ఉపశమించని దాహంతో దేహం ఆర్చుకుపోవడం తెల్లవారుతూనే మొదలౌతోంది. వైశాఖ మాసమంటేనే జీవుల గొంతెండిపోవడం.. ఇంతకాలమూ ఫోకస్ అంతా ఎన్నికలమీదే ….అందుబాటులో సీసాలకొద్దీ నీళ్ళు వుండటం వల్ల దాహ బాధ తెలియకుండాపోయింది.
నీళ్ళు దగ్గర లేనపుడు దాహం ఎలా పీడిస్తుందో 
(దాదాపు 50 రోజుల తరువాత)మార్నింగ్ వాక్ కి వెళ్తూంటే అనుభవమయ్యింది..ఎటుచూసినా భవనాలు ఎదురుగా కనుచూపు మేరా రోడ్డు..అక్కడడక్కడా అటూఇటూ తిరిగే మనుషులు…బిక్కుబిక్కు మంటున్నట్టు మొక్కలూ చెట్లే…
దాహాన్ని వదలని దెయ్యం అందామా, పీడించే పిశాచం అందామా అనుకుంటూండగానే నా కానుగ చెట్టు నీడకు చేరిపోయాను. అక్కడ ఒక పెద్దరాయి వుంటుంది..దానిమీద కూర్చుని ఓనిమిషం కుదుటపడ్డాక దాహపీడన తగ్గినట్టుంది. చెమట ఆరుతున్న శరీరం, తెరలు తెరలు గా తాకుతున్న చల్లగాలికి చిన్నగా గాలిలో తేలిపోతున్న అనుభవం… ఎంతడబ్బిచ్చినా స్విచ్చివేసి ఈ హాయిని కొనుక్కోలేము.
చెట్టుకాండమంతా పసుపు నారింజ బూడిద రంగులు కలిపేసిన కొత్త రంగుతో కాంతివంతంగా నున్నగా పచ్చగావుంది.. ఆకులు ముదురు ఆకుపచ్చరంగులో దట్టంగా వున్నాయి. వసంత రుతువుని పూర్తిగా తొడుక్కున్న చెట్టు ఇంత అందంగా వుంటుంది..
ఆకులు కదలిక – అలసటతో చెట్టుకింద చేరిన నన్ను గాలివిసిరి సేదతీర్చినట్టూ, ఎలావున్నావని పలకరించినట్టూ, అనిపించింది..నాకొత్తబట్టలు చూశావా అని అడగకుండానే అడిగినట్టు ముదురుపచ్చటి సోయగాలు చూపిస్తున్నట్టు అనిపించింది. తిరిగి వస్తూ వెనక్కి చూసినపుడు చేతులై వీడ్కోలు చెబుతున్న ఆకులు – Take care అన్నాయనే అనిపించింది
23/5/2014 శుక్రవారం శుభోదయం:-)