Search

Full Story

All that around you

Month

April 2014

♦️ ఎండాకాలం – నైట్ వాక్


☀️ మండే కాలంలో బతుకు ఎప్పుడూ చల్లగావుండదు. సత్తువ, సత్తా, అపహరించబడిన మనిషి నిస్సహాయతలా, అశక్తతలా వుంటుంది. 
☀️ ప్రేమ, కరుణ, దాక్షిణ్యం, సానుభూతి, క్షమ, సహభావం లేని మనుషుల్లా తడారిపోయి వుంటుంది. కరెంటుతో కొన్న గాలి చల్లదనాలకు ఉష్ణం తగ్గవచ్చు. ఉగ్రత తగ్గదు. 
☀️ రుతువులు నిత్య గ్రీష్మమైపోయాయి అంటాముకాని, పచ్చతనాన్ని కాంక్రీటువనాలుగా మార్చేస్తున్న మనమే 24/7 సమ్మరైజ్ అయిపోయాము.
⭐️ జ్వరం మిగిల్చిన రెండు రోజుల సోమరితనాన్ని వదిలించుకుని, కొంతఓపిక కూడదీసుకుని రాత్రి ఎనిమిదిన్నరకు ఇంటిచుట్టూ నాలుగే వీధులు చుట్టివచ్చినపుడు 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉద్రేకం అలాగే వుందనిపించింది. గాలిలో 67 శాతం తేమ శరీరాన్ని ఎలా మగ్గబెట్టేస్తుందో అనుభవమైంది. మూడు కిలోమీటర్ల వేగమైనా లేని గాలితో ఊరికే ఊపిరాడటం లేదని అర్ధమైంది. 
☀️ “జీవితం ఎండాకాలమైపోవడం” ఇదేనేమోననిపించింది!

🌞 ఇంతేనా!


♦️ పేలవమైతేలిపోడానికి దశాబ్దల కల అవసరమా? వచ్చినవారికీ, వేచివున్న వారికీ త్యాగాలు గుర్తొచ్చినపుడు మనసులు కన్నీరైపోవద్దా! విజయాలను ప్రస్తుతించుకున్నపుడు శరీరాలు నిక్కబొడుచుకోవద్దా! 
అక్కడున్న అది చూస్తున్న మానవ సమూహాల్లో పోరాడి సాధించుకున్న  ఉద్వేగం బద్దలైపోవద్దా! 
⭐️ తెలంగాణాను ప్రసాదించిన సోనియా ను ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతా పూర్వకంగా పిలుచుకున్న కరీంనగర్ ముచ్చట ఇది. మూలవిరాట్టే తరలివచ్చిన వేడుకలో కృతజ్ఞతే లేదు. అధినేత్రే పాల్గొన్న ఉత్సవంలో విజయమే లేదు. 
♦️ ఎంత పోరాటం? ఎన్ని బలిదానాలు? ఇదంతా ఒక్క ప్రస్తుతితో చెల్లిపోవడమేనా! 
⭐️ నాయకత్వం మాటల్లో ఒక జ్ఞాపకం, ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక ప్రేమ, ఒక వాత్సల్యం  ప్రవహించవద్దా! గుండె గొంతులో పలికినపుడేకదా అదంతా ప్రజలను సోక
తాకుతుంది. మాటల్ని మనసు అనువదిస్తేనే కదా అది గుండెనిండి గొంతులో చేరుతుంది….అదంతా చారిత్రక ఉద్వేగంగా ప్రజల హృదయాల్లో ఇంకిపోతుంది…కానీ ఇదేమీ జరగలేదే? 
♦️ అసలు ఆమాటలెక్కడ? ఒక అపురూపమైన సన్నివేశానికి ఇంత బలహీనమైన ఉపన్యాసమా? తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మరీ ఇంత బడుద్ధాయిలా! ఒక మంచి ఉపన్యాసం సోనియాతో చెప్పంచాలన్న వివేకం కూడా వారికిలేదా? 
☀️ విభజన స్పష్టమైపోయాక తెలంగాణా వార్తలమీద ఆసక్తి చచ్చిపోయింది. నేను ఎంతో అభిమానించే కెసిఆర్ ఉపన్యాసాలు కూడా చూడ్డం లేదు. ఆరాష్ట్రంతో నాకు సంబంధంలేదు కాబట్టి. 
♦️ ఇవాళమాత్రం చాలా ఆసక్తితో టివిముందు కూర్చున్నాను. నా వాటా తేల్చకుండా నాముఖ్య పట్టణమేదో చెప్పకుండా నా మాట వినకుండా నన్ను అవమానించి నా ఇంటి నుంచి బయటికి నడువ్ అని నన్ను గెంటేసిన సోనియా కసాయితనాన్ని ఎన్నటికీ క్షమించలేను. నాకు దెయ్యమైన సోనియా తెలంగాణాకు దేవతే. ఆమె ప్రసాదమైన నేలమీద మొదటిసారి ఆమె ఏమి చెబుతుందో వినాలన్న కుతూహలంతో శ్రద్ధగా రాగద్వేషాలకు అతీతంగా సోనియా సందేశాన్ని విన్నాను. 
ఈ పాటి ఉపన్యాసానికి ఆమె రానవసరంలదని పించింది. ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి వుంటే చాలనిపించింది. నేనైనా కూడా ఒక మంచి ఉపన్యాసం రాసి వుండేవాడినేమో అనిపించింది.
☀️ అపురూపమైన ఒక ఘట్టాన్ని పేలవంగా ముగించేసిన తెలంగాణా కాంగ్రెస్ పెద్దలు దౌర్భాగ్యులే!

☀️ "ఏం తమాషా చేస్తున్నారా" ?


☀️ “ఏం తమాషా చేస్తున్నారా” ?
☀️ చంద్రబాబుకి కోపమొస్తే ఈ మాట అంటూ వుంటారు ఇపుడు ఇదే మాట చంద్రబాబుగారిని  అడగాలి
☀️ బిజెపితో  తెలుగుదేశం తెగతెంపులు చేసుకోవాలనుకుంటుంటోదని అందుకు కారణాలతో సహా అదేపనిగా టివిలో వార్తాకథనాలు వస్తాయి. 
చంద్రబాబు దాన్ని ఖండించరు. అవుననరు. కాదనరు .రియాక్షన్ల కోసం తమాషా చూస్తూంటారు. 
☀️ బిజెపికి ఇచ్చిన నాలుగు లోక్ సభా సా్ధనాల్లో పద్నాలుగు శాసనసభా స్ధానాల్లో ఆపార్టీ తనకు నచ్చిన అభ్యర్ధుల్ని పెట్టుకుంటే తెలుగుదేశం ఓడిపోతుందా? 
☀️ మరి కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి తెలుగుదేశం  ఎన్నిసీట్లు ఇచ్చింది. ఆసీట్లలో విజయాలు ఖాయమా ఆసీట్లలో తెలుగు తమ్ముళ్ళు ఆనందోత్సాహాలతో కాంగ్రెస్ అన్నయ్యల్ని గెలిపించేస్తారా? 
☀️ కాంగ్రస్ నుంచి వచ్చిన వలసల వల్ల తెలుగుపార్టీలో రేగిన కంపుని కప్పెట్టుకుని, అదంతా చిన్న బిజెపికి పులిమేస్తారా!
☀️ తెగతెంపులకు సిద్ధంగా వున్నట్టు రాత్రి లీకేజి కథనాలు..తెల్లాసేసరికి బిజెపి కి కేటాయించిన సీట్లలో తెలుగుదేశం తమ్ముళ్ళు నామినేషన్లు…తగాదా పరిష్కరించడానికి తెలుగుదేశం చేసిన కృషి ఏమిటి?  ఆరోపణా, తీరూ్ప తెలుగుదేశానిదేనా? ఆంతా ఏకపక్షమేనా? 
☀️ ఏం తమాషా చేస్తున్నారా? 
 ☀️ 14 అసెంబ్లీ స్ధానాల్లో, 4 పార్లమెంటు స్ధానాల్లో తగాదాలని పరిష్కరించుకోలేని తెలుగుదేశం బిజెపి పార్టీలు రేపు రాష్టా్రన్ని, దేశాన్ని ఏంచేస్తారు? 
☀️ తెలుగుదేశం బలమో బిజెపి బలమో సీమాంధ్ర ప్రదేశ్ లో ఆకస్మింగా పెరిగిపోలేదు. అలా పెరిగిపోడానికి ఈ రెండు పార్టీలూ ఊడబొడిచిందేమీ లేదు. దుర్మార్గమైన పద్ధతిలో రాషా్ట్రన్ని సోనియా విభజించడంవల్ల ఆమె పై ఏర్పడిన అసహ్యం ఆగ్రహాలవల్ల ఈరెండుపార్టీలమీదా ఆదరణ పెరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా తెగతెంపులు అంటే ఈ రెండుపార్టీల తాళ్ళు కూడా తెగిపోతాయి.

గెలుపుగుర్రాలపై బలుపు గుర్రాలు (పన్నుకట్టని డబ్బు x ఆడ్డగోలు డబ్బు)


ఒకప్పుడు స్తోమతగలవారే అంటే ఎక్కువెక్కువ భూములున్నవారు ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి పోటీచేసేవారు. స్వతంత్రపార్టీ నుంచి (ఇండిపెండెంట్ల కాదు) కూడా వారే పోటీపడేవారు.
భూస్వాములే కాదు సామాన్యులు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, భూస్వాములపై సామాన్యులు గెలవవచ్చని కమ్యూనిస్టులు నిరూపించారు. ప్రజాప్రాతినిధ్య వ్యవస్ధ ను సంపన్నులు/భూస్వాములనుంచి మొట్టమొదటి సారి విముక్తం చేసింది కమ్యూనిస్టు పార్టీలే!
మరోవైపు ఉత్పాదక పెంచుకోలేక ఖర్చులు తగ్గించుకోలేక కొందరు భూములు అమ్మేసుకుంటున్న ఆర్ధిక ధోరణి. అదేసమయంలో వ్యవసాయంలో మిగుళ్ళను ఇతర వ్యాపారాలలో పెట్టుబడులుగా పెట్టి క్రమంతప్పకుండా వ్యవసాయం కంటే ఎక్కువ
ఆదాయాలు ఇచ్చే సంపదలు సృష్టించుకున్న రైతు కుటుంబాలవారు, సినిమాలు, హొటళ్ళు, వస్త్రాలు, ఫైనాన్స్ లాంటి వ్యాపారాలు- సంపన్న/భూస్వామ్య/రైతు కుటుంబాల్లో రెండో తరం వారి సంపదలను అనేకరెట్లు పెంచేశాయి. వీరిని న్యూరిచ్ క్లాస్ అన్నారు. ఇలా పెరిగిపోయిన సంపదలనుంచి మొలుచుకొచ్చిన ‘అతి’పోకడల మనుషులను నడమంత్రపు సిరిగాళ్ళు అనేవారు.
సమాజంలో ఏ మార్పువల్లయినా సంక్రమించే ఫలాలు అయినా ముందుగా ఆధిపత్యకులాలకే అందుతాయి. రెడ్లు, కమ్మలు, వెలమలు, రాజులు…ఇలాంటి కులాలలో ని న్యూరిచ్ వర్గాలే రాజకీయ అధికారాల్లోకి రావడం మొదలయ్యాక అన్ని రాషా్ట్రలలోను కాంగ్రస్ గుత్తాధిపత్యం విచ్ఛిన్నమవ్వడం మొదలైంది. 
ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాక డబ్బే ప్రధానంగా సామాజికంగా రాజకీయంగా ఆర్ధికంగా ప్రభావంచూపించే ఒక వర్గం పుట్టుకొచ్చింది. పనివిలువను రికార్డుల్లో అనేక రెట్లు పెంచేసి, అధికారంలో వున్నవారికి దగ్గరగా వున్నవారికి యోగ్యతలు అర్హతలతో నిమిత్తం లేకుండా ఆదాయాలనిచ్చే కాంటా్రక్టులు కట్టబెట్టడమే ఈ విధానం. వారు ఆపనులను ఇతరులకు సబ్ కాంటా్రక్టులకు ఇవ్వడం ద్వారా అడ్డగోలు డబ్బు వచ్చిపడటం మొదలైంది. 
ఇది రాజకీయ అధికారంలో వున్నవారు వారి ఆశ్రితులు పంచుకోవడం సంస్కరణలు అమలులో వున్న ప్రతీచోటా జరిగుతున్నదే. ఇలా రాత్రికి రాత్రే మహాసంపన్నులైపోయిన వారిని “క్రోనీ కేపిటలిస్టులు”/ఆకస్మిక అడ్డగోలు సంపన్నులు అంటున్నారు. 
సంస్కరణలు అమలులో వున్న ప్రతీరాష్ట్రంలోనూ ఈధోరణి వున్నా ఆంధ్రప్రదేశ్ లో వున్నంతగా ఇంకెక్కడా లేదు. చంద్రబాబు హయాంలో ఇది పదుల రెట్లలో వుంటే వై ఎస్ హయాంలో ఇది వందల రెట్లకు పెరిగింది. 
విద్యావిస్తరణ,  కమ్యూనికేషన్లు, రవాణా విస్తృతులవల్ల ప్రపంచంతో పరిచయం పెరిగి వెనుక బడినతరగతుల వారిలో చైతన్యం పెరిగింది. కులమతాలకతీతంగా నమ్ముకున్న వారికి ఏదైనా కట్టబెట్టే వై ఎస్ లక్షణం వల్ల ఆధిపత్య కులాల వారితోపాటు వెనుకబడిన వర్గాల వారు కూడా క్రోనీ కేపిటలిస్టులయ్యారు. 
ఇలాంటి ఆకస్మిక సంపన్నులు రాష్ట్రంలో 1500 మంది వరకూ వున్నారు. ఒక అవసరానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలంటే మరో ఆలోచన లేకుండా సిద్ధమైపోగల స్తోమత వీరిది. 
పదిహేనేళ్ళుగా అన్ని రాజకీయపార్టీలూ ఎన్నికల్లో పోటీచేయడానికి “గెలుపు గుర్రాల”నే వెతకడం మొదలైంది.
గెలుపు గుర్రాలంటే బాగా ఖర్చుపెట్టేవారనే అర్ధం.
క్రోనీ కేపిటలిస్టులనే అడ్డగోలు సంపన్నులు కొంతకాలంగా “గెలుపు గుర్రా”లౌతున్నరు. వారి సంపదలు జనంనోళ్ళలో పడి వివాదమౌతూండటంతో వాటి కాపలాకైనా రాజకీయాధికారం తప్పని సరౌతోంది. దీంతో గెలుపు గుర్రాలకు అండదండలు అందించిన “ఆకస్మిక సంపన్నులు” స్వయంగా పోటీ కి దిగిపోతున్నారు. వారికి పార్టీసిద్ధాంతం, ప్రజలపట్ల విశ్వాసం లాంటివి వుండవు. ఫిరాయింపులు పెద్దవిషయం కాదు.
ఇందువల్ల సాంప్రదాయికమైన “గెలుపు గుర్రాలు” 
కొత్తగా వస్తున్న”బలుపుగుర్రాల”తో పోటీ పడక తప్పని పరిస్ధితి ఎదురౌతోంది. 
జాగ్రత! 1500 వందల మంది చేతుల్లోవున్న అడ్డగోలు సంపదల్లో అన్నిపార్టీల్లోనూ వందల కోట్ల రూపాయలు పరిచెయ్యగల బలుపు గుర్రాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని తొక్కేసి ఈడ్చుకుంటూ పోడానికి సిద్ధమై కాలుదువ్వుతున్నాయి. 

Blog at WordPress.com.

Up ↑