♦️హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మొట్టమొదటి మెకనైజ్డ్ లాండ్రీ చైన్ షాపుల పేరు “ఫాషన్ డ్రైక్లీనర్స్” 
ఉత్తమ్ చంద్ అనే వ్యాపారవేత్త వాటిని స్ధాపించారు. అప్పటికే వారు సంపన్నులు. ఆయనకొక కారు భార్య రేణుకా బెన్ కి ఒక కారు వుండేవి. అమె అతిధులతో మాట్లాడుతున్నప్పుడూ, కారులో ప్రయాణిస్తున్నపుడూ లేసు అల్లుతూనే వుండేది. అంత అవసరమేమిటా అని నాకు పెద్ద అనుమానం (మా నాన్నగారితో వాళ్ళ ఇంటికి చాలా సార్లు వెళ్ళాను) తరువాత తెలిసింది. లేసు అమ్మాకాల మీద వచ్చే ఆదాయం ఆమె ఛారిటీ కార్యక్రమాలకు వినియోగించే వారని…
♦️విజయవాడలో సిరీస్ రాజుగారు సంపన్న పారిశ్రామిక వేత్త . వ్యక్తిగా ఆయన నిరాడంబరుడు సాత్వికాహారి. రొజాయినే పక్కగావేసుకుని నేలమీదే పడుకునేవారు. 
♦️కమ్యూనిస్టుల ఉద్యమాల వల్ల ఉత్తమ చంద్, సిరీస్ రాజు కుటుంబాలు శ్రామిక దోపిడిదారులన్న అపఖ్యాతినే మూటగట్టుకున్నారు. వారి నిరాడంబరత వెలుగులోకి రాలేదు.
♦️పారిశ్రామిక విప్లవంతరువాత ఇంగ్లండులో విపరీతంగా పెరిగిపోయిన వస్తువుల అమ్మకం అపారమైన జనాభా వనరురున్న భారతదేశాన్ని పెద్ద మార్కెట్ గా మార్చేసింది. జీవనశైలిని మార్చేసే ఆవస్తువులు సంపన్నులకే అందుబాటులో వున్నపుడు పేదల్లో ఈరా్ష్య అసూయలు పెరగకుండా గాంధీజీ ప్రతిపాదించిన సింపుల్ సిటి మంత్రాన్ని డబ్బున్న వారు బాగాపాటించారు. సంపన్నురాలైన రేణుకా బెన్ లేసు అల్లడం లో గాంధీజీ ప్రభావం కూడా వుండివుండవచ్చు.
♦️ఎలకా్ట్రనిక్ విప్లవం, గ్లోబలీకరణలవల్ల ప్రపంచమే ఒకటైపోతోంది. అవసరాలు ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. మోటారు టూవీలర్ కిబదులు పూర్తిగా సైకిల్ మీదే తిరగాలని చాలా ఏళ్ళు ప్రయత్నించాను. ఎప్పుడూ 100 శాతం విజయం సాధించలేకపోయాను. 
♦️విమానంలో ప్రయాణించే వ్యక్తి “నేను ఎకానమీ క్లాస్ లో సింపుల్ గానే ప్రయాణిస్తున్నాను ఎగ్జిక్యూటివ్ క్లాస్ కాదుకదా” అంటే అది నిరాడంబరత కాదు అనలేము కదా! 
♦️గాంధీజీ స్వయంగా అతినిరాడంబరుడు. “ఎల్లపుడూ ప్రయాణాల్లో వుండే ఆయన్ని నిరాడంబరంగా వుంచడానికి 
స్వచ్ఛమైన మేకపాలు, వేరుశెనగపప్పు తాజాగా తెప్పించడానికి చాలా ఖర్చు చేస్తున్నాము” అని సరోజినీ నాయుడో మరేవరో ఒక సారి చమత్కరించారు.
♥️అతిసామాన్యంగా జీవించడం ఉన్నతమైన ఆదర్శమే..కాని (గతంలో మాదిరిగా) ఇది సమాజం అంతటికీ ఒకేలా కాకుండా ఒకొక్కరికి ఒకోలా వర్తిస్తుందేమో!