వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 లో నినదించిన “సంక్షేమ”నినాదం బాబు ఓటమికి పైకి కనిపించే కారణం. ఆయితే ఆ ఓటమికి మూలం ఆర్ధిక సంస్కరణల అమలులో చంద్రబాబు మోడల్ ని  ప్రజలు తిరస్కరించడమే! 


అధికారానికొచ్చిన వైఎస్, సమాజ సంక్షేమాన్ని ఓట్ల రాజకీయాల సైజుకి మార్చేశారు. కమ్యూనిటీ మౌలికసదుపాయాలు పెంచి వ్యక్తుల ఆర్ధిక స్ధితులు మెరుగుపరచవలసిన సూత్రాన్ని వదిలేసి వ్యక్తిగత లబ్ధి ఇచ్చే సబ్సిడి సంక్షేమాన్ని విస్తరింపజేశారు. ఉత్పత్తినీ ఉత్పాదకతనూ ధ్వంసం చేసిన  ఈ విధానం వైఎస్ ను 2009 కూడా అధికారంలోకి తెచ్చింది. ఇందుకు ఆయనకు బొటాబొటి మద్ధతు మాత్రమే లభించింది.

అధికారానికి రెండు టెర్ములు దూరమైన చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాల మధ్య సమతూల్యం వుండే మోడల్ ని సిద్ధం చేసుకున్నారు. ఇంతలో రాష్ట్ర విభజన మరో సమస్య అయింది. కాంగ్రెస్ బిజెపి లాంటి జాతీయ పార్టీలే విభజన లాభాన్ని తాముతీసుకుని నష్టాన్ని ఎదుటి పార్టీకి అంటగట్టే పిల్లిమొగ్గలు వేస్తూంటే ఒకే రాష్ట్రంలో వున్న పార్టీని రెండు ప్రాంతాల్లో కాపాడుకోడానికి రెండు కళ్ళ సిద్ధాంతం మినహా తెలుగుదేశానికి ఇంకోదారిలేదని ఎవరికైనా అర్ధమౌతుంది( తెలుగుదేశాన్ని వ్యతిరేకించేవారికి ఇదే పెద్దపాయింట్ అయితే అది వేరే సంగతి) 

మరో వైపు వైఎస్ కార్యక్రమాలు కొనసాగింపు అభివృద్ధి తప్ప జగన్ పార్టీకి వేరే అజెండాలేదు. చంద్రబాబు నినాదం కూడా ఇంచుమించు ఇదే. ఈ రెండు పార్టీలమధ్యా తీవ్రమైన పోటీ గత మూడేళ్ళుగా పెరుగుతూనే వుంది. 

ఇంతలో రాష్ట్రం విడిపోయింది. ఆవెంటనే సీమాంధ్రలో చంద్రబాబు గ్రాఫ్ పెరగడం జగన్ పట్ల ఆదరణ తగ్గడం కనిపిస్తోంది. ఇందులో కొత్తగా చంద్రబాబు చేసిన ఘన కార్యాలూ లేవు జగన్ కొత్తగా చేసిన దారుణాలూ లేవు. 
ఈ ఇద్దరూ సిద్ధం చేసుకున్న ఎన్నికల ఎజెండాను రాష్ట్రవిభజన పక్కకి నెట్టేసింది. సీమాంధ్రలో ప్రాధాన్యతలు మారిపోయాయి. జగన్ మీద కొత్తగా కోపంలేదు కాని, చంద్రబాబు మీద మాత్రం ప్రేమ పుట్టుకొచ్చింది. కొత్తరాష్టా్ర నిర్మాణానికి కొత్త వ్యక్తి కంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబే సరైన వ్యక్తి నయమన్న నమ్మకం కుదిరింది. దీన్ని పసిగట్టి, సీమాంధ్రులు ఇప్పట్లో కాంగ్రెస్ ను క్షమించలేరని అంచనా వేసిన బాబు బిజెపితో చేయికలిపారు. ఈ నిర్ణయం వల్ల సీమాంధ్రలో  తెలుగు దేశం బిజెపిల కాంబినేషన్ కి ఆదరణ పెరిగింది.  అయితే అతిసమీపంలో వున్న జగన్ పార్టీకి ఈ ఆదరణను నిర్వీర్యం చేయగల ధనసామర్ధ్యం వుంది. 

మొత్తానికి సీమాంధ్రలో రెండు ఎన్నికల నినాదాలు వున్నాయి. ఒకటి రాష్ట్ర నిర్మాణం,  అభివృద్ధి – రెండు వై ఎస్ పధకాల కొనసాగింపు, అభివృద్ధి  

ఈ నినాదాలిచ్చిన ఇద్దరు నాయకులికీ పెద్ద మచ్చలే వున్నాయి. జగన్ తీవ్రమైన ఆర్ధిక నేరాల్లో కూరుకుపోయి ప్రస్తుతం బెయిలు మీదవున్నారు. చంద్రబాబు నిలకడలేని మనిషిగా నిర్ణయాలు మార్చుకునే నాయకుడిగా మచ్చమోస్తున్నారు  మరి ఎవరి నినాదం గెలుస్తుందో?