ఉదాత్తమైన వృత్తిని ఎంచుకున్నావు…మంచిదే!
భార్యాపిల్లలకు మంచి జీవితం ఇచ్చే ఆదాయాలు ఇందులో వున్నాయా? వేజ్ బోర్డులను అమలు చేసే వెసులుబాటు, బాధ్యత దిన పత్రికల యాజమాన్యాలకు వున్నాయా?? 
1985 లో కేంద్రమానవ వనరుల శాఖమంత్రి పివినరశింహారావుగారు నాతో అన్నమాటలు ఇవి. ఆయనా, ముఖ్యమంత్రి ఎన్ టి రామారావుగారూ హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో వచ్చి రేణిగుంట విమానాశ్రయంలో దిగారు..తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్ టి ఆర్ అభిమానులతో మహాకోలాహలంగా వుంది..అదంతా గమనిస్తూ పివి గారు వెయిటింగ్ రూమ్ కి చేరుకున్నారు. ఒక రెవిన్యూ అధికారి, ఒక పోలీసు అధికారి, ముగ్గురు పోలీసులు, ముగ్గురు రెవిన్యూ ఉద్యోగులు, పదిమందికంటే తక్కువమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పివి కోసం వేచివున్నారు.
కారు రెడీసర్ అని అధికారి చెప్పగానే వెల్దాంలే అన్నట్టు సైగ చేశారు(ఎన్ టి ఆర్ కాన్వాయ్ వెళ్ళిపోయాక బయలుదేరుదామన్నట్టు) కాఫీ అని ఆ అధికారి సంశయంగా అడిగినప్పుడు వద్దని సైగ చేశారు. పేపరు తిరగేయడం మొదలు పెట్టారు.
ఆసమయంలో నేను లోనికి వెళ్ళి పరిచయం చేసుకున్నాను. ఒకసారి తేరిపార చూసి ‘మంచిది’అన్నారు. పెద్దాడ రామచంద్రరావుగారు మాతండ్రిగారు అన్నాను. ఎక్కడ పెద్దాడ అని అడిగారు. వీరవాసరం చాలాకాలంగా జంగారెడ్డి గూడెం అని బదులివ్వగానే మొహంలో చిన్నమార్పు (బహుశ లోపల నవ్వి వుంటారు ఆయన మొహంలో సాధారణంగా నవ్వు పలకదు)
“మీ నాయన ఎలాగున్నాడు అతనిది మంచి ఆరోగ్యమే కన్ననూరు ఎర్రవాడ జైళ్ళలో కలసి వున్నాము రాజీపడని మనిషి యోధుడు సాహసి త్యాగం చేసినవాడు సంస్కరణ ఆలోచనలు బాగా చర్చించేవాడు. స్వాతంత్ర ఉద్యమానికి గాంధీ నిర్మాణకార్యక్రమాలకీ మీ నాయనది సమమైన ప్రాధాన్యత. ఇక్కడ తామ్రపత్రం అందుకున్న మొదటి 16 మందిలో నీ నాయన వున్నాడు” 
ఈ తరహాలో మానాన్నగారితో జ్ఞాపకాలను పివిగారు గుర్తుచేసుకున్నారు. ఆతరువాత నా వృత్తి ఉద్యోగ వివరాలు అడిగారు. 
ఉదాత్తమైన వృత్తిని ఎంచుకున్నావు…మంచిదే!
భార్యాపిల్లలకు మంచి జీవితం ఇచ్చే ఆదాయాలు ఇందులో వున్నాయా? వేజ్ బోర్డులను అమలు చేసే వెసులుబాటు, బాధ్యత దిన పత్రికల యాజమాన్యాలకు వున్నాయా?? అన్నారు!
తెలుగుదిన పత్రికలలో ఈనాడు బాగానే వుంటుంది.. నీకు ఇంగ్లీషు వచ్చునా ? ఇంగ్లీషు పేపర్లలో జీతభత్యాలు కొంత మెరుగు అని కూడా అన్నారు.
ఇంకేమీ మాట్లాడలేదు పేపర్ చదువుకుంటూ వుండిపోయారు. ఏడెనిమిది నిమిషాల తరువాత తలపైకెత్తి అటూ ఇటూ చూస్తూండగా అధికారి రెడీసర్ అన్నారు. ఆయన సోఫానుంచి లేచి రెండడుగుల వేశారు 
నమస్కారం వుంటాను సార్ అన్నాను 
నావైపు తలతిప్పి “మంచిది” అంటూ వెళ్ళిపోయారు