Search

Full Story

All that around you

Month

July 2014

ఎప్పటికీ మాయని మచ్చ


…పాతేస్తే మన్నూ, కాల్చేస్తే బూడిదా అనేమాటనిజమేకాని ప్రాణం పోయిన మనిషి పట్ల ఇంతహేయమైన ప్రవర్తన దుఃఖం కలిగిస్తూంది. ఇలాంటి దారుణాలు  సమాజపు నాగరీకతకీ, మనిషి సంస్కారానికీ మాయని మచ్చలుగానే వుండిపొతాయి.
ఈతచాపలో చుట్టినా కావడిలో మోసుకెళ్ళినా ఆశరీరం జీవించడం ఆగదు స్మరణ వినిపిస్తున్నంతవరకూ సమాధిలో కదులుతూనే వుంటుంది
.మరణించిన మనిషిచుట్టూ అయినవారు గుమిగూడి నిలబడి దాటలేని సరిహద్దు వద్ద సాగనంపుతారు…నిర్జీవ శరీరానికి కూడా నెప్పితెలియకూడదన్నట్టు సున్నితంగా భూగృహంలోనో అగ్నిశయ్యమీదో విశ్రమింపజేస్తారు…మృత్యువులోకి మనిషి గౌరవంగా సాగనంపాలన్న సంస్కారమే మానవీయ విలువల్లో ఉతృ్కష్టమైనది…అనాధమరణమైనా అంతిమసంస్కారం చేయడాన్ని మహాపుణ్యమన్నది ఇందుకే…
మరణాన్ని దగ్గరగా చూడటమంటే దీపనిర్వాణగంధాన్ని పీల్చడమే…కలలు కాలిన కమురు వాసనే…కలలు వెలిగించిన చమురువాసనే…మగ్గిపోయిన పండువాసనే..అంతటి  ప్రాణదీపాన్ని ఏకారణంచేతైనా బలవంతంగా ఆర్పివేయడం నికృష్టం…
మనిషికాయాన్ని కాలితో తన్నడం అంతకుమించిన నికృష్టమేకాక పశుప్రాయం కూడా…అనాధమృతదేహాలకీ, ఎన్ కౌంటర్లలో చనిపోయినవారి మృతదేహాలకీ – చచ్చిపోయిన పశువుల్ని ఈడ్చేయడానికీ పెద్దతేడా వుండదు. 
ఇది ఉత్తరప్రదేశ్ లో ఒక అమానుష దృశ్యం 
సంక్షేమకార్యక్రమాలకి వేలు లక్షల కోట్లరూపాయలు ఖర్చుచేస్తున్నప్రభుత్వాలు మనిషి అంతిమ సంస్కారం కాస్త మర్యాదగా కాస్త గౌరవంగా పూర్తయ్యే ఏర్పాట్లు చేస్తే బాగుండును!
 

నచ్చిన "దృశ్యం"


“దృశ్యం” చూస్తున్నంతసేపూ ఒకవిధమైన భయమేసింది… సిగ్గు తీసేస్తానని భయపెట్టి ఒక అమ్మాయి గౌరవాన్ని వెంటాడుతున్నప్పుడు …
తనకు కావలసిన దానికోసం కరడుగట్టిన అధికారం చిన్నా పెద్దా ఆడా మగా తేడాలేకుండా ఇంటిల్లపాదినీ వేటాడుతున్నప్పుడు…
ఏంజరుగుతుందా అని రెపరెపలాడే ఉత్కంఠ భయపెట్టింది. 
కుటుంబంలో బాండేజ్,  మనుషుల ఉద్వేగాలు ధ్రిల్లింగ్ గా కనబడిన “దృశ్యం” ఒక ప్రాతీయ/భాషా చిత్రం కాదు…యూనివర్సల్ సినిమా…
దృశ్యం సినిమా కు కథా కథనాలే హీరో హీరోయిన్లు…
లార్జర్ దాన్ లైఫ్ సైజు పాత్రల హీరో వెంకటేష్, మంచ నటి మీనా వారి వారి పాత్రల్లో ఇమిడిపోవడం వల్ల నటుల్ని గాక సినిమా కథనే చూసినట్టు వుంది.
(నాకు బాగానచ్చిన “దృశ్యం” సక్సెసో ఫెయిల్యూరో నాకు తెలియదు) 

నేలకు నీరుపట్టించే ఆకులు


మనం గ్లాసుతో నీళ్ళు పొరమారకుండా ఎలాతాగుతామో అలాగే మొక్కల,చెట్ల ఆకులు నేలకి నీళ్ళు పట్టించడం చూశాను. 
చినుకులు మొదలవ్వగానే వానను చూడటానికి, చల్లదనాన్ని తాకడానికి, మట్టివాసనను పీల్చడానికి బాల్కనీలో నుంచున్నపుడు ఈ ప్రకృతి రహస్యాన్ని గమనించాను
జడివాన వేగానికి నేల మీద బుల్లిబుల్లి గుంతలు పడటం, గుంతనుంచి రేగిన మట్టి కరగి వాలుకి కొట్టుకుపోవడం, అంటే నేల పైపొర తొలగిపోవడం కనపడ్డాయి. కానుగ చెట్టుకింద వున్న నేలమీద ఈ దృశ్యం లేదు. 
జడివాన ఉదృతిని, కానుగ ఆకులు ఒడసిపట్టుకుని తుంపరలుగా,  బిందువులుగా మార్చి నొప్పితగలకూడదన్నంత మెత్తగా నేలమీదకు జారవిడిచాయి. నెలల తరబడి ఎండిపోయివున్న  నేల ప్రశాంతంగా నీటిని ఇముడ్చుకోడానికి వాన ఉధృతిని తగ్గించిన ఆకులు అద్భుతంగా ఉపయోగపడ్డాయి. చెట్టుకింద నేల గుంతలు పడనూలేదు. భూసారం కొట్టుకుపోనూలేదు. 
ఒక మొక్కే, ఒకచెట్టే  నేలను ఇంతగా కాపాడితే మొత్తం మొక్కలు మొత్తం చెట్లు నేలని ఎంతగా కాపాడుతాయోకదా?
ఇదేమీ నాకు తెలియకముందే మా రోడ్డుని సిమెంటు రోడ్డుకాకుండా నేను ఆపగలిగాను. మా అపార్టుమెంటుముందున్న మూడుచెట్లనూ కరెంటువాళ్ళు నరికేయకుండా చాలాకాలం ఆపగలిగాను. అన్ని రోడ్లూ సిమెంటురోడ్లయిపోతున్నపుడు – వాననీరు నేలలోకి ఇంకదు, ఎండకు వీధితొందరగా చల్లారదు అని కార్పొరేటర్ కి నచ్చజెప్పి మా వీధివరకూ సిమెంటురోడ్డు ఆపించగలిగాను.. అన్నీ సిమెంటువే మనమే ఇలావుండిపోయేము అందుకు కారకుడైన ఇతగాడు అభివృద్ధి నిరోధకుడు అన్నట్టు నన్ను మా ఆపార్టుమెంటు నివాసుల్లో కొందరు చూస్తూంటారు.
అపార్టుమెంటు ఎదురుగా కరెంటు వైర్లు వున్నాయి. వాటికి అడ్డంగా ఎదుగుతున్న కొమ్మల్ని ప్రతీసారీ నరకడం కష్టమనుకున్న విద్యుత్ శాఖవారు చెట్లను నరికించేయడానికి వచ్చేశారు. అదేశాఖలో ఇంజనీరైన కవి”వెలుతురుపిట్ట” కొత్తపల్లి శ్రీమన్నారాయణ గారికి విషయం చెబితే ఆయన చెట్ల నరకివేత ఆపించేశారు. ఎపుడైనా కరెంటుపోయి వాళ్ళకి ఫోన్ చేస్తే చెట్లు నరికితేతప్ప కుదరదు అనేవారు బతిమిలాడి తెచ్చుకోవలసి వచ్చేది. అలాంటి సమయాల్లో నేను మా వాళ్ళందరికీ శత్రువునే. శ్రీమన్నారాయణ గారు ఆకస్మికంగా చనిపోయారు. పదిరోజులు తిరగకండానే మా అపార్ట్ మెంటు ముందు చెట్లను నరికేశారు. 
మున్సిపాలిటీవాళ్ళ సిమెంటు రోడ్డు పడలేదుగానీ ఏఆపార్ట్ మెంటుకి ముందు ఆ అపార్ట్ మెంటు వారు సిమెంటు ర్యాంపులు కట్టించుకున్నారు. మా వాళ్ళు మనవాకిలే అసహ్యంగా వుందని మీటింగుల్లో అంటూవుంటారు. నావల్లే ఆ అసహ్యమన్నది వారిభావన 
అన్నం పెట్టే ఊరువదలి వెళ్ళి కొత్తపని వెతుక్కోవడం అయ్యేపనికాదుకాని, ఇందాకటి దృశ్యాల్ని చూసినప్పటినుంచీ – కాంక్రీటు నివాసాన్ని సావాసల్నీ వొదిలి మొక్కలు చెట్లు నేల బాగా వున్న ఊరిచివరకు పోయి నివశిస్తేబాగుండునని వుంది…అది చిన్నవిషయంకాదు టా్రన్స్ పోర్ట్, కనెక్టివిటీలకు చాలా ఖర్చుపెట్టాలి అదినాకు భారమే అవుతుంది. అందుకూ సిద్ధమైదూరంగా వెళ్ళినా అన్నివైపులకీ ‘అనకొండ’ వేగంతో పాకుతున్న ఊరు నేను ఎక్కడికి వెళ్ళినా  ఖాయంగా అక్కడికీ వచ్చేస్తూంది
నగరంలో జీవితమంటే కుండీలో పెరిగే మొక్కలాంటిదే. విడిగా బతకాలంటే నగరంతో బతుకును తెంపేసుకోవడమే …ఇంకోదారిలేదు

రేపటిఆశలు / డాక్టర్ గన్ని ఉపన్యాసం


ఇవాళ డాక్టర్లకు శుభాకాంక్షలు చెప్పే “డాక్టర్స్ డే”
సుప్రసిద్ధ సర్జన్ జిఎస్ ఎల్ మెడికల్ కాలేజి చీఫ్ ప్రమోటర్ రెండు రోజులక్రితం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి బ్రాంచ్ సమావేశంలో ఒక స్ఫూర్తివంతమైన ఉపన్యాసం ఇచ్చారు. అది వైద్యరంగానికి సంబందించినది కాదు..రాష్ట్రం విడిపోయివున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ను నిర్మించుకోడానికి పునర్నిర్మించుకోడానికి అవసరమైన మైండ్ సెట్ గురించి మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలామ్ ఉపన్యాసాలలో ఒకదానిని ముందుగా ప్రస్తావించి తరువాత తన ఉపన్యాసం ఇచ్చారు. ఇది వేర్వేరు వృత్తినిపుణులకు కూడా తెలియాలన్న ఆలోచనతో ఉపన్యాసాన్ని అచ్చువేయించారు. ఆ కాపీని ఇక్కడ వుంచుతున్నాను ఆసక్తి వుంటే చదవండి 
ప్రియమైన స్నేహితులారా!
ముందుగా దేశభక్తుడు, శాస్త్రవేత్త, మాజీ దేశాధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ కలామ్ దేశప్రజలందరికీ రాసిన ఉత్తరాన్ని(ఇది క్లుప్తమైన తెలుగు అనువాదం) చూద్దాం!
——————————————————————-
భారతీయులందరికీ, 
ఇక్కడ మీడియా ఎందుకు వ్యతిరేక దృక్పధంతో వుంది?
మనం మన శక్తిసామరా్ధ్యలను, సాధించిన ఘనతలనూ చెప్పుకోడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాము? మనల్ని మనం గుర్తించుకోవడంలో సమస్య ఏమిటి?
పాలఉత్పత్తిలో, హెచ్చుసంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడంలో మొదటి స్ధానం మనదే!
ధాన్యం పండించడంలో రెండో చోటు మనదే!
గ్రామాన్ని స్వయంపోషకంగా మార్చిన తెలివితేటలు మనవే అందుకు మనకి అన్ని వనరులూ వున్నయి
ఇలాంటి విజయాలు మనకి లక్షల్లో వున్నాయి
కానీ మీడియాకు మాత్రం వైఫల్యాలు సంక్షోభాల మీదదృష్టి పెట్టడం మీదే ఆసక్తి ఎందుకో! ఇజ్రాయెల్ లో బాంబుదాడులు ప్రాణనష్టం జరిగిన మరునాడు టెల్ అవీ విమానాశ్రయంలో పేపరుచదువుతూంటే సంతోషమనిపించింది. ఆ యుద్ధ వార్తలన్నీ లోపలి పేజీలో..ఐదేళ్ళు శ్రమించి ఎడారిలో పూలతోటలు పళ్ళతోటలు మొలిపించిన జూయిష్ పెద్దమనిషి విజయగాధ ఫొటోలు మొదటిపేజీనిండా వున్నాయి
మరి మన మీడియా ఎందుకు ఇంత నెగిటివ్ గా వుంటుంది? మనకి దిగుమతి చేసుకునే విదేశీవస్తువులంటే ఎందుకు ఇంతమోజు?
స్వయంపోషకం నుంచే స్వాభిమానం మొలకెత్తుతుందని మనం తెలుసుకోవడంలేదు.
హైదరాబాద్ లో ఒకసారి 14 ఏళ్ళ బాలికను నీ ఆశయం ఏమిటి అని అడిగినపుడు అభివృద్ధి చెందిన భారత దేశంలో జీవించడం అని చెప్పింది. ఆపాపలాంటి ఆశలున్నవారు లక్షల్లో కోట్లలో వున్నారు వాళ్ళ కోసం మనం దేశాన్ని ముందుకితీసుకువెళ్ళాలి.
మనం ప్రభుత్వాన్ని చట్టాల్ని వ్యవస్ధని అధికారుల్ని పొరుగువాళ్ళని ….ఎవరోఒకరిని ఎందుకో ఒకందుకు విమర్శుంచని రోజు వుంటందా? మరి మనమేం చేస్తున్నాం ? ఎంత బాధ్యతగా వుంటున్నాం? రోడ్లని అన్నిరకాల కమ్యూనిటీ వసతుల్ని పాడుచేస్తున్నది మనం కాదా? 
మరి మన విమర్శలకు అర్ధం వుందా? 
అమెరికా, జపాన్, ఒకటేమిటి ఏ అభివృద్ది చెందిన దేశంలో అయినా పౌరులు ఎంతబాధ్యతగా వుంటారు? 
రోడ్డుమీద ఉమియడంకూడా వుండదే? అంతబాధ్యతాయుతంగా మనం వ్యవహరించవద్దా? 
అమెరికాలో రెసిషన్ అంటే ఇంగ్లాండ్ కీ ఇంగ్లాండ్ లో నిరుద్యోగమంటే ఆసే్ట్రలియాకీ పరుగులుతీసే మన ఆలోచనలు డబ్బు సంపాదనకే తాకట్టయిపోయాయా? 
మనదేశాన్ని సుభిక్షం చేయడానికి వనరులు అవకాశాలు అపురూపంగా వున్న విషయం మరచిపోకూడదు. హక్కులకు బాధ్యతలు కూడా జోడిస్తే మనం ఎంతైనా సాధించగలం .పుచ్చుకోవడమే తప్ప ఇవ్వడం లేకపోతే సంపాదనలో ఎప్పటికీ సంతృప్తి మిగుల్చుకోలేమన్న స్పృహ ఇందుకు మనల్ని ప్రేరేపిస్తుంది. 
-అబ్దుల్ కలామ్
——————————————————————-
డాక్టర్ అబ్దుల్ కలామ్ మాటల్లో స్పూర్తిని అర్ధం చేసుకోగలిగితే మొదటినుంచీ నిర్మించుకోవలసిన, పునర్నిర్మించుకోవలసిన ఆంధ్రప్రదేశ్ ను ఉన్నతంగా నిలబెట్టుకోవడం మనకి అసాధ్యమేమీకాదు..ఈ ప్రయత్నాన్ని మనం మన రాజమండ్రినుంచే ప్రారంభిద్దాం!
వెయ్యేళ్ళ నిరంతరాయ చరిత్ర సంస్కృతి వున్న మన ఊరు సాంప్రదాయానికి ఎంత పేరో మార్పు అభ్యుదయాలకు కూడా అంతేపేరు. వినూత్నంగా ఆలోచించడంమనకి తెలుసు కష్టపడిపనిచేయడం మనకి వచ్చు. (మెటో్రలు, రాజధానులు మినహా) కొనుగోలు శక్తుల్లో తూర్పుగోదావరిజిల్లా దేశంలోనే 9వస్ధానంలో వుందంటే అది ఈనేల వనరులు, ఈప్రజల చైతన్యాలవల్లే సాధ్యమైంది.
డీసెంట్రలైజేషన్ బేసిస్ తోనే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతుంది. కల్చర్, హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, టూరిజం వంటి రంగాలకు కేంద్రస్ధానం కాగల అవకాశాలు సహజంగానే మన ప్రాంతానికి వున్నాయి.ప్రతిస్ధాయిలో ప్రజాప్రతినిధులు ఈ అవకాశాలు తెచ్చేకృషిచేయాలి
మనబోటి వృత్తినిపుణుల మొదలు సాధారణ పౌరులవరకూ ప్రతిఒక్కరూ మన ఊరిపట్ల మన ప్రాంతం పట్ల మన రాష్ట్రం పట్ల బాధ్యత గా అభివృద్దిలో మనమూ భాగస్వాములమే అన్న విజన్ తో పనిచేస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి ప్రత్యేక స్ధానాలతో ముందుంటాయి. 
తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న వ్యక్తి కొత్తజీవితాన్ని ప్రారంభించినట్టు మన మైండ్ సెట్ ని కూడా పాజిటివ్ గా మార్చుకుంటే సాధించలేనిది ఏదీ వుండదు.అందుకు మనప్రాంతంలో బలమైన వనరులు అవకాశాలూ వున్నాయి 
అసూయా ద్వేషాలతోనే జర్మనీ విడిపోయింది.మధ్యలో గోడకూడా కట్టుకున్నారు. పట్టుదలతో చిత్తశుద్దితో పశ్చిమ జర్మనీ ఎదిగింది. అలాంటి పాజిటివ్ దృక్పధాన్ని చూసిన తూర్పు జర్మనీ వాసులు గోడలు బద్దలుకొట్టి  ఐక్యజర్మనీగా మారిపోయారు. ఆంధ్రప్రదేశ్ కి అంతకు మించిన పొటెన్షియల్ వుంది. 
అన్నీ పక్కనపెట్టి ఎవరిపనిని వారు పాజిటివ్ గాప్రారంభిద్దాం
రాజమండ్రినుంచే మొదలు పెడదాం! 
ముందుగా ఈభావన ను ప్రతీ ఒక్కరిలో నింపే పని చేద్దాం! ఈ ఆలోచనల్ని  మరొకరికి ఇచ్చి వారుచదివాక ఇంకొకరికి ఇచ్చేలా పాజిటివ్ భావాల మానవ హారాన్ని నిర్మిద్దాం! 
మీ 
డాక్టర్ గన్నిభాస్కరరావు 

హేపీ డాక్టర్స్ డే !


1) పరీక్షలు మందుల ఖర్చులు డాక్టర్ చేతిలో లేనివి…అవి మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోలేనివి  ఇది డబ్బు సమస్య ఇది వైద్యుల సమస్య కాదు వైద్యంలో సమస్య
2) వైద్యులలో హెచ్చుమంది మంచి కమ్యూనికేటర్లు కాదు..రోగి రెస్పాన్స్ కి అనుగుణంగా చికిత్సలు మందులు మారుతూంటాయి. ఇది రోగి సంబంధీకులకు స్పష్టంగా చెప్పగలిగిన ఏర్పాటులేదు. టెస్టులకీ మందులకీ అదేపనిగా డబ్బు ఖర్చయిపోతున్నపుడు ఎంతకాలం ఆస్పత్రిలో వుండాలో ఎంతకాలం మందులు వాడాలో తెలియని అవస్ధ రోగిసంబంధీకులను ఆర్ధిక భారాలవల్ల అసహనంలోకి నెట్టుతూంది 
వైద్యులపై అపనమ్మకానికి అదేబీజం. ఎప్పటికప్పుడు రోగిపరిస్ధితిని సంబంధీకులకు చెప్పకుండా ఒక ఉదయం ఆకస్మికంగా ఇక్కడ లాభంలేదు హైదరాబాద్ తీసుకువెళ్ళండి అని సూచించడం పట్టరాని ఆగ్రహాన్ని మిగులుస్తుంది 
3) రోగి వైద్యుల సంబంధాలను గట్టి గా దెబ్బతీస్తున్నమొదటి అంశం కమ్యూనికేషన్ గేప్ (దీన్ని వైద్యులు చక్కదిద్దవచ్చు) మరో ముఖ్య అంశం డబ్బు (దీంతో వైద్యులకు సంబంధం లేదు) 
డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన “ఆరోగ్యశ్రీ” పధకం (లోపాలువుంటే వేరేవిషయం) వైద్యంలో డబ్బు సమస్యకు ఒక ప్రత్యామ్నాయమైంది.
ప్రతి ఒక్కరికీ చదువుకున్నంత వరకూ ఉచిత విద్య,
ప్రతి ఒక్కరికీ ఎంతైనా పూర్తిగా ఉచిత వైద్యం (ప్రభుత్వమో ఇన్సూరెన్సు సంస్ధలో టీచర్లకు డాక్టర్లకూ చెల్లించే విధంగా) పధకాలు వుంటే బాగుండును 
మానవవనరులు అపుడు భౌతికంగా, బౌద్ధికంగా సుభిక్షంగా వుంటాయి 

Blog at WordPress.com.

Up ↑