Search

Full Story

All that around you

Month

April 2014

❤️ ఒక అంతర్ముఖం లాంటిదే ఈ సినిమా!


❤️ నవ్వులో గూఢత్వంలేదు…చూపులో నర్మగర్భత లేదు…ఎక్స్ ప్రెషన్ లో అభినయం లేదు…మనుషులకు ముసుగులు లేవు…ఇదంతా “చందమామ కథలు” సినిమా గురించి.  అసంబద్ధతలు లేని సినిమాలను ఆమోదించలేని అలవాటే వొంటబట్టించుకున్నాము. మేకప్పులు పులిమిన ముఖాల్నే తప్ప అంతర్ముఖాల్నీ గుర్తుపట్టలేని స్ధితికి చేరుకున్నాము.
❤️ అలాంటి సినిమాల మధ్య “చందమామ కథలు” సినిమా  బాగుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఫైట్లు ఐటమ్ సాంగులు కామెడీ టా్రకులు లేవు. ఇందులో వున్నవారంతా   హీరోలు హీరోయిన్లే… అందరికీ పెయిన్ వుంటుంది. పెయిన్ తో స్ట్రగుల్ వుంటుంది. జీవితాల్నే చూస్తున్నట్టు వుంటుంది. ఇందులో జీవితాన్ని ఎదురించడమో జీవితం మీద తిరగబడటమో వుండదు. జీవితం ఎలా నడిపిస్తే అలా నడవడమే వుంటుంది. అలా నడవడంలో వున్న చిన్న చిన్న మెలో డ్రామాలే ఈ సినిమాలో బ్యూటీ!
♥️ నాకైతే బాగుంది. (నా టేస్ట్ అంత మంచిది కాదని నా స్నేహితులు అంటారు. ఇందువల్ల నా మాటల ఆధారంగా మాత్రమే ఈ సినిమా చూడవద్దని మనవి)

పట్టణంలా కాదు…ఉరంటేనే ఒక ఉద్వేగం!


పట్టణంలా కాదు- ఉరంటేనే ఒక ఉద్వేగం!

ఉరంటే….అభిమానం, ఆపేక్ష,  ప్రేమ, ఆత్మగౌరవం, పంతం, ఒకోసారి మూర్ఖత్వం, ఎపుడైనా డబ్బు

ఎన్నికలప్రచారసరళి గమనించడానికి మూడురోజులుగా ఊళ్ళలో తిరుగుతున్నపుడు చూసిన సన్నివేశాలు నాకు సంతోషమిచ్చాయి. వేమగిరి, రాజానగరం, జి ఎర్రవరం, తూర్పుగోనగూడెం, శ్రీరామపురం, పుణ్యక్షేత్రం, నామవరం, సుద్దకొండ గ్రామాల్లో ఇంచుమించు ఒకే వాతావరణం కనిపించింది. ఇవి రాజమండ్రి రూరల్, రాజానగరం శాసన సభా నియోజకవర్గాల్లో రాజమండ్రిలోక్ సభా నియోజకవర్గంలో వున్నాయి.

వేమగిరి ఊరి మధ్యనుంచి కాకినాడకాల్వ ప్రవహిస్తూ వుంటుంది. కాల్వకుడి గట్టు వైపు ఒక కులానిది ఆధిపత్యం. రెండో గట్టు వైపు మరో కులానిది ఆధిపత్యం. రెండువైపులా వెనుకబడిన తరగతులవారు వున్నారు. వారిమీద ఆయా ఆధిపత్య కులాల ప్రభావమే ఎక్కువ  ఏగట్టున వున్న పెద్దలు ఎలా చెబితే ఆ వైపున వున్న వారు స్ధూలంగా “అలక్కానిచ్చేద్దాం” అనే మాటమీదుంటారు. 

ఆ ఉరి సర్పంచ్ పదవికి కుడిగట్టు కులం వారే ముగ్గురు పోటీ చేశారు. ఎవరిగ్రూపులు వారికున్నాయి. ఆ ఊళ్ళో తెలుగుదేశం అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫస్ట్ మీటింగు తమగట్టు మీదే జరగాలని పెద్దలు అనుకున్నారు. ఆయన్ని పిలుచుకున్నారు. ఒక గ్రూపు కోలాటం పెట్టించింది. ఇంకో గ్రూపు డప్పులతో చిందాట పెట్టించింది. బుచ్చయ్య వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. ఎడమ గట్టు నాయకులకు మంటగా వుంది. “సరే కాలవ ఆవతలవాళ్ళే ఆయనకు ముఖ్యమై పోతే మమ్మల్నే కావాలనుకునే వాళ్ళే మాకు ముఖ్యులౌతారు” అని నిష్టూరాలు పోతున్నారు. 

నామవరంలో సర్పంచ్ గారి ఇల్లు కోలాహలంగా వుంది. తెలుగుదేశం అభ్యర్ధులు మురళీమోహన్, పెందుర్తి వెంకటేష్ ఆయింటి దగ్గర చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ వీధిలో వున్నవాళ్ళు అంటీ ముట్టనట్టున్నారనిపించింది. ఒకాయన్ని పలకరిస్తే “ఈ ప్ర సిడెంటుతో మాకు కుదరదు” అన్నడు. మీరు జగన్ పార్టీయా అంటే నవ్వేసి ” విడిపోకముందు రకరకాలుగా వున్నాగాని ఇపుడైతే మన స్టేటుని కట్టడానికి అనుభవంకవవోడే కావాల చంద్రబాబు రైటు”అన్నాడు. 

శ్రీరామపురంలో ఒక వీధి చాలాసందడిగా వుంది. “ఆవిడకూడా చాలామంది వుంటారు. బైకులమీద దుమ్మురేపేస్తారు” అని ఒకాయన, కూల్ డ్రింకులు ఇద్దం అని ఓ యువకుడు, ఎన్నని తెస్తారు మజ్జిగ ఇవ్వండ్రా చల్లగావుంటుందని ఒక పెద్దాయన, (దివాన్ చెరువు)సెంటర్ కి ఫోన్ చేసి రెండు మజ్జిగ కేన్లు తెప్పించండ్రా డబ్బు నేనిస్తానని ఇంకో నడివయసాయన, 

ఎందుకు ఐదారిళ్ళనుంచి మజ్జిగ ఇప్పించండి అల్లం జిలకర్ర దబ్బాకు కలిపి నేను పల్చగా మజ్జిగచేస్తాను. నాకో పదిరూపాయలిద్దురు. ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చుకోండని మాసిపోయిన బనీను వేసుకున్న పెద్దమనిషి…

ఇంకో రెండడుగులు ముందుకివేసి ఒకాయనతో మీఊరు టె్రండు మారిందా అంటే “అదెలాగ అవుదది్ద మనవోటడదని ఆవిడకీ (జగన్ పార్టీ అభ్యర్ధిని) తెలుసు అయినా ఆవిడ ఓటడగడం, మనం మర్యాద చేయడం ఇద్దరికీ గౌరవం. ఏమో ఆవిడ ఓటడిగే పద్ధతికి ఎవరైనా ఏస్తారేమో! ఎంతైనా జక్కం పూడి భార్య కదా” అన్నాడు.

బొమ్మూరులో రెండు పార్టీల శిబిరాలూ పెళ్ళిళ్ళ లాగ కళకళలాడుతున్నాయి. “చాలా ఖర్చు కదా కేండిడేట్లు పెట్టుకుంటారా” అని ఇరు వర్గాల్నీ అడిగినపుడు వాళ్ళ వాళ్ళ భాషలో – అదేం మాట అంతచెడిపోయిలేము. పార్టీ వాళ్ళదేకాదు మనదే. ఈసందడిలేక పోతే ‘కేడర్ ‘ నీరసపడిపోతుంది అన్నారు.

ఇక్కడ కేడర్ అంటే నిర్విరామంగా పనిచేసి, పేకెట్ లో వచ్చిన బిర్యానీ తిని ఇంటికెళ్ళే టపుడు మందుసీసా, వందనుంచి రెండొందలు డబ్బూ తీసుకు వెళ్ళే వాళ్ళని అర్ధం చేసుకోవాలి

పుణ్యక్షేత్రంలో అయితే అభ్యర్ధితో పాటు ఆ పార్టీ కార్యకర్తలే కాకుండా తటస్ధులైన ఊరి పెద్దలు కొద్దిమంది మహిళలూ నడుస్తున్నారు. ఇలా అనుసరిస్తున్న ఒక బృందంతో మీరు ఏపార్టీయో బైటపడిపోయారు కదా అంటే  “అదేం మాట మనమీద గౌరవంతో వాళ్ళు వచ్చినపుడు మనం నాలుగడుగులు వాళ్ళతో కలసి నడవడం మనకి వాళ్ళకీ మర్యాదకదా! ఓటంటారా ఎవరిష్టం వాళ్ళది” అన్నడు ఒకాయన.

ఈ పరిశీలనలో నాకు అర్ధమైన విషయాలు….

1) పట్టణాల్లోకంటే లేదా పట్టణాలకు ధీటుగా పల్లెల్లోనే తెలుగుదేశం పార్టీ నెట్ వర్క్ చాలా బాగుంది(నెట్ వర్క్ ఉన్నంత మాత్రాన ఆ పార్టీ గెలుస్తుందని నా ఉద్దేశ్యం కాదు గెలుపోటముల కారణాలు ఫ్యాక్టర్లు వేరే వుంటాయి.)

2) అన్నిటికీ మించి గ్రామాల్లో రూపాలు మారినా ఆలోచనలు అలాగే వున్నాయి. ఇలా పరిశీలించిన గ్రామాలన్నీ రాజమండ్రి చుట్టూ వున్నవే! ఆ ఊళ్ళలో జీన్ పాంట్లు,  త్రీపోర్త్ షాట్లూ, కొత్తమోడల్ బైకులూ, చిన్నకార్లూ, స్మార్ట్ ఫోన్లూ

కొత్త డిజైన్ ఇళ్ళూ, ఎసి యూనిట్లూ కనిపిస్తున్నాయి. 

పట్టణ సదుపాయాలన్నీ వారు అనుభవిస్తున్నారు. జీవనశైలి మార్చుకుంటున్నారు. అయినా వారు సామూహిక మౌలిక స్వభావాన్ని కోల్పోలేదు. (ఈలక్షణాన్ని పట్టణాలు పోగొట్టుకున్నాయి.)

ప్రతి ఊరి లోనూ జనానికి వున్న “మన ఊరు, మన గౌరవం, మన మర్యాద” అనే స్పృహ, అది ఇచ్చే ఎమోషన్ , ఆ ఎమోషన్లను ప్రేమగా తడిమిచూసుకోవడం ఇంకా వుంది. ఇది నాకు భలే నచ్చేసింది. చాలాసంతోషమనిపిస్తోంది.

(రెండు బృందాలతో నేను చేసిన ఈ పరిశీలనలో ఒక బృందంలో ఇద్దరు సెఫాలజిస్టులు వున్నారు. రెండో బృందంలో నా మిత్రులు ఉప్పులూరి సుబ్బారావు, మధుఫోమా్ర వున్నారు) 

❤️ ఇది గాల్లో తేలే సీజన్


❤️ గాలి లేదనుకున్న చోట పెద్ద మొక్కలున్నా, చిన్నచెట్లున్నా చాలు చల్లగా వుంటుంది. వాటి ఆకులు విసిరే గాలికి మనం పెట్టుకునే పేరు”గాలో్లతేలినట్టుంది” . అలాంటి చోట అరగంటుంటే చాలు. ఆ హాయి గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. 
❤️ రాజమండ్రి ప్రకాశం నగర్ రౌండ్ పార్కులో ఒకే ఒక్క రావిచెట్టు తప్ప మిగిలినవన్నీ ఆరేడు అడుగుల పెద్దమొక్కలే, అంతే ఎత్తున్న చిన్న చిన్న చెట్లే. వసంతంలో చిగురించిన ఆకులు గట్టిగా గాలొస్తే చిరిగిపోతాయన్నంత పల్చగావున్నాయి. లేత ఆకుపచ్చ రంగునుంచి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతున్న ఒక లాంటి రంగు కరెంటు లైట్ల వెలుగులో ఆకులు కదలినపుడల్లా మెరుస్తూ డ్యాన్స్ చేస్తున్నట్టున్నాయి.
❤️ చెమటలు కక్కుతూ పార్క్ లోకి చేరాక ఇదంతా చూసి వాకింగ్ పాత్ మీద నడచి మళ్ళీ చెమటలు పట్టించుకోవాలనిపించలేదు. ఇంట్లో టె్రడ్ మిల్లు మీద నడుద్దామని (ఆపని ఎలాగూ చెయ్యము అది వేరేసంగతి) మాకు మేమే (నేనూ నా భార్య) సర్దిచెప్పుకుని బెంచీ మీద కూర్చుండిపోయాము.
❤️ సెలవులిచ్చిన బడిపిల్లల పరుగులు కేకలు, వాళ్ళని తీసుకువచ్చిన అమ్మమలు తాతయ్యల తీరుబడి కబుర్లు, 
ఒంటరిగా వచ్చిన వాళ్ళు గాలిలోకి ప్రశాంత ధ్యానంలా చూసే చూపులు, ఆగాగి కదులుతున్న ఆకులు….గొప్పగా వుంది ఆంబియన్స్. ఒకరినొకరు ఆనుకుపోయి కూర్చుని స్వీట్ నధింగ్స్ చెప్పుకునే యువజంటలు కనబడలేదు. 
ఇంతటి రద్దీ వారికి అసౌకర్యమే! 
❤️ ఆకులతోపాటు వాటిని ఆశ్రయించి వున్న చిన్న పురుగులు కూడా ఆనంద నాట్యం మొదలుపెట్టాయి. ఇళ్ళలోనే మగ్గిపోయే మన శరీరాలకు పురుగులడేన్సు దురదపుట్టిస్తుంది కదా! 
❤️ ఆదశలోనే ఇంటికి వచ్చేశాము. స్నానంతో స్ధిమిత పడి ఎసి కేసి చూస్తే ఓ క్షణం చికాకనిపించింది. పార్కులో కదులుతున్న చెట్ల ఆకులే కళ్ళముందు కనిపించాయి. నా చికాకుని చూసి ఎసి అలిగిందా అన్నట్టు ఆన్ చేయగానే కరెంటు పోయింది…ఎప్పుడు వస్తుందో తెలియదు…కానీ తప్పక వస్తుంది…ఈ రాత్రే! 

వారమే గడువు (రాజధాని ఎక్కడ)


ఆంధ్రప్రదేశ్ ఎలా వుండాలో రాజధాని ఎక్కడ వుండాలో ఒక అభిప్రాయం రూపుదిద్దుకోక ముందే రాజధాని ఎక్కడుండాలి అనేవిషయమై ప్రజలు అందచేయవలసిన సూచనలకు గడువు మరో వారంలో (30-4-2014) ముగిసిపోతోంది. ఈసారికూడా ప్రతిపాదనల దశలో ప్రజలకు విసృ్తతమైన భాగస్వామ్యం లేకుండా పోతోంది.
విభజనపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందం ప్రజాభిప్రాయ సేకరణకు ఆరువారాల గడువు ఇచ్చింది. అసలు విభజనే జరగదని సమైక్యనాయకులు తప్పుదారి పట్టించడంవల్ల ప్రజలు ఆబృందాన్ని హేళనగా చూశారు. 
“విభజనకు సోనియా నిర్ణయించేశారు. ఈ బృందాలు తూతూ మంత్రాలే ప్రజలు ఒద్దాన్నా ఆగేదా”? అని ఇపుడు తిరగేసి మాట్లాడుతున్నారు. అధికారంలో వున్న వారి ఉద్దేశ్యాలు ఎలా వున్నా ప్రజలకిచ్చిన అవకాశాల్ని ప్రజలు చిత్తశుద్ధితో ఉపయోగించుకోవాలి. ఇలాంటి ప్రక్రియల్ని విడిచిపెట్టే ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని పెడబెబ్బలు పెట్టి ప్రయోజనం లేదు.
అయిందేదో అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని పై నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఆకమిటీ ప్రజలనుంచి అభిప్రాయాలు సేకరించడానికి ఏప్రిల్ 30 గడువు పెట్టుకుంది. 
సోనియా గ్యాంగ్ దుర్మార్గంవల్ల సీమాంధ్ర రాజధాని ఏదో తేలకుండానే రాష్ట్రం విడిపోయింది. రాజధానిపై వేసిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వబోతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ నివేదిక అలాగే వుంటుంది. ఆప్రభుత్వమే రాజధానిపై నిర్ణయం తీసుకోవాలి. 
అయితే ఆ నిర్ణయానికి ప్రజాభిప్రాయమే ప్రాతిపదిక అయితేనే అది ప్రజాస్వామ్యబద్ధ మౌతుంది. సోనియా బృందం కిరాతకం కారణంగానే విభజనకు నిర్ణయించిన సమయం నాయకులకు ప్రజలకు ఏకాగ్రత పెట్టలేని ఎన్నికల కాలమైంది.
ప్రజల్ని సమాయత్తం చేయకుండా ప్రాతిపదికలు ఏమిటో చెప్పకుండా ఎక్కడ రాజధాని అంటే ఎవరుమాత్రం ఏమని చెప్పగలుగుతారు? ఏపట్టణం వారు ఆపట్టణంలోనే రాజధాని కావాలంటారు. ఇది శాస్త్రీయమైన సూచన కానేకాదు.
హైదరాబాద్ అనుభవాన్ని బట్టి కొత్తరాష్ట్రంలో అన్ని రంగాలూ ఒకే చోట కేంద్రీకృతమై వుండకూడదు. వనరులు అవకాశాలను బట్టి ఆయారంగాల కేంద్రాలను జిల్లాల వారీగా అభివృద్దిచేయాలి ఉదాహరణకు: నౌకావాణిజ్యకేంద్రం ఒక తీర పట్టణంలో, పర్యాటకానికి గోదావరిజిల్లాలు, ఉన్నత విద్యకు గుంటూరు, వాణిజ్యానికి విజయవాడ, రాజధానిగా అన్ని ప్రాంతాలకూ వీలైనంత అందుబాటులో వున్న ప్రాంతం …ఇలాగన్న మాట…ఈ ప్రాంతాల పేర్లు ఉదాహరణలే..అక్కడే అవి వుండాలని కాదు.
వికేంద్రీకరించబడిన పద్ధతిలో రాష్ట్రం ఏర్పడితే రాజధాని మాకేనంటే మాకేనని పంతాలు వాదనలు చాలా తగ్గిపోతాయి. ఈ మేరకు ప్రజల్ని ప్రిపేర్ చేయవలసిన రాజకీయ రంగం ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతోంది. ప్రజలతో సంబంధంలేని శివరామకృష్ణన్ “ప్రజల అభిప్రాయాన్ని” అనుసరించి కొత్తరాజధాని ఎక్కడుండాలో సిఫార్సు చేస్తారు. రాజధానిపై ఎవరైనా వారి అభిప్రాయాలను feedback.expcomt@mha.gov.in 
కు ఇమెయిల్ చేయవచ్చు. 
పిచ్చి సమైక్యతా వాదంవల్లా సోనియా బృందం దుర్మార్గంవల్లా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రజలు కాక నాయకులు కాక అధికారులు నిర్ణయించే పరిస్ధితులు దాపురించాయి. ఫైలు రాసే పద్ధతిని బట్టే ప్రతిపాదనల బలం వుంటుంది. ఎంతో తెగువ వున్న నాయకుడైతే తప్ప ప్రతిపాదనలని పూర్తిగా మార్చడం జరిగేపనికాదు. 
తెలంగాణా డిమాండులో సహేతుకతను గుర్తించకుండా, తెలంగాణా ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపించినపుడుకూడా కళ్ళుమూసుకుపోయి ఏంకాదులే అన్న సమైక్యాంధ్ర నాయకుల్ని సీమాంధ్ర పౌరసమాజాన్నీ 
“ఎంతపని చేశారయ్యా” అని తిట్టడానికి, “ప్రత్యామ్నాయాలు చూపించకుండా రాత్రికి రాత్రే సామాను బయటపెట్టేసి పదేళ్ళలో నీకో దారి చూద్దాంలే” అన్న సోనియా కసాయితనాన్ని గట్టిగా చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ అంతటికీ వినిపించగల ఒక పెద్దగొంతు మూడునిమిషాలైనా నాకు వుంటే బాగుండును అనిపిస్తోంది.
అప్పట్లో మంత్రుల బృందం ముందు అవకాశాలు ఎలా పోగొట్టుకున్నమో ఆసక్తి వుంటే ఈ లింకు చదవండి 
గడువు ఆరు వారాలే! సీమాంధ్రులూ హుషార్!! http://t.co/9NembzWGq6

♦️మంచిమాటే! నెరవేర్చేదెలా?


♦️హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మొట్టమొదటి మెకనైజ్డ్ లాండ్రీ చైన్ షాపుల పేరు “ఫాషన్ డ్రైక్లీనర్స్” 
ఉత్తమ్ చంద్ అనే వ్యాపారవేత్త వాటిని స్ధాపించారు. అప్పటికే వారు సంపన్నులు. ఆయనకొక కారు భార్య రేణుకా బెన్ కి ఒక కారు వుండేవి. అమె అతిధులతో మాట్లాడుతున్నప్పుడూ, కారులో ప్రయాణిస్తున్నపుడూ లేసు అల్లుతూనే వుండేది. అంత అవసరమేమిటా అని నాకు పెద్ద అనుమానం (మా నాన్నగారితో వాళ్ళ ఇంటికి చాలా సార్లు వెళ్ళాను) తరువాత తెలిసింది. లేసు అమ్మాకాల మీద వచ్చే ఆదాయం ఆమె ఛారిటీ కార్యక్రమాలకు వినియోగించే వారని…
♦️విజయవాడలో సిరీస్ రాజుగారు సంపన్న పారిశ్రామిక వేత్త . వ్యక్తిగా ఆయన నిరాడంబరుడు సాత్వికాహారి. రొజాయినే పక్కగావేసుకుని నేలమీదే పడుకునేవారు. 
♦️కమ్యూనిస్టుల ఉద్యమాల వల్ల ఉత్తమ చంద్, సిరీస్ రాజు కుటుంబాలు శ్రామిక దోపిడిదారులన్న అపఖ్యాతినే మూటగట్టుకున్నారు. వారి నిరాడంబరత వెలుగులోకి రాలేదు.
♦️పారిశ్రామిక విప్లవంతరువాత ఇంగ్లండులో విపరీతంగా పెరిగిపోయిన వస్తువుల అమ్మకం అపారమైన జనాభా వనరురున్న భారతదేశాన్ని పెద్ద మార్కెట్ గా మార్చేసింది. జీవనశైలిని మార్చేసే ఆవస్తువులు సంపన్నులకే అందుబాటులో వున్నపుడు పేదల్లో ఈరా్ష్య అసూయలు పెరగకుండా గాంధీజీ ప్రతిపాదించిన సింపుల్ సిటి మంత్రాన్ని డబ్బున్న వారు బాగాపాటించారు. సంపన్నురాలైన రేణుకా బెన్ లేసు అల్లడం లో గాంధీజీ ప్రభావం కూడా వుండివుండవచ్చు.
♦️ఎలకా్ట్రనిక్ విప్లవం, గ్లోబలీకరణలవల్ల ప్రపంచమే ఒకటైపోతోంది. అవసరాలు ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. మోటారు టూవీలర్ కిబదులు పూర్తిగా సైకిల్ మీదే తిరగాలని చాలా ఏళ్ళు ప్రయత్నించాను. ఎప్పుడూ 100 శాతం విజయం సాధించలేకపోయాను. 
♦️విమానంలో ప్రయాణించే వ్యక్తి “నేను ఎకానమీ క్లాస్ లో సింపుల్ గానే ప్రయాణిస్తున్నాను ఎగ్జిక్యూటివ్ క్లాస్ కాదుకదా” అంటే అది నిరాడంబరత కాదు అనలేము కదా! 
♦️గాంధీజీ స్వయంగా అతినిరాడంబరుడు. “ఎల్లపుడూ ప్రయాణాల్లో వుండే ఆయన్ని నిరాడంబరంగా వుంచడానికి 
స్వచ్ఛమైన మేకపాలు, వేరుశెనగపప్పు తాజాగా తెప్పించడానికి చాలా ఖర్చు చేస్తున్నాము” అని సరోజినీ నాయుడో మరేవరో ఒక సారి చమత్కరించారు.
♥️అతిసామాన్యంగా జీవించడం ఉన్నతమైన ఆదర్శమే..కాని (గతంలో మాదిరిగా) ఇది సమాజం అంతటికీ ఒకేలా కాకుండా ఒకొక్కరికి ఒకోలా వర్తిస్తుందేమో! 

♥️ ఒక ఫీల్ గుడ్ టైమ్


❤️ మొహాలు గంటలతరబడి ప్రసన్నంగానో, చిరునవ్వులతోనో వుండే సందర్భం, పలకరింపులతో మొదలై పాతముచ్చట్లలో మినిగిపోయే సందర్భం, పెద్దాచిన్నా తేడా లేకుండా ఆడవాళ్ళందరూ ఒకరినొకరు నగలధగధగల్నీ, వస్త్రాలంకరణల్నీ చూసీచూడనట్టు చూసే సందర్భం, పడుచుపిల్లలు పరస్పరం లైనేసుకునే సందర్భం : పెళ్ళి 🙂 
♦️ మా అపార్టుమెంట్లో ఒక ఫ్లాట్ లో వుండే “దివ్య” పెళ్ళిలో వున్నాము. మేమంతా ఇంచుమించు ఒకేసారి ఈ అపార్ట్ మెంటులోకి వచ్చాము.అపుడు ఈ పెళ్ళికూతురు  ఎయిత్ క్లాస్. నాభార్య ఇరుగుపొరుగు వాళ్ళ కబూర్లలో వుంది. నాకు కంపెనీ లేదు పక్కనే వున్న చింతామణిగారితో మాట్లాడుదామంటే భజంత్రీల శబ్ధం తప్ప ఏమీ వినబడటం లేదు. 
♥️ అసలు చుట్టూ వున్న మనుషుల్ని గమనిస్తూ వుంటే వాళ్ళ హావభావాల్లో బాడీ లాంగ్వేజీల్లో తొంగిచూసే  చిన్న సంతోషాలూ బుల్లి ఆనందాలే నాకు పండుగలా వుంటుంది
❤️ ఏమైనా పెళ్ళంటే ఒక ఫీల్ గుడ్ టైమే 🙂

♥️ నేను చూసి నేర్చుకున్న ఒక పచ్చడి వివరాలు ఇవి. ఎవరైనా ట్రయ్ చేయవచ్చు.


కావలసినవి పాత మాగాయి, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం ఎక్కువ ఉల్లిపాయల ముక్కలు, కొంచెం పెరుగు. ఇష్టముంటే కొద్దిగా తరిగిన బెల్లం. ఏమాత్రం ఉప్పు అవసరంలేకపోవడమే ఈ డిష్ ప్రత్యేకత 
వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా తిప్పెయ్యాలి. అంతే పచ్చడి రెడీ మీ ఇంట్లో ఎవరో ఒక మేడమ్ వండిన దోసెలు లేదా ఇడ్లీలలో ఈ పచ్చడి నంజుకుని తినెయ్యడమే!
కావాలనుకుంటే స్టయిల్ కోసం wow అనవచ్చు

♦️ ప్రయోగమేతప్ప ఉపసంహారం తెలియని బాబు!


♦️ నాయకుడు నమ్ముకున్నవారికి బలమవ్వాలి…వెన్నుతట్టి ఉత్సాహమవ్వాలి…జయం మనదేనని నడిపించాలి…చంద్రబాబు ఇపుడు బాగా సంపను్నల ముందు మోకరిల్లి చేతులుసాచి మీరు ఎలాగైనా గెలిచి నన్ను నాయకుడిగా ఎన్నుకోండి అంటున్న యాచకుడిగా కనబడుతున్నారు…ఒక వేళ ఇది నా దృష్టిదోషం కావచ్చు అవగాహన లోపం కావచ్చు. (ఇది టివి న్యూస్ వల్ల ఏర్పడిన అభిప్రాయం) ఇదంతా మీడియా సృష్టే నాకే సంబంధమూ లేదని చంద్రబాబు అనవచ్చు. కాని సహేతుకంగా ఏర్పడిన అభిప్రాయాలు అంతతొందరగా మారవు
📢 ఇక్కడ ఇంకోవిషయం కూడా చెప్పాలి మీడియాను ఎలావాడుకోవాలో బాబుకి తెలిసినంతగా ఇతరులకు తెలియదన్న అభిప్రాయం ఒకటి వుంది. లీకులు ఇవ్వడంలో ఆయన టైమింగ్ బాగుంటుంది. కానీ మీడియాతో ఒక ప్రమాదం కూడా వుంది. “కొంచెం పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకునే” వెర్రి పోటీ వల్ల టివిలు తమ అదుపులోలే తాము వుండలేవు. 
♦️ ఆట ఎలా మొదలు పెట్టాలో బాగా తెలిసిన చంద్రబాబుకి ఆటను ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపాలో అంతగా తెలిసినట్టులేదు.

💚 రెండు పనులు చేస్తే చాలు


❤️ వేలాడుతున్న ఫోన్ కేబుల్ ని నీట్ గా కేసింగ్ లో పెట్టించడం, వైఫై కొసం ప్రత్యేకంగా ఒక ప్లగ్ పాయింటు పెట్టించడం, బాత్ రూముల్ని యాసిడ్ తోకడిగించడం, ఫర్నిచర్ కు పాలిష్ పెట్టించడం, ఫొటో తగిలించడానికి గోడకు మేకు వేయించడం, టైట్ అయిపోయిన పాంట్స్ నడుము ఒదులు చేయించడం, ఇన్వెర్టర్ లో అపుడపుడూ వినిపించే గర్ ర్ ర్ ర్ ర్ ర్ చప్పుళ్ళు ఆపుచేయించడం, 
❤️ వీటిల్లో ఏరెండు పనులైనా చేయించు ఆతర్వాతే నువ్వుచెప్పే వసంతరుతు శోభ గురించీ, రాష్ట్రంలో దేశం లో ఏఏ పార్టీలను ఎందుకెందుకు గెలిపించాలన్న చారిత్రక అవసరాలగురించి  (సుత్తి / సోది) ఎంతైనా వింటాను అని కాఫీఇచ్చిమరీ తేల్చేసింది నా ఇల్లాలు.
⭐️ ఇవన్నీ చిన్నగా కనిపించేపెద్దవిషయాలు. ఈ పనులన్నీ ప్రత్యేక వృత్తులుగా స్ధిరపడుతున్న రంగాలు. ఇవి రాజమండ్రిలాంటి చిన్న పట్టణంలో ప్రొఫెషన్స్ గా ఎదగలేదు. ఆర్ధికావసరం ఒకరితోనే అన్నిపనులనూ (మొరటుగా) చేయించేస్తోంది. పంబ్లరే ఎలకీ్ట్రషీయన్, ఎలకీ్ట్రషియనే కార్పెంటర్. కార్పెంటరే పెయింటర్.
⚡️ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదిగో వచ్చేస్తున్నామనే వాళ్ళేగాని వచ్చేవాళ్ళు లేరు…సర్వీసు రంగానికి మనుషుల కొరత…మనుషుల్లో నైపుణ్యాల కొరత….పనుల్లో నైపుణ్యాల కొరత….
❤️ ఆఆఆఆ ఆపేస్తున్నా సుత్తీ / సోదీ 🙂

Create a free website or blog at WordPress.com.

Up ↑