(2014 ఎన్నికల నేపధ్యం! జాతీయ స్ధాయిలో)
♦️ కాంగ్రస్ అధ్యక్షురాలి హోదాలో యిపిఎ చైర్ పర్సన్ హోదాలో దేశాన్ని పాలిస్తున్న సోనియా, ఆమె కోటరీ బాధ్యత లేని అధికారాల్ని చెలాయించడం దేశ, విదేశాల్లో భారతదేశ ప్రజాస్వమ్య విలువల్ని పలచన చేశాయి. 
అవినీతి, కుంభకోణాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి
♦️ బిజెపికి మించిన ఎత్తుకి నరేంద్రమోదీ పెరిగిపోయారు. ఆయన మాట కాదనలేని అనివార్యతను ఆయన పార్టీముందుంచారు. వ్యక్తిపూజలో కాంగ్రస్ పార్టీకి సరితూగే స్ధితిని బిజెపికి తెచ్చిపెట్టారు
♦️ వామపక్షాలు క్రియాశూన్యమవ్వడం వల్ల మూడో ప్రత్యామ్నయం దిశగా ఆలోచనా చర్చా లేకుండాపోయింది. కాంగ్రస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక, తటస్ధ శక్తులను కూడగట్టే యంత్రాంగమే లేకుండా పోయింది.. ఎన్నికల తరువాత మూడో ఫ్రంట్ ఏర్పడినా అందులో సూత్రబద్ధత కంటే అవకాశవాద/అనివార్య తలే ఎక్కువగా వండవచ్చు.
♦️ ఒక సారి ఖర్చయితే తిరిగి పొందలేని సహజవనరులను పాలకులు కొన్ని కోట్లరూపాయలకు తెగనమ్ముకునే ధోరణి యుపిఎ హయాంలో మొదలైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా వుంది
⭐️ రాష్ట్ర స్ధాయిలో
♦️ అన్ని రాషా్ట్రల్లో ఎన్నికల వాతావరణం కొద్దినెలలక్రితమే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పటి నుంచీ మొదలైంది. అయితే ఈ కథ 2004 ఎన్నికల ముందు నుంచే ప్రారంభమైంది. రాష్ట్ర విభజన ఇందులో మరికొన్ని చిక్కుముడులను వేసింది. 
♦️ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 లో నినదించిన “సంక్షేమ”నినాదం బాబు ఓటమికి పైకి కనిపించే కారణం. ఆయితే ఆ ఓటమికి మూలం ఆర్ధిక సంస్కరణల అమలులో చంద్రబాబు మోడల్ ని  ప్రజలు తిరస్కరించడమే! 
♦️ అధికారానికొచ్చిన వైఎస్, సమాజ సంక్షేమాన్ని ఓట్ల రాజకీయాల సైజుకి మార్చేశారు. కమ్యూనిటీ మౌలికసదుపాయాలు పెంచి వ్యక్తుల ఆర్ధిక స్ధితులు మెరుగుపరచవలసిన సూత్రాన్ని వదిలేసి వ్యక్తిగత లబ్ధి ఇచ్చే సబ్సిడి సంక్షేమాన్ని విస్తరింపజేశారు. 
♦️ ఉత్పత్తినీ ఉత్పాదకతనూ ధ్వంసం చేసిన  ఈ విధానం వైఎస్ ను 2009 కూడా అధికారంలోకి తెచ్చింది. ఇందుకు ఆయనకు బొటాబొటి మద్ధతు మాత్రమే లభించింది.
☀️ ఇంతలో రాష్ట్ర విభజన మరో సమస్య అయింది. కాంగ్రెస్ బిజెపి లాంటి జాతీయ పార్టీలే విభజన లాభాన్ని తాముతీసుకుని నష్టాన్ని ఎదుటి పార్టీకి అంటగట్టే పిల్లిమొగ్గలు వేశాయి. 
☀️ ఇలాంటప్పుడు ఒకే రాష్ట్రంలో వున్న పార్టీని రెండు ప్రాంతాల్లో కాపాడుకోడానికి రెండు కళ్ళ సిద్ధాంతం మినహా తెలుగుదేశానికి ఇంకోదారిలేదని ఎవరికైనా అర్ధమౌతుంది( తెలుగుదేశాన్ని వ్యతిరేకించేవారికి ఇదే పెద్దపాయింట్ అయితే అది వేరే సంగతి) 
♦️ వైఎస్ కార్యక్రమాలు కొనసాగింపు, అభివృద్ధి తప్ప జగన్ పార్టీకి వేరే అజెండాలేదు. చంద్రబాబు నినాదం కూడా ఇంచుమించు ఇదే. 
☀️ ఇంతలో రాష్ట్రం విడిపోయింది. ఆవెంటనే సీమాంధ్రలో చంద్రబాబు గ్రాఫ్ పెరగడం జగన్ పట్ల ఆదరణ తగ్గడం కనిపిస్తోంది. ఇందులో కొత్తగా చంద్రబాబు చేసిన ఘన కార్యాలూ లేవు జగన్ కొత్తగా చేసిన దారుణాలూ లేవు. 
♦️ ఈ ఇద్దరూ సిద్ధం చేసుకున్న ఎన్నికల ఎజెండాను రాష్ట్రవిభజన పక్కకి నెట్టేసింది. 
♦️ సీమాంధ్రలో ప్రాధాన్యతలు మారిపోయాయి. జగన్ మీద కొత్తగా కోపంలేదు కాని, చంద్రబాబు మీద మాత్రం ప్రేమ పుట్టుకొచ్చింది. కొత్తరాష్టా్ర నిర్మాణానికి కొత్త వ్యక్తి కంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబే సరైన వ్యక్తి నయమన్న నమ్మకం కుదిరింది. 
♦️ దీన్ని పసిగట్టి, సీమాంధ్రులు ఇప్పట్లో కాంగ్రెస్ ను క్షమించలేరని అంచనా వేసిన బాబు బిజెపితో చేయికలిపారు. ఈ నిర్ణయం వల్ల సీమాంధ్రలో  తెలుగు దేశం బిజెపిల కాంబినేషన్ కి ఆదరణ పెరిగింది.  
♦️ మొత్తానికి సీమాంధ్రలో రెండు ఎన్నికల నినాదాలు వున్నాయి. ఒకటి రాష్ట్ర నిర్మాణం,  అభివృద్ధి – రెండు వై ఎస్ పధకాల కొనసాగింపు, అభివృద్ధి  ఈ నినాదాలిచ్చిన ఇద్దరు నాయకులికీ పెద్ద మచ్చలే వున్నాయి. 
☀️ జగన్ తీవ్రమైన ఆర్ధిక నేరాల్లో కూరుకుపోయి ప్రస్తుతం బెయిలు మీదవున్నారు. చంద్రబాబు నిలకడలేని మనిషిగా నిర్ణయాలు మార్చుకునే నాయకుడిగా మచ్చమోస్తున్నారు
♥️ జగన్ కు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు?
రెడ్డి వర్గంలో అత్యధికులు, గ్రామీణ వృద్ధులు, నిరుపేదలు, ముస్లింలు, దళితుల్లో హెచ్చుమంది, క్రైస్తవులు, దళిత కై్రస్తవులు, వెనుక బడిన తరగతుల్లో దిగువవర్గాల వారు, బళహుజనులు, వైఎస్ పధకాల వల్ల ఆకస్మికంగా సంపన్నులైపోయిన వారు, కష్టపడలేనివారు…
రాష్ట్రవిభజనలో సీమాంధ్రులకు అవమానం జరగలేదనుకునే వారు…సీమాంధ్ర నష్టపోలేదనుకునే వారు…అసలు విభజన పెద్దవిషయం కాదనుకునే వారు
♥️ చంద్రబాబుకి ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు?
కమ్మవారు, మధ్యతరగతివారు, మధ్యతరగతి ఆపై స్ధాయి రైతులు, యువకులు, విద్యావంతులు, నడివయసువారు, మధ్యవయసు ఉద్యోగులు, రిటైర్ అయినవారు.
♥️ రెండు పార్టీలకూ మద్దతు ఇచ్చే వర్గాలలో రైతులు స్త్రీలు వున్నారు జయాపజయాలను నిర్ణయించేది వీరి సంఖ్యే!
♥️ విభజన వల్ల బాబుకి పెరిగిన కొత్తమద్ధతు
రాష్ట్రవిభజనలో సీమాంధ్రులకు అవమానం జరగిందనుకున్నవారు…సీమాంధ్ర నష్టపోయిందనుకున్న వారు..కాంగ్రస్ మీద ద్వేషంతో తెలుగు దేశం బిజెపిల కాంబినేషన్ కి మద్దతు ఇస్తున్నారు. ఈ రెండు పార్టీల పట్లా గతంలో అనుకూలత లేనివారు, జగన్ మీద కొద్దిపాటి అనుకూలత ఉన్నవారూ కూడా వీరిలో వున్నారు. ఇదే తెలుగుదేశం బలం పెరినట్టు కనిపించడానికి కారణం ఇందులో చంద్రబాబు చేసిందేమీ లేదు. 
♦️ అభ్యర్ధుల ఎంపిక జగన్ పార్టీలో తొటు్రపాట్లు లేకుండా జరిగింది. తెలుగుదేశంలో కొన్నిచోట్ల అభ్యర్ధులు ఓడిపోయే లా ఎంపికలు జరిగాయి. 
☀️ ఇందువల్ల సీమాంధ్రలో స్ధూలంగా ఒక పరిస్ధితి వుంటే కొన్ని నియోజకవర్గాల్లో వేరే వాతవరణం తలఎత్తింది. ఉదాహరణకు రాజమండ్రి అర్బన్ సీటులో బిజెపి, జగన్ పార్టీల మధ్య పోటీవుంది. స్ధానిక సమీకరణల్లో ఈ పోటీ ఒసి బిసి మధ్య పొటీగా మారిపోయింది. ఇది జగన్ పార్టీ అభ్యర్ధిని గెలిపించే లా మారింది 
☀️ గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లభించే అవకాశాలు వున్నాయి( మిగిలిన జిల్లాల గురించి నాకు సమాచారం లేదు) 
♦️ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చాలా బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోకతప్పని వాతావరణం వుంది