మనం గ్లాసుతో నీళ్ళు పొరమారకుండా ఎలాతాగుతామో అలాగే మొక్కల,చెట్ల ఆకులు నేలకి నీళ్ళు పట్టించడం చూశాను. 
చినుకులు మొదలవ్వగానే వానను చూడటానికి, చల్లదనాన్ని తాకడానికి, మట్టివాసనను పీల్చడానికి బాల్కనీలో నుంచున్నపుడు ఈ ప్రకృతి రహస్యాన్ని గమనించాను
జడివాన వేగానికి నేల మీద బుల్లిబుల్లి గుంతలు పడటం, గుంతనుంచి రేగిన మట్టి కరగి వాలుకి కొట్టుకుపోవడం, అంటే నేల పైపొర తొలగిపోవడం కనపడ్డాయి. కానుగ చెట్టుకింద వున్న నేలమీద ఈ దృశ్యం లేదు. 
జడివాన ఉదృతిని, కానుగ ఆకులు ఒడసిపట్టుకుని తుంపరలుగా,  బిందువులుగా మార్చి నొప్పితగలకూడదన్నంత మెత్తగా నేలమీదకు జారవిడిచాయి. నెలల తరబడి ఎండిపోయివున్న  నేల ప్రశాంతంగా నీటిని ఇముడ్చుకోడానికి వాన ఉధృతిని తగ్గించిన ఆకులు అద్భుతంగా ఉపయోగపడ్డాయి. చెట్టుకింద నేల గుంతలు పడనూలేదు. భూసారం కొట్టుకుపోనూలేదు. 
ఒక మొక్కే, ఒకచెట్టే  నేలను ఇంతగా కాపాడితే మొత్తం మొక్కలు మొత్తం చెట్లు నేలని ఎంతగా కాపాడుతాయోకదా?
ఇదేమీ నాకు తెలియకముందే మా రోడ్డుని సిమెంటు రోడ్డుకాకుండా నేను ఆపగలిగాను. మా అపార్టుమెంటుముందున్న మూడుచెట్లనూ కరెంటువాళ్ళు నరికేయకుండా చాలాకాలం ఆపగలిగాను. అన్ని రోడ్లూ సిమెంటురోడ్లయిపోతున్నపుడు – వాననీరు నేలలోకి ఇంకదు, ఎండకు వీధితొందరగా చల్లారదు అని కార్పొరేటర్ కి నచ్చజెప్పి మా వీధివరకూ సిమెంటురోడ్డు ఆపించగలిగాను.. అన్నీ సిమెంటువే మనమే ఇలావుండిపోయేము అందుకు కారకుడైన ఇతగాడు అభివృద్ధి నిరోధకుడు అన్నట్టు నన్ను మా ఆపార్టుమెంటు నివాసుల్లో కొందరు చూస్తూంటారు.
అపార్టుమెంటు ఎదురుగా కరెంటు వైర్లు వున్నాయి. వాటికి అడ్డంగా ఎదుగుతున్న కొమ్మల్ని ప్రతీసారీ నరకడం కష్టమనుకున్న విద్యుత్ శాఖవారు చెట్లను నరికించేయడానికి వచ్చేశారు. అదేశాఖలో ఇంజనీరైన కవి”వెలుతురుపిట్ట” కొత్తపల్లి శ్రీమన్నారాయణ గారికి విషయం చెబితే ఆయన చెట్ల నరకివేత ఆపించేశారు. ఎపుడైనా కరెంటుపోయి వాళ్ళకి ఫోన్ చేస్తే చెట్లు నరికితేతప్ప కుదరదు అనేవారు బతిమిలాడి తెచ్చుకోవలసి వచ్చేది. అలాంటి సమయాల్లో నేను మా వాళ్ళందరికీ శత్రువునే. శ్రీమన్నారాయణ గారు ఆకస్మికంగా చనిపోయారు. పదిరోజులు తిరగకండానే మా అపార్ట్ మెంటు ముందు చెట్లను నరికేశారు. 
మున్సిపాలిటీవాళ్ళ సిమెంటు రోడ్డు పడలేదుగానీ ఏఆపార్ట్ మెంటుకి ముందు ఆ అపార్ట్ మెంటు వారు సిమెంటు ర్యాంపులు కట్టించుకున్నారు. మా వాళ్ళు మనవాకిలే అసహ్యంగా వుందని మీటింగుల్లో అంటూవుంటారు. నావల్లే ఆ అసహ్యమన్నది వారిభావన 
అన్నం పెట్టే ఊరువదలి వెళ్ళి కొత్తపని వెతుక్కోవడం అయ్యేపనికాదుకాని, ఇందాకటి దృశ్యాల్ని చూసినప్పటినుంచీ – కాంక్రీటు నివాసాన్ని సావాసల్నీ వొదిలి మొక్కలు చెట్లు నేల బాగా వున్న ఊరిచివరకు పోయి నివశిస్తేబాగుండునని వుంది…అది చిన్నవిషయంకాదు టా్రన్స్ పోర్ట్, కనెక్టివిటీలకు చాలా ఖర్చుపెట్టాలి అదినాకు భారమే అవుతుంది. అందుకూ సిద్ధమైదూరంగా వెళ్ళినా అన్నివైపులకీ ‘అనకొండ’ వేగంతో పాకుతున్న ఊరు నేను ఎక్కడికి వెళ్ళినా  ఖాయంగా అక్కడికీ వచ్చేస్తూంది
నగరంలో జీవితమంటే కుండీలో పెరిగే మొక్కలాంటిదే. విడిగా బతకాలంటే నగరంతో బతుకును తెంపేసుకోవడమే …ఇంకోదారిలేదు