టివి, మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని ఉహించుకోలేని ఎలకా్ట్రనిక్ “వ్యసన”పరులమైపోయాం. లాప్ టాప్ లాంటి నానారకాల గాడ్జెట్టుల్నీ వ్యసనాల జాబితాలో చేర్చేసుకుంటున్నాం. మనుషులు దూరమైపోతున్నా వస్తువులే లోకమై బతికేస్తున్నాం. గ్లోబలీకరణనవల్ల హద్దులు చెరిగిపోయి ప్రపంచం 24 గంటల దూరానికి దగ్గరైపోయిందని మురిసిపోతున్నాం . . నాణ్యమైనవాటిని ధరతక్కువైన వాటిని ఏమూలలున్నా పట్టుకుని వాడుకోవచ్చని ఆన్ లైన్ హొయలు పోతున్నాం.

అయితే పతనమౌతున్న రూపాయి విలువని నిలువరించలేక గాడ్జెట్ ‘వ్యసనాల’ ధరాభారాన్నితట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్న గ్లోబల్ సామాన్యులమైపోతున్నాం

రూపాయి పతనం ఆర్థికవ్యవస్థే కే కాదు అందరి జేబులకూ చిల్లు పెడుతోంది. భారీగా తగ్గుతున్న రూపాయి విలువతో దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఇందులో మనం నిత్యం వాడే వస్తువులు కూడా ఉన్నాయి.

గత రెండేళ్ల కాలంలో రూపాయి విలువ 30 శాతం పతనమయింది. మే నెల నుంచి ఇప్పటిదాకా 8.5 శాతం పైనే తగ్గింది. రెండేళ్ల కిందట 43 రూపాయిలుగా ఉన్న రూపాయి మారకపు విలువ మేలో 53 స్థాయిలో ఉంటే ప్రస్తుతం 58 రూపాయిల 39 పైసల వద్ద ఉంది. అంటే నెల రోజుల వ్యవధిలో సుమారు 500 పైసల పైగా పతనమైంది.

ఈ పతనం నానారకాలుగా ప్రభావం చూపుతోంది. దిగుమతుల బిల్లు పెరుగుతుంది. ఫలితంగా మనం వాడే కొన్ని వస్తువల ధరలు ప్రియం కానున్నాయి

కంప్యూటర్లు, లాప్ ట్యాప్ లు, ట్యాబెట్ లు, స్మార్ట్ ఫోన్లు,కార్లు, టీవిలు, ఇంపోర్టెడ్ లిక్కర్,ప్రీమియం పుడ్, లగ్జరీ ఐటమ్స్ ల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుత రూపాయి పతనంతో దిగుమతి చేసుకుంటున్న కన్జూమర్ గూడ్స్ ధరలు 20 నుంచి 25 శాతం ప్రియం కానున్నాయి. రూపాయి విలువ ఒక్క శాతం తగ్గితే ఇంపోర్టెడ్ పుడ్ విలువ 3 నుంచి 4శాతం వరకు పెరుగుతుంది. అదే లిక్కర్ ధర 6 శాతం,గృహోపకరణాల ధర 2 నుంచి 3 శాతం వరకు పెరుగుతుంది. ఇక విదేశీ ప్రయాణం మరింత ఖరీదు కానుంది.ఫారిన్ టూర్ ప్యాకేజీల ధరలు 5 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే కొన్ని వస్తువులపై ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఈ నెలఖారులోగా తమ కంప్యూటర్లపై ధరలను 5 నుంచి 8 శాతం పెంచుతున్నట్లు లెనోవా తెలుపగా, 10 శాతం వరకు పెంచుతున్నట్లు ఏసర్, 8 శాతం పెంచుతున్నట్లు హెచ్ సీఎల్ ప్రకటించింది.

రకరకాల ఎల్ట్రకానిక్ ఉపకరణాల ధరలను ఈ నెలఖారులోగా 2 నుంచి 5 శాతం వరకు పెంచే అవకాశం ఉందని ఎల్ జి, సాంసంగ్, పానసోనిక్ లు తెలిపాయి.