కాలం మారిపోతూంది. రుతుధర్మాలు తారుమారైపోతున్నాయన్న దృష్టితో ఈమాట అంటున్నాను.
అయితే ఈ ఏడాది కాలధర్మాలు పద్ధతిగానే వున్నాయని అనిపిస్తోంది. ఉదయం చల్లగా తెల్లవారడం, సైంధవుడిలా మూసేసిన మేఘాలు సూర్యతీష్ణానికి నింపాదిగా తొలగిపోవడమో చిన్నగా కరగిపోవడమో రాజమండ్రిలో వారంగా స్ధిరపడిన సన్నివేశాలు. ఎండతీవ్రమూకాదు. వాన కుండపోతా కాదు. లోపలిపొరల్లో వర్షంనీటిని ఇముడ్చుకుంటున్న నేల చల్లగా వుంది. ఎండకూడా తీవ్రంగా లేదు. శీతోష్ణాలు బాగుండటంవల్ల పనుల్లో అలసటతగ్గింది. భవన నిర్మాణాలు ఉల్లాసంగా సాగుతున్నాయి. నగరంలో సాగుదల అంటే కాంకీ్రటు అడవిని అల్లడమే కదా!
వర్షరుతువు చివరికొచ్చేశాము. వచ్చేవారంలో శరద్రుతువు మొదలౌతుంది (ఆశ్వయజ, కార్తీక మాసాలు)
ఆరుతువులో వేడితక్కువ వెన్నెల ఎక్కువ. ఆకులు రాలుతాయి. రంగురంగుల డిజైన్లతో సీతాకోకచిలుకలు మందలు మందలు గా కనపడేది ఈకాలంలోనే. చలికాలం మొదలయ్యే వరకూ వుండే వాతావరణం నాకు ఎంతో ఇష్టం. 
వెన్నెల్లో తడుస్తూ నానుతూ ఎంతదూరమైనా నడవచ్చు…కాకపోతే ఆకతాయి/పేచీకోరు/నెగిటివ్ ఆటిట్యూడ్ వున్న కుక్కలను అదిలించడానికి చిన్న లాఠీ, ఉల్లాసంగా తిరిగే కీటకాలనుంచి కవచంగా కాళ్ళకు షూ, వానజల్లులో కూడా కనుచూపులో దృశ్యాల్ని చూడటానికి ఫెల్టు క్యాప్ (ఇది జేబులో వుంచుకోవాలి) పోలీసులు ఎదురైతారు కాబట్టి జేబులో ఐడెంటిటీ కార్డు దగ్గరుండాలి
వెన్నెల్లో వాన అద్భుతమైన దృశ్యం ఆదృశ్యంలో మనం వుండటం మహానందం. అలావుండటానికి నేను రెడీఅయిపోతున్నాను 
వీలుకుదిరితే మీరూ ట్రయ్ చేయండి బాగుంటుంది! 🙂
17-9-2014 బుధవారం, శుభోదయం