రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రచారానికి వచ్చే సమయం ఆలస్యమౌతోంది. ఐదేళ్ళ క్రితం ఉదయం ఏడున్నరకి ఒక చోటచేరి బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ఎనిమిదిన్నర లోగా వీధుల్లోకి వెళ్ళిపోయేవారు. భోజనంకోసం  రెండు గంటలకి ప్రచారం ముగించేలోగా రెండు సార్లు టీ తాగేవారు
ఇపుడు వారు అనుకున్న సెంటర్  కి బ్రేక్ ఫాస్ట్ ముగించేసుకుని 8/45 – 9 00 మధ్య చేరిపోతున్నారు. ఆవెంటనే వీధుల్లోకి వెళ్ళిపోవడమే! లంచ్ లోగా వీరికి పళ్ళముక్కలు, జూస్ లే ఆహారం. అన్ని పార్టీల కార్యకర్తలదీ ఇదే స్ధితి 
వేసవికాలమని కాదు ఆహారపు అలవాట్లలో మార్పు ఫలితమే టీ కి బదులు జూస్ లు, బజ్జీలు వడలకు బదులు ఫ్రూట్ సలాడ్ లు వచ్చాయి. 
ప్రచారంలో గోలకూడా బాగా తగ్గింది. వారి వారి పార్టీల పాటలు, నాయకుల ఉపన్యాసాల రికార్డెడ్ డేటా  ఒక వాహనంలో నిరంతరాయంగా వినబడుతూ వుంటుంది. కొందరు ముందుగా వెళుతూ జిందాబాద్ నినాదాలతో సందడి సృష్టిస్తారు. ఇళ్ళనుంచి బయటికి వచ్చిన వాళ్ళకి – వెనుక వచ్చిన కార్యకర్తలు పాంప్లెట్లు పంచుతూ వుంటారు. మూడురోజులుగా రాజమండ్రి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని గమనించిన నాకు ఇదంతా అర్ధమైంది. గతంలోకంటే ఈ సారి “పనివిభజన” బాగుంది. చకచకా పని పూర్తిచేసుకుంటున్నరు. 
లంచ్ కి పని ఆపేశాక తిరిగి సాయంత్రం 5 కే మళ్ళీ ప్రచారం మొదలౌతోంది. ఇందులో కాస్త పెద్దనాయకులే వుంటున్నారు. ప్రతీ ఇంటికీ వెళ్ళడమే పని. ఉదయం తిరిగిన బృందం ముందుగా వెళ్ళి సందడిచేస్తూ ఇళ్ళలో ఉన్నవారు బయటికి వచ్చేలా చేస్తూంటారు. అంటే వెనుక వచ్చే నాయకులకు స్వాగతం చెప్పించడం లాగన్న మాట. అలా ఇంటినుంచి బయటకు రావడానికి ఇష్టపడని వారిని తమ పార్టీకి ఓటు వేయనివారుగా గుర్తించడమే ఈ బృందం పని. అయితే నాయకులెంత గౌరవంగా ఓటు అడుగుతున్నారో ప్రజలు కూడా అంతే మన్ననగా చిరునవ్వులతో వారిని సాగనంపుతున్నారు. ఏమైనా ఒక లౌక్యం ప్రచారాన్ని ప్రశాంతంగా నడిపిస్తోంది
అన్నిటికీ మించి ఈ ఐదేళ్ళలో మనుషుల జీవన గడియారం కనీసం గంటన్నర ఆలస్యంగా తిరుగుతోంది. తొందరగా పనిమొదలు పెట్టాలనుకుంటే అది ఉదయం 9 కి కాని మొదలవ్వడంలేదు. ఎన్నికల ప్రచారానికే కాదు ఏపనికైనా సరే!