ఎదురుచూడని రైలు వచ్చి,ఆగి, తేరుకునేలోగానే వెళ్ళిపోయినందుకు పా్లట్ ఫారం మీదున్న జనంలో ఆందోళన గందరగోళాలు అరుపులు కేకలు మొదలయ్యాయి. ఆగుంపుల్లో పార్టీలనాయకులు, ముఖ్యమైన వ్యక్తులని పేరుపడిన నానారకాలమనుషులు, డబ్బులున్నవాళ్ళు, నోరున్నవాళ్ళు, తెల్లబట్టలవాళ్ళు నోటికొచ్చినట్టల్లా మాట్లాడేస్తున్నారు.

ఇదంతా వీళ్ళవల్లేనని వాళ్ళూ, వాళ్ళవల్లేనని వీళ్ళూ తగాదాపడుతున్నారు. రైలుని వెనక్కి తెచ్చేద్దం మరేం ఫరవాలేదని కొందరు ఆవేశ పడిపోతున్నారు. అసలురైలే వెళ్ళలేదని ఇంకొందరు కొందరు పెద్దలు విశ్లేషణలు చేసేస్తున్నారు.

సమైక్యాంధ్రా జిందాబాద్ అనీ అన్నిపార్టీలూ డౌన్ డౌన్ అంటూ బస్సులు ఆపేసీ, షాపులు మూయించేసీ, బొమ్మలు తగలబెట్టేసీ యువకులు ఉద్యమించడాన్ని నేర్చుకుంటున్నారు.

రాష్ట్రవిభజన నిర్ణయం ప్రకటితమైనప్పటినుంచీ రాయలసీమ ఆంధ్రా ప్రాంతాల్లో పరిస్ధితి ఇది. ఎవరి పాత్రలను వారు బాగానే నిర్వహిస్తున్నారు.

అయితే వాస్తవాలను విడమరచి దారిచూపే పెద్దమనుషులు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు(ఒకప్పుడున్న సామాజిక నాయకత్వం ఇపుడు అంతరించిపోయింది-న్యూస్ టివిలు పెద్దమనుషుల్లాగే కనిపించినా అవి ఎగదోసే నాశనకారులు మాత్రమేనని అందరికీ బాగానే అర్ధమైపోతోంది)

1)రైలుని వెనక్కిరప్పించే(కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయాన్ని రద్దుచేయించే)శక్తి, సామర్ధ్యం టివీల్లో అరుపులు పెడబొబ్బలు పెట్టే కెమేరా వీరులకుగాని,పదవులకు రాజీనామాలు చేసిన చేస్తామంటున్న కాంగ్రెస్ వాళ్ళకుగాని లేవని ప్రజలు గ్రహించాలి

2)తెలుగుదేశం పార్టీ లేఖవల్లే ఈ పరిస్ధితి వచ్చిందని ఆడిపోసుకుంటున్న కాంగ్రెస్ వారు – 2004 లోనే సాక్షాత్తూ సోనియాగాంధీ తెలంగాణా ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకోవాలి. సమస్యను నాన్చి ముదరబెట్టిన కాంగ్రస్ వైఫల్యాన్ని ఇతరుల నెత్తిన రుద్దడం ఎంత సమంజసమో ఆలోచించుకోవాలి.

3)వత్తిడి పెంచడానికి ఆందోళనలు అలజడులు సరే! ఆగొడవసాగిస్తూనే రేపటి కార్యక్రమమేంటో కూడా నిర్ణయించుకోవాలి. తెలంగాణా ఏర్పాటుచేయాలన్న అధికారపార్టీ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేయడం మొదలుపెడుతుంది.అందుకోసం కేబినెట్ కమిటీ పని మొదలుపెట్టేటప్పడికే ఉమ్మడి రాజధానిలో రెండులేదా మూడు రాషా్ట్రల హక్కులు ఏమిటీ అజమాయిషీ ఎవరిది మొదలైన అంశాలపై అవగాహనకు రావాలి. హెచ్చు అవకాశాలకోసం వాదనలు సిద్దం చేసుకోవాలి (టివిల్లోకాదు టివిల్లోనే ఈ దుకాణం పెడితే ప్రయోజనాలు సర్వనాశనమైపోతాయి)

4)పదేళ్ళో ఎంతోకొంతకాలం ఉమ్మడి రాజధాని తప్పదుకాబట్టి రాయలసీమనుంచి, ఆంధ్రానుంచి హైదరాబాద్ లో చేరేవరకూ కనీసం రెండు మూడు రోడ్ల మార్గం పొడవునావున్న ప్రాంతాలను సీమాంధ్ర రాష్ట్రం హద్దుల్లోకి వచ్చే నోటిఫికేషన్ చేయించుకోవాలి లేకపోతేసొంత యింటికిచేరుకునే దారి కోసం పొరుగువాళ్ళని బతిమిలాడుకునే అవస్ధతప్పకపోవచ్చు

5) చండీఘడ్ ఉమ్మడిరాజధాని గా వుండటం మూలాన పంజాబ్ హర్యానా రాష్టా్రల సమస్యలేమిటో అధ్యనం చేయాలి

6)విభజన హద్దులు ఏమిటి?రాజధాని – రాయలసీమ ఆంధ్రాలు వేర్వేరు రాషా్ట్రలైతే రాజధానులు ఎక్కడ మొదలైన విషయాలపై ఒక అవగాహనకు రావాలి

కేబినెట్ ఉపసంఘం పని బహుశ నెలరోజుల్లో మొదలౌతుంది అప్పటికి ఈ అంశాలతో సిద్దం గా లేకపోతే ఉపసంఘం తనకు అందుబాటు /వీలైన విషయాలనే ఖరారు చేసేస్తుంది. (అస్ధులు అప్పులు పంపకాలు తరువాత దశలకు వస్తాయి) అంటే రెండో రైలుకూడా ప్రజలతో నిమిత్తం లేకుండానే వెళ్ళి పోవడమన్నమాట
రాజకీయవేత్తలు మాత్రమే ఈపనులన్నీ చేయలేరు చేయరు కూడా మేధావులు ఆలోచనాపరులు నిపుణులు ఇందులో మార్గాలను వెతకాలి పెద్దమనుషులు వీరినందరినీ రాజకీయవేత్తలతో అనుసంధానం చేయాలి.

4-08-2013