పట్టణంలా కాదు- ఉరంటేనే ఒక ఉద్వేగం!

ఉరంటే….అభిమానం, ఆపేక్ష,  ప్రేమ, ఆత్మగౌరవం, పంతం, ఒకోసారి మూర్ఖత్వం, ఎపుడైనా డబ్బు

ఎన్నికలప్రచారసరళి గమనించడానికి మూడురోజులుగా ఊళ్ళలో తిరుగుతున్నపుడు చూసిన సన్నివేశాలు నాకు సంతోషమిచ్చాయి. వేమగిరి, రాజానగరం, జి ఎర్రవరం, తూర్పుగోనగూడెం, శ్రీరామపురం, పుణ్యక్షేత్రం, నామవరం, సుద్దకొండ గ్రామాల్లో ఇంచుమించు ఒకే వాతావరణం కనిపించింది. ఇవి రాజమండ్రి రూరల్, రాజానగరం శాసన సభా నియోజకవర్గాల్లో రాజమండ్రిలోక్ సభా నియోజకవర్గంలో వున్నాయి.

వేమగిరి ఊరి మధ్యనుంచి కాకినాడకాల్వ ప్రవహిస్తూ వుంటుంది. కాల్వకుడి గట్టు వైపు ఒక కులానిది ఆధిపత్యం. రెండో గట్టు వైపు మరో కులానిది ఆధిపత్యం. రెండువైపులా వెనుకబడిన తరగతులవారు వున్నారు. వారిమీద ఆయా ఆధిపత్య కులాల ప్రభావమే ఎక్కువ  ఏగట్టున వున్న పెద్దలు ఎలా చెబితే ఆ వైపున వున్న వారు స్ధూలంగా “అలక్కానిచ్చేద్దాం” అనే మాటమీదుంటారు. 

ఆ ఉరి సర్పంచ్ పదవికి కుడిగట్టు కులం వారే ముగ్గురు పోటీ చేశారు. ఎవరిగ్రూపులు వారికున్నాయి. ఆ ఊళ్ళో తెలుగుదేశం అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫస్ట్ మీటింగు తమగట్టు మీదే జరగాలని పెద్దలు అనుకున్నారు. ఆయన్ని పిలుచుకున్నారు. ఒక గ్రూపు కోలాటం పెట్టించింది. ఇంకో గ్రూపు డప్పులతో చిందాట పెట్టించింది. బుచ్చయ్య వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. ఎడమ గట్టు నాయకులకు మంటగా వుంది. “సరే కాలవ ఆవతలవాళ్ళే ఆయనకు ముఖ్యమై పోతే మమ్మల్నే కావాలనుకునే వాళ్ళే మాకు ముఖ్యులౌతారు” అని నిష్టూరాలు పోతున్నారు. 

నామవరంలో సర్పంచ్ గారి ఇల్లు కోలాహలంగా వుంది. తెలుగుదేశం అభ్యర్ధులు మురళీమోహన్, పెందుర్తి వెంకటేష్ ఆయింటి దగ్గర చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ వీధిలో వున్నవాళ్ళు అంటీ ముట్టనట్టున్నారనిపించింది. ఒకాయన్ని పలకరిస్తే “ఈ ప్ర సిడెంటుతో మాకు కుదరదు” అన్నడు. మీరు జగన్ పార్టీయా అంటే నవ్వేసి ” విడిపోకముందు రకరకాలుగా వున్నాగాని ఇపుడైతే మన స్టేటుని కట్టడానికి అనుభవంకవవోడే కావాల చంద్రబాబు రైటు”అన్నాడు. 

శ్రీరామపురంలో ఒక వీధి చాలాసందడిగా వుంది. “ఆవిడకూడా చాలామంది వుంటారు. బైకులమీద దుమ్మురేపేస్తారు” అని ఒకాయన, కూల్ డ్రింకులు ఇద్దం అని ఓ యువకుడు, ఎన్నని తెస్తారు మజ్జిగ ఇవ్వండ్రా చల్లగావుంటుందని ఒక పెద్దాయన, (దివాన్ చెరువు)సెంటర్ కి ఫోన్ చేసి రెండు మజ్జిగ కేన్లు తెప్పించండ్రా డబ్బు నేనిస్తానని ఇంకో నడివయసాయన, 

ఎందుకు ఐదారిళ్ళనుంచి మజ్జిగ ఇప్పించండి అల్లం జిలకర్ర దబ్బాకు కలిపి నేను పల్చగా మజ్జిగచేస్తాను. నాకో పదిరూపాయలిద్దురు. ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చుకోండని మాసిపోయిన బనీను వేసుకున్న పెద్దమనిషి…

ఇంకో రెండడుగులు ముందుకివేసి ఒకాయనతో మీఊరు టె్రండు మారిందా అంటే “అదెలాగ అవుదది్ద మనవోటడదని ఆవిడకీ (జగన్ పార్టీ అభ్యర్ధిని) తెలుసు అయినా ఆవిడ ఓటడగడం, మనం మర్యాద చేయడం ఇద్దరికీ గౌరవం. ఏమో ఆవిడ ఓటడిగే పద్ధతికి ఎవరైనా ఏస్తారేమో! ఎంతైనా జక్కం పూడి భార్య కదా” అన్నాడు.

బొమ్మూరులో రెండు పార్టీల శిబిరాలూ పెళ్ళిళ్ళ లాగ కళకళలాడుతున్నాయి. “చాలా ఖర్చు కదా కేండిడేట్లు పెట్టుకుంటారా” అని ఇరు వర్గాల్నీ అడిగినపుడు వాళ్ళ వాళ్ళ భాషలో – అదేం మాట అంతచెడిపోయిలేము. పార్టీ వాళ్ళదేకాదు మనదే. ఈసందడిలేక పోతే ‘కేడర్ ‘ నీరసపడిపోతుంది అన్నారు.

ఇక్కడ కేడర్ అంటే నిర్విరామంగా పనిచేసి, పేకెట్ లో వచ్చిన బిర్యానీ తిని ఇంటికెళ్ళే టపుడు మందుసీసా, వందనుంచి రెండొందలు డబ్బూ తీసుకు వెళ్ళే వాళ్ళని అర్ధం చేసుకోవాలి

పుణ్యక్షేత్రంలో అయితే అభ్యర్ధితో పాటు ఆ పార్టీ కార్యకర్తలే కాకుండా తటస్ధులైన ఊరి పెద్దలు కొద్దిమంది మహిళలూ నడుస్తున్నారు. ఇలా అనుసరిస్తున్న ఒక బృందంతో మీరు ఏపార్టీయో బైటపడిపోయారు కదా అంటే  “అదేం మాట మనమీద గౌరవంతో వాళ్ళు వచ్చినపుడు మనం నాలుగడుగులు వాళ్ళతో కలసి నడవడం మనకి వాళ్ళకీ మర్యాదకదా! ఓటంటారా ఎవరిష్టం వాళ్ళది” అన్నడు ఒకాయన.

ఈ పరిశీలనలో నాకు అర్ధమైన విషయాలు….

1) పట్టణాల్లోకంటే లేదా పట్టణాలకు ధీటుగా పల్లెల్లోనే తెలుగుదేశం పార్టీ నెట్ వర్క్ చాలా బాగుంది(నెట్ వర్క్ ఉన్నంత మాత్రాన ఆ పార్టీ గెలుస్తుందని నా ఉద్దేశ్యం కాదు గెలుపోటముల కారణాలు ఫ్యాక్టర్లు వేరే వుంటాయి.)

2) అన్నిటికీ మించి గ్రామాల్లో రూపాలు మారినా ఆలోచనలు అలాగే వున్నాయి. ఇలా పరిశీలించిన గ్రామాలన్నీ రాజమండ్రి చుట్టూ వున్నవే! ఆ ఊళ్ళలో జీన్ పాంట్లు,  త్రీపోర్త్ షాట్లూ, కొత్తమోడల్ బైకులూ, చిన్నకార్లూ, స్మార్ట్ ఫోన్లూ

కొత్త డిజైన్ ఇళ్ళూ, ఎసి యూనిట్లూ కనిపిస్తున్నాయి. 

పట్టణ సదుపాయాలన్నీ వారు అనుభవిస్తున్నారు. జీవనశైలి మార్చుకుంటున్నారు. అయినా వారు సామూహిక మౌలిక స్వభావాన్ని కోల్పోలేదు. (ఈలక్షణాన్ని పట్టణాలు పోగొట్టుకున్నాయి.)

ప్రతి ఊరి లోనూ జనానికి వున్న “మన ఊరు, మన గౌరవం, మన మర్యాద” అనే స్పృహ, అది ఇచ్చే ఎమోషన్ , ఆ ఎమోషన్లను ప్రేమగా తడిమిచూసుకోవడం ఇంకా వుంది. ఇది నాకు భలే నచ్చేసింది. చాలాసంతోషమనిపిస్తోంది.

(రెండు బృందాలతో నేను చేసిన ఈ పరిశీలనలో ఒక బృందంలో ఇద్దరు సెఫాలజిస్టులు వున్నారు. రెండో బృందంలో నా మిత్రులు ఉప్పులూరి సుబ్బారావు, మధుఫోమా్ర వున్నారు)