అర్ధరాత్రి వేళ గంటపాటు ఉరిమిన ప్రతీ ఉరుమూ జీవితాన్ని ఆకస్మికంగా జంక్షన్ లో నిలబెట్టి ఎటువైపు నీనడక అని భయపెట్టినట్టయింది! 
తెల్లవార్లూ ఆగి ఆగి కురిసిన వానలో స్నానం చేసిన చెట్లు ఆకులలు మెరుస్తున్నాయి. దుమ్మూ ధూళీ వొదిలిన ఊరు యవ్వనంలో మిలమిలలాడుతున్నట్టుంది. మెత్తబడిన నేల కాలుమోపిన చోట అమ్మై హత్తుకున్నట్టుంది. 
కానికాలపు వాన ….చల్లగా హాయి ఇస్తున్నట్టు, అల్పపీడనాలో వాయుగుండాలో లేకపోతే కురవనే కురవను అని భయపెడుతున్నట్టూ వుంది. 
మాగాణుల్లోనే ధాన్యం రాశులు పోసిన రైతుల ఆశలకింద వాననీరు కమ్ముకున్నట్టుంది. మాసూళ్ళకు సిద్ధంగా వున్న వరిపనలు తడిసి రైతుగుండెలా బరువెక్కినట్టున్నాయి.