ఇవాళ డాక్టర్లకు శుభాకాంక్షలు చెప్పే “డాక్టర్స్ డే”
సుప్రసిద్ధ సర్జన్ జిఎస్ ఎల్ మెడికల్ కాలేజి చీఫ్ ప్రమోటర్ రెండు రోజులక్రితం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి బ్రాంచ్ సమావేశంలో ఒక స్ఫూర్తివంతమైన ఉపన్యాసం ఇచ్చారు. అది వైద్యరంగానికి సంబందించినది కాదు..రాష్ట్రం విడిపోయివున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ను నిర్మించుకోడానికి పునర్నిర్మించుకోడానికి అవసరమైన మైండ్ సెట్ గురించి మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలామ్ ఉపన్యాసాలలో ఒకదానిని ముందుగా ప్రస్తావించి తరువాత తన ఉపన్యాసం ఇచ్చారు. ఇది వేర్వేరు వృత్తినిపుణులకు కూడా తెలియాలన్న ఆలోచనతో ఉపన్యాసాన్ని అచ్చువేయించారు. ఆ కాపీని ఇక్కడ వుంచుతున్నాను ఆసక్తి వుంటే చదవండి 
ప్రియమైన స్నేహితులారా!
ముందుగా దేశభక్తుడు, శాస్త్రవేత్త, మాజీ దేశాధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ కలామ్ దేశప్రజలందరికీ రాసిన ఉత్తరాన్ని(ఇది క్లుప్తమైన తెలుగు అనువాదం) చూద్దాం!
——————————————————————-
భారతీయులందరికీ, 
ఇక్కడ మీడియా ఎందుకు వ్యతిరేక దృక్పధంతో వుంది?
మనం మన శక్తిసామరా్ధ్యలను, సాధించిన ఘనతలనూ చెప్పుకోడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాము? మనల్ని మనం గుర్తించుకోవడంలో సమస్య ఏమిటి?
పాలఉత్పత్తిలో, హెచ్చుసంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడంలో మొదటి స్ధానం మనదే!
ధాన్యం పండించడంలో రెండో చోటు మనదే!
గ్రామాన్ని స్వయంపోషకంగా మార్చిన తెలివితేటలు మనవే అందుకు మనకి అన్ని వనరులూ వున్నయి
ఇలాంటి విజయాలు మనకి లక్షల్లో వున్నాయి
కానీ మీడియాకు మాత్రం వైఫల్యాలు సంక్షోభాల మీదదృష్టి పెట్టడం మీదే ఆసక్తి ఎందుకో! ఇజ్రాయెల్ లో బాంబుదాడులు ప్రాణనష్టం జరిగిన మరునాడు టెల్ అవీ విమానాశ్రయంలో పేపరుచదువుతూంటే సంతోషమనిపించింది. ఆ యుద్ధ వార్తలన్నీ లోపలి పేజీలో..ఐదేళ్ళు శ్రమించి ఎడారిలో పూలతోటలు పళ్ళతోటలు మొలిపించిన జూయిష్ పెద్దమనిషి విజయగాధ ఫొటోలు మొదటిపేజీనిండా వున్నాయి
మరి మన మీడియా ఎందుకు ఇంత నెగిటివ్ గా వుంటుంది? మనకి దిగుమతి చేసుకునే విదేశీవస్తువులంటే ఎందుకు ఇంతమోజు?
స్వయంపోషకం నుంచే స్వాభిమానం మొలకెత్తుతుందని మనం తెలుసుకోవడంలేదు.
హైదరాబాద్ లో ఒకసారి 14 ఏళ్ళ బాలికను నీ ఆశయం ఏమిటి అని అడిగినపుడు అభివృద్ధి చెందిన భారత దేశంలో జీవించడం అని చెప్పింది. ఆపాపలాంటి ఆశలున్నవారు లక్షల్లో కోట్లలో వున్నారు వాళ్ళ కోసం మనం దేశాన్ని ముందుకితీసుకువెళ్ళాలి.
మనం ప్రభుత్వాన్ని చట్టాల్ని వ్యవస్ధని అధికారుల్ని పొరుగువాళ్ళని ….ఎవరోఒకరిని ఎందుకో ఒకందుకు విమర్శుంచని రోజు వుంటందా? మరి మనమేం చేస్తున్నాం ? ఎంత బాధ్యతగా వుంటున్నాం? రోడ్లని అన్నిరకాల కమ్యూనిటీ వసతుల్ని పాడుచేస్తున్నది మనం కాదా? 
మరి మన విమర్శలకు అర్ధం వుందా? 
అమెరికా, జపాన్, ఒకటేమిటి ఏ అభివృద్ది చెందిన దేశంలో అయినా పౌరులు ఎంతబాధ్యతగా వుంటారు? 
రోడ్డుమీద ఉమియడంకూడా వుండదే? అంతబాధ్యతాయుతంగా మనం వ్యవహరించవద్దా? 
అమెరికాలో రెసిషన్ అంటే ఇంగ్లాండ్ కీ ఇంగ్లాండ్ లో నిరుద్యోగమంటే ఆసే్ట్రలియాకీ పరుగులుతీసే మన ఆలోచనలు డబ్బు సంపాదనకే తాకట్టయిపోయాయా? 
మనదేశాన్ని సుభిక్షం చేయడానికి వనరులు అవకాశాలు అపురూపంగా వున్న విషయం మరచిపోకూడదు. హక్కులకు బాధ్యతలు కూడా జోడిస్తే మనం ఎంతైనా సాధించగలం .పుచ్చుకోవడమే తప్ప ఇవ్వడం లేకపోతే సంపాదనలో ఎప్పటికీ సంతృప్తి మిగుల్చుకోలేమన్న స్పృహ ఇందుకు మనల్ని ప్రేరేపిస్తుంది. 
-అబ్దుల్ కలామ్
——————————————————————-
డాక్టర్ అబ్దుల్ కలామ్ మాటల్లో స్పూర్తిని అర్ధం చేసుకోగలిగితే మొదటినుంచీ నిర్మించుకోవలసిన, పునర్నిర్మించుకోవలసిన ఆంధ్రప్రదేశ్ ను ఉన్నతంగా నిలబెట్టుకోవడం మనకి అసాధ్యమేమీకాదు..ఈ ప్రయత్నాన్ని మనం మన రాజమండ్రినుంచే ప్రారంభిద్దాం!
వెయ్యేళ్ళ నిరంతరాయ చరిత్ర సంస్కృతి వున్న మన ఊరు సాంప్రదాయానికి ఎంత పేరో మార్పు అభ్యుదయాలకు కూడా అంతేపేరు. వినూత్నంగా ఆలోచించడంమనకి తెలుసు కష్టపడిపనిచేయడం మనకి వచ్చు. (మెటో్రలు, రాజధానులు మినహా) కొనుగోలు శక్తుల్లో తూర్పుగోదావరిజిల్లా దేశంలోనే 9వస్ధానంలో వుందంటే అది ఈనేల వనరులు, ఈప్రజల చైతన్యాలవల్లే సాధ్యమైంది.
డీసెంట్రలైజేషన్ బేసిస్ తోనే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతుంది. కల్చర్, హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, టూరిజం వంటి రంగాలకు కేంద్రస్ధానం కాగల అవకాశాలు సహజంగానే మన ప్రాంతానికి వున్నాయి.ప్రతిస్ధాయిలో ప్రజాప్రతినిధులు ఈ అవకాశాలు తెచ్చేకృషిచేయాలి
మనబోటి వృత్తినిపుణుల మొదలు సాధారణ పౌరులవరకూ ప్రతిఒక్కరూ మన ఊరిపట్ల మన ప్రాంతం పట్ల మన రాష్ట్రం పట్ల బాధ్యత గా అభివృద్దిలో మనమూ భాగస్వాములమే అన్న విజన్ తో పనిచేస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి ప్రత్యేక స్ధానాలతో ముందుంటాయి. 
తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న వ్యక్తి కొత్తజీవితాన్ని ప్రారంభించినట్టు మన మైండ్ సెట్ ని కూడా పాజిటివ్ గా మార్చుకుంటే సాధించలేనిది ఏదీ వుండదు.అందుకు మనప్రాంతంలో బలమైన వనరులు అవకాశాలూ వున్నాయి 
అసూయా ద్వేషాలతోనే జర్మనీ విడిపోయింది.మధ్యలో గోడకూడా కట్టుకున్నారు. పట్టుదలతో చిత్తశుద్దితో పశ్చిమ జర్మనీ ఎదిగింది. అలాంటి పాజిటివ్ దృక్పధాన్ని చూసిన తూర్పు జర్మనీ వాసులు గోడలు బద్దలుకొట్టి  ఐక్యజర్మనీగా మారిపోయారు. ఆంధ్రప్రదేశ్ కి అంతకు మించిన పొటెన్షియల్ వుంది. 
అన్నీ పక్కనపెట్టి ఎవరిపనిని వారు పాజిటివ్ గాప్రారంభిద్దాం
రాజమండ్రినుంచే మొదలు పెడదాం! 
ముందుగా ఈభావన ను ప్రతీ ఒక్కరిలో నింపే పని చేద్దాం! ఈ ఆలోచనల్ని  మరొకరికి ఇచ్చి వారుచదివాక ఇంకొకరికి ఇచ్చేలా పాజిటివ్ భావాల మానవ హారాన్ని నిర్మిద్దాం! 
మీ 
డాక్టర్ గన్నిభాస్కరరావు