Search

Full Story

All that around you

Month

September 2014

నల్లనేలలు పచ్చని ఛాయలు


కనుచూపుమేర పచ్చ తివాచిలా పరచుకున్న వరిపైరు, మధ్యమధ్యలో ముదురు ఆకుపచ్చ అడవిలా వ్యాపించిన జామతోటలు, అక్కడక్కడా ఏదో సంకోచంగా మొలిచిన పత్తిచేలు, దుమ్మూ ధూళీ లేకుండా, రాయిలా అణగారిపోయిన నల్లమట్టి కణాల మార్జిన్లు, అందంగా మెరిసిపోతున్న సింగిల్ తార్రోడ్లు…
 గుంటూరు జిల్లా తుళ్ళూరు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో నిన్న నాయాత్రా సన్నివేశం ఇది. ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసరాల్ని పరిశీలించే నా అధ్యయన యాత్రల్లో ఇది మూడవది. 
నీరున్నపుడు ఈనేలలు ఎంతమెత్తనో నీరెండినపుడు అంత దృఢంగావుంటాయి. రోడ్డుపక్కన ఒక చేలోదిగినపుడు నేల కాలుని పొదివిపట్టుకున్నంత హాయి అనిపించింది. ఇంతకంటే పాదరక్షణ ఇంకేముంటుందనిపించింది. కారెక్కేముందు ఒక కుళాయి కింద మట్టి వదిలించుకోవడం చాలాసుళువైంది గోదావరి డెల్టాల్లో అయితే బురద తేలిగ్గా వొదరదు మట్టిలో జిగిరు తేలిగ్గా వదలదు జాగ్రత్తగా కడుక్కోకపోతే ఇంకా అలుముకుంటుంది. తుళ్ళూరు మట్టిలో జిడ్డులేదు.జిగురు తక్కువ. ఆరిపోగానే మట్టి రాయిలా బిగుసుకుపోతుంది. 
మంగళగిరి దగ్గర రోటీలు తినడానికి ఒక ఢాభా దగ్గర ఆగినపుడు నల్లమట్టి గడ్డను చెప్పులు విప్పేసి కాస్తగట్టిగానే కాలిక్లేటెడ్ గా తన్నాను. అనుకున్నదానికంటే గట్టిగానే దెబ్బతగిలించి కాస్త ఎక్కువసేపే నొప్పి వుంది.
నేను (తోడుగా వచ్చిన మరో మిత్రుడితో కలసి) కారుదిగిన ప్రతీచోటా పోలాలు కొండానికి వచ్చేశారా అనే పలకరింపు జనాల చూపుల్లో ఫీల్ అయ్యాము. భూముల ధరలుకాక ఆప్రాంత జనజీవనంలో ప్రత్యేకతలు మాత్రమే మేము అడగడం వారికి ఆశ్చర్యాన్ని కుతూహలాన్ని కలిగించడం గమనించాము. హెచ్చుమంది అయితే మేము పలకరించగానే ఆప్రాంతం భూములధరలు ఎలా పెరిగిపోతున్నాయో ఏకరువు పెట్టడం చూశాము.
ధరల విషయంలో నాకు ఆసక్తిలేదు రాజధాని అయిన ప్రాంతం సమీపప్రాంతాలు ఇప్పుడు ఎలావున్నాయి రేపు ఎలా మారుతాయి అని పరిశీలించాలన్న ఆధ్యనాపూర్వకమైన కుతూహలం మాత్రమే నాది.
ఈసారి వెళ్ళినపుడు 1) ఎవరో ఒక సామాన్యుణ్ణి ఎంచుకుని వారి ఇంట్లో ఆకుటుంబం రోజూతినే భోజనం చేయడం 2) ఆప్రాతం ప్రత్యేకతలకు ప్రతీకతలను దర్శంచచడం 3) ఆయాగ్రామ దేవతలను దర్శించి అనువంశిక పూజారులతో (వీరు బాహ్మణులు కాదు) మాట్లాడటం…
ఈ మూడిటిలో ఒకటైనా చేయాలని నిర్ణయించుకున్నాను 
అలసటలేదుకాని నిన్నటి ప్రయాణపు ఒళ్ళునెప్పులతో నిద్రలేచాను వయసుపెరుగుతూండటమే ఒళ్ళునెప్పులకు కారణమేమో ఇంకా ప్రయాణాలు చేయవలసివుంది కాబట్టి నెప్పులు లేని / తక్కువ వుండే ఉపాయాలను వెతుక్కోవాలి
29-9-2014 సోమవారం శుభోదయం 

పారదర్శకతను కప్పుకున్న వాతవరణం!


సూర్యుడి తిష్ణానికోఏమో మేఘాలన్ని ఊడ్చేసినట్టు పడమటి వైపుకీ ఉత్తరవైపునా పోగుపడి పరచుకుంటున్నాయి…
తూర్పువైపు తేరిపార చూడలేనంత బంగారు నగిషీల వెండికాంతి…
దక్షిణంనుంచి నిలకడగా చిన్నగా వీస్తున్న గాలితరగ శరీరానికి కలిగిస్తున్న హాయి…
కొన్ని కొన్ని రంగులు ఆయాకాలాలకు రుతువులకు ప్రతీకలుగా / సిగ్నేచర్ ట్యూన్లుగా మనసుల్లో రంగుల సంగీతాన్ని పలుకుతాయి…
దేవీనవరాత్రులతో ఆశ్వయుజమాసంతో మొదలయ్యే శరత్కాలం/రుతువు రంగు ఏమైవుంటుందా అని గతరుతువులో కూడా ఆలోచించినా సమాధానం తట్టలేదు
 ఈ ఉదయమే అర్ధమైంది శరదృతువు రంగు పారదర్శకం (పియర్స్ సబ్బుమాదిరి టా్రన్స్ పరెంట్) 
ఈకాలంలోనేకదా వెన్నెల నిండుగా కాసేది, కురిసేది
నిజానికి చందమామ కాంతి ఎప్పుడూ ఒకటే ఆకాశమూ వాతావరణమూ ఎప్పుడూ ఏవో రంగులు ఛాయల్ని కప్పుకుని వుండటం వల్ల వాటిని దాటి చీల్చుకుని వచ్చే కాంతి యధాతధంగా కనిపించడంలేదు అనిపించింది
శరదృతువు పారదర్శక వర్ణం కాబట్టే ఈకాలపు రాత్రిళ్ళు 
వెండివెన్నెల జాబిల్లులే అని అర్ధమైంది 
28-9-2014 ఆదివారం శుభోదయం
 

శ్రద్ధ ఆసక్తి వృత్తిగౌరవం క్రమశిక్షణలకు మనిషెత్తు రూపం


సోడ, సోడ…రెండే మాటలు 
నేను వచ్చేశాను అని తనలో తాను అనుకుంటున్నట్టు
దానవాయిపేట, ప్రకాష్ నగర్ , గోరక్షణ పేటల్లోని వీధుల్లో సాయంత్రం 6 నుంచి 8-30 మధ్య ఈ పెద్దాయనా ఆయన బతుకు బండీ కనబడుతారు. 
ఈయన 20 ఏళ్ళుగా నాకుతెలుసు. అంతకుముందు మరో ఇరవై ఏళ్ళనుంచీ గోలీసోడా అమ్మకమే ఆయన జీవనం
స్ స్ స్ స్ స్ స్సో డ డ డ డ య్్య ఆనే అరుపు ఆటూఇటూ ముందూ వెనుకా పదహారిళ్ళకు వినిపించేది. రబ్బరు మూక్కని అడ్డంపెట్టి చెక్కకవచంతో గోలీని నొక్కి సోడాని తెరిచే శబ్దాన్ని అనుకున్నంత సేపు సాగదీయడం ఈయన నైపుణ్య విశేషం.
చెక్కబండిలో అరలు అరలుగా వుంచిన సోడాలను చల్లగా వుంచడానికి గోతం కప్పి బండి కింద వేలాడదీసిన బకెట్ లో నీళ్ళను ఆరారా చిలకరిస్తూ నలభై ఐదేళ్ళు జీవితాన్ని నెట్టేశారు. 
పూరిల్లు పేదజీవితం ఎదిగేపిల్లలు రోగాలు వేడుకలు చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు పేరటాలు…ఇలా అన్నిబాధ్యతలూ నెరవేర్చుకున్నారు. పాక పెంకుల్లయింది పెంకిల్లు నాలుగువాటాల బుల్లిమేడ అయింది. ఖరీదైన సోడామిషను వచ్చింది. గ్యాసైపోయాక బండ తీసుకుపోయి మార్చుకునే అవస్ధను రెండు పెద్ద స్పేర్ సిలెండర్లు వచ్చితప్పించాయి. ఇవన్నీ వుండటానికి ఓ గది అమిరింది. ఆయన ఈ గదిని గుడిలా చూసుకుంటారు. మాట్లాడుతూనే వుంటారు. సోడా సీసాలను లోపలా బయటా తళతళలాడేలా సోడాఉప్పుతో కడుగుతారు. శుభ్రమైన తెల్లటి వస్త్రాన్నిగరాటుకి కట్టి దాని నుంచి సోడా సీసాలో పోస్తారు. సీసాను మిషనుకెక్కించి తలుపు బిగించి వేగంగా తిప్పుతారు. అలాగేసెక్కిన సీసాలను చెక్కబండిలో సర్దుకుంటారు. తక్కువతిప్పులు తిప్పిన కోద్దపాటి సీసాలను వేరుగా అమర్చుకుంటారు. నిమ్మరసం ఉప్పు కలిపిన సోడాలు ఇంకో పక్కన సర్దుకుంటారు..
వయసైనవాళ్ళు వుంటారుకదా! వాళ్ళకోసం కాస్త తక్కువగ్యాస్ పెట్టినవి ఇస్తాను మూడుపైసలప్పటినుంచి నాలుగురూపాయలయ్యాక కూడా నా సోడాతాగుతున్నవారు రాలిపోతున్నారు.మిగిలిన వారికి ఎక్కువగ్యాస్ ఉక్కిరిబిక్కిరి చేయకుండా తక్కువ పడుతూంటాను అన్నారు. 
పాతఖాతాదారులకు అపుడపుడూ బోనస్ గా మామూలు సోడా ధరకే నిమ్మకాయి సోడా, ఒకసోడా ధరకే రెండు సోడాలు ఇస్తూవుంటారు
ఇంకా ఇంత కష్టపడాలా అంటే ? నాపనే ఇదికదా! మీరు నడకకే ప్రత్యేకమైన సమయం కేటాయించుకోవలసి వుంది. నా ఆరోగ్యపు నడకా బ్రతుకు నడకా ఇదే! బాగా వర్షమొస్తేనో నలతగావుంటేనో బండివెయ్యను. అప్పుడు ఏమీతోచదు. ఎప్పుడు బండితోసుకుని రోడ్డుమీదికి వెళ్తానా అని ఆరాటం ఆగదు. నేను ఉన్నంతకాలం సోడా బండి ఆగదు సాగవలసిందే అన్నారు
బ్రతుకుదారిగా మొదలైన సోడా అమ్మకం ఆయన జీవనవిధానమైపోయింది. సుదీర్ఘప్రయాణంలో సోడాసీసాలు పేలిన గాయాలు కూడా ఆయన శరీరంమీద రెండు వున్నాయి. వాటిని తడుముకున్నప్పుడు గతం గుర్తువచ్చి బాగుంటుంది అన్నారు
అది తనను తాను కౌగలించుకున్న అనుభవమేమో మరి!
ఆయన జీవితంలో పరుగు, వెంపర్లాట, ఆదుర్దా, ఆందోళన కూడా వుండేవి. అపుడుకాని నిలకడైన ప్రశాంతతకు చేరుకున్న ఇపుడు కాని పనిమీద శ్రద్ధ ఆసక్తి గౌరవం తగ్గలేదు సరికదా ఇంకా పెరిగాయి.
నేను వాకింగ్ చేసేటప్పుడు ఆయనా తారసపడుతుంటాము. ఆయనతోపాటే కాసేపు నడుస్తాను 
సోడా అని అరవరేంటి అని అడిగితే వాళ్ళకి నా టైమ్ తెలుసుకదా అని నవ్వేశారు. 
అప్పట్లో ఆయన్ని నువ్వు అనేవాణ్ణి (సోడాలు అమ్ముకునే వాడు కదా మరి) నన్నుకూడా నువ్వు అనేవారు ఆయన నన్ను ఏకవచనంలో పిలవడం నాకంటే పెద్ద అవ్వడంవల్లో ఏమో నాకు ఇబ్బంది అనిపించలేదు.
ఇపుడు ఆయన్ని నువ్వు అనలేను  శ్రద్ధ ఆసక్తి వృత్తిగౌరవం క్రమశిక్షణలకు మనిషెత్తు రూపం ఆయనే మరి! 

వెన్నెల వాక్ (శరదృతువు పిలుస్తోంది! కదలి రా!!)


కాలం మారిపోతూంది. రుతుధర్మాలు తారుమారైపోతున్నాయన్న దృష్టితో ఈమాట అంటున్నాను.
అయితే ఈ ఏడాది కాలధర్మాలు పద్ధతిగానే వున్నాయని అనిపిస్తోంది. ఉదయం చల్లగా తెల్లవారడం, సైంధవుడిలా మూసేసిన మేఘాలు సూర్యతీష్ణానికి నింపాదిగా తొలగిపోవడమో చిన్నగా కరగిపోవడమో రాజమండ్రిలో వారంగా స్ధిరపడిన సన్నివేశాలు. ఎండతీవ్రమూకాదు. వాన కుండపోతా కాదు. లోపలిపొరల్లో వర్షంనీటిని ఇముడ్చుకుంటున్న నేల చల్లగా వుంది. ఎండకూడా తీవ్రంగా లేదు. శీతోష్ణాలు బాగుండటంవల్ల పనుల్లో అలసటతగ్గింది. భవన నిర్మాణాలు ఉల్లాసంగా సాగుతున్నాయి. నగరంలో సాగుదల అంటే కాంకీ్రటు అడవిని అల్లడమే కదా!
వర్షరుతువు చివరికొచ్చేశాము. వచ్చేవారంలో శరద్రుతువు మొదలౌతుంది (ఆశ్వయజ, కార్తీక మాసాలు)
ఆరుతువులో వేడితక్కువ వెన్నెల ఎక్కువ. ఆకులు రాలుతాయి. రంగురంగుల డిజైన్లతో సీతాకోకచిలుకలు మందలు మందలు గా కనపడేది ఈకాలంలోనే. చలికాలం మొదలయ్యే వరకూ వుండే వాతావరణం నాకు ఎంతో ఇష్టం. 
వెన్నెల్లో తడుస్తూ నానుతూ ఎంతదూరమైనా నడవచ్చు…కాకపోతే ఆకతాయి/పేచీకోరు/నెగిటివ్ ఆటిట్యూడ్ వున్న కుక్కలను అదిలించడానికి చిన్న లాఠీ, ఉల్లాసంగా తిరిగే కీటకాలనుంచి కవచంగా కాళ్ళకు షూ, వానజల్లులో కూడా కనుచూపులో దృశ్యాల్ని చూడటానికి ఫెల్టు క్యాప్ (ఇది జేబులో వుంచుకోవాలి) పోలీసులు ఎదురైతారు కాబట్టి జేబులో ఐడెంటిటీ కార్డు దగ్గరుండాలి
వెన్నెల్లో వాన అద్భుతమైన దృశ్యం ఆదృశ్యంలో మనం వుండటం మహానందం. అలావుండటానికి నేను రెడీఅయిపోతున్నాను 
వీలుకుదిరితే మీరూ ట్రయ్ చేయండి బాగుంటుంది! 🙂
17-9-2014 బుధవారం, శుభోదయం 

ఇంకుడుగుంటలే మోక్షం!


రిజర్వాయిర్లలో వరద పెరిగినపుడు ఆటోమేటిక్ గా తెరచుకునే గేట్లు…సముద్రఅలల నుంచి విశాఖరేవు కోతపడకుండా బ్లాకులతో ఆపిన టెక్నిక్కులూ …
ఆయన సృజనాత్మక సేవలకు మెచ్చుతునకలు…
నీటి వడిసుడుల ఆనుపానులు పసిగట్టి మానవాళి ప్రయోజనాలకు అనుగుణంగా మళ్ళించిన సాంకేతిక మేధావి, భారతరత్న, మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి సేవలగురించి చదివిన విషయాలను వారి జయంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను
జలవనరుల్ని జలశక్తుల్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నాము. పొదుపుచేసుకోలేకపోతున్నాము అని ఈరోజు మరోసారి జ్ఞాపకానికి వచ్చింది…ఇదంతాబర్తీ చేసుకోవాలంటే భారీగా నిధులుకావాలి …అది మీవల్లా నావల్లా అయ్యేపనికాదు
అయితే మనందరివల్లా “ఇంకుడుగుంట”పని అవుతుంది
వాననీటిని వాడకం నీటిని ఎక్కడికక్కడ ఇంకిపోయేలా చూడటం వల్ల భూగర్భజలాల మట్టం నిలకడగా వుంటుంది…పెరుగుతుంది…కిక్కిరిపోతున్న పట్టణాలకు ఇంకుడుగుంటలు అత్యవసరం 
మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి దివ్యస్మృతికి శ్రద్ధాంజలి!
 

ఇది లోపలి రీసౌండ్


కనిపించని ఎలకా్ట్రనిక్ కంచెని తాకినా, దాటినా రెక్కలుతెగిన పక్షి గొంతుచించుకున్నట్టు వినిపించే అరుపులు కలవరపెడతాయి నిద్రపోనివ్వవు.
రోడ్డుపక్క నిలిపివుంచిన కారు పక్కగా మనిషో కుక్కో పిల్లో వెళ్ళినపుడల్లా థెఫ్ట్ అలారం అరుపులు చెవుల్ని బద్దలుగొట్టి నిద్రలేపేశాయ. రాత్రి ఇలా నాలుగుసార్లు జరిగుంది. 
(ఈ కారు ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ ది. బదిలీపై నాలుగు రోజులక్రితమే ఈ ఊరు వచ్చిన వారు గ్రౌండ్ ఫ్లోర్ లో మేము ఫస్ట్ ఫ్లోర్ లో వుంటాము. వారు రాత్రి బయటినుంచి వచ్చేసరికి లేట్ అయివుంటుంది..కారుని పార్కింగ్ ప్లేస్ లో పెట్టకుండా ఇంటి ఎదురుగా బయటే వుంచేశారు…)
నిద్రనుంచి మూడునాలుగు సార్లు ఆకస్మికంగా/బలవంతంగా మేల్కొనవలసిన అవస్ధవల్ల తలనొప్పి మొదలైంది…ఆదివారం ఫ్రెష్ నెస్ లేకుండాపోయింది
శబ్దకాలుష్యం ఇచ్చే అసౌకర్యాన్ని నేను చెప్పుకోగలుగుతున్నాను…ముఖ్యంగా జబ్బుతో వున్నవారికి, పసిపిల్లలకు ఇది తీరని బాధే కదా! 

ఒక ఆసక్తిదాయకమైన సినిమా!


నిశ్శబ్దంలో ఒక బాధ, హృదయంలో ఒక వేదన, జీవితంలో ఒక క్రియారాహిత్యం, సినిమాలో చూపించడం కుదరదు. మహేష్ బాబులాంటి ఏక్షన్ పాక్ డ్ హీరో వున్న మూవీలో ఈ ఫీల్ తీసుకురావడం చాలా కష్టం.
అయితే “నెంబర్1నేనొక్కడినే” సినిమాలో ఇదంతావుంది…జ్ఞాపకాలు మనుషుల్ని వెంటాడుతాయి…ఈసినిమాలో జ్ఞాపకాల్నే హీరో వేటాడుతాడు. 
సెంటుమెంటుని ఏక్షన్ లో దట్టించి ఉన్నతమైన సాంకేతికతను నింపేసిన ఈ స్టయిలిష్ సినిమాని జెమిని టివి హైడెఫినిషన్ ఛానల్ లో లైట్లు ఆర్పేసి చూస్తున్నాను. చిన్నచీకటి గది …పెద్దటివి సీ్క్రన్…ఇంచుమించు ధియేటర్ లో వున్నట్టుంది 🙂 
నవీన్ 
13-9-2014 శనివారం 7-15 PM

స్మార్ట్ సిటి – ఏమిటి? ఎవరికి?


అసలు స్మార్ట్ సిటి అంటే ఏమిటో ఏయే సౌకర్యాలు ఈ నగరాల్లో ఏర్పాటు చేస్తారో, ప్రస్తుతం ఉన్న నగరాల కంటే స్మార్ట సిటీలుఎందులో భిన్నంగా ఉంటాయో కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పటంలేదు
స్మార్ట్ సిటీల్లో కాగితపు కరెన్సీ అవసరం లేకండా స్మార్ట్ కార్డులద్వారా అన్ని రకాల లావాదేవీలను ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. ఆ స్మార్ట్ కార్డుల ద్వారా ఇంట్లోని లైట్లను ఆఫ్/ ఆన్ చేయవచ్చు. ఇంటికి వెళ్లగానే తలుపుకు అమర్చిన `ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (ముఖకవళికలు గుర్తించే వ్యవస్థ) గుర్తుపట్టి దానంతట అదే తలుపు తెరుచుకుంటుంది. దొంగలభయం లేకుండా అధునాతనమైన ఆటోమెటిక్ బిల్డింగ్ సెక్యూరిటీ నిఘా వ్యవస్థలు ఉంటాయి. వీటితోపాటు టా్రఫిక్ లైట్లు మొదలుకొని భవనాల వరకు అన్నీ కంప్యూటర్ నెట్వర్క్,  వైఫైతో అనుసంధానం చేస్తారు. వైర్లెస్ స్పెన్సర్ల నెట్వర్కులు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను ప్రజలకు, అధికారులకు సమాచారం ఇస్తాయి. నీటిపైపులలో లీకేజీని గుర్తించే వ్యవస్థతోబాటు, చెత్తకుండి నిండిన వెంటనే కార్పొరేషన్ అధికారులకు అలారం మోగుతుంది. టా్రఫిక్ జామ్ల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం, వాన నీటిని ఒడిసి పట్టి పచ్చదనాన్ని పెంచటం, పనికి దగ్గరగా నివాస సముదాయాలు, మెటో్రరైలు వంటి అత్యాధునిక రవాణా సౌకర్యాలు, 24 గంటల విద్యుత్, మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలు స్మార్ట్ సిటీలో ఉంటాయి.
ఇంతటి ఆధునిక టెక్నాలజితో నిర్మించే నగరాలలో జైట్లీ చెప్పినట్లు గ్రామీణ వలస ప్రజలకు అవకాశం ఉంటుందా? ఈ స్మార్ట్ సిటీలు రోజువారీ కార్మికులు, అసంఘటిత, పారిశుద్య్ధ కార్మికులు, పాలు, కూరగాయలు అమ్ముకుని పొట్టకోసుకొనే వాళ్లు- ఇలా అనేక తరగతుల ప్రజల పొట్టగొట్టే నగరాలు కానున్నాయా? ప్రతిపాదిత స్మార్ట్ సిటి నిర్మాణానికి విధి విధానాలు ఏమిటి? ఎంత భూమి అవసరం? ప్రైవేట్ భాగస్వామ్యం ఏ రంగాల్లో అనుమతిస్తారు- ప్రకటించాల్సిన అవసరం ఉంది. 
తాజాగా ప్రైవేట్ నిర్మాణ సంస్ధలు, మౌలిక సదుపాయాల రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న, ఎల్టి వంటి కంపెనీలు, రియల్ ఏస్టేట్ సంస్థలు, కన్సల్టెన్సీలు `స్మార్ట్ సిటి కౌన్సిల్’గా ఏర్పడ్డాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్ధ (ఏ.పి.ఐ.ఐ.సి) సిఎండి జయేష్రంజన్ తప్ప, ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి కాని కేంద్ర పట్టణాభివృధ్ది శాఖ నుండి కాని ప్రతినిధులు లేరు. బడ్జెట్లో ప్రతిపాదించిన తర్వాత స్మార్ట్ సిటి నిర్మాణానికి బాధ్యత వహించాల్సిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్ధలు ఈ ప్రక్రియలో ఇంతవరకూ భాగస్వామ్యులు కాకపోవడం విడ్డూరం.

Blog at WordPress.com.

Up ↑