చెరువు నిండిన నీరు మరో చెరువులోకి మరలిపోయే దారే “జాలు”. ఈ జాలులే పుంతలు…ఊరికీ ఊరుకీ మధ్య రహదారులు.. అవన్నీ చౌడునేలలే వర్షాకాలంలో అక్కడ నడక నరకమే. పాదాలు వాచిపోయి/ఉబ్బిపోయి దురదలు…మంటలు…పొలంలో ఉన్న ఇంటికీ చిన్నావారిగూడెంలో బడికీ ఏడు ఫర్లాంగుల దూరం (8ఫర్లాంగులు ఒక మైలు) టీచరైన అమ్మ, నాలుగో క్లాసు లో వున్ననేను రోజూ పోకరాక, పోకరాక నాలుగుసార్లు జాలులోనే నడక. కాలి దురదలు వాపు భరించలేనపుడు కాలి వేళ్ళను ఒకొటొకటిగా పురికొస(తాడుతో) గట్టిగా చుట్టి సేప్టీపిన్ ను దీపంవెలుగులో కాల్చి వేలిమీద పడిస్తే నల్లటి నెత్తురు వచ్చేది. దాన్ని నక్కనెత్తురు అనేవారు. నక్కనెత్తురు బయటికి వచ్చేస్తే  మంట దురద వాపు తగ్గేవి. ఈ చికిత్స పదిపదిహేను రోజులకోసారి వుండేది. 
మా అమ్మ ఏడిస్తే మా ఇంట్లో వుండే దూరపు బంధువైన ఒక పెద్దావిడ విసుక్కునేది…మా అమ్మ ఎంత బాధైనా ఓర్చుకునేది… నేను ఏడ్చినపుడే ఏంచేయలేక తను ఏడ్చేది (అని నానమ్మకం అసలు ఏ అమ్మైనా ఇంతే) 
ఒక సారి ఇంటి దూలం నుంచి పడిన తేలు ముందు అమ్మని కుట్టింది. తను చేయ్యి విదిలించడం వల్లో ఏమో పక్కలో వున్న నా మీదపడి నన్ను కుట్టింది మాకేకలకు నాన్నలేచి తేలుని గుర్తించి చంపేశారు. తెల్లవార్లూ ఇద్దరం ఏడుపే..ఇంట్లో వున్న పెద్దావిడ విసుక్కున్నపుడు అమ్మ కసిరేసుకుంది -మీకు దయా కనికరాలు లేవు చిన్నవాడు నక్కనెత్తురుతో బాధపడినపుడూ తేలుమంట ఆపుకోలేనపుడూ ఒకటే మాటా ఆపండి- అనేసింది 
మదర్స్ డే మెసేజిలు చదువుతుంటే మా అమ్మ గుర్తొస్తూంది 
1983 నుంచి 86 వరకూ తిరుపతి ఈనాడులో పనిచేశాను. దాదాపు ప్రతీనెలా హైదరాబాద్ మీటింగ్ కి వెళ్ళే వాడిని. అయిపోయాక గౌలిగూడా బస్ స్టాండ్ కి వచ్చి తిరుపతి / రాజమండ్రి బస్సుల్లో ఏది ముందు వస్తే ఆబస్సు ఎక్కేవాడిని చాలాసార్లు రాజమండ్రిబస్సే ముందువచ్చేది ఆబస్సులో జంగారెడ్డిగూడెంలో దిగిపోయి సాయంత్రంవరకూ అమ్మతోనే వుండేవాడిని . సాయంత్రం ఏలూరు బస్సెక్కి అక్కడినుంచి విజయవాడ బస్సెక్కి అక్కడినుంచి తిరుపతి బస్సెక్కేవాడిని. 86 ఫిబ్రవరి ఏప్రిల్ మీటింగ్స్ అయిపోయాక రెండుసార్లూ తిరుపతి బస్సులే ముందు రావడం వల్ల ఇంటికి వెళ్ళలేకపోయాను. 
బాగాతిరుగుతున్న అమ్మ ఏప్రిల్ 9 ఉదయం ఆకస్మికంగా చనిపోయింది. 
14 రోజుల తరువాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాక చూస్తే మా అమ్మ రాసిన చివరి ఉత్తరం వుంది
“చూసి చాలా కాలమైపోయింది. బెంగగావుంది. ఒక సారి జీతనష్టం సెలవుపెట్టయినా సరే తప్పకుండా రావలెను. చార్జీల డబ్బు నేను ఇవ్వగలను. సెలవు కష్టమైతే ఉత్తరం రాయవలెను ఎలాగో ఒకలాగ నేనే రాగలను” 
ఇదే ఆ కార్డులో సారాంశం..
మనుషులు శాశ్వతం కాదు. జ్ఞాపకాలు మనుషులకంటే జీవితాన్ని గాఢంగా అల్లుకుంటాయి. ఒకే జీవితంలో అనేక జీవితాలైనంతగా కిక్కిరిసిపోతాయి. ఇవి సుఖదుఃఖాల ఉద్వేగాలు. ఇవిలేని మనుషులు అమానవులైపోతారు. ఇవి శూన్య అసంబంధాలను,  చైతన్య సంబంధాలుగా మలుస్తాయి. యంత్రభూతమైన జీవనశైలి జనారణ్యంలో మనుషుల్ని ఏకాకులుగా మార్చకుండా కాపాడటానికి పిల్లలకోసం జ్ఞాపకాలను గుర్తుచేయాలి. జ్ఞాపకాలను తడిమిచూడాలంటే మనసుకి వేళ్ళుండాలి…
(ఇది చెప్పడానికే నాకు తప్ప ఎవరికీ అవసరం ఆసక్తి లేని ఇంత సోదీనూ…)