ఉగాదికి ముందురోజు వచ్చే అమావాస్యనాడు ఆతల్లికి నైవేద్యాలు పెట్టి చల్లగా చూడమని కోరుకుంటారు. రాజమండి్ర ఆడపడుచులంతా సోమాలమ్మకు నివేదన చేసి దణ్ణాలు పెట్టుకుంటారు. 

నేను కొడుకూ, పోలింగ్ కు వెళ్ళడానికి సిద్ధమైపోయాము. వచ్చాక వండుకుందువు బయలు దేరమంటే “మీరు వెళ్ళండి పనయ్యాక నేను వెళ్తా” అంది నా భార్య. వచ్చాక  పనిచేసుకోవచ్చులే అంటే సోమాలమ్మకే కోపం వస్తుందన్నంత గా చికాకు పడిపోయింది. 

గారెలు వండుతోంది తరువాత బూరెలు వండాలట. తెలగపిండి కూర, పెసరపప్పు అప్పటికే వండేసింది.సోమాలమ్మకు ఇదే మెనూ ఎందుకు అంటే నాకు మా అమ్మ చెప్పింది అమ్మకు వాళ్ళమ్మ చెప్పింది అమ్మమకు వాళ్ళమ్మ…ఇక విసిగించకు అని విసుక్కుంది. 

(పనిలో వున్నభార్యల  కాళ్ళకీ చేతులకీ అడ్డం పడిపోవడం భర్తలకు కర్తవ్యం లాంటి లక్షణం కదా:)

ఇప్పుడు సోమాలమ్మ గుడికి  వెళ్ళక్కరలేదు కదా అని అనుమానంగా అడిగితే “ఎన్నేళ్ళయినా కొత్తేనా.చేసే పనిలో భక్తీ శ్రద్ధా వుండక్కరలేదా? “అని కసురుకుంది. 

అవసరం లేదు. గుడికి వెళ్ళనవసరంలేదు. గోడకు కుంకుమ బొట్టు పెడితే అదే సోమాలమ్మతల్లి. ఆమెముందు వండినవి పెట్టి చీరా జాకెట్టూ వుంచి అమ్మా తల్లీ ఊరుని చల్లగా చూడు అని దణ్ణం పెట్టుకోవడమే!

తరువాత ఆ నైవేద్యాన్ని ఇరుగూ పొరుగున పంచి మనం తిని ఆవిడ చీరకట్టుకుంటే పండగ అయిపోయినట్టే !!

ఇది ప్రతీ కొత్త అమావాస్య నాడూ జరిగేదే. ఈ ఆచారంలో రాజమండ్రి ఆడపడుచులకు కన్న ఊరిమీద ఆపేక్ష మమకారాలు కనబడుతాయి. ఎక్కడెక్కడో అత్తారిళ్ళలో వున్న రాజమండ్రి  స్త్రీలు ఈ పండుగకోసమే పుట్టింటికి రావడం ఆనవాయితీ. ఊరిని చల్లగా చూడమన్నదే ఈ పండుగలో ఏకైక వేడుకోలు. 

(కుల మతాలకతీతంగా  విస్తరించిన ఈ  సాంస్కృతిక సాంప్రదాయం ఇపుడు పల్చబడిపోవడం వేరే కథ) 

ఉరిని చల్లగా చూడు అనే కొరికకు అదనంగా “నిరాడంబరమైన సామాన్యులు కూడా మున్సిపాలిటీ లో పోటీ చేయగల అవకాశం ఇవ్వు తల్లీ అని కూడా సామాలమ్మను వేడుకుందామని నిశ్చయించుకున్నాను:) 

ఆతరువాతే ఓటేయడానికి వెళ్తాం!