Search

Full Story

All that around you

Month

May 2014

ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఇక పోలికా పోటీ!


ఉత్పత్తి-వినియోగం ఒకేచోట ఉంటే పన్నులుండవు
దిగుమతి వస్తులపై తప్పని వ్యాట్ పన్నులు
విభజన తరువాత వాట్ టాక్స్ వల్ల –
తెలంగాణాలో విద్యుత్, పెటో్రలు, స్టీలు …
ఆంధ్రప్రదేశ్ లో సిమెంటు, మందులు, లిక్కర్ల
ధరలు పెరిగే అవకాశం 
ప్రజలమీద పడే అదనపు భారాల విషయంలో ప్రభుత్వాలు  మౌనంగా వుంటాయా ఏమైనా చేస్తాయా అన్నది చూడాలి
14 వేల కోట్ల రూపాయలలోటుతో ఆంధ్రప్రదేశ్
7 వేల కోట్లరూపాయల లోటుతో తెలంగాణా 
కొత్తజీవితాలు ప్రారంభిస్తున్నాయి..
రాజధానితోసహా మౌలికవసతులను నిర్మించుకోవలసిన పేదరికంలో ఆంధ్రప్రదేశ్ 
అధునాతన రాజధాని వుండి ఇతర పట్టణాలను అభివృద్ది చేసుకోవలసిన ప్రశాంతతతో తెలంగాణా
ఏమైనా తెలుగు ప్రజలందరూ రెండు రాషా్ట్రల్లో కష్టసుఖాలకు ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయిడిగారిని, చంద్రశేఖరరావుగారినీ ప్రతి సందర్భంలోనూ (కొంతకాలంపాటు) పోల్చిచూసుకుంటారు 

తాడుమీద తెలుగుదేశం నడక !


తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం రిత్యా ఎదురే వుండదు. అయినా ఇష్టారాజ్యంగా పాలించడానికి అవకాశంలేదు.. రాష్ట్రపునర్నిర్మాణంలో వనరులను నిధులనూ కూడగట్టుకోవడం పెద్ద కష్టం. జనరంజకంగా పాలించడం అంతకుమించిన కష్టం.
ఎందుకంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా జగన్ కి అనుకూలంగా ఓటువేసిన వారి సంఖ్య నూటికి నలభైతొమ్మిది మంది. 
డబ్బులేని కారణంగా వైద్యంలేక ఏ ఒక్కరికీ అర్ధంతరపు చావురాకూడదన్న వైఎస్ రాజశేఖరరెడ్డి గారి  “మానవీయ”పధకం ఆరోగ్య శ్రీ పధకం – జగన్ సాధించిన 49 శాతం ఓట్లలో కీలక పాత్రవహించింది. 
జగన్ మద్దతుదారులు ఒక విధమైన షాక్ లో ఉన్నారు. జగన్ మౌనంగా వున్నారు.ఆయన కార్యాచరణలోకి దిగకముందే తెలుగు దేశం తన వ్యతిరేక ఓటర్లను తటస్ధ పరచకపోతే మళ్ళీ ఎన్నికల వరకూ రెండు పార్టీల మద్దతుదారుల మధ్యా సామరస్యం కాక కనిపించని ఉద్రిక్తత వుంటుంది.. ప్రశాంతత లేని ఈ పరిస్ధితి అభివృద్ధికి అవరోధమే అవుతుంది.. ఎలాచూసినా తెలుగుదేశం భవిష్యత్తు తాడుమీద నడకలాగే కనబడుతోంది
సున్నితమైన విషయాలపై నోరుమెదపకపోవడం ప్రతీ తెలుగుదేశం నాయకుడూ టివిగొట్టాలముందు జగన్ పార్టీ మీద దుమె్మత్తిపోయకుండా వుండటం లాంటి చర్యలు తెలుగుదేశానికి ఉపయోగపడుతాయి… 

దాహం ఒక దెయ్యమే!


ఉపశమించని దాహంతో దేహం ఆర్చుకుపోవడం తెల్లవారుతూనే మొదలౌతోంది. వైశాఖ మాసమంటేనే జీవుల గొంతెండిపోవడం.. ఇంతకాలమూ ఫోకస్ అంతా ఎన్నికలమీదే ….అందుబాటులో సీసాలకొద్దీ నీళ్ళు వుండటం వల్ల దాహ బాధ తెలియకుండాపోయింది.
నీళ్ళు దగ్గర లేనపుడు దాహం ఎలా పీడిస్తుందో 
(దాదాపు 50 రోజుల తరువాత)మార్నింగ్ వాక్ కి వెళ్తూంటే అనుభవమయ్యింది..ఎటుచూసినా భవనాలు ఎదురుగా కనుచూపు మేరా రోడ్డు..అక్కడడక్కడా అటూఇటూ తిరిగే మనుషులు…బిక్కుబిక్కు మంటున్నట్టు మొక్కలూ చెట్లే…
దాహాన్ని వదలని దెయ్యం అందామా, పీడించే పిశాచం అందామా అనుకుంటూండగానే నా కానుగ చెట్టు నీడకు చేరిపోయాను. అక్కడ ఒక పెద్దరాయి వుంటుంది..దానిమీద కూర్చుని ఓనిమిషం కుదుటపడ్డాక దాహపీడన తగ్గినట్టుంది. చెమట ఆరుతున్న శరీరం, తెరలు తెరలు గా తాకుతున్న చల్లగాలికి చిన్నగా గాలిలో తేలిపోతున్న అనుభవం… ఎంతడబ్బిచ్చినా స్విచ్చివేసి ఈ హాయిని కొనుక్కోలేము.
చెట్టుకాండమంతా పసుపు నారింజ బూడిద రంగులు కలిపేసిన కొత్త రంగుతో కాంతివంతంగా నున్నగా పచ్చగావుంది.. ఆకులు ముదురు ఆకుపచ్చరంగులో దట్టంగా వున్నాయి. వసంత రుతువుని పూర్తిగా తొడుక్కున్న చెట్టు ఇంత అందంగా వుంటుంది..
ఆకులు కదలిక – అలసటతో చెట్టుకింద చేరిన నన్ను గాలివిసిరి సేదతీర్చినట్టూ, ఎలావున్నావని పలకరించినట్టూ, అనిపించింది..నాకొత్తబట్టలు చూశావా అని అడగకుండానే అడిగినట్టు ముదురుపచ్చటి సోయగాలు చూపిస్తున్నట్టు అనిపించింది. తిరిగి వస్తూ వెనక్కి చూసినపుడు చేతులై వీడ్కోలు చెబుతున్న ఆకులు – Take care అన్నాయనే అనిపించింది
23/5/2014 శుక్రవారం శుభోదయం:-) 
 

జ్ఞాపకాలంటే ఒకే జీవితంలో అనేక జీవితాలు


చెరువు నిండిన నీరు మరో చెరువులోకి మరలిపోయే దారే “జాలు”. ఈ జాలులే పుంతలు…ఊరికీ ఊరుకీ మధ్య రహదారులు.. అవన్నీ చౌడునేలలే వర్షాకాలంలో అక్కడ నడక నరకమే. పాదాలు వాచిపోయి/ఉబ్బిపోయి దురదలు…మంటలు…పొలంలో ఉన్న ఇంటికీ చిన్నావారిగూడెంలో బడికీ ఏడు ఫర్లాంగుల దూరం (8ఫర్లాంగులు ఒక మైలు) టీచరైన అమ్మ, నాలుగో క్లాసు లో వున్ననేను రోజూ పోకరాక, పోకరాక నాలుగుసార్లు జాలులోనే నడక. కాలి దురదలు వాపు భరించలేనపుడు కాలి వేళ్ళను ఒకొటొకటిగా పురికొస(తాడుతో) గట్టిగా చుట్టి సేప్టీపిన్ ను దీపంవెలుగులో కాల్చి వేలిమీద పడిస్తే నల్లటి నెత్తురు వచ్చేది. దాన్ని నక్కనెత్తురు అనేవారు. నక్కనెత్తురు బయటికి వచ్చేస్తే  మంట దురద వాపు తగ్గేవి. ఈ చికిత్స పదిపదిహేను రోజులకోసారి వుండేది. 
మా అమ్మ ఏడిస్తే మా ఇంట్లో వుండే దూరపు బంధువైన ఒక పెద్దావిడ విసుక్కునేది…మా అమ్మ ఎంత బాధైనా ఓర్చుకునేది… నేను ఏడ్చినపుడే ఏంచేయలేక తను ఏడ్చేది (అని నానమ్మకం అసలు ఏ అమ్మైనా ఇంతే) 
ఒక సారి ఇంటి దూలం నుంచి పడిన తేలు ముందు అమ్మని కుట్టింది. తను చేయ్యి విదిలించడం వల్లో ఏమో పక్కలో వున్న నా మీదపడి నన్ను కుట్టింది మాకేకలకు నాన్నలేచి తేలుని గుర్తించి చంపేశారు. తెల్లవార్లూ ఇద్దరం ఏడుపే..ఇంట్లో వున్న పెద్దావిడ విసుక్కున్నపుడు అమ్మ కసిరేసుకుంది -మీకు దయా కనికరాలు లేవు చిన్నవాడు నక్కనెత్తురుతో బాధపడినపుడూ తేలుమంట ఆపుకోలేనపుడూ ఒకటే మాటా ఆపండి- అనేసింది 
మదర్స్ డే మెసేజిలు చదువుతుంటే మా అమ్మ గుర్తొస్తూంది 
1983 నుంచి 86 వరకూ తిరుపతి ఈనాడులో పనిచేశాను. దాదాపు ప్రతీనెలా హైదరాబాద్ మీటింగ్ కి వెళ్ళే వాడిని. అయిపోయాక గౌలిగూడా బస్ స్టాండ్ కి వచ్చి తిరుపతి / రాజమండ్రి బస్సుల్లో ఏది ముందు వస్తే ఆబస్సు ఎక్కేవాడిని చాలాసార్లు రాజమండ్రిబస్సే ముందువచ్చేది ఆబస్సులో జంగారెడ్డిగూడెంలో దిగిపోయి సాయంత్రంవరకూ అమ్మతోనే వుండేవాడిని . సాయంత్రం ఏలూరు బస్సెక్కి అక్కడినుంచి విజయవాడ బస్సెక్కి అక్కడినుంచి తిరుపతి బస్సెక్కేవాడిని. 86 ఫిబ్రవరి ఏప్రిల్ మీటింగ్స్ అయిపోయాక రెండుసార్లూ తిరుపతి బస్సులే ముందు రావడం వల్ల ఇంటికి వెళ్ళలేకపోయాను. 
బాగాతిరుగుతున్న అమ్మ ఏప్రిల్ 9 ఉదయం ఆకస్మికంగా చనిపోయింది. 
14 రోజుల తరువాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాక చూస్తే మా అమ్మ రాసిన చివరి ఉత్తరం వుంది
“చూసి చాలా కాలమైపోయింది. బెంగగావుంది. ఒక సారి జీతనష్టం సెలవుపెట్టయినా సరే తప్పకుండా రావలెను. చార్జీల డబ్బు నేను ఇవ్వగలను. సెలవు కష్టమైతే ఉత్తరం రాయవలెను ఎలాగో ఒకలాగ నేనే రాగలను” 
ఇదే ఆ కార్డులో సారాంశం..
మనుషులు శాశ్వతం కాదు. జ్ఞాపకాలు మనుషులకంటే జీవితాన్ని గాఢంగా అల్లుకుంటాయి. ఒకే జీవితంలో అనేక జీవితాలైనంతగా కిక్కిరిసిపోతాయి. ఇవి సుఖదుఃఖాల ఉద్వేగాలు. ఇవిలేని మనుషులు అమానవులైపోతారు. ఇవి శూన్య అసంబంధాలను,  చైతన్య సంబంధాలుగా మలుస్తాయి. యంత్రభూతమైన జీవనశైలి జనారణ్యంలో మనుషుల్ని ఏకాకులుగా మార్చకుండా కాపాడటానికి పిల్లలకోసం జ్ఞాపకాలను గుర్తుచేయాలి. జ్ఞాపకాలను తడిమిచూడాలంటే మనసుకి వేళ్ళుండాలి…
(ఇది చెప్పడానికే నాకు తప్ప ఎవరికీ అవసరం ఆసక్తి లేని ఇంత సోదీనూ…) 

కాలుజారిందా? తలతిరిగిందా?


ఎలకా్రనిక్స్, కమ్యూనికేషన్సు అనుసంధానమయ్యాక అన్నిరంగాల స్వరూప స్వభావాలే మారిపోతున్నాయి. ఇందులో వైద్యరంగం సాధిస్తున్న ప్రయోజనాలు అతిముఖ్యవైనవేమో అనిపిస్తోంది. ఇది రాజమండ్రిలో నేను చూసిన ఒక అనుభవం
ఒక ప్రముఖుడు బాత్ రూమ్ లో పడిపోయారు. మోచేతిదుగువ చిన్న ఫ్రాక్చర్ అయ్యింది. అక్కడ పట్టీవేశారు. మూడునాలుగు వారాలకు అది మానిపతుంది. అసలు ఎందుకు పడ్డారు ? అన్న ప్రశ్న నుంచే ఈ కథమొదలయ్యింది. 
జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్లో నిపుణులు ఆయన్ని ఈ ప్రశ్న అడిగారు. తలతిరగడం వల్ల ఏమో అన్న సమాధానం విని ఇసిజి (ఎలకో్ట్ర కారిడియో గ్రాఫ్) తీశారు. చిన్న తేడా వుంది. ఒకరోజంతా హాస్పిటల్ వుండాలి 24 గంటలూ ఇసిజి రికార్డు చేయాలని సూచించారు. అలావీలుపడదన్నపుడు ప్రత్యామ్నయంగా ఒక సూక్ష్మమైన ఇసిజి పరికరాన్ని ఆయన ఛాతికి అంటించారు. 24 గంటల తరువాత తొలగించి 24 గంటల కాలంలో ఆయన గుండె పై ఎలకి్ట్రక్  యాక్టివిటీ ప్రభావాన్ని విశ్లేషించారు. 
ఇందులో చిన్నలోపాన్ని చూశారు. హార్ట్ బీట్ ఒకోసారి పెర్ ఫెక్ట్ గా వుండటం లేదని నిర్ధారణకు వచ్చారు. మరింత డాటా వుంటేనే ఖచ్చితమైన మందు సూచించవచ్చు కాబట్టి “ఈవెంట్ లూప్ రికార్డర్” ELR 
ని ఉపయోగించాలని నిర్ణయించారు.
ఇది అంగుళం వెడల్పు మూడంగుళాల పొడవు వున్న పరికరం. దీన్ని ఆయన ఎడమచాతిమీద ప్లాస్టర్లు వేసి బిగించారు. ఇది శరీరంలో ఎలకి్ట్రక్ ఏక్టివిటీని ఎప్పటికప్పుడు నమోదుచేస్తుంది. ఇది వున్న వ్యక్తికి 9 మీటర్లదూరానికి మించకుండా సెల్ ఫోన్ సైజులో వున్న రిమోట్ సెన్సింగ్ టా్రన్స్ మీటర్ వుంచుకోవాలి (జేబులో వేసుకోవచ్చు దగ్గరలో వుంచుకోవచ్చు. ఇది సిమ్ కార్డుతో పనిచేస్తుంది. నెట్ వర్క్ లేని ప్రాంతానికి వెళ్ళినా ఇబ్బందిలేదు. నెట్ వర్క్ లోకి రాగానే ELR లో డాటాను తీసుకుని శాటిలైట్ కి పంపుతుంది శాటిలైట్ నుంచి అమెరికాలోని ఆసంస్ధ కు చేరుతుంది. అదంతా ఇ మెయిల్ ద్వారా డాక్టర్లకు చేరుతుంది.
ఈ ఉదయం ఆ ప్రముఖునికి ELR వేశారు. తాము  ఏడాదికాలంలో దేశవాప్తంగా 75 పట్టణాలు నగరాల్లో 2000 మందికి ELR అమర్చామని రాజమండ్రిలో ఇదే మొదటిసారని ఆసంస్ధ ప్రతినిధి చెప్పారు..
 

కురిసింది వాన…


అర్ధరాత్రి వేళ గంటపాటు ఉరిమిన ప్రతీ ఉరుమూ జీవితాన్ని ఆకస్మికంగా జంక్షన్ లో నిలబెట్టి ఎటువైపు నీనడక అని భయపెట్టినట్టయింది! 
తెల్లవార్లూ ఆగి ఆగి కురిసిన వానలో స్నానం చేసిన చెట్లు ఆకులలు మెరుస్తున్నాయి. దుమ్మూ ధూళీ వొదిలిన ఊరు యవ్వనంలో మిలమిలలాడుతున్నట్టుంది. మెత్తబడిన నేల కాలుమోపిన చోట అమ్మై హత్తుకున్నట్టుంది. 
కానికాలపు వాన ….చల్లగా హాయి ఇస్తున్నట్టు, అల్పపీడనాలో వాయుగుండాలో లేకపోతే కురవనే కురవను అని భయపెడుతున్నట్టూ వుంది. 
మాగాణుల్లోనే ధాన్యం రాశులు పోసిన రైతుల ఆశలకింద వాననీరు కమ్ముకున్నట్టుంది. మాసూళ్ళకు సిద్ధంగా వున్న వరిపనలు తడిసి రైతుగుండెలా బరువెక్కినట్టున్నాయి.

☀️ జనంనాడి ఎలావుంది?


(2014 ఎన్నికల నేపధ్యం! జాతీయ స్ధాయిలో)
♦️ కాంగ్రస్ అధ్యక్షురాలి హోదాలో యిపిఎ చైర్ పర్సన్ హోదాలో దేశాన్ని పాలిస్తున్న సోనియా, ఆమె కోటరీ బాధ్యత లేని అధికారాల్ని చెలాయించడం దేశ, విదేశాల్లో భారతదేశ ప్రజాస్వమ్య విలువల్ని పలచన చేశాయి. 
అవినీతి, కుంభకోణాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి
♦️ బిజెపికి మించిన ఎత్తుకి నరేంద్రమోదీ పెరిగిపోయారు. ఆయన మాట కాదనలేని అనివార్యతను ఆయన పార్టీముందుంచారు. వ్యక్తిపూజలో కాంగ్రస్ పార్టీకి సరితూగే స్ధితిని బిజెపికి తెచ్చిపెట్టారు
♦️ వామపక్షాలు క్రియాశూన్యమవ్వడం వల్ల మూడో ప్రత్యామ్నయం దిశగా ఆలోచనా చర్చా లేకుండాపోయింది. కాంగ్రస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక, తటస్ధ శక్తులను కూడగట్టే యంత్రాంగమే లేకుండా పోయింది.. ఎన్నికల తరువాత మూడో ఫ్రంట్ ఏర్పడినా అందులో సూత్రబద్ధత కంటే అవకాశవాద/అనివార్య తలే ఎక్కువగా వండవచ్చు.
♦️ ఒక సారి ఖర్చయితే తిరిగి పొందలేని సహజవనరులను పాలకులు కొన్ని కోట్లరూపాయలకు తెగనమ్ముకునే ధోరణి యుపిఎ హయాంలో మొదలైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా వుంది
⭐️ రాష్ట్ర స్ధాయిలో
♦️ అన్ని రాషా్ట్రల్లో ఎన్నికల వాతావరణం కొద్దినెలలక్రితమే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పటి నుంచీ మొదలైంది. అయితే ఈ కథ 2004 ఎన్నికల ముందు నుంచే ప్రారంభమైంది. రాష్ట్ర విభజన ఇందులో మరికొన్ని చిక్కుముడులను వేసింది. 
♦️ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 లో నినదించిన “సంక్షేమ”నినాదం బాబు ఓటమికి పైకి కనిపించే కారణం. ఆయితే ఆ ఓటమికి మూలం ఆర్ధిక సంస్కరణల అమలులో చంద్రబాబు మోడల్ ని  ప్రజలు తిరస్కరించడమే! 
♦️ అధికారానికొచ్చిన వైఎస్, సమాజ సంక్షేమాన్ని ఓట్ల రాజకీయాల సైజుకి మార్చేశారు. కమ్యూనిటీ మౌలికసదుపాయాలు పెంచి వ్యక్తుల ఆర్ధిక స్ధితులు మెరుగుపరచవలసిన సూత్రాన్ని వదిలేసి వ్యక్తిగత లబ్ధి ఇచ్చే సబ్సిడి సంక్షేమాన్ని విస్తరింపజేశారు. 
♦️ ఉత్పత్తినీ ఉత్పాదకతనూ ధ్వంసం చేసిన  ఈ విధానం వైఎస్ ను 2009 కూడా అధికారంలోకి తెచ్చింది. ఇందుకు ఆయనకు బొటాబొటి మద్ధతు మాత్రమే లభించింది.
☀️ ఇంతలో రాష్ట్ర విభజన మరో సమస్య అయింది. కాంగ్రెస్ బిజెపి లాంటి జాతీయ పార్టీలే విభజన లాభాన్ని తాముతీసుకుని నష్టాన్ని ఎదుటి పార్టీకి అంటగట్టే పిల్లిమొగ్గలు వేశాయి. 
☀️ ఇలాంటప్పుడు ఒకే రాష్ట్రంలో వున్న పార్టీని రెండు ప్రాంతాల్లో కాపాడుకోడానికి రెండు కళ్ళ సిద్ధాంతం మినహా తెలుగుదేశానికి ఇంకోదారిలేదని ఎవరికైనా అర్ధమౌతుంది( తెలుగుదేశాన్ని వ్యతిరేకించేవారికి ఇదే పెద్దపాయింట్ అయితే అది వేరే సంగతి) 
♦️ వైఎస్ కార్యక్రమాలు కొనసాగింపు, అభివృద్ధి తప్ప జగన్ పార్టీకి వేరే అజెండాలేదు. చంద్రబాబు నినాదం కూడా ఇంచుమించు ఇదే. 
☀️ ఇంతలో రాష్ట్రం విడిపోయింది. ఆవెంటనే సీమాంధ్రలో చంద్రబాబు గ్రాఫ్ పెరగడం జగన్ పట్ల ఆదరణ తగ్గడం కనిపిస్తోంది. ఇందులో కొత్తగా చంద్రబాబు చేసిన ఘన కార్యాలూ లేవు జగన్ కొత్తగా చేసిన దారుణాలూ లేవు. 
♦️ ఈ ఇద్దరూ సిద్ధం చేసుకున్న ఎన్నికల ఎజెండాను రాష్ట్రవిభజన పక్కకి నెట్టేసింది. 
♦️ సీమాంధ్రలో ప్రాధాన్యతలు మారిపోయాయి. జగన్ మీద కొత్తగా కోపంలేదు కాని, చంద్రబాబు మీద మాత్రం ప్రేమ పుట్టుకొచ్చింది. కొత్తరాష్టా్ర నిర్మాణానికి కొత్త వ్యక్తి కంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబే సరైన వ్యక్తి నయమన్న నమ్మకం కుదిరింది. 
♦️ దీన్ని పసిగట్టి, సీమాంధ్రులు ఇప్పట్లో కాంగ్రెస్ ను క్షమించలేరని అంచనా వేసిన బాబు బిజెపితో చేయికలిపారు. ఈ నిర్ణయం వల్ల సీమాంధ్రలో  తెలుగు దేశం బిజెపిల కాంబినేషన్ కి ఆదరణ పెరిగింది.  
♦️ మొత్తానికి సీమాంధ్రలో రెండు ఎన్నికల నినాదాలు వున్నాయి. ఒకటి రాష్ట్ర నిర్మాణం,  అభివృద్ధి – రెండు వై ఎస్ పధకాల కొనసాగింపు, అభివృద్ధి  ఈ నినాదాలిచ్చిన ఇద్దరు నాయకులికీ పెద్ద మచ్చలే వున్నాయి. 
☀️ జగన్ తీవ్రమైన ఆర్ధిక నేరాల్లో కూరుకుపోయి ప్రస్తుతం బెయిలు మీదవున్నారు. చంద్రబాబు నిలకడలేని మనిషిగా నిర్ణయాలు మార్చుకునే నాయకుడిగా మచ్చమోస్తున్నారు
♥️ జగన్ కు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు?
రెడ్డి వర్గంలో అత్యధికులు, గ్రామీణ వృద్ధులు, నిరుపేదలు, ముస్లింలు, దళితుల్లో హెచ్చుమంది, క్రైస్తవులు, దళిత కై్రస్తవులు, వెనుక బడిన తరగతుల్లో దిగువవర్గాల వారు, బళహుజనులు, వైఎస్ పధకాల వల్ల ఆకస్మికంగా సంపన్నులైపోయిన వారు, కష్టపడలేనివారు…
రాష్ట్రవిభజనలో సీమాంధ్రులకు అవమానం జరగలేదనుకునే వారు…సీమాంధ్ర నష్టపోలేదనుకునే వారు…అసలు విభజన పెద్దవిషయం కాదనుకునే వారు
♥️ చంద్రబాబుకి ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు?
కమ్మవారు, మధ్యతరగతివారు, మధ్యతరగతి ఆపై స్ధాయి రైతులు, యువకులు, విద్యావంతులు, నడివయసువారు, మధ్యవయసు ఉద్యోగులు, రిటైర్ అయినవారు.
♥️ రెండు పార్టీలకూ మద్దతు ఇచ్చే వర్గాలలో రైతులు స్త్రీలు వున్నారు జయాపజయాలను నిర్ణయించేది వీరి సంఖ్యే!
♥️ విభజన వల్ల బాబుకి పెరిగిన కొత్తమద్ధతు
రాష్ట్రవిభజనలో సీమాంధ్రులకు అవమానం జరగిందనుకున్నవారు…సీమాంధ్ర నష్టపోయిందనుకున్న వారు..కాంగ్రస్ మీద ద్వేషంతో తెలుగు దేశం బిజెపిల కాంబినేషన్ కి మద్దతు ఇస్తున్నారు. ఈ రెండు పార్టీల పట్లా గతంలో అనుకూలత లేనివారు, జగన్ మీద కొద్దిపాటి అనుకూలత ఉన్నవారూ కూడా వీరిలో వున్నారు. ఇదే తెలుగుదేశం బలం పెరినట్టు కనిపించడానికి కారణం ఇందులో చంద్రబాబు చేసిందేమీ లేదు. 
♦️ అభ్యర్ధుల ఎంపిక జగన్ పార్టీలో తొటు్రపాట్లు లేకుండా జరిగింది. తెలుగుదేశంలో కొన్నిచోట్ల అభ్యర్ధులు ఓడిపోయే లా ఎంపికలు జరిగాయి. 
☀️ ఇందువల్ల సీమాంధ్రలో స్ధూలంగా ఒక పరిస్ధితి వుంటే కొన్ని నియోజకవర్గాల్లో వేరే వాతవరణం తలఎత్తింది. ఉదాహరణకు రాజమండ్రి అర్బన్ సీటులో బిజెపి, జగన్ పార్టీల మధ్య పోటీవుంది. స్ధానిక సమీకరణల్లో ఈ పోటీ ఒసి బిసి మధ్య పొటీగా మారిపోయింది. ఇది జగన్ పార్టీ అభ్యర్ధిని గెలిపించే లా మారింది 
☀️ గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లభించే అవకాశాలు వున్నాయి( మిగిలిన జిల్లాల గురించి నాకు సమాచారం లేదు) 
♦️ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చాలా బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోకతప్పని వాతావరణం వుంది 

😡 మరచిపోగలమా?


హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వున్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ఆదాయాలు కూడా తెలంగాణా ఖజానాలో కలిసిపోతాయి. పదేళ్ళకు మించకుండా హైదరాబాద్ లో వుండవచ్చని సోనియా దయతలిచారు. దీనర్ధం ఎంతకాలం హైదరాబాద్ లో వుంటే అంతకాలమూ ఆ రషా్ట్రనికి ఈ రాష్ట్రం ఆదాయాలను కప్పంగా కట్టాలనే. 
ఇలా సీమాంధ్ర గొంతుకోసిన సోనియా వుండగా ఆపార్టీకి ఓటు వేసేది లేదు
బిజెపి తెలుగుదేశం ఉత్తరాలు ఇచ్చినందువల్లే విభజించామంటున్నారు. ఆపార్టీలు ఇలా సీమాంధ్ర గొంతు కోసేయ్యమన్నాయా? 
జూన్ 2 తరువాత సొంత రాజధాని లేకపోతే 18000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో వున్న సీమాంధ్ర రోజూరోజూ ఆర్ధికంగా దిగజార్చేయమన్నాయా? 
ఎన్నికల తర్వాత వుంటుందో ఊడుతుందో తెలియని కాంగ్రెస్ సీమాంధ్రని దిక్కులేకుండా వీధులపాలు చేయమని ఆరెండు పార్టీలూ చెప్పాయా? 
ఇదంతా పాతకథే…గుర్తొచ్చినపుడల్లా సోనియా కాంగ్రెస్ చేసిన గాయానికి అవమానానికి రగిలిపోతున్నట్టుంది. 

ఏ నినాదం గెలుస్తుంది? కొత్త రాష్ట్ర నిర్మాణం – సంక్షేమ పధకాలు


వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 లో నినదించిన “సంక్షేమ”నినాదం బాబు ఓటమికి పైకి కనిపించే కారణం. ఆయితే ఆ ఓటమికి మూలం ఆర్ధిక సంస్కరణల అమలులో చంద్రబాబు మోడల్ ని  ప్రజలు తిరస్కరించడమే! 


అధికారానికొచ్చిన వైఎస్, సమాజ సంక్షేమాన్ని ఓట్ల రాజకీయాల సైజుకి మార్చేశారు. కమ్యూనిటీ మౌలికసదుపాయాలు పెంచి వ్యక్తుల ఆర్ధిక స్ధితులు మెరుగుపరచవలసిన సూత్రాన్ని వదిలేసి వ్యక్తిగత లబ్ధి ఇచ్చే సబ్సిడి సంక్షేమాన్ని విస్తరింపజేశారు. ఉత్పత్తినీ ఉత్పాదకతనూ ధ్వంసం చేసిన  ఈ విధానం వైఎస్ ను 2009 కూడా అధికారంలోకి తెచ్చింది. ఇందుకు ఆయనకు బొటాబొటి మద్ధతు మాత్రమే లభించింది.

అధికారానికి రెండు టెర్ములు దూరమైన చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాల మధ్య సమతూల్యం వుండే మోడల్ ని సిద్ధం చేసుకున్నారు. ఇంతలో రాష్ట్ర విభజన మరో సమస్య అయింది. కాంగ్రెస్ బిజెపి లాంటి జాతీయ పార్టీలే విభజన లాభాన్ని తాముతీసుకుని నష్టాన్ని ఎదుటి పార్టీకి అంటగట్టే పిల్లిమొగ్గలు వేస్తూంటే ఒకే రాష్ట్రంలో వున్న పార్టీని రెండు ప్రాంతాల్లో కాపాడుకోడానికి రెండు కళ్ళ సిద్ధాంతం మినహా తెలుగుదేశానికి ఇంకోదారిలేదని ఎవరికైనా అర్ధమౌతుంది( తెలుగుదేశాన్ని వ్యతిరేకించేవారికి ఇదే పెద్దపాయింట్ అయితే అది వేరే సంగతి) 

మరో వైపు వైఎస్ కార్యక్రమాలు కొనసాగింపు అభివృద్ధి తప్ప జగన్ పార్టీకి వేరే అజెండాలేదు. చంద్రబాబు నినాదం కూడా ఇంచుమించు ఇదే. ఈ రెండు పార్టీలమధ్యా తీవ్రమైన పోటీ గత మూడేళ్ళుగా పెరుగుతూనే వుంది. 

ఇంతలో రాష్ట్రం విడిపోయింది. ఆవెంటనే సీమాంధ్రలో చంద్రబాబు గ్రాఫ్ పెరగడం జగన్ పట్ల ఆదరణ తగ్గడం కనిపిస్తోంది. ఇందులో కొత్తగా చంద్రబాబు చేసిన ఘన కార్యాలూ లేవు జగన్ కొత్తగా చేసిన దారుణాలూ లేవు. 
ఈ ఇద్దరూ సిద్ధం చేసుకున్న ఎన్నికల ఎజెండాను రాష్ట్రవిభజన పక్కకి నెట్టేసింది. సీమాంధ్రలో ప్రాధాన్యతలు మారిపోయాయి. జగన్ మీద కొత్తగా కోపంలేదు కాని, చంద్రబాబు మీద మాత్రం ప్రేమ పుట్టుకొచ్చింది. కొత్తరాష్టా్ర నిర్మాణానికి కొత్త వ్యక్తి కంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబే సరైన వ్యక్తి నయమన్న నమ్మకం కుదిరింది. దీన్ని పసిగట్టి, సీమాంధ్రులు ఇప్పట్లో కాంగ్రెస్ ను క్షమించలేరని అంచనా వేసిన బాబు బిజెపితో చేయికలిపారు. ఈ నిర్ణయం వల్ల సీమాంధ్రలో  తెలుగు దేశం బిజెపిల కాంబినేషన్ కి ఆదరణ పెరిగింది.  అయితే అతిసమీపంలో వున్న జగన్ పార్టీకి ఈ ఆదరణను నిర్వీర్యం చేయగల ధనసామర్ధ్యం వుంది. 

మొత్తానికి సీమాంధ్రలో రెండు ఎన్నికల నినాదాలు వున్నాయి. ఒకటి రాష్ట్ర నిర్మాణం,  అభివృద్ధి – రెండు వై ఎస్ పధకాల కొనసాగింపు, అభివృద్ధి  

ఈ నినాదాలిచ్చిన ఇద్దరు నాయకులికీ పెద్ద మచ్చలే వున్నాయి. జగన్ తీవ్రమైన ఆర్ధిక నేరాల్లో కూరుకుపోయి ప్రస్తుతం బెయిలు మీదవున్నారు. చంద్రబాబు నిలకడలేని మనిషిగా నిర్ణయాలు మార్చుకునే నాయకుడిగా మచ్చమోస్తున్నారు  మరి ఎవరి నినాదం గెలుస్తుందో? 
Blog at WordPress.com.

Up ↑