వెళ్ళిపోతున్న శిశిరాన్ని కాలుమోపుతున్న వసంతాన్ని ఒకే కొమ్మ మీద చూపిస్తున్న రుతువుల సాక్ష్యమై నిలబడింది కానుగ చెట్టు…
ఏ కానుగ చెట్టుని చూసినా ఇలాగే కనిపిస్తూంది. వారంక్రితం అన్నీ ఎండుటాకులే…పచ్చబొట్లు అన్నట్టు అక్కడక్కడా చిగుళ్ళు. ఇపుడు గట్టిగా గాలివీస్తే చినిగిపోతాయేమో అనిపించేటంత కోమలంగా ఎదుగుతున్న లేత ఆకుపచ్చ ఆకులు, ఆపక్కనే ముట్టుకుంటే పొడై రాలిపోతాయన్నంతగా ఎండిపోయిన పండుటాకులు…
ఈ సన్నివేశం చూస్తున్నపుడే ఒక ఆశమొలిచింది. పచ్చగా వున్న ప్రకాశంనగర్ లో ఇంకా మొక్కలు నాటింపజేయాలి. పరిశుభ్రతను పూలతోటంత శ్రద్ధగా సాకుకునేలా చేయాలి. ఈ విషయమై మా కార్పోరేటర్ తో ఒక డీల్ కుదర్చగలనే నమ్మకం కుదిరింది.
యాభై డివిజన్లున్న రాజమండ్రిలో రిజర్వేషన్ల పుణ్యమా అని (సగం మంది) మేయర్ తో సహా 25 వార్డుల్లో మహిళలే కార్పొరేటర్లుగా ఎన్నిక కాబోతున్నారు. పచ్చదనం, పారిశుధ్యాల మీద వీరి దృష్టి పడేలా చేస్తే, గోదావరి పుష్కరాలకు మన ఊరని అందంగా ముస్తాబు చేసుకోవాలన్న దృష్టి పెట్టించగలిగితే నా ఊరు పచ్చగా మెరిసిపోతూంది.
ముప్పై ఏళ్ళక్రితం  హెలికాప్టర్ తో  విజయవాడలో కొండల మీద మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ విత్తనాలు చల్లించారు. అపుడు ఆకొండలు జబ్బుచేసి జుట్టురాలిపోయిన తలల్లా వుండేవి. రాళ్ళు, ఎర్రమట్టి తప్ప పచ్చతనం కనబడేదికాదు. ముందుచూపుతో డాక్టర్ జంధ్యాల చల్లించిన విత్తనాలు ఆ చిన్న కొండలమీద ఇపుడు వృక్షాలయ్యాయి. 
మూడుదశాబ్దాల క్రితం “తమ్మయ్య” అనే హార్టికల్చరిస్టు అంకితమైన సేవల వల్లే తిరుమలలో తిరుపతిలో వేంకటేశ్వరస్వామి ఉద్యానవనాలకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దేవుడి సేవలకు 600 రకాల పూలని (అని జ్ఞాపకం) టిటిడి గార్డెన్స్ లోనే తమ్మయ్య పూయించారు . స్వామి దర్శనానికి వెళ్ళేవారు సమయాన్ని మరచిపోయి కూర్చునేలా పార్కుల్ని ఆయన అభివృద్ధి చేశారు. తమ్మన్న రిటైర్ అయ్యాక రామోజి ఫిలింసిటి లోచేరి అక్కడ గార్డెన్స్ ని అభివృద్ది చేశారు. ఫిలింసిటి అందచందాలు – చూసినవారికి తెలుసు. 
సంకల్పానికి అధికార వనరుకూడా తోడైతే ఆశ అద్భుతంగా ఫలిస్తుంది. డాక్టర్ జంధ్యాల శంకర్, తమ్మయ్య లే ఇందుకు ఉదాహరణ. 
మీ ఊళ్ళో కూడా సగంమంది స్త్రీలే కౌన్సిలర్లు / కార్పొరేటర్లు గా వుంటారు. పచ్చదనం మీద వారి దృష్టి పడేలా చేయండి…కుదిరితే పోలింగ్ లోగా హామీ తీసుకోండి…బాగుంటుంది…మీ ఊరు పచ్చపచ్చగా మెరిసిపోతుంది:-)