ప్రతీ 12 ఏళ్ళకూ గురుడు సింహరాశిలో ప్రవేశించిన రోజుమొదలు 12 రోజులు గోదావరి పుష్కరాలు జరగుతాయి. ఈ ప్రకారం 2015 జులై రెండో వారంలో పుష్కరాలు మొదలవ్వాలి.   
దేవాదాయ ధర్మాదాయ శాఖ పండితుల సభను నిర్వహిస్తుంది. ఆసిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వం తేదీలు నోటిఫై చేస్తుంది. 
కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పనిచేయడం లేదు కనుక ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు.
జ్యోతిష్కుల్లో భిన్నాభిప్రాయాలు : గ్రహాలు రాశుల సంచారాన్ని బట్టి పండుగలు తేదీలను నిర్ణయించే గణన విధానాలు దేశంలోపదకొండు వున్నయి. 
దక్షిణాది రాషా్ట్రల్లో ప్రధానంగా సూర్యమానాన్ని అనుసరిస్తారు. ఈ విధానంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని పిడపర్తి కుటుంబీకులు, పశ్చిమగోదావరి జిల్లా రేలంగిలోని తంగిరాల కుటుంబీకుల లెక్కలకు దక్షిణ భారతంలోనే విశేషమైన గుర్తింపు వుంది. “పిడపర్తి వారి పంచాంగం”, “తంగిరాల వారి పంచాంగం” పేరుతో ఆ కుటుంబాలు బ్రాండ్లు అయ్యాయి. అయితే అవే కుటుంబాల్లో వారసులు పరంపరగా ఆ వృత్తిని కొనసాగించక పోవడం, కొనసాగించినా మార్కెటింగ్ నైపుణ్యాలు లేకపోవడంతో ఆ బ్రాండ్లు కూడా చిక్కిపోతున్నాయి. 
రాజమండ్రికే చెందిన బుట్టే దైవజ్ఞ సిద్ధాంతి ఇపుడు చాలా పాపులర్ గణకుడు. పేరుమార్పేతప్ప ఇదంతా పిడపర్తి వారి విధానమే నని ఈయన ప్రత్యర్ధులు అంటూంటారు.
నాలుగైదేళ్ళుగా స్వామీజీలు, పీఠాల అధిపతులు, సర్వసంగ పరిత్యాగులూ కూడా జ్యోతిషాంశాలలో వేళ్ళూ కాళ్ళూ పెట్టేసి తేదీలనుప్రకటించేస్తున్నారు. అందువల్ల వారికీ వారి మఠాలకీ టివిల్లో మంచి ప్రాచుర్యం, ప్రజలమైన మనకు గొప్ప గందరగోళం తప్పడం లేదు. ఫలితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని పండిత సభలో అభిప్రాయం ప్రకారం వేడుకలు/క్రతువుల తేదీని సమయాన్ని ఖరారు చేయవలసి వస్తోంది. ఈ ఖరారులో మార్కెటింగ్, బ్రాండింగ్, లౌక్యాలు లాబీయింగ్ లు తెలిసిన వారి వాదనలదే పైచేయి అవుతోంది. ఇందులో వెనుక బడిన వారికి న్యూస్ టివిలు అదేపనిగా వేదికలౌతున్నాయి.
ఇందువల్లే మూడునాలుగేళ్ళుగా ప్రతీ – పండుగ “వేళా” వివాదాలౌతున్నాయి.
మధిర వారి దృక్ సిద్ధాంతం :  ఈసందర్భంగా అత్యంత ప్రాచీనమైన దృక్ సిద్ధాంతాన్నికి ఆధునికతను ఆపాదించి దేశవ్యాప్తంగా ఒకే కేలెండర్ తీసుకురావడానికి ప్రయత్నించిన రాజమండ్రి పెద్దమనిషి మధిర కృష్ణమూర్తి శాస్త్రి గారిని ప్రస్తావించుకోవాలి. ఆయన వయోభారం, అనారోగ్యాలతో కొద్దినెలలు గా బయటికి రావడం లేదు. 
అన్ని జ్యోతిష సిద్ధాంతాలనూ సమన్వయం చేసి ఒకే గణన విధానాన్ని అమలు చేయడానికి ఈయన అన్ని రాషా్ట్రలూ తిరిగారు. ఉత్తరాది రాషా్ట్రల్లో ఈయన ప్రతిపాదనకు గట్టి మద్దతు లభించింది. స్వస్ధలంలో, జ్యోతిష పండితుల్లో ఆయన కు ఎనలేని గౌరవమర్యాదలున్నాయి. ఆయన సిద్ధాంతాలకు ప్రతిపాదనలకు మాత్రం మన్ననలేదు. ఏడెనిదేళ్ళ క్రితం నేను మధిర కృష్ణమూర్తి శాస్తిగారితో  ఈ సంగతే ప్రస్తావించినపుడు
“నా జాతకమే అంత” అని పెద్దగా నవ్వేశారు.
ప్రపంచంతో పెరిగిన కనెక్టివిటీ వల్ల గోదావరి పుష్కరాలకు దేశదేశాల్లోవున్న తెలుగువారు, భారతీయులు గోదావరి పుష్కరాలకు వస్తారు..తేదీలు ఖరారైతే తప్ప వారు టూర్ ప్లాన్ చేసుకునే అవకాశం లేదు. సెలవులు, టికెట్లు, పుష్కరాలతోపాటు చూడవలసిన ఇతర ప్రాంతాలు, తిరుగు ప్రయాణం షెడ్యూల్ పుష్కరాలతేదిల నోటిఫికేషన్ తోనే ముడిపడివుంది. ఇందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతల్లో తేదీలనోటిఫికేషన్ కూడా ముఖ్యమైనదే – పెద్దాడ నవీన్