సోడ, సోడ…రెండే మాటలు 
నేను వచ్చేశాను అని తనలో తాను అనుకుంటున్నట్టు
దానవాయిపేట, ప్రకాష్ నగర్ , గోరక్షణ పేటల్లోని వీధుల్లో సాయంత్రం 6 నుంచి 8-30 మధ్య ఈ పెద్దాయనా ఆయన బతుకు బండీ కనబడుతారు. 
ఈయన 20 ఏళ్ళుగా నాకుతెలుసు. అంతకుముందు మరో ఇరవై ఏళ్ళనుంచీ గోలీసోడా అమ్మకమే ఆయన జీవనం
స్ స్ స్ స్ స్ స్సో డ డ డ డ య్్య ఆనే అరుపు ఆటూఇటూ ముందూ వెనుకా పదహారిళ్ళకు వినిపించేది. రబ్బరు మూక్కని అడ్డంపెట్టి చెక్కకవచంతో గోలీని నొక్కి సోడాని తెరిచే శబ్దాన్ని అనుకున్నంత సేపు సాగదీయడం ఈయన నైపుణ్య విశేషం.
చెక్కబండిలో అరలు అరలుగా వుంచిన సోడాలను చల్లగా వుంచడానికి గోతం కప్పి బండి కింద వేలాడదీసిన బకెట్ లో నీళ్ళను ఆరారా చిలకరిస్తూ నలభై ఐదేళ్ళు జీవితాన్ని నెట్టేశారు. 
పూరిల్లు పేదజీవితం ఎదిగేపిల్లలు రోగాలు వేడుకలు చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు పేరటాలు…ఇలా అన్నిబాధ్యతలూ నెరవేర్చుకున్నారు. పాక పెంకుల్లయింది పెంకిల్లు నాలుగువాటాల బుల్లిమేడ అయింది. ఖరీదైన సోడామిషను వచ్చింది. గ్యాసైపోయాక బండ తీసుకుపోయి మార్చుకునే అవస్ధను రెండు పెద్ద స్పేర్ సిలెండర్లు వచ్చితప్పించాయి. ఇవన్నీ వుండటానికి ఓ గది అమిరింది. ఆయన ఈ గదిని గుడిలా చూసుకుంటారు. మాట్లాడుతూనే వుంటారు. సోడా సీసాలను లోపలా బయటా తళతళలాడేలా సోడాఉప్పుతో కడుగుతారు. శుభ్రమైన తెల్లటి వస్త్రాన్నిగరాటుకి కట్టి దాని నుంచి సోడా సీసాలో పోస్తారు. సీసాను మిషనుకెక్కించి తలుపు బిగించి వేగంగా తిప్పుతారు. అలాగేసెక్కిన సీసాలను చెక్కబండిలో సర్దుకుంటారు. తక్కువతిప్పులు తిప్పిన కోద్దపాటి సీసాలను వేరుగా అమర్చుకుంటారు. నిమ్మరసం ఉప్పు కలిపిన సోడాలు ఇంకో పక్కన సర్దుకుంటారు..
వయసైనవాళ్ళు వుంటారుకదా! వాళ్ళకోసం కాస్త తక్కువగ్యాస్ పెట్టినవి ఇస్తాను మూడుపైసలప్పటినుంచి నాలుగురూపాయలయ్యాక కూడా నా సోడాతాగుతున్నవారు రాలిపోతున్నారు.మిగిలిన వారికి ఎక్కువగ్యాస్ ఉక్కిరిబిక్కిరి చేయకుండా తక్కువ పడుతూంటాను అన్నారు. 
పాతఖాతాదారులకు అపుడపుడూ బోనస్ గా మామూలు సోడా ధరకే నిమ్మకాయి సోడా, ఒకసోడా ధరకే రెండు సోడాలు ఇస్తూవుంటారు
ఇంకా ఇంత కష్టపడాలా అంటే ? నాపనే ఇదికదా! మీరు నడకకే ప్రత్యేకమైన సమయం కేటాయించుకోవలసి వుంది. నా ఆరోగ్యపు నడకా బ్రతుకు నడకా ఇదే! బాగా వర్షమొస్తేనో నలతగావుంటేనో బండివెయ్యను. అప్పుడు ఏమీతోచదు. ఎప్పుడు బండితోసుకుని రోడ్డుమీదికి వెళ్తానా అని ఆరాటం ఆగదు. నేను ఉన్నంతకాలం సోడా బండి ఆగదు సాగవలసిందే అన్నారు
బ్రతుకుదారిగా మొదలైన సోడా అమ్మకం ఆయన జీవనవిధానమైపోయింది. సుదీర్ఘప్రయాణంలో సోడాసీసాలు పేలిన గాయాలు కూడా ఆయన శరీరంమీద రెండు వున్నాయి. వాటిని తడుముకున్నప్పుడు గతం గుర్తువచ్చి బాగుంటుంది అన్నారు
అది తనను తాను కౌగలించుకున్న అనుభవమేమో మరి!
ఆయన జీవితంలో పరుగు, వెంపర్లాట, ఆదుర్దా, ఆందోళన కూడా వుండేవి. అపుడుకాని నిలకడైన ప్రశాంతతకు చేరుకున్న ఇపుడు కాని పనిమీద శ్రద్ధ ఆసక్తి గౌరవం తగ్గలేదు సరికదా ఇంకా పెరిగాయి.
నేను వాకింగ్ చేసేటప్పుడు ఆయనా తారసపడుతుంటాము. ఆయనతోపాటే కాసేపు నడుస్తాను 
సోడా అని అరవరేంటి అని అడిగితే వాళ్ళకి నా టైమ్ తెలుసుకదా అని నవ్వేశారు. 
అప్పట్లో ఆయన్ని నువ్వు అనేవాణ్ణి (సోడాలు అమ్ముకునే వాడు కదా మరి) నన్నుకూడా నువ్వు అనేవారు ఆయన నన్ను ఏకవచనంలో పిలవడం నాకంటే పెద్ద అవ్వడంవల్లో ఏమో నాకు ఇబ్బంది అనిపించలేదు.
ఇపుడు ఆయన్ని నువ్వు అనలేను  శ్రద్ధ ఆసక్తి వృత్తిగౌరవం క్రమశిక్షణలకు మనిషెత్తు రూపం ఆయనే మరి!