. ఈ విషయమై మా కార్పోరేటర్ తో ఒక డీల్ కుదర్చగలనే నమ్మకం కుదిరింది.
యాభై డివిజన్లున్న రాజమండ్రిలో రిజర్వేషన్ల పుణ్యమా అని (సగం మంది) మేయర్ తో సహా 25 వార్డుల్లో మహిళలే కార్పొరేటర్లుగా ఎన్నిక కాబోతున్నారు. పచ్చదనం, పారిశుధ్యాల మీద వీరి దృష్టి పడేలా చేస్తే, గోదావరి పుష్కరాలకు మన ఊరని అందంగా ముస్తాబు చేసుకోవాలన్న దృష్టి పెట్టించగలిగితే నా ఊరు పచ్చగా మెరిసిపోతూంది.
ముప్పై ఏళ్ళక్రితం  హెలికాప్టర్ తో  విజయవాడలో కొండల మీద మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ విత్తనాలు చల్లించారు. అపుడు ఆకొండలు జబ్బుచేసి జుట్టురాలిపోయిన తలల్లా వుండేవి. రాళ్ళు, ఎర్రమట్టి తప్ప పచ్చతనం కనబడేదికాదు. ముందుచూపుతో డాక్టర్ జంధ్యాల చల్లించిన విత్తనాలు ఆ చిన్న కొండలమీద ఇపుడు వృక్షాలయ్యాయి. 
మూడుదశాబ్దాల క్రితం “తమ్మయ్య” అనే హార్టికల్చరిస్టు అంకితమైన సేవల వల్లే తిరుమలలో తిరుపతిలో వేంకటేశ్వరస్వామి ఉద్యానవనాలకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దేవుడి సేవలకు 600 రకాల పూలని (అని జ్ఞాపకం) టిటిడి గార్డెన్స్ లోనే తమ్మయ్య పూయించారు . స్వామి దర్శనానికి వెళ్ళేవారు సమయాన్ని మరచిపోయి కూర్చునేలా పార్కుల్ని ఆయన అభివృద్ధి చేశారు. తమ్మన్న రిటైర్ అయ్యాక రామోజి ఫిలింసిటి లోచేరి అక్కడ గార్డెన్స్ ని అభివృద్ది చేశారు. ఫిలింసిటి అందచందాలు – చూసినవారికి తెలుసు. 
సంకల్పానికి అధికార వనరుకూడా తోడైతే ఆశ అద్భుతంగా ఫలిస్తుంది. డాక్టర్ జంధ్యాల శంకర్, తమ్మయ్య లే ఇందుకు ఉదాహరణ. 
మీ ఊళ్ళో కూడా సగంమంది స్త్రీలే కౌన్సిలర్లు / కార్పొరేటర్లు గా వుంటారు. పచ్చదనం మీద వారి దృష్టి పడేలా చేయండి…కుదిరితే పోలింగ్ లోగా హామీ తీసుకోండి…బాగుంటుంది…మీ ఊరు పచ్చపచ్చగా మెరిసిపోతుంది:-)

సగటు మనిషి వ్యూపాయింట్


 బిజెపి మీద సానుకూలత ఎందుకు?

ముందుచెప్పినట్టుగానే విభజనకు సహకరించింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించింది. అన్యాయం చేసిన కాంగ్రస్ న్యాయమెలా చేస్తుంది
తెలుగుదేశం మీద సానుకూలత ఎందుకు? 
సమన్యాయం అంటే తప్పేముంది. అంతపెద్ద కాంగ్రస్ పార్టీ సీమాంధ్రను వద్దనుకుంది. తెలుగుదేశం రెండు ప్రాంతాలూ కావాలనుకుంది. హైదరాబాద్ ని అంత చక్కగా తీర్చిదిద్దిన చంద్రబావల్లే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం బాగా జరుగుతుంది.
కాంగ్రస్ మీద కోపం ఎందుకు? 
సీమాంధ్ర రాజధాని ఏదో కూడా చెప్పకుండా, హైదరాబాద్ రాబడుల్లో వాటా ఏంటో తేల్చకుండా ఇంట్లోనుంచి గెంటేసింది. అందరూ ఒప్పుకున్నారు రాసిచ్చేశారు అంటే…చీల్చెయ్యడమేనా తల్లి చేయవలసిన పనేనా?
నా వ్యూపాయింట్
బ్రిటీష్ పాలకులకి ఈ దేశంమీద ఇక్కడ ప్రజల మీద ప్రేమ లేదు. ఇటలీనుంచి వచ్చిన సోనియా కూడా అంతే. ఆమెకి బ్రిటీష్ పాలకులకీ తేడా ఏముంది. వెన్నెముకలేని కాంగ్రస్ నాయకుల వల్లా సొంత భజనపరుల వల్లా ఆమె, కొడుకూ ఇష్టారాజ్యంగా ఏలుతున్నారు.
నాలుగురోజులుగా రెండేసి గంటలు రాజమండ్రిలో జనం మధ్యతిరుగుతున్నాను. వారిని సంభాషణలోకి దించగలిగినపుడు వెల్లడైన అభిప్రాయాల సారమే ఈ అప్ డేట్. రాజకీయ నాయకుల్ని జర్నలిస్టులు ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తే ప్రజలు సమాధానమివ్వరు. ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతారు. ఇది ముప్పై ఏళ్ళుగా ప్రతీసారీ చూస్తున్న, ఇపుడూ ఎదురౌతున్న అనుభవమే. అయితే ఈ సారి ప్రజల మూడ్ స్పష్టంగా అర్ధమైపోతోంది. 
అయితే మౌనంగా వున్న జగన్ పార్టీ మద్దతుదారుల సంఖ్య తక్కువకాదు. చాలా ఎక్కువ. 
సమైక్యనినాదాన్నే తప్ప సమైక్యభావనని సీమాంధ్రలో ఏపార్టీ నాయకులూ తీసుకురాలేకపోయారు. దుర్మార్గంగా రాషా్ట్రన్ని చీల్చిన సోనియా గాంధీ సీమాంధ్రలో ఉద్వేగపూరితమైన భావసమైక్యతను, కాంగ్రస్ పార్టీ మీద తీవ్రమైన ద్వేషాగ్రహాల్ని తీసుకురాగలిగారు. 
అందుకైనా ఓసారి “సోనియాకీ జై” అనాలి
– పెద్దాడ నవీన్ 
ఇంకోవిషయం : తెలంగాణా విడిపోవాలి నేను మొదటినుంచీ కోరుకుంటున్నానని ఫేస్ బుక్ లోకూడా నా మిత్రులకు తెలుసు. కానీ ఇంత ఏకపక్ష దుర్మార్గ విభజన తలచుకున్నపుడల్లా నన్ను బాధపెడుతోంది. నాసొంత జీవితంలో కష్టాలు బాధలు అవమానాలు వున్నాయి. కాని కాంగ్రస్ నన్ను అవమానించినంతగా నేను ఎపుడూ ఎక్కడా అవమానపడలేదు.

వలసలు


 తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోసిన వాళ్ళు తెలుగుదేశంలోకి…వై ఎస్ ఆర్ తో కుదరని వాళ్ళు ఆయన కొడుకు పార్టీలోకి…దీన్ని 1.రాజకీయ అవకాశవాదం అనాలా? 2.(కాంగ్రస్ హైకమాండ్ మూర్ఖత్వం వల్ల మొదలైన) రాజకీయ పునరేకీకరణ అనాలా? 

జీవన గడియారం గంటన్నర ఆలస్యం!


రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రచారానికి వచ్చే సమయం ఆలస్యమౌతోంది. ఐదేళ్ళ క్రితం ఉదయం ఏడున్నరకి ఒక చోటచేరి బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ఎనిమిదిన్నర లోగా వీధుల్లోకి వెళ్ళిపోయేవారు. భోజనంకోసం  రెండు గంటలకి ప్రచారం ముగించేలోగా రెండు సార్లు టీ తాగేవారు
ఇపుడు వారు అనుకున్న సెంటర్  కి బ్రేక్ ఫాస్ట్ ముగించేసుకుని 8/45 – 9 00 మధ్య చేరిపోతున్నారు. ఆవెంటనే వీధుల్లోకి వెళ్ళిపోవడమే! లంచ్ లోగా వీరికి పళ్ళముక్కలు, జూస్ లే ఆహారం. అన్ని పార్టీల కార్యకర్తలదీ ఇదే స్ధితి 
వేసవికాలమని కాదు ఆహారపు అలవాట్లలో మార్పు ఫలితమే టీ కి బదులు జూస్ లు, బజ్జీలు వడలకు బదులు ఫ్రూట్ సలాడ్ లు వచ్చాయి. 
ప్రచారంలో గోలకూడా బాగా తగ్గింది. వారి వారి పార్టీల పాటలు, నాయకుల ఉపన్యాసాల రికార్డెడ్ డేటా  ఒక వాహనంలో నిరంతరాయంగా వినబడుతూ వుంటుంది. కొందరు ముందుగా వెళుతూ జిందాబాద్ నినాదాలతో సందడి సృష్టిస్తారు. ఇళ్ళనుంచి బయటికి వచ్చిన వాళ్ళకి – వెనుక వచ్చిన కార్యకర్తలు పాంప్లెట్లు పంచుతూ వుంటారు. మూడురోజులుగా రాజమండ్రి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని గమనించిన నాకు ఇదంతా అర్ధమైంది. గతంలోకంటే ఈ సారి “పనివిభజన” బాగుంది. చకచకా పని పూర్తిచేసుకుంటున్నరు. 
లంచ్ కి పని ఆపేశాక తిరిగి సాయంత్రం 5 కే మళ్ళీ ప్రచారం మొదలౌతోంది. ఇందులో కాస్త పెద్దనాయకులే వుంటున్నారు. ప్రతీ ఇంటికీ వెళ్ళడమే పని. ఉదయం తిరిగిన బృందం ముందుగా వెళ్ళి సందడిచేస్తూ ఇళ్ళలో ఉన్నవారు బయటికి వచ్చేలా చేస్తూంటారు. అంటే వెనుక వచ్చే నాయకులకు స్వాగతం చెప్పించడం లాగన్న మాట. అలా ఇంటినుంచి బయటకు రావడానికి ఇష్టపడని వారిని తమ పార్టీకి ఓటు వేయనివారుగా గుర్తించడమే ఈ బృందం పని. అయితే నాయకులెంత గౌరవంగా ఓటు అడుగుతున్నారో ప్రజలు కూడా అంతే మన్ననగా చిరునవ్వులతో వారిని సాగనంపుతున్నారు. ఏమైనా ఒక లౌక్యం ప్రచారాన్ని ప్రశాంతంగా నడిపిస్తోంది
అన్నిటికీ మించి ఈ ఐదేళ్ళలో మనుషుల జీవన గడియారం కనీసం గంటన్నర ఆలస్యంగా తిరుగుతోంది. తొందరగా పనిమొదలు పెట్టాలనుకుంటే అది ఉదయం 9 కి కాని మొదలవ్వడంలేదు. ఎన్నికల ప్రచారానికే కాదు ఏపనికైనా సరే!

ఊగే రంగులు…


చెప్పలేనంత కృతజ్ఞతతో దేవుణ్ణీ, అంతుచిక్కని భయంతో దెయ్యాన్నీ సృష్టించుకున్న మనుషులు మిగిలిన అన్ని ఉద్వేగాలకూ రూపాల్ని అనుభవాలు అనుభూతల నుంచే తీర్చిదిద్దుకున్నరు. 
మనసన్నాక తుళ్ళింతా వుంటుంది. దానికి రంగూ రూపూ ఊపూ ఇచ్చిన మనిషి సృజనాత్మకత ప్రకృతినుంచి నేర్చుకున్నది. ఇలా మనకొచ్చిన వాటిలో “హోలీ”ఒక రోమాంఛిత/రొమాంటిక్ వేడుక
ఉత్తరాదినుంచి “హోలీ” తెలుగునాట కాలు మోపి పడుచుపిల్లలకే పరిమితమైన “కోలాటం”తో కాలుకదిపి స్ధిరపడిపోయింది. ఈవాతావరణం రాజమండ్రిలో కనిపించని రోజుల్లో 2001 లో కృష్ణుడు పెరిగిన బృందావనంలో (వృందావన్) నేనొక్కణ్ణీ హోలీ ఆట చూశాను. 
ఆసయమంలో న్యూఢిల్లీలో లక్ సభ స్పీకర్ (బాలయోగి గారు) నివాసంలో 14 రోజులు అతిథి గా వున్నాను. హోలీకి ముందురోజు స్పీకర్ పిఎ సత్తరాజుగారు వృందావన్ వెళ్తారా బాగుంటుంది అని అడిగారు. నా కూడా ఇంకెవరూ లేరు. ఏమీతోచనితనం వల్లా కుతూహలం వల్లా సరేనన్నాను. కృష్ణజన్మస్ధానమైన మధుర, కృష్ణుడు పెరిగిన వృదావనం, హోలీ పండుగల గురించి ఆరాత్రి ఇంటర్ నెట్ లో సెర్చ్ చేసి ప్రింట్లు తీసుకున్నాను. నా కోరిక ప్రకారం ఇంగ్లీషు వచ్చిన కేబ్ డ్రైవర్ ని ఏర్పాటు చేశారు.
కారే రంగుల్లో తడిసిపోయింది. ముందుగా మధురలో కేశవదాస్ స్వామి (కృష్ణుడు) ఆలయానికి వెళ్ళాను. కూడా డ్రయివర్ వున్నాడు. అతని దగ్గర సత్తిరాజు గారు ఇచ్చిన ఉత్తరం వుంది. దానివల్లే పండగ రష్ లో కూడా మాకు క్యూతో నిమిత్తంలేని ప్రత్యేక దర్శనం దొరికింది. పాలతో కృష్ణుడికి స్నానం చేయించి ఒళ్ళు తుడితే అవకాశం కుదిరింది. ఆవాతావరణం శుభ్రంగాలేదు. పండితుల ను చూస్తే వీళ్ళు స్నానాలు చేసి చాలా రోజులయ్యిందేమో అనిపించింది. ఆమాటే అంటే డ్రయివర్ నన్ను చాలా కోపంగా చూశాడు.
అక్కడి నుంచి పదకొండింటికి వృందావన్ చేరుకున్నాము. కృష్టుడు పెరిగిన ఆ ఊరిలో బాగా తీర్చిదిద్దిన పెద్దతోట. ముదురు ఆకుపచ్చ ఆకులు. బూడిదరంగు కాండాలు. వేళ్ళతో నొక్కితే స్పర్శకు అందిన మెత్తని అనుభవం ఒక మనిషిని ముట్టుకున్నంత మృధువుగా అనిపించింది. ఆచెట్లలో మామిడి రావి బాదం చెట్లను గుర్తుపట్టగలిగాను. అన్నీ పూల మొక్కలే ఎన్నోరంగురంగుల పూలు. గుంపులు గుంపులుగా మనుషలు. రంగులు పూసుకుంటూ…పులిమించుకుంటూ… అక్కడ ఉత్సాహమంతా పడుచు అమ్మాయిలూ, స్త్రీలదే. 
నల్లటి నారంగూ, ఆకారాల వల్ల ఉత్తరభారతీయుల మధ్య నేను ప్రత్యేకంగా కనబడుతాను. అక్కడ ప్రతీ ఒక్కరూ నన్ను కుతూహలంగా చూసినవారే. చాలమంది పలకరింపుగా నవ్విన వారే. ఒకావిక వచ్చి ఏదో అని చేత్తో నొసటిమీదా చెంపల మీద రంగు పూసేసింది. బహుశ హిందీలో ఆమె నాకు శుభాకాంక్షలు చెప్పిందేమో. తరువాత అందరూ నన్ను రంగుల్లో ముంచేశారు. నాకూ రంగులు ఇచ్చారు. ఆరంగలు నా అసలు రంగుని కప్పేశాయి. రెండుగంటల సమయంలో నేనున్న చెట్టుకింద భోజనాలకు చేరిన ఒక కుటుంబంలో పెద్దావిడ నాకు రెండు ఆలూ పరాటాలు ఇచ్చింది. ఒకటే తీసుకున్నాను. అదితినేశాక రెండోది కూడా తీసుకుని వుంటే బాగుండేది అనిపించింది. 
మంచుకురిసే హేమంతరుతువూ, కొత్తపూత పట్టే వసంతరుతువూ ఇచ్చే ఆహ్లాదం అంతా ఇంతాకాదు. ఈ సంతోషం ఓపలేనిదై, మనుషుల్లో రంగులై పొంగి, నృత్యమై నడుము ఊపి, చూపరులను ఉత్తేజభరితులను చేసిచిన్నగా చిందేయించిన అనుభవాన్ని బృందావనంలో పొందగలిగాను 
పిల్లతనంలో అల్లరీ, కౌమారంలో కన్నుగీటడం, యవ్వనంలో ఆవేశం, ప్రేరకాలై మనిషిని వదలని ఒక కాంక్ష ను కుదిపేయడం అపుడే అనుభూతి చెందగలిగాను.
అంతరాలు అరమరికలు లేని స్నేహోల్లాసపు 
మనిషితనానికి హోలీ ఒక ప్రతీక అని అపుడే అర్ధం చేసుకున్నాను. మూడ్, యాంబియన్స్ (కూడా) ఎంత ఎగ్జయిట్ మెంటు ఇస్తాయో చూపించే రొమాంటిక్ వేడుక కాబట్టే 
“హోలీ” ఎవరికైనా పండగే! –   
మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు
(ఈ జ్ఞాపకం వయసు పదమూడేళ్ళ. ఇప్పటికీ ఆ అనుభూతి అంతే గాఢంగా వుండటం నేను ఒక ఎమోషనల్ మనిషినని అర్ధమైపోతూనే వుంది. వయసు పెరుగుతున్న నా ఆరోగ్యానికి ఇది మంచో చెడో అర్ధం కావడం లేదు:-)

Blog at WordPress.com.

Up ↑