ఎండ పేటే్రగిపోతున్నపుడు, కణంకణం తడారిపోతున్నపుడు విచిత్రంగా చిగురుపట్టిన ఆకులు ముదురు నారింజ రంగు బాల్యంనుంచి, రాగిరంగు యవ్వనంలోకి ఆపై ఆకుపచ్చని పరిపూర్ణతలోకి మారిపోతున్నాయి. లేత మొగ్గలు రంగుల మిశ్రమాల్ని మార్చుకుంటూ  చిత్రకారుడి ఊహకే అందనంత మేని సొగసులతో వికసిస్తున్నాయి.

మొన్నటి వానను, నిన్నటి మంచును ఇముడ్చుకుని  “మధువు”గా మార్చుకున్న మొక్కా, చెట్టూ- అన్నీ రాలి శక్తిహీన అయ్యాయనుకున్నాక ఆమధువు ఉత్తేజంతోనే చిగురించి పూయడం మొదలుపెట్టాయి. అందుకేనేమో ఇది “మధు”(చైత్ర)మాసం అయ్యింది. రుతువలయంలో, కాలభ్రమణంలో మనుషుల సౌలభ్యానికి ఒక మొదలు వుండాలి కాబట్టి ఆమొదలే ఉగాది అయ్యింది. పిలుచుకోడానికి పేరుంటే బాగుంటుంది కాబట్టి ఈసారి “జయ” నామసంవత్సరమైంది.వసంత రుతువుతో మొదలైంది.

రంగులరాట్నంలా, రోలర్ కేస్టర్ లా, ఆగకతిరిగే కాలాన్ని అందుకుని ఆనందించడంలో మనుషులం భంగపడుతున్నాం! భగ్నమౌతున్నాం!! కలకాలం ఎండాకాలాన్నే మిగుల్చుకుంటున్నాం “అన్నీ నాకే” నన్న వెంపర్లాటలో మనుషులుగానే ఎండిపోతున్నాం. 

మొక్కనీ, ఆకునీ,  పువ్వునీ, లోకంలో రంగుల్నీ చూస్తే రుతువులు రుతువుల్లాగే వున్నాయని తెలిసిపోతుంది. మనుషులే గతితప్పి శాశ్వత ఎండాకాలాలైపోతున్నారని అర్ధమైపోతుంది.

మొక్కకి “మధువు” ఆలంబన అయినట్టు “పచ్చ”త/ధనమే మనల్ని ఆదుకోవాలి.  

ఇది అందరం అర్ధం చేసుకోవాలని ఆశతో,  మిత్రులందరికీ “జయ” ఉగాది శుభాకాంక్షలు తెలియజసుకుంటున్నాను -పెద్దాడ నవీన్