Search

Full Story

All that around you

Month

August 2014

ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు….కెసిఆర్ కాదు


శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఒక సలహా మాత్రమే! రాష్ట్రవిభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సూచనలు సలహాలు ఇవ్వడానికి అప్పటి కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ కేంద్రానికే నివేదిక ఇచ్చింది ఇవ్వాలి…ఇది స్పష్టంగా తెలిసివున్న చంద్రబాబు స్వయంగా “అశ్వద్థామ హతః” అన్నట్టు ఆకమిటీ తనకు నివేదిక ఇవ్వలేదు అని వ్యాఖ్యానించారు. కమిటీ నివేదిక కేంద్రానికి మాత్రమే ఇవ్వాలని ముఖ్యమంత్రి అంతటివాడికి తెలియదా? తెలిసీ ఆవ్యాఖ్యచేయడం కమిటీ మీద ఒక వ్యతిరేక భావనను డ్రైవ్ చేయడం కాదా?
రాజధాని మీద మంత్రి నారాయణతో చంద్రబాబు మరోకమిటీ వేశారు. శివరామకృష్ణన్ ఆలోచనలకు నారాయణ ఆలోచనలకూ పొంతనలేదు..దీన్ని బట్టి కేంద్రం తన సిఫార్సుతో కాని సిఫార్సు లేకుండా కాని పంపే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకుంటారో అనుమానమే
వికేంద్రీకరణే ప్రాతిపదికగా భూములు లభించని వాస్తవికతపై శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలు హేతుబద్ధంగా వున్నాయి. దీనికంటే మద్దతుదారులు స్వజనుల రియలెస్టేటు ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు తుదినిర్ణయానికి వస్తే కమీటీ నివేదిక పూర్తిగా అటకెక్కేస్తుంది
రాజధాని ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి అని కేంద్రం అంటున్నప్పటికీ అది అంతతేలికకాదు..ఈవిషయంలో కేంద్రం మనసెరిగి అంటే ఆంధ్రప్రదేశ్ మీద విపరీతమైన శ్రద్ధాసక్తులువున్న కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇష్టాయిష్టాల ప్రభావం కూడా రాజధాని ఎంపిక మీద వుంటుంది. ఈ ఎంపిక ఆయనకు నచ్చితే ఢిల్లీ సహకారం ఒకలాగ, నచ్చకపోతే మరొకలాగా వుంటుంది 
రాజధాని ఎంపికలో వెంకయ్య నాయుడిని విస్మరించి నిర్ణయం తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వల్లకాదు…
ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు….కెసిఆర్ కాదు 

వేగం అసౌకర్యం కూడా!


బద్ధకపు మబ్బుల కదలిక ఆదివారపు సోమరితనంలా వుంది…చెట్లు మొక్కలు చేతులూపి చల్లగా గాలితోలుతున్నాయి…ఇది ఒక వసంతం లోపలికి పాకడమే! కదా 
వసంత ఎవరు? మనోజ్ఞ అని విసిగిస్తావు 
ఇది ఇంకోరోలా! పెసరెట్టు తిప్పుతున్న అట్లకాడను చూస్తూ మాత్రవేసుకున్నావా అని విసుక్కుంది సుబ్బలక్షి్మ
ముందుగా అనుకున్నట్టే ఆదివారాన్ని ఆస్వాదించడంలో శనివారంనాటి పనులపాత్ర గట్టిగావుంటుందని రాత్రే అర్ధమైంది…కారులో ప్రయాణం సౌకర్యంగానే కాదు అసౌకర్యంగా కూడా వుంటుంది…నిన్న రానూపోనూ 250 కిలోమీటర్ల ప్రయాణం…రోడ్డు నాట్ బేడ్…డ్రయివర్ కంటో్రల్డ్ గా వేగంగా నడిపాడు…రాత్రి నెప్పులతో ఒళ్ళు పులిసిపోయింది…ఇపుడు విరుచుకనే కొద్దీ ఒళ్ళు సుఖంగా వుంది…ఇలా ఆదివారం ఓపూట నెప్పులతో సమసిపోయినట్టే…ఇంతకుముందు ఓశనివారం చెత్తచెత్త రోడ్లలో ఇంతే దూరం ప్రయాణించాము…హాయిగా నిద్రపోయాము…తరువాతరోజు ఆదివారాన్ని ఆదివారంగానే గడుపుకున్నాము. ఈసారే కాస్త తేడాగా వుంది. 
డ్రయివర్ చేతిలో భద్రతమాత్రమే కాదు గొప్పసౌకర్యం కూడా వుంది…మనుషుల్ని డబ్బాలో పెట్టేసి బరాబరా ఈడ్చుకుపోడానికీ, నొప్పితెలియకుండా లాక్కుపోడానికీ వున్నతేడా ఇపుడు అర్ధమైంది. దూరప్రయాణాలకు “చిన్న”కారులో 60-70 కిలోమీటర్ల వేగం ఎంతో సౌకర్యమని రికమెండ్ చేస్తున్నాను 
ఒకే నెలలో ఎప్పుడో గాని 5 వీకెండ్లురావు. 
ఆగష్టులో ఇది చివరి ఐదో ఆదివారం మీ అందరికీ శుభోదయం! హాపీ సండే!!

తెలుగు ఎలా మనగలుగుతుంది?


భాషను జనం మాటగా మార్చి గిడుగురామ్మూర్తి పంతులుగారు తెలుగుకి వందేళ్ళు ఊపిరిపోశారు…ఆఊపిరే నేనుకూడా రాయగల అవకాశాన్ని ఇచ్చింది 
ప్రపంచవ్యాపతంగా మరణిస్తున్న సగంభాషల్లో అనేక పరిణామాలవల్ల తెలుగు కూడా చేరిపోయింది 
యునెస్కో నివేదిక ప్రకారం 2025 నాటికి మనదేశంలో హిందీ బెంగాలీ మరాఠీ తమిళం మళయాళ భాషలు మాత్రమే వుంటాయి 
గిడుగు మాష్టారి ఉద్యమంవల్ల ఓ వందేళ్ళయినా తెలుగువుంది అందుకు వారిని భక్తి శ్రద్ధలతో గుర్తుచేసుకుంటున్నాను ఆసమయంలో నేనూ వున్నవరంపొందినందుకు సంతోషిస్తున్నాను
తెలుగు మాయమైపోతూండటం విచారకరమే అయినా ఇదొక పరిణామక్రమంగా స్వీకరిస్తున్నాను
(ఉన్నత రాజకీయాధికారంలో వున్నవారిలో మండలి బుద్ధప్రసాద్ గారికితప్ప ఎవరికీ తెలుగు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేవు…ఇందువల్ల తెలుగుని ఉద్ధరించేస్తామనే నాయకుల మాటలు మనకి వినబడవు…ఒక వేళ ఎవరైనా అలా చెబితే అవి దొంగమాటలే అని మరో ఆలోచనలేకుండా అనేసుకోవచ్చు) 
* ప్రపంచంలో ఏమతమైనా తనను తాను ప్రచారం చేసుకోడానికి ప్రజల భాషను ఆశ్రయిస్తే మన వైదీకం జనం భాషకు దూరమై రహస్యంగా వుండిపోయింది
* సంసృ్కతాన్ని పక్కన పెట్టి గౌతమబుద్ధుడు, మహావీరుడు ప్రజలభాష “పాళీ”లో చేసిన బోధనలు శరవేగంతో దేశాన్ని చుట్టుముట్టాయి
* పండితుల సంస్కృత భారతాన్ని వందల ఏళ్ళతరువాతే నన్నయ తెలుగునేల మీదకు తీసుకురాగలిగారు
* తెలుగుదేశాన్ని ఎవరుపాలించినా సంస్కృతమో, పారశీకమో, ఊర్దోనో, ఇంగ్లీషో  పాలకుల భాషగావుండిపోయాయి
* ఉద్యోగాలకోసం నైజాములో ఉర్దూ, ఆంధ్రాలో ఇంగ్లీషూ తెలుగుని టెలుగూ గా మార్చేశాయి
* తెలుగుకోసం ఉద్యమాలు చేసి రాషా్ట్రలు సాధించిన తెలుగువాడు కూర్చున్న కొమ్మను తానే నరికేసుకుంటున్నాడు
* ఇంగ్లీషువాళ్ళు , నిజాం స్కూళ్ళవరకూ తెలుగుని అనుమతించారు తెలుగువాడు తల్లఒడిలోనే మాతృభాషను తన్నేస్తున్నాడు
* మెకాలే ఊహలోనే లేని ఉగ్గుపాల నుంచే ఎబిసిడిలను అడుగులు పడనపుడే ఐఐటి కోచింగ్ లను తెలుగువాడు మోహిస్తున్నాడు
* ఉద్యోగాలు ఇస్తున్నపుడు, తల్లిదండ్రులే చదివించుకుంటున్నపుకు ఇంగ్లీషంటే నొప్పి ఎందుకని సుప్రీం కోర్టే ప్రశ్నిస్తోంది
* భాషఅంటే అది మాట్లాడే ప్రజలూ, చరిత్రా, సంక్కృతీ – ఇవన్నీ ధ్వంసమయ్యాక భాష ఒక్కటే బతికి వుండటం ఎలా సాధ్యం
* పక్కదారులనుంచి దేశంలో దూరిన బ్రిటీష్ వాడిని తరిమేసిన ఉద్యమ విలువలు అమెరికావాడికి ఎస్ బాస్ అనేలా తిరగబడ్డాక మాతృభాషకు చోటెక్కడ?
* మార్కెట్టే జీవిత సర్వస్వమైపోయాక డాలర్ గరగరలు తప్ప తెలుగు నాణాలు మోగుతాయా
* ఆత్మనే అమ్మకుకున్నాక అమ్మ భాష మీద మమకారముంటుందా?
* మాతృభూమిని ప్రేమించకుండా మాతృభాషను కాపాడుకోవడం కుదురుతుందా?
 

స్త్రీ పట్ల ఆలోచనల కాలుష్యం – దృక్ఫధాల్లో మార్పు


సహజమైన కుతూహలం కలిగించేవి (స్త్రీ కి పురుషుడు-పురుషుడికి- స్త్రీ), మనసుల్నిఆహ్లదపరచేవీ, ప్రకృతి పరమైన సహజత్వానికి దూరమై, డబ్బు సంపాదించే వ్యాపార వస్తువులుగా మారిపోవడం వల్ల జీవన సంసృ్కతి కలుషితమైపోతోంది. మహిళలపై, మైనర్ బాలికలపై, చివరికి బడిపిల్లలపై లైంగిక అత్యాచారాలకూ, అఘాయిత్యాలకూ, మూలమీ నైతిక, సాంస్కృతిక కాలుష్యమే!

ఉప్పు పప్పు నూనె బియ్యం లాంటి వినియోగవస్తువుల జాబితాలోకి మనుషుల ఉద్వేగాలతో ముడిపడివున్న వినోదం కూడా చాలాకాలం క్రితమే చేరిపోయింది. అమ్మకాలు కొనుగోళ్ళ మద్య వ్యాపారవస్తువైపోయిన “ఫన్” డిమాండు పెంచడానికి అందులో ఉత్తేజాలనూ, ఉద్రేకాలనూ కలిపేస్తున్నారు.

స్త్రీపట్ల పురుషుడికీ, పురుషుడి పట్ల స్త్రీ కి స్వాభావికంగా వుండే ఆసక్తి, కుతూహలాలను కృత్రిమంగా రెచ్చగొట్టే విధంగా సినిమాలు వస్తున్నాయి. మనుషులకు సహజసిద్ధమైన లైంగికేచ్ఛ ‘లిబిడో’ ని ప్రకోపింపజేసే వాతావరణాన్ని రూపొందిస్తున్న ప్రతీ ముడిసరుకూ వ్యాపారవస్తువే. బెల్టు షాపులు, లైసెన్సు లేని బార్లు, లైసెన్సువున్న బార్లు, పబ్బులు, ఔటింగులు, డేటింగులు, రేవ్ పార్టీలు మొదలైనవి చివరికి లైంగిక సంతోషాల వైపే దారిచూపిస్తున్నాయి.

సెక్స అనేది ఆనందపడటమే, ధ్రిల్ ఆస్వాదించడమే అన్న దృక్పధం వున్న పరిపక్వ/సంపన్న/న్యూరిచ్ క్లాస్ యువతీయువకుల విషయం పక్కన పెడితే ఈ ఆనందాల వేటలో ప్రలోభాల, భ్రమల ఎరకు చిక్కుకునేది మధ్యతరగతి, పేదతరగతి యువతులూ, మహిళలే – వీరిలో హెచ్చుమంది చివరి మజలీ వ్యభిచారమే అయిపోతోంది.

దీనికితోడు టెక్నాలజీ విస్పోటనం నుంచి వచ్చిన సోషల్ నెట్ వర్కింగ్ కుటుంబ సంబంధాల్లో సామాజిక బంధనాల్లో, మానవసంబంధాల్లో తీవ్రమైన మార్పులనే తీసుకువస్తోంది.

ఏకాంతంలో వుండే, వుండవలసిన మధురిమలు బట్టబయలవుతున్నాయి. ఎదుటివారితో ప్రశంసలు పొందాలన్న మనుషుల ఇచ్ఛ స్త్రీలలో పురుషులలో వెర్రితలలు వేసి ఎగ్జిబిషనిజం అవుతోంది.

ఇక్కడ విశేషమేమంటే వర్చువల్ మాయా ప్రపంచపు మనుషులు అవసరమనుకుంటే నిజంగా ప్రత్యక్షమైపోవడమే. మోహం మొత్తాక మాయమైపోవడమే.

మనుషులే సృట్టించిన ఇంటర్నెట్ లోకంలోకూడా మానవప్రపంచంలో వున్న మంచీచెడులన్నీ వున్నాయి. అయితే ఇది మంచి ఇది చెడు అని హితవుచెప్పే పెద్దమనుషుల వ్యవస్ధ అక్కడవుండదు. క్లిక్కులు, టా్రఫిక్కు, హిట్సే అక్కడ లాభనష్టాల లెఖ్ఖ.

పురుషాధిక్య సమాజపు “స్త్రీ పట్ల కుతూహలం” ఇంటర్నెట్ లో పెద్ద వ్యాపారవస్తువు. మానవసమూహాల మధ్యగాక ప్రయివేటుగా కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్టుల తెరలమీద మాత్రమే కనిపించే వీలుండటంవల్ల స్త్రీని విశృంఖలంగా చూపించడానికి, చూడటానికి చిన్నపాటి సంకోచమైనా వుండటంలేదు.

ఇలాంటి “థ్రిల్” ఆఫ్ లైన్ లో, ఇంటర్నెట్ కనెక్షన్ కి అవకాశమే లేని ఫీచర్ మొబైల్ ఫోనుల్లో కూడా శరవేగంతో విస్తరిస్తోంది. మెమరీ కార్డుల్లో బూతు సినిమాలునింపి అమ్ముకునే వ్యాపారం గ్రామాల్లో పెరిగిపోతోంది.

వీటన్నిటి ప్రభావంగా మెదళ్ళల్లో సెక్స్ శక్తివంతమైన ముద్రతో స్ధిరపడిపోతోంది. ఇందువల్ల ఏ స్త్రీ ని అయినా లైంగిక దృష్టితో చూడటమే జరుగుతోంది. మనిషి వేషంలో వున్న కోర్కెల మృగాల మధ్య మహిళలు తిరుగుతున్నారన్న ఆలోచనే వొళ్ళు జలదరింపజేస్తుంది.

మహిళలు యువతులు చివరికి చిన్నపిల్లలపై లైంగికదాడులకు మూలాలు ఇవే.

వంటలో ఉప్పో పులుపో కారమో ఎక్కవైతే పాలో పెరుగోకలిపి వాటిని విరిచేసి రుచికరంగా చేసే చిట్కాలు అమ్మకు తెలుసు. వరదప్రవాహంలా ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి చిట్కాలు చాలవనే అనిపిస్తుంది.

పాపికొండలు దాటాక దిగువవైపు గోదావరి వడి అంతా ఇంతాకాదు. గట్లను ఎలా కోసేయగలదో ఆ వేగం చూస్తేనే అర్ధమౌతుంది.గట్టుగ్రామాల్లో నివాసముండే గిరిపుత్రులు వెదురు బొంగులను ఒక కోణంవుండేలా చెక్కి ఒక మైలు దూరంలో ఏడెనిమిది వుండేలా నదిలో నాటేవారు. వెదురు కోణం, వాటిని నాటిన దిశలనుబట్టి ప్రవాహం దిశమారుతుంది. అంటే గట్టు కోతపడుతున్నచోటుని మార్చడమే. ఇందులో మహాప్రవాహం ఆగలేదు. చిన్న చిట్కాతో ఒక మళ్ళింపు ద్వారా కోతపడే ప్రదేశాన్ని కాపాడుకోవడమే!

“నిర్భయ” లాంటి కఠిన చట్టాలు విషఫలాలను మాత్రమే రూపుమాపగలవు. మూలాలను నిర్వీర్యం చేయనంతకాలం ఆడవారిపై అఘాయిత్యాలను ఆపడం” నిర్భయ” వల్లకాదు.

చట్టబద్ధతకూ, నైతికతకూ హద్దే చెరిగిపోయి, నీతి ఉనికే ప్రశ్నార్ధకమవ్వడంవల్ల ఈ తరం యువతరానికి “తప్పు”, “తలవంపు” అనే స్పృహే తెలియకుండా పోయింది. మనిషిమీద మనిషికి గౌరవ మర్యాదల సంస్కారాన్ని మళ్ళీ తీసుకురాగలిగితే దృక్పధాల్లోనే తప్పక మార్పువస్తుంది. ఇది చట్టాలూ, సామాజిక సంస్ధలపనికాదు. పూర్తిగా తల్లిదండ్రుల పనే. ఏ లైంగిక ఆగడం గురించి చదివినా, విన్నా- కన్నవారు జాగ్రత్తలు చెప్పేది కేవలం కూతుర్లకే…”కొడుకులూ! మీ ఆలోచనలూ నడకలూ జాగ్రత్త” అనాలనే ఆలోచనకూడా తల్లిదండ్రులకు రాకపోవడమే స్త్రీ అభద్రతకు పునాది అవుతోంది

సాంస్కృతిక కాలుష్యం మీద పాలకుల తో సహా అన్ని పార్టీలు, సామాజిక సంస్ధలు దృష్టిపెట్టాలి. ఒక సాంస్కృతిక విధానాన్నిరూపొందించుకోవాలి. నేరస్ధులను శిక్షించడంతోపాటు స్త్రీ పట్ల దురవగాహనపెంచే మూలాలపై చైతన్యం తేవాలి. నీచమైన ఆలోచనలు ఒక రుగ్మత అనే స్పృహ పెంచాలి. ఇదంతా అంతతేలికేనా అనేఆనుమానం ఎదురౌతుంది. ఆదేసమయంలో గోదావరి ప్రవాహాన్ని మళ్ళించి గట్టు కాపాడుకునే గిరిజనుల అనుభవాన్ని కూడా గుర్తు చేసుకోవాలి

-పెద్దాడ నవీన్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రాజమండ్రి

4-08-2013

వేర్పాటుకే పోరాటాలు సమైక్యతకు ఉద్యమాలుండవు 2తెలుగు రాషా్ట్రల్లో వచ్చే ఎన్నికలు!!


ప్రజల ఇష్టప్రకారం రాజ్యాలు ఏర్పడిన చరిత్ర ఒక్కటీలేదు.ఏచరిత్రలోనైనా యుద్ధాలు, సంధులే రాజ్యాల్ని సృష్టించాయి. హద్దుల్ని నిర్దేశించాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా అందుకు భిన్నమైన పరిస్ధితి వుండదు. ఇక్కడ యుద్దాలంటే వత్తిళ్ళే! సైనికులంటే నాయుల్ని అనుసరించే సహచరులు అనుచరులు కార్యకర్తలే ! కాంగ్రెస్ పదేళ్ళ నిర్ణయరాహిత్యం వల్ల /కాలయాపనవల్ల/ ఉదాసీనతవల్ల ఈ మూడింటి వల్లా వత్తిళ్ళు పెరిగి ఉద్వేగాలై ప్రజల్లోకి ప్రవహిస్తున్నాయి.

వేర్పాటుకే ఉద్యమాలూ పోరాటాలు వుంటాయితప్ప సమైక్యతకు అలాంటివి వుండే అవకాశమేలేదు. కెసిఆర్ తెలంగాణా సెంటిమెంటుని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఉద్యమాన్ని నిర్మించారు. ఆందోళనలు చేశారు. ప్రతీసారీ సీమాంధ్రనాయకులు వెటకారపు ఖండనలు, హేళనా పూర్వకమైన విమర్శలు, టివిల్లో ముచ్చట్లేతప్ప రాష్ట్రం కలసి వుండవలసిన అవసరాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలే చేయలేదు. ఇందువల్ల తెలంగాణా ప్రజల్లో రెండో ఆలోచనే లేకుండాపోయింది. అప్పటికే ఉద్వేగంతో వున్న తెలంగాణా వారికి సీమాంధ్ర నాయకుల ప్రకటనలు హేతుబద్ధతలేని నినాదాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. రాజకీయకార్యకర్తలు, పార్టీలు సంస్ధల కార్యకర్తలు, విద్యార్ధులు మినహా సామాన్య ప్రజలెవరూ సమైక్యాంధ్ర కోసం ఆందోళనల్లో పాల్గొనలేదు.

1969 తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రులు 1972 జై ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణావారూ మౌనంగానే వుండిపోయారు. ఇపుడూ దాదాపు అంతే…

అసలు రాష్టా్రలు విడిపోవడమో కలసివుండటమో ప్రజల ఇష్టప్రకారం జరగవు. వత్తిళ్ళే హద్దుల్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుత కాలంలో అధికారంలో వున్న పాలకుల అవసరాలు అనివార్యతలే ఈ అంశాన్ని నిర్దేశిస్తాయి. తెలంగాణా వత్తిడి విభజన ప్రకటనకు దారితీయగా సీమాంధ్ర లాబీయింగ్ ఆప్రకటనను నిలుపుదల చేయించడం వరకే ఉపయోగపడింది.ఈ తమాషాను పదేళ్ళుగాచూస్తున్న కాంగ్రెస్ ఇపుడు కళ్ళుతెరచినట్టే కనిపిస్తోంది.

దేశాన్ని పరిపాలిస్తున్న ముందుముందుకూడా పాలించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అవసరం రాష్ట్రవిభజన అంశాన్ని ఈసారి గట్టిగానే ముందుకి తెచ్చింది. తెలంగాణాలో పాకిపొయిన సొంత రాష్ట్రం సెంటిమెంటును సొమ్ముచేసుకోడానికి టి ఆర్ ఎన్ ఇప్పటికే ముందుంది. అందులో పెద్దవాటా తనదేనంటూ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కాళ్ళు లాగేస్తోంది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్రకే పరిమితం చేస్తే తెలంగాణా ప్రాంతంలోనైనా ఆధిక్యత తెచ్చుకోవాలన్నది కాంగ్రెస్ లెఖ్ఖ.

ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కోర్ కమిటీలో తెలంగాణ అంశంపై చర్చించారు. ఇతర కీలక అంశాలతో పాటు తెలంగాణపై వర్కింగ్ కమిటీలో చర్చించారు. తెలంగాణపై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాల్సిన నేపథ్యంలో శుక్రవారం జరిగిన భేటీ అత్యంత ప్రాధాన్య సంతరించుకుంది. యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి యుపిఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్ నాథ్, అహ్మద్ పటేల్, ఆంటోనీ తదితరులు హాజరయ్యారు. గంటపాటు ఈ బృందం సమాలోచనలు జరిపింది.

పార్లమెంటు సమావేశాల్లోపే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీడబ్ల్యూసీ సమావేశం ఎప్పుడు అనేది వచ్చే వారం నిర్ణయించనున్నారు. మరోవైపు తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ భోపాల్ లో శుక్రవారం మధ్యాహ్నాం ఓ ప్రటకన చేశారు.

తెలంగాణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు. గత వారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలోనే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని భావించినా, బంతిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోర్టులోకి నెట్టేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఈనెల 26న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సమాయత్తమవుతోంది. సీడబ్ల్యూసీ భేటీ తర్వాత రెండు మూడు రోజులకు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాస్తుంది
అదే సమయంలో ఈనెల చివరి వారంలో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించి తెలంగాణపై నిర్ణయం పూర్వాపరాలను వివరిస్తారనీ, భాగస్వామ్య పక్షాల అనుమతితో బిల్లు రూపకల్పనకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలన్నాయి. తెలంగాణ అంశంపై క్యాబినెట్ లో చర్చించి ఆ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉందని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఆగస్టు తొలి వారంలో రాష్ట్రపతి కార్యాలయానికి తెలంగాణ ఏర్పాటు బిల్లును పంపించి ఆగస్టు 15లోగా అసెంబ్లీ తీర్మానం కోసం మన రాష్ట్రానికి పంపవచ్చని సమాచారం. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసన సభ ఆమోదించవలసిన తీర్మానం గురించి దిగ్విజయ్ సింగ్ నాదెండ్ల మనోహర్తో చర్చించారంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో శాసన సభ తీర్మానం ఒక మలుపు లాంటిది. తీర్మానాన్ని చర్చకు చేపట్టే సమయంలో స్పీకర్ అత్యంత మెలుకువతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 2009 డిసెంబర్ 9న అప్పటి హోం శాఖ మంత్రి పి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు దీనికోసం రాష్ట్ర శాసన సభ ఒక తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను అదేశించినట్లు చెప్పటం తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర శాసన సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే తీర్మానం చర్చకు రాకముందే తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసన సభ్యులు రాజీనామా చేయటం, ఆ తరువాత పెద్ద ఎత్తున గొడవ జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి శాసన సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపాదించి చర్చించటం గొడవతో కూడుకున్న విషయం అనేది అందరికి తెలిసిందే. అందుకే దిగ్విజయ్తో నాదెండ్ల జరిపిన చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర శాసన సభలో పార్టీల బలాబలాల గురించి కూడా వారు చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తివేస్తేనే… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే మొదట ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తి వేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగంలోని 371 డి ప్రకారం ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధలను ఆరు సూత్రాల పథకం పేరుతో జారీ చేయటం తెలిసిందే. 1969 తెలంగాణ ఉద్యమం తరువాత ఈ ఆరు సూత్రాల పథకాన్ని జారీ చేస్తూ దీనికోసం రాజ్యాంగాన్ని సవరించారు. లోక్సభలో రాజ్యాంగ సవరణకు మూడింటా రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ వారం, పది రోజుల క్రితం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడారని అంటున్నారు.

ఇక 10జిల్లాల తెలంగాణ, 12జిల్లాల రాయల తెలంగాణలపై కూడా అధిష్టానం కసరత్తు చేస్తోంది. పది జిల్లాల తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలన్నది కాంగ్రెస్ యోచన. రాయల తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోవచ్చని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ఈ కారణంగానే టీఆర్ఎస్ అగ్రనేతలను తరచూ సంప్రదిస్తూనే ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంశంపైనా కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ వర్గాలన్నాయి. మొత్తానికి 2014లో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోందని ప్రచారం సాగుతోంది.

ఇదంతా అర్ధమవ్వడంవల్లే సమైక్యాంధ్ర వుండాలన్న కాంగ్రెస్ వాదులు “యు” టర్న్ తీసుకున్నారు.విడిపోయినా ఫరవాలేదుగాని సభల్లో చర్చజరగాలని రాజమండ్రి ఎంపి ఉండవిల్లి అరుణ్ కుమార్ కొత్తపల్లవి అందుకున్నారు..ఇది మాటమార్చే ప్రక్రియలో పక్కదారి చూపించడమేతప్ప పెద్దచర్చకు కాంగ్రెస్ అవకాశమీయదని ఆయనకీ తెలుసు

విడిపోవాలన్న వారి కోరికతీరుతుంది కాబట్టి కలిసుందామనేవారు మెరుగైన పాకేజి కోసం పట్టుబట్టడమే మిగిలివుంది

4-08-2013

ఆవేశకావేశాలూ సరే! బురదపులుముకునే రాజకీయాలూ సరే!! దారి చూపే పెద్దలు ఏరి


ఎదురుచూడని రైలు వచ్చి,ఆగి, తేరుకునేలోగానే వెళ్ళిపోయినందుకు పా్లట్ ఫారం మీదున్న జనంలో ఆందోళన గందరగోళాలు అరుపులు కేకలు మొదలయ్యాయి. ఆగుంపుల్లో పార్టీలనాయకులు, ముఖ్యమైన వ్యక్తులని పేరుపడిన నానారకాలమనుషులు, డబ్బులున్నవాళ్ళు, నోరున్నవాళ్ళు, తెల్లబట్టలవాళ్ళు నోటికొచ్చినట్టల్లా మాట్లాడేస్తున్నారు.

ఇదంతా వీళ్ళవల్లేనని వాళ్ళూ, వాళ్ళవల్లేనని వీళ్ళూ తగాదాపడుతున్నారు. రైలుని వెనక్కి తెచ్చేద్దం మరేం ఫరవాలేదని కొందరు ఆవేశ పడిపోతున్నారు. అసలురైలే వెళ్ళలేదని ఇంకొందరు కొందరు పెద్దలు విశ్లేషణలు చేసేస్తున్నారు.

సమైక్యాంధ్రా జిందాబాద్ అనీ అన్నిపార్టీలూ డౌన్ డౌన్ అంటూ బస్సులు ఆపేసీ, షాపులు మూయించేసీ, బొమ్మలు తగలబెట్టేసీ యువకులు ఉద్యమించడాన్ని నేర్చుకుంటున్నారు.

రాష్ట్రవిభజన నిర్ణయం ప్రకటితమైనప్పటినుంచీ రాయలసీమ ఆంధ్రా ప్రాంతాల్లో పరిస్ధితి ఇది. ఎవరి పాత్రలను వారు బాగానే నిర్వహిస్తున్నారు.

అయితే వాస్తవాలను విడమరచి దారిచూపే పెద్దమనుషులు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు(ఒకప్పుడున్న సామాజిక నాయకత్వం ఇపుడు అంతరించిపోయింది-న్యూస్ టివిలు పెద్దమనుషుల్లాగే కనిపించినా అవి ఎగదోసే నాశనకారులు మాత్రమేనని అందరికీ బాగానే అర్ధమైపోతోంది)

1)రైలుని వెనక్కిరప్పించే(కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయాన్ని రద్దుచేయించే)శక్తి, సామర్ధ్యం టివీల్లో అరుపులు పెడబొబ్బలు పెట్టే కెమేరా వీరులకుగాని,పదవులకు రాజీనామాలు చేసిన చేస్తామంటున్న కాంగ్రెస్ వాళ్ళకుగాని లేవని ప్రజలు గ్రహించాలి

2)తెలుగుదేశం పార్టీ లేఖవల్లే ఈ పరిస్ధితి వచ్చిందని ఆడిపోసుకుంటున్న కాంగ్రెస్ వారు – 2004 లోనే సాక్షాత్తూ సోనియాగాంధీ తెలంగాణా ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకోవాలి. సమస్యను నాన్చి ముదరబెట్టిన కాంగ్రస్ వైఫల్యాన్ని ఇతరుల నెత్తిన రుద్దడం ఎంత సమంజసమో ఆలోచించుకోవాలి.

3)వత్తిడి పెంచడానికి ఆందోళనలు అలజడులు సరే! ఆగొడవసాగిస్తూనే రేపటి కార్యక్రమమేంటో కూడా నిర్ణయించుకోవాలి. తెలంగాణా ఏర్పాటుచేయాలన్న అధికారపార్టీ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేయడం మొదలుపెడుతుంది.అందుకోసం కేబినెట్ కమిటీ పని మొదలుపెట్టేటప్పడికే ఉమ్మడి రాజధానిలో రెండులేదా మూడు రాషా్ట్రల హక్కులు ఏమిటీ అజమాయిషీ ఎవరిది మొదలైన అంశాలపై అవగాహనకు రావాలి. హెచ్చు అవకాశాలకోసం వాదనలు సిద్దం చేసుకోవాలి (టివిల్లోకాదు టివిల్లోనే ఈ దుకాణం పెడితే ప్రయోజనాలు సర్వనాశనమైపోతాయి)

4)పదేళ్ళో ఎంతోకొంతకాలం ఉమ్మడి రాజధాని తప్పదుకాబట్టి రాయలసీమనుంచి, ఆంధ్రానుంచి హైదరాబాద్ లో చేరేవరకూ కనీసం రెండు మూడు రోడ్ల మార్గం పొడవునావున్న ప్రాంతాలను సీమాంధ్ర రాష్ట్రం హద్దుల్లోకి వచ్చే నోటిఫికేషన్ చేయించుకోవాలి లేకపోతేసొంత యింటికిచేరుకునే దారి కోసం పొరుగువాళ్ళని బతిమిలాడుకునే అవస్ధతప్పకపోవచ్చు

5) చండీఘడ్ ఉమ్మడిరాజధాని గా వుండటం మూలాన పంజాబ్ హర్యానా రాష్టా్రల సమస్యలేమిటో అధ్యనం చేయాలి

6)విభజన హద్దులు ఏమిటి?రాజధాని – రాయలసీమ ఆంధ్రాలు వేర్వేరు రాషా్ట్రలైతే రాజధానులు ఎక్కడ మొదలైన విషయాలపై ఒక అవగాహనకు రావాలి

కేబినెట్ ఉపసంఘం పని బహుశ నెలరోజుల్లో మొదలౌతుంది అప్పటికి ఈ అంశాలతో సిద్దం గా లేకపోతే ఉపసంఘం తనకు అందుబాటు /వీలైన విషయాలనే ఖరారు చేసేస్తుంది. (అస్ధులు అప్పులు పంపకాలు తరువాత దశలకు వస్తాయి) అంటే రెండో రైలుకూడా ప్రజలతో నిమిత్తం లేకుండానే వెళ్ళి పోవడమన్నమాట
రాజకీయవేత్తలు మాత్రమే ఈపనులన్నీ చేయలేరు చేయరు కూడా మేధావులు ఆలోచనాపరులు నిపుణులు ఇందులో మార్గాలను వెతకాలి పెద్దమనుషులు వీరినందరినీ రాజకీయవేత్తలతో అనుసంధానం చేయాలి.

4-08-2013

డియర్ వేణు! జర్నలిస్టుగా నేను పోగొట్టుకున్నవాటిలో అతిముఖ్యమైనది చదువుకునే అలవాటు…


డియర్ వేణు,

మనిషినుంచి లోపలిమనిషిని దూరంచేసే ఉద్యోగాల్లో జర్నలిస్ట్ ఉద్యోగమొకటని తెలిసే సరికే చాలాఏళ్ళు (జర్నలిజం వృత్తికాదు ఉద్యోగమనీ, మితిమీరిన వత్తిడివల్ల – ఈ పని స్పందనలు కోల్పోయిన యంత్రప్రాయమేననీ తెలుసుకునే సరికి కొన్నేళ్ళ) గడచిపోయాయి.

నేను పోగొట్టుకున్న వాటిలో అతిముఖ్యమైనది చదువుకునే అలవాటు.

నాకు పుస్తకాలు కొని చదవడమే నచ్చుతుంది. ఎవరినుంచైనా తీసుకువస్తే తిరిగియిచ్చేయాలన్న ఆలోచన స్ధిమితంగా వుండనీయదు.

మనం విజయవాడలో పనిచేసినప్పుడు ప్రతీనెలా పుస్తకాల బడ్జెట్ వుండేది. కథలు నవలలు సాహిత్య వ్యాసాలు …. చివరి ప్రాధాన్యతగా కవితలు..ఒకటేమిటి పుస్తకం దొరికితే చదవాల్సిందే

ఒకే పెద్దయింట్లో అయిదు కుటుంబాలవాళ్ళం అద్దెకుండేవాళ్ళం. ఒక వేసవిలో అన్ని ఇళ్ళలోనూ ఇల్లాళ్ళు పిల్లల్నితీసుకుని పుట్టిళ్ళకు వెళ్ళారు. నాభార్య అన్ని యిళ్ళ కరెంటుబిల్లులు కట్టేపని నాకుపెట్టి అందరి డబ్బులూ యిచ్చి రాజమండ్రి వెళ్ళిపోయింది. బిల్లు కట్టేగడువు ఇంకావుంది.కొత్తపుస్తకాలు వచ్చాయి. జీతంతీసుకున్నాక కట్టొచ్చన్న ధీమాతో పుస్తకాలు కొనేసి వాటిని చదివే ఆబలో దాదాపు రాత్రంతా మెళకువగా వుండి ఉదయమే లేవలేక ఇతర రిపోర్టర్లనుంచి వార్తలు తీసుకుని…రోజులు గడిపేసి ఫ్యూజులు తీసేసేదాకా బిల్లు మరచిపోయిన సంఘటన నా వ్యక్తిగత క్రమశిక్షణా రాహిత్యానికీ…పుస్తకాలు చదవడం మీదున్న నా ప్రేమకీ , ఒక జ్ఞాపకమే!

మనసుకి నచ్చకపోవడం మొదలైందంటే ఇక ఆపనిమీద అసహనం రోజురోజుకీ రెట్టింపైపోతూనేవుంటుంది. కారణాలేమి చెప్పుకున్నా అలాంటి తట్టుకోలేని ఒక సందర్భంలో ఈనాడు నుంచి వచ్చేశాను.

భార్య, హైస్కూలుకొచ్చిన ఇద్దరు కొడుకులు, 630 రూపాయల బేంకు బ్యాలెన్సు, ఇంతకాలం ఈ మిడిల్ మేనేజిమెంటువాడి తో ఎలా పనిచేశానా అని గుండెనిండా ఆశ్యర్యం – ఓ మూల పెద్దహాయి, ఎలాగైనా బతకలేకపోమన్నధీమా, మనమెవరికీ ద్రోహం చేయలేదు కాబట్టి దేవుడు మనకి అన్యాయం చేయడని భార్య యిచ్చిన భరోసా తప్ప 18 ఏళ్ళు పనిచేసి 1997 జూన్ 6 న ఉద్యోగం మానేసేటప్పడికి నాదగ్గర ఏమీలేదు.

జర్నలిస్టుల కుటుంబాలకు సాయంకాలాలు వుండవు. నేను ఉద్యోగం వదిలేశాక ఇంచుమించు ఆరునెలలపాటు (గ్రాట్యుయిటీ డబ్బులు అయిపోయేదాకా) మాకూ సాయంత్రాలు మిగిలాయి. చిరంజీవి సౌభాగ్యవతి నా భార్య సుదీర్ఘకాలం మిగుల్చుకున్న సంతోషం ఆ సమయమే నేమో!

ప్రేమాస్పదంగా, గౌరవంగా, ఆర్ధికకోణంనుంచి జస్ట్ సంతృప్తికరంగా జీవించడానికి, ఈమూడూ పొసగనిపొత్తులని అర్ధంచేసుకుంటూ పొత్తుపొసగించడానికి దాదాపు నిరంతర పోరాటంలాంటి ఉద్యమం చేస్తూ నిలదొక్కుకోడానికి ఇంకో 15 సంవత్సరాలు పట్టింది. ఈదశలోనే ఆరోగ్యం బాగాదెబ్బతినేసింది.

నెలనెలా జీతంలేని పనిలో రోజువారీ పెనుగులాట,(చాలాసార్లు సమాధానం దొరకని) రేపేమిటన్న ప్రశ్నే పూర్తిగా ఆవరించేసుకుని నేను “ఖాళీ” లేనిమనిషినైపోయాను.

కొద్దిపాటి డబ్బు, కాస్త సహృదయత, అన్నిటికీ మించి ఓపెన్ మైండు వున్న పౌరప్రముఖుడి సావాసం నాకు పెద్దపనినే అప్పగించింది. ఈతిబాధలు తీరిపోయాయి.
కాస్తవెసులుబాటు దొరికాక మళ్ళీ చదువుకోవచ్చని సంబరపడిపోయాను.

వేలాది మంది పాఠకుల మాదిరిగానే నేనూ దారితప్పి టివి ప్రేక్షకుణ్ణయిపోయినవాణ్ణేనని అప్పుడే అర్ధమైంది…

అయినా మొండిగానే చేసిన ప్రయత్నానికి మళ్ళీ మూడు అవరోధాలు ఎదురయ్యాయి.

ఒకటి-సాహిత్య సారస్వత సాంస్కృతిక కేంద్రమనిపించుకుంటున్న రాజమండ్రిలో మంచి పుస్తకాల షాపు లేకపోవడం, రెండు – కాస్త శ్రమా ఖర్చు తో విజయవాడవెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్న ప్రతీసారీ , (పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ పరచేసే ఆసంబరం కొన్ని రోజుల పాటు వుంటుంది) పుస్తకాలతో సహా నిన్నూ కిందికి విసిరేస్తాననే మా ఆవిడ విసుగుదల (వయసైపోతోందికదా!) అదీగాక ఇల్లుకూడా చిన్నదే మరి

ఈ రెండు కారణాలకూ మించింది …నా ఉద్వేగాలకు సంబంధించినదీ మూడో కారణం.

గ్లోబలైజేషన్/ప్రయివేటైజేషన్ మూలాలనుంచి పుట్టింది నేను పనిచేస్తున్న ప్రాజెక్టు. ఇలాంటిచోట్ల కనీసహక్కులను గుర్తించనట్టే నటిస్తారని, మానవ సంబంధాలే వుండవని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
నా అతిచిన్న అధికార పరిధిలో ఈ పరిస్థితులు లేకుండా చూడగలగడం కాస్త తృప్తి అనిపిస్తూంది.

ఆదే కొన్నిసార్లు చర్చకు దారితీసినపుడు వాదించకుండా మౌనంగా వుండి పోవడమే నేను నేర్చుకున్న సూత్రం. ఒకప్పుడు ఇలాంటి “నిస్సహాయత” నన్ను నీలదీసేది… ఉక్రోషపరచేది…ఉద్వేగపరచేది…నిలదీయించేది.

నిస్సహాయత “లౌక్యం” గా రూపాంతరం చెందాక ఎపుడూ నిర్వేదం …ఎపుడో ఓ ఉలికిపాటు తో రోజులు వెళ్ళిపోతున్నాయి. విచిత్రమేమిటంటే ఈ అవస్ధే నాకు కాస్త డబ్బు యిచ్చింది. ఈ సావకాశం కూడా పుస్తకాలు చదవనీయలేదు.

ఏది చదువుతున్నా ఒక అంతర్మధనం మొదలౌతోంది. తలవొంచుకున్న “లౌక్యం” ముందు “నిస్సహాయత” తలెగరేయడం మొదలుపెడుతోంది.

ఈ పరిణామాలన్నీ చదువునుంచి నన్ను చాలాదూరం ఈడ్చుకుపోయాయి.

ఆరోగ్యకారణాలతో పాటు కాస్త ఆదాయం కూడా స్ధిరపడ్డాక రెండేళ్ళనుంచీ పెద్దపనులు పెట్టుకోకుండా దాదాపు పెన్షనర్ లాగే జీవిస్తున్నాను.

దారితప్పి ప్రేక్షకుణ్ణయిపోయిన నాకు మళ్ళీ చదువుకోవాలనిపించింది. మొదటినుంచీ పడుకునే చదవడం నా (చెడ్డ) అలవాటు. పడుకుని పట్టుకోడానికి వీలుగా మన పుస్తకాలు వుండవు.

ఇ-రీడింగ్ దీనికి ఒక పరిష్కారమని నాకు అర్ధమయ్యేసరికి తెలుగు ఇ పుస్తకాలు లేవు. రాకపోతాయా అన్న నా ఆశ kinige.com వల్ల నెరవేరింది. మొదట iPad మీద blue fire రీడర్ లో తెలుగు ఇ పుస్తకాలు చదివేవాడిని. వెల్లకిలా పడుకుని వుండగా దాదాపు అరకిలో బరువున్న ఐపాడ్ ని పట్టుకుని చదవడం సౌకర్యం కాదు. అదీగాక మొబైల్ ఫోన్, ఐపాడ్ వగైరా గాడ్జెట్టుల సీ్ర్కన్ వెనుక నుంచి వచ్చే కాంతికి చదివేకళ్ళు త్వరగా అలసిపోతాయి.

ఇంక్ టెక్నాలజీతో (అంటే కాంతి అక్షరాలమీద పడగా ఆ అక్షరాలను మనం చదువుకోవడం / లైటు వేసుకుని లేదా పగటి పూట పుస్తకం చదువుకోవడం) తయారైన ఈ రీడర్లే సమస్యకు పరిష్కారమని అర్ధమయింది.

తెలుగులో ఇ పుస్తకాలు వేసే ఏకైక సంస్ధ కినిగే ప్రచురణలు అన్ని ఈ రీడర్లలోనూ తెరచుకోవు. వారి సూచన మేరకు “సోని రీడర్” ఈబే లోకొన్నాను. చాలా పుస్తకాలు కొని ఈ ఉపకరణంలో డౌన్ లోడ్ చేసుకున్నాను. చిన్నగా చదువుకుంటున్నను.

ఇకదొరకవేమో అన్నంత ఆబగా ఆన్ లైన్ లో పుస్తకాలు దిగుమతి చేసుకున్నప్పుడల్లా నాకు చాలా ధీమాగా వుంటుంది. చిన్నపాటిగర్వంగా కూడా అనిపిస్తుంది.

నేనువుంటున్న ఇంటిని కొనుక్కున్నప్పటి తృప్తికంటే పుస్తకాలు సమీకరించుకునేటప్పటి సంతృప్తే నాకు ఎక్కువ ఆనిపిస్తుంది.

మళ్ళీ చిన్న సమస్య నా పగటి సమయం దాదాపు షెడ్యూలైపోయివుంటుంది. ప్రశాంతంగా చదువుకునేది రాత్రివేళే. అప్పుడు లైటువేసి చదువుకోవడం నా భార్యా పిల్లల ప్రశాంత నిద్రను ఇబ్బంది పెట్టడమే. అందువల్ల నేను అనుకున్నంత వడిగా చదువు సాగటంలేదు.

కంటికి శ్రమకలిగించని ఇంక్ టెక్నాలజీకి ఇన్ బిల్ట్ లైటుని అమర్చిన ఇ రీడర్లు ఈమధ్యేమార్కెట్ లోకి వచ్చాయి. వాటిలో కినిగేకి కంపేటబిలిటీ వున్న “kobo glo” అనే రీడర్ ని ఇప్పటికే యు ఎస్ లో వున్న ఒక స్నేహితుడు నాకోసం కొన్నాడు. (ఇది ఇ బే లో లేదు- ముంబాయి, ఢిల్లీలలో కూడా ఈ రీడర్లు లేకపోవడం కాస్త ఆశ్చర్యంగావుంది-త్వరలో మన మార్కెట్ కి కూడా విద్యార్ధుల కోసం ఇవి బాగావచ్చే సూచనలూ వున్నాయి)

అతని భార్య 31 న ఇండియా వచ్చేటప్పుడు నారీడర్ కూడా తెస్తారు. ఆమె కుటుంబీకులంత ఆదుర్దాగానే నేను ఆమెకోసం ఎదురు చూస్తున్నాను

ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వచ్చేశాను. టెక్నాలజీలూ, గాడ్జెట్టులూ మన అవసరాల్ని సౌకర్యవంతంగా తీర్చవచ్చేమోగాని మననుంచి చాలాదూరం వెళ్ళిపోయిన మనల్ని మళ్ళీ మనలోకి తసుకు రాలేవు కదా!

వుంటాను
25/07/2013

*ఇంకోమాట చిన్న ఉత్తరం రాసే తీరికలేక ఇంతపెద్ద ఉత్తరం రాశాను

నా హైస్కూల్ రోజుల్లో పోస్ట్ మన్ ఇచ్చిన వుత్తరం చదివాక దాచివుంచడానికి కొక్కెంవున్న ఊచలాంటి ఉత్తరాల బొత్తి వుండేది. దానికి ఉత్తరాన్ని గుచ్చకానికి మా తమ్ముడూ నేనూ పోటీ పడేవాళ్ళం. అప్పట్లో ఉత్తరం …అందుకున్న వాళ్ళదగ్గరే వుండేది. మెయిల్ పుణ్యమా అని ఒకే ఉత్తరం అందుకున్న వారిఇన్ బాక్స్ లో పంపిన వారి సెంట్ బాక్స్ లో కూడా వుండటం విచిత్రమనిపిస్తోంది.

కొయ్యగుర్రమెక్కి (వర్చువల్) లోకంలో స్వారీచేసినట్టు – ఈ ఉత్తరం మీ చేతికందకపోవడం ఎంత నిజమో దీన్ని మీరు చదువుతూండటం కూడా అక్షరాలా అంతే నిజం
అసలు ఈ టెక్నాలజీ ఇంద్రజాలం మనుషుల్ని ఎంత మోహపరుస్తూందోకదా!

పాఠకులు ప్రేక్షకులయ్యారు
ప్రేక్షకులు సగంనిజాలు సగం డిజిటల్స్ అయిపోతున్నారు.
వర్చువల్ జీవితాలనుంచి అందరమూ ఎప్పటికైనా వెనక్కి వచ్చేస్తామా?
మామూలు మనుషులమౌ తామా?

Blog at WordPress.com.

Up ↑