Search

Full Story

All that around you

Month

October 2014

తూర్పుకోస్తా ప్రయాణానికి గోదావరి అడ్డుపడినప్పుడు మౌనంగా వీపున మోసిన “హేవలాక్ వంతెన” ఐదుతరాల కథకుఅసలైన హీరో!


కమ్మరి సూరన్న కొలిమిలో తయారైన కత్తి మంగలి నూకరాజు చేతిలో మెత్తగా మారి చినకాపు పాపారావు గెడ్డం గీస్తున్న సమయంలో పాపారావు మేనల్లుడు సుందర్ చేతిలోకి రేజర్ తోసహా సెవెన్ ఓ క్లాక్ బ్లేడు వచ్చేసింది…

మెత్తగా కాళ్ళను వత్తుతున్న చెప్పుల అనుభవంతో వెంకడి పనితనాన్ని స్టాఫంతటికీ తరచు రికమెండు చేస్తూండే హెడ్మాష్టర్ దక్షిణామూర్తి కాళ్ళు ఓరోజు నిగనిగలాడుతున్న నల్లబూటుల్లోకి దూరిపోయాయి.

టకప్పులు, మెటల్ బొత్తాలు, సిల్కు చొక్కాలు, ట్వీడ్ పాంటులు…ఇలా మనుషుల వేషభాషలు …ఆలోచనలు… దృక్పధాలు… రూపాంతరం చెందడంలో “హేవలాక్” వంతెన పాత్ర 5 తరాలపాటు గాఢంగా వుంది.

సోషల్ ఇంజనీరింగ్ ను ఈ వారధి మౌలికంగా మార్చేసింది. జాతీయభావాన్నీ అభ్యుదయాన్ని సంస్కరణనూ మనుషుల మధ్య బదిలీ చేసిందికూడా ఈ వంతెనే!

అదే పనిగా రుద్ది రుద్ది కొండలనే కరగించి ఇసుకగా మార్చడానికి నదికి వేల సంవత్సరాలు పడితే, ఆంగ్లేయుల హిందూదేశపు ముఖ్యపట్టణం కలకత్తా, తూర్పుకోస్తాలో చెన్నపట్టణం మధ్య ప్రత్యక్షంగా, – ఉత్తరాది, దక్షిణాదుల మధ్య పరోక్షంగా అనేక మార్పులను బట్వాడా చేయడానికి “హేవలాక్” వంతెనకు ఐదు తరాలు పట్టింది.

గోదావరి మీద కొవ్వూరు రాజమండ్రిల మధ్య జవసత్వాలుడిగిన మొదటివంతెనను ఒక స్మారకంగా కాపాడాలన్న ప్రజా ఉద్యమం మొదలౌతున్న నేపధ్యంలో చారిత్రక వాస్తవాలు విశ్లేషిస్తే ఈ వంతెన రవాణా ఉపకరణంగా కంటే ప్రజలజీవితాల్లో పెనుమార్పుల వారధిగానే చివరివరకూ ఉపయోగపడిందని స్పష్టమౌతోంది.

1887 లో నిర్మాణం మొదలై ఇరవయ్యో శతాబ్దం మొదట్లో అంటే 1900 సంవత్సరంలో ప్రారంభమైంది.

న్యూస్ ఛానళ్ళూ మొబైల్ ఫోన్లూ లేని ఆరోజుల్లో ఈ వంతెన ద్వారానే పారిశ్రామిక విప్లవ అనంతర యూరప్ పరిణామాలూ, భారతదేశంలో స్వాతంత్రోద్యమ భావాలు, సాంఘిక సంస్కరణలు బట్వాడాఅయ్యాయి.

19 శతాబ్దంలో (1800 – 1900 సంవత్సరాలమధ్య ) బ్రిటీషర్లు మనదేశంనుంచి చవకగావస్తువులను కొని యూరప్ లోలాభసాటిగా అమ్ముకునే వ్యాపారం చేసేవారు. అందుకు పరిమితమైన వసతులు ఏర్పాటు చేసుకోవడం మినహా ఆకాలంలో పెద్దగా మనదేశంలో మౌలికవసతులు ఏర్పాటుకాలేదు.

ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవ ఫలితంగా వస్తూత్పత్తి విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని అమ్ముకోడానికి భారతదేశం పెద్ద మార్కెట్ గా కనబడింది. దేశవ్యాప్తంగా పెద్దనదులపై వంతెనలు కట్టాలని 1896 లో బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించి పనులు మొదలుపెట్టింది. 1900 సంవత్సరంలో దేశమంతటా ఒకేసారి 31 భారీవంతెనలు ప్రారంభంకాగా , అందులో హేవలాక్ వంతెన ఒకటి. ఈ వారధులన్నీ కలసి అప్పటివరకూ ఎగుమతులదేశంగా వున్న భారతదేశాన్ని దిగుమతుల దేశంగా మార్చేశాయి.

మా తాత పెద్దాడ పేర్రాజు గారు(1873-1948) హయాంలో సిల్కు చొక్కా ట్వీడ్ ఫాంటు క్లాతింగ్ కి బొంబాయి వెళ్ళవలసి వచ్చేదని చెప్పేవారని అవేగుడ్డలు 1930 ల్లోనే నిడదవోలు భీమవరం తాడేపల్లిగూడెం లాంటి పట్టణాల్లో దొరికేవనీ రెండు అణాలకు సిల్కు చొక్కా, మూడున్నర అణాలకు ట్వీడ్ ఫాంటు కొనుక్కున్న అనుభవాన్ని మానాన్నపెద్దాడరామచంద్రరావు గారు (1911-1997)
చెప్పారు.

వంతెనల వల్ల రైళ్ళు హోల్ సేల్ వ్యాపార కేంద్రాలనీ, ఆకేంద్రాల నుంచి కాల్వల వల్ల గూడుపడవలు రిటైల్ వ్యాపారాన్నీ పెంచాయి. ఈ విధంగా 20 శతాబ్దం కన్సూమరిజం వ్యాప్తితోనే మొదలైంది. విద్యావ్యాప్తి కూడాజరిగింది .ఇది మన సోషల్ ఇంజనీరింగ్ ను మార్చేసింది.

హౌరానుంచి మద్రాసుకి వస్తువులతోపాటే కొత్త ఆలోచనలూ రవాణా అయ్యాయి. రైలుప్రయాణాలంత వేగంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. జాతీయోద్యమంలో ఉరూవాడా సభలు సమావేశాలు పెరగడానికి ఈ వంతెన ప్రముఖ సదుపాయమయ్యంది. కందుకూరి వీరేశలింగం చిలకమర్తి లక్ష్మీ నరశింహం వంటి నాయకుల సంస్కరణ భావాలు, జాతీయ లక్ష్యాలు తూర్పుకోస్తాఅంతటా ప్రభావం చూపించాయంటే గోదావరిదాటి ఎక్కడికైనా వేగంగా వెళ్ళిపోడానికి వీపుపరచిన హేవలాక్ వంతెనే ముఖ్యకారణం!

అప్పటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్ధర్ ఎలిబంక్ హేవలాక్ పేరు వంతెనకు పెట్టారు. చీఫ్ ఇంజనీర్ ఫెడ్రిక్ ధామస్ గ్రాన్ విల్లే వాల్టన్ ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయించారు. మూడేళ్ళు పట్టిన ఈ నిర్మాణం అంచనా వ్యయం 50 లక్షలరూపాయలుకాగా (మద్రాసీ?) కాంటా్రక్టర్ 47 లక్షలకే పనిపూర్తిచేశారట! నీటి ప్రవాహవేగాన్ని లెక్కగట్టి వందేళ్ళు వుంటుందన్న అంచనాతో అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ గా రాయి సున్నాలతో స్టీలు గర్డర్లతో కట్టిన హేవలాక్ వంతెనపై రాకపోకలను సరిగ్గా వందేళ్ళకు 1997 లో నిలుపుదల చేశారు. రైల్వేశాఖ వంతెనలో ఇనుమును వేలం వేయాలని నిర్ణయించింది. గర్డర్లు తొలగించాక రాతిస్ధంభాలు కాలక్రమంలో నదిలోకి ఒరిగిపోతాయి.

హేవలాక్ వంతెనను పరిరక్షించాలని, టూరిస్టుకేంద్రంగా వృద్ధిచేయాలనీ, జాతీయ స్మారకంగా వుంచాలనీ రాజకీయాలకతీతంగా ఉద్యమనిర్మాణానికి ప్రజలను కూడగట్టే ప్రయత్నాలు రాజమండ్రిలో మొదలయ్యాయి.

హేవలాక్ వంతెన సంస్కృతినీ దృక్పధాలనీ దేశమంతటికీ రవాణా చేసిన వారధిఅవ్వడంవల్లే వంతెన కూల్చివేత ఆలోచనే ఒక ఉద్వేగమౌతోంది.

ఏకథైనా ఆసక్తికరమే. సమాజం చరిత్రకంటే ఆసక్తిదాయకమైన కథవుండదు. శరవేగంగా మార్పులను అందుకుని అందుకు అనుగుణంగా తనను తాను మలచుకున్న తూర్పుకోస్తా ప్రయాణానికి గోదావరి అడ్డుపడినప్పుడు మౌనంగా వీపున మోసిన “హేవలాక్ వంతెనే” ఐదుతరాల కథకు అసలైన హీరో!

ఈజ్ఞాపకాల ఉద్వేగాన్ని భౌతికరూపంతో ఒక స్మృతి చిహ్నంగా మార్చుకోవడం చిన్న విషయం కాదు. అది విజయవంతమైతే చరిత్రను పదిలపరచుకునే దారికికూడా హేవలాక్ వంతెన మళ్ళీ వారధే అవుతుంది.

బిసి రిజర్వేషన్లు – భూ, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు విస్మృత నేత


అంతగా కీర్తించబడని దివంగత ప్రధాని, మేధావి, నిస్వార్ధ రాజకీయవేత్త, నిరాడంబరుడు, “ఏరుదాటాక కాంగ్రెస్ పార్టీ తగలబెట్టిన తెప్ప” పాములపర్తి వేంకట నరసింహారావు గారి జయంతి (28/9/13) ఈరోజే.

పదవులను సమాజహితం కోసం ఉపయోగించడంలో, పాములపర్తివేంకటనరసింహారావుముందుండేవారు.ముఖ్యమంత్రిగా కొద్దికాలమే ఉన్నా తనకున్న పరిమితులతో సుపరిపాలనను అందించారు. 1972లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో 70శాతం సీట్లను వెనుకబడిన తరగుతల వారికి ఇచ్చి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణల అమలుకు కఠిన చర్యలు తీసుకున్నారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కూడా పీవీ ప్రవేశపెట్టిందే. పెద్దరైతులు ఆదుగ్ధతోనే పివిని దించేయడానికి జై ఆంధ్రా ఉద్యమాన్ని వాడుకున్నారన్న విశ్లేషణ ఇప్పికీ వినిపిస్తూనే వుంటుంది

ప్రధాని హోదాలో పీవీ తీసుకున్న ఆర్థిక సంస్కరణల అమలు నిర్ణయం.. భారత సమాజాన్ని యావత్ ప్రపంచానికి దగ్గర చేసింది. 1991కాలంలోనే ఆయన కంప్యూటర్ వాడకంలో నిష్ణాతుడిగా ఉండేవాడు. అల్లకల్లోలంగా ఉన్న పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణిచివేసి శాంతిని స్థాపించడంతో పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపిన ఘనత కూడా పీవీదే. ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తెచ్చి ఆర్థికమంత్రిని చేసిన ఘనత కూడా పీవీదే. అలా ఆయన చూపిన బాటలో సాగిన మన్మోహన్ ప్రధాని స్థాయికి చేరుకున్నారు.

పీవీ నరసింహారావు.. వరంగల్ జిల్లా.. నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించిన పీవీ. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ను దత్తత తీసుకున్నారు. అప్పటినుంచే ఆయన ఇంటిపేరు పాములపర్తిగా మారింది.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1938లో అంటే తన 17వ ఏటే కాంగ్రెస్ లో చేరారు. డిగ్రీ చదువుతున్న సమయంలో నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని ఆలపించడం వల్ల ఉస్మానియా వర్శిటీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి 1944వరకు ఎల్ ఎల్ బీ చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పీవీ పాల్గొన్నారు.

బూర్గుల రామకృష్ణారావు శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పీవీ.. నాటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, చవాన్, వీరేంద్ర పాటిల్ తదితరులతో కలిసి పని చేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యత్వం పొందారు. 1957లో మంథని నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1962లో తొలిసారి మంత్రి అయ్యారు.

1962 నుంచి 1971వరకు న్యాయ, సమాచార, దేవాదాయ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లారిన తర్వాత.. ఈ ప్రాంతానికి చెందిన గ్రూపు రాజకీయాలకు అతీతుడైన పీవీని కాంగ్రెస్ అధిష్ఠానం.. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. తర్వాత కొంత కాలానికే రాజకీయ కారణాల వల్ల పీవీ ప్రభుత్వం రద్దైంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆయన రాజకీయ కార్యకలాపాలు ఢిల్లీకి మారాయి. మొదటిసారి హన్మకొండ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.

రెండోసారీ అక్కడి నుంచే గెలిచారు. మూడోసారి మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి విజయం సాధించారు. 1980-89మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రిగా కొనసాగారు. 1991సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్న పీవీని.. అనుకోకుండా ప్రధానమంత్రి పదవి వరించింది. రాజీవ్ గాంధీ హత్యతో.. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు అతీతుడిగా ఉన్న పీవీని ప్రధానిగా ఎన్నుకున్నారు.

సాహిత్య పరంగా కూడా పీవీ సమాజానికి తన సేవలను అందించారు. దాదాపు 16భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడమే కాకుండా ఆయా భాషల్లోని సాహిత్యంతో పీవీకి పరిచయం ఉండేది. విశ్వనాథ రాసిన వేయిపడగలు రచనను హిందీలో సహస్రఫణ్ పేరిట అనువదించారు. దీనికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇన్ సైడర్ పేరిట తన జీవిత కథను రాసుకున్నారు. పీవీ నరసింహారావు జీవితంలో కొన్ని మరకలున్నా.. భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, బీసీలకు రాజకీయావకాశాలు కల్పించడం ద్వారా సమాజానికి తన వంతు విశిష్ట సేవలు అందించారు. ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు.

ఆధునిక భారత రూపశిల్పి, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు, పాములపర్తి వేంకట నరసింహారావు. వింధ్య పర్వత శ్రేణుల దిగువనుంచి భారత ప్రధాని స్థాయికి ఎదిగిన ఏకైక రాజనీతి కోవిదుడు. వంగర గ్రామం నుంచి ఢిల్లీ దర్బారు దాకా ఎదిగిన ఈ నిరాడంబర మేధావి.

సంస్కరణల గురించి ఘనంగా చెప్పుకునే కాంగ్రెస్ అందుకు ఆద్యుడైన పివిని ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించంది. దేశరాజధానిలో ప్రధానులకు జరిగే అంత్యక్రియల ఆనవాయితీ సోనియా కు నచ్చనికారణంగా పివి విషయంలో తప్పిపోయింది.

నచ్చిన కధ “చీకటి”


మిలటరీ నుంచి డిశ్చార్జయిన కెప్టెన్ వర్మ తన వేటకుక్క సీజర్ తో కలిసి బాతుల వేటకు బయలుదేరాడు. ఇల్లూ వాకిలీ లేని దేశదిమ్మరి డిబిరిగాడు తన నత్తగొట్టు (ఒక జాతి కొంగ) తో నీటి పక్షుల వేటకు బయలుదేరాడు. వీళ్ళిద్దరూ తారసపడతారు.

అల్లం శేషగిరిరావుగారు రాసిన “చీకటి” కధలో పాత్రలు ఈ నాలుగే. కధ చదువుతూంటే అది నీటి చిట్టడవుల నేపధ్యమని కథకుడు ప్రత్యేకంగా చెప్పడకుండానే అర్ధమైపోతుంది. నాకైతే కొల్లేరు కళ్ళముందు మెదిలింది.
చలిమంటవేసి డిబిరిగాడు అతని జీవితాన్ని చెబుతాడు.

ఆకలి,శృంగారం, పోలీసు క్రౌర్యం, తండ్రి ఉరితీర మొదలైన ఏ ఘట్టాన్నయినా రాగద్వేషాలకు అతీతంగా అనుభవిస్తాడు. బాధ శోకాలతోపాటు జీవితంలో ఉండవలసిన ఉత్సాహం డిబిరిగాడిలో చెక్కుచెదరదు
ఈ కథ చదివినప్పుడల్లా డిబిరిగడిలో వున్న సహజవిలువల నుంచి నాగరీక మనుషులమైన మనలో విలువలు ఎంత కృతకమైపోయాయోనన్న నిట్టూర్పే మిగులుతుంది.

నాకు బాగా నచ్చిన కథల్లో ఒకటైన “చీకటి” కథ-నేపధ్యం 1 ఇ పుస్తకంలో చదివాను అది వున్నచోటు

http://kinige.com/kbook.php?id=1393&name=Katha+Nepathyam+1

భయపెడుతున్న మూగజీవుల మౌనం!


సన్నటి ఈదురుగాలులలో పక్షులు అరవడంలేదు, కొతులు బిక్కచచ్చిపోయివున్నాయి, ఉరకుక్కలు మందకొడిగా వున్నాయి. పెంపుడు కుక్కలు కొంతగాభరాగా వున్నాయి. ఆవులు గేదెల్లో కూడా ఒక డల్ నెస్ వుంది. ఇవి ఈరోజు మద్యాహ్నం మూడున్నరనుంచి రాత్రి ఏడున్నరవరకూ నేషనల్ హైవేలో వేమగిరినుంచి రాజానగరం వరకూ తిరిగి నేను గమనించిన, సేకరించిన విశేషాలు ఇవి. గోకవరం కొండలనుంచి రాజానగరం వరకూ పొలాలకు వచ్చి కలుపుమొక్కల చిగుళ్ళను తినే జింకలు మాత్రం మామూలుగానే వచ్చి వెళ్ళాయట.( నేను ఆప్రాంతం చేరేసరికి ఆలస్యమైంది)
ఈ ప్రాంతాల్లో పొలాల్లో వుండే కొందరు పాలేర్లు లేదా భూమి యజమానుల నమ్మిన బంట్లు నాకుతెలుసు  తుపాను కి ముందు పశువులు పక్షులు జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో ఈ మిత్రుల సహకారంతో కొంతకాలంగా పరిశీలిస్తున్నాను. నా పరిశీలనా పద్ధతి శాస్తీయమైనదికాదు. అయినా కొన్ని సూచనలు నాకు అర్ధమౌతున్నాయి. మనుషులు సృష్టించిన సెన్సర్లకందని సంకేతాలను మూగజీవుల జ్ఞానేంద్రియాలు గ్రహిస్తున్నాయి.
టివిల్లో తుపాను హెచ్చరికలు తీవ్రంగా వున్నపుడు పశువులు పక్షులు మామూలుగానే వున్నాయి అపుడు ఈ ప్రాంతంలో తుపాను ప్రభావం దాదాపువుండేది కాదు.
మందలు మందలుగా తోటల్లో చెట్ల మీద గెంతులు వేసే కోతులు బిక్కుబిక్కుమంటూ వుండిపోవడం, దాదాపు అన్నిమూగజీవాలూ ఈసారి మౌనంగా వుండటం పెద్ద విపత్తుకి సంకేతమేమోననిపిస్తుంది. నామిత్రులకు ఉదయంనుంచీ ఫోన్లు చేస్తూ టచ్ లోవుండి వారిచ్చిన, నేను చూసిన వివరాలను క్రోడీకరించుకుని ఈ అభిప్రాయానికి వచ్చాను. ఇది శాస్త్రీయం కాదు. అయినా ఒక అనుభవం. మనిషి జ్ఞానం పెంచుకోడానికి ప్రాచీనకాలంలో దోహదపడిన ఒకానొక విధానం.
మనిషి సాధించిన విజ్ఞానంనుంచి రూపొందిన సాంకేతిక పరిజ్ఞానం సముద్రాన్ని గ్రహాల్ని చుట్టి ఫోటోలతో వస్తోంది. వేగాన్ని తీవ్రతనీ లెక్కగట్టడానికి వుపయోగపడే టెక్నాలజీవల్ల ఆస్తనష్టాలు మౌలికసదుపాయాల నష్టాలేతప్ప అమూల్యమైన మానవ ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నాము.
ఈసదుపాయాలు కమ్యూనికేషన్లు లేని 1976 దివిసీమ ఉప్పెనలో 25 వేలమంది జలసమాధి అయ్యారు.1996 కోసనీమ తుపానులో 800మంది చనిపోయారు.
ఆతరువాత అంతంత ప్రాణనష్టం జరగలేదు.
హుధుద్ తుపాను కోనసీమ తుపానుకి రెట్టింపు అని అర్ధమౌతోంది. అది ఎక్కడ తీరందాటినా ఆపరిధిలో గాలిఉధృతికి చాలానష్టం తప్పకపోవచ్చు
మన ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైసిస్ ని హాండిల్ చేయడంలో గొప్ప మేనేజర్ 1996 లో అది ఆయనకు అతిసమీపంలోవుండి అర్ధంచేసుకున్నాను. ఇపుడు ఆయనే ఇదంతా మానిటర్ చేస్తూవుండటం పనిచేసే టీముల మొరేల్ పెంచుతుంది.
ప్రకృతితో జయాపజయాలు అనే ప్రస్తావనే బుద్ధిలేనిది. ప్రకృతిని అర్ధంచేసుకుని చేసే ప్రయాణమే మానవ ప్రస్ధానం. ఇదిఅడుగడుగూ సురక్షితం చేసుకోగల వివేకాన్ని సాధించుకుందాం!

ధనస్వామ్యమా? ప్రజాపక్షమా?? దేశంవర్గాల్లో కలవరం!


ప్రజాజీవనంతో సంబంధాలు లేకపోయినా ఆర్ధిక సౌష్టవమే అర్హతగా తెలుగుదేశంలో ప్రవేశించి, అందలాలు ఎక్కిన నాయకుల ధోరణులవల్ల పార్టీకి అంకితమై పనిచేసే కార్యకర్తలు నాయకులు గాయపడటం మొదలైంది
పట్టణాభివృద్దిశాఖమంత్రి నారాయణ నెల్లూరులో ఒక పార్టీసమావేశంలో చేశారంటున్న వ్యాఖ్యానాలు, మొదటినుంచీ తెలుగుదేశం లో వున్న నాయకులు కార్యకర్తల్ని తీవ్రంగా అవమానించేలావున్నాయి. పార్టీ అంతర్గత విబేధాలను ప్రస్తావిస్తూ “ఉండేవాళ్ళు వుండండి లేకపోతేపొండి. ఎదురుతిరిగితే ఊరుకునేదిలేదు” అని నారాయణ అత్యంత సీనియర్ నాయకుడైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారని పార్టీఅంతటా వ్యాపించింది. పార్టీలో ఒక వర్గనాయకుడు ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తే అర్ధంచేసుకోవచ్చు. కానీ “పదేళ్ళ నుంచీ పార్టీలో ప్రతీ ఇంపార్టెంట్ నిర్ణయంలోనూ నేను వున్నాను” అనే హెచ్చరికను విశ్లేషిస్తే అది పార్టీకి మాత్రమేకాదు రాజ్యాంగేతర శక్తినని నేరుగా ప్రకటించడం వ్యక్తిగత అహంకారానికి ఒక సంకేతం అంతకుమించి ప్రజాస్వామ్య దృక్పధానికే హానికరమని స్పష్టమౌతోంది
పిసిసి అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఈమధ్యే తెలుగుదేశం మీద చేసిన తీవ్రమైన విమర్శలో కొంతైనా నిజంవుంది అనడానికి నారాయణ వ్యాఖ్యానాలు ఒక సాక్షిగా వున్నాయి. “తెలుగుదేశం ఇపుడు చంద్రబాబు చేతుల్లోలేదు ముగ్గురు బ్రోకర్లు సుజనాచౌదరి, సిఎంరమేష్, నారారయణ లచేతుల్లోకి వెళ్ళిపోయింది” అని రఘువీరా వ్యాఖ్యానించారు. అయితే ఈ ముగ్గురినీ బ్రోకర్లు అనలేము. స్వయంకృషితో ఆర్ధికంగా ఎదిగిన వ్యక్తులుగా వారిని ఎవరైనా గౌరవిస్తారు. అయితే పార్టీమీదా, ప్రభుత్వంలోనూ ఇలాంటివారి పెత్తనాన్ని ఆత్మగౌరవం పునాదిగా పుట్టుకొచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు మద్దతుదారులు సానుభూతిపరులు సహించరు
అధికారంలోకి వచ్చిన నాలుగునెలలకే ఉండేవారు ఉండండి పొయ్యేవారు పోండి అన్నారంటే పదేళ్ళుగా నాకుతెలియకుండా ఏమీజరగలేదని వెల్లడించుకున్నారంటే అది ఏళ్ళతరబడి ముసుగువేసుకుని వున్న అసలురూపాన్ని బయటపెట్టినట్టుగావుంది
ఆర్ధికబలంతో కష్టకాలంలో పార్టీని ఆదుకోవడం వేరు. అధికారంలోకి రాగానే అడ్డగోలు పెత్తనంతో తెగబడటంవేరు. ఒకవిధంగా ఇది నారాయణ విషయమేకాదు. పేదవాడికి పట్టెడన్నం బడుగుమనిషికి కాస్తసంక్షేమం. తెలుగువాడికి ఆత్మగౌరవం నినాదంగా పుట్టి సగటుమనిషి ఆత్మకు అద్దంపట్టిన తెలుగుదేశం మౌలిక స్వరూపం మారిపోవడం తెలుగుదేశం ఫేస్ నుంచి ప్రజలదృక్పధం తొలగిపోయి ధనస్వామ్యం ఆక్రమించుకోవడం యాధృచ్చికమైతే చక్కదిద్దడం చంద్రబాబుకి పెద్ద కష్టంకాదు ఇది ఉద్దేశ్యపూర్వకమే అయితే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయన్న నానుడి గుర్తురాకతప్పదు. కమిట్ మెంటుకి నిర్వచనమే మారిపోయినపుడు పాతవారిని వెళ్ళగొట్టి పార్టీని పునర్నిర్మించుకోవడమే తెలుగుదేశానికి తేలిక అవుతుంది
ఇదే సందర్భంలో ఈరోజే వెలువడిన తూర్పుగోదావరిజిల్లా దివాన్ చెరువు పంచాయతీ ఎన్నికల ఫలితాలను తెలుగుదేశం విశ్లేషించుకోవలసివుంది. ఆగ్రామంలో 16 వార్డులుండగా 12 వార్డుల్లో జగన్ పార్టీ అభ్యర్ధులు, 3వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు, ఒక వార్డులో తెలుగుదేశం అభ్యర్ధీ గెలిచారు. రాష్ట్రలో ఎక్కడాలేనంత ఓట్ల ఆధిక్యత తూర్పుగోదావరిజిల్లా తెలుగుదేశానికి ఇచ్చి ఐదునెలలైనా నిండకముందే చిన్నపంచాయతీలో అధికారపార్టీ చతికిలపడిపోయిందంటే ప్రజలవ్యతిరేకత మొదలైందని అర్ధం చేసుకోవాలి
ఇలాంటి స్ధితిలో’ఉండేవాళ్ళు ఉండండి పోయేవాళ్ళు పొండి’అనేధోరణి ఇంకా కొనసాగితే అది తీవ్రమైన రాజకీయపరిణామాలకు బీజం వేసినట్టే! 

మనిషికి దేవుడంటే భయం దెయ్యమంటే కుతూహలం


కుడివైపు బడి, ఎడమ వైపు కనుచూపుమేరా పచ్చటి చేలు, ఎదురుగా దేవుడు, దేవుడి ఎదురుగా చెరువు, ఆరిన హోమగుండం సెగల మీదుగా సోకుతున్న పచ్చి వరిపైరు వాసన
ఇది బిక్కవోలులో గణపతి ఆలయం ఆంబియెన్స్. గోదావరి తూర్పు డెల్టాలో పాడిపంటలు, తరతరాలుగా అవి ఇచ్చిన సిరిసంపదలు వున్న ప్రాంతంలో ఇది ఒకఊరు. నా చిన్నకొడుకు, నాభార్య, నేను నిన్న మధ్యాహ్నం భోజనం ముగించుకున్నాక చేసిన యాత్ర ఇది. 
మూడున్నరకి బిక్కవోలు చేరాము. దేవుడు కూడా భొజనం చేసి విశ్రమించిన సమయం. మాలాగే దూరంనుంచి వచ్చిన మరో రెండుకుటుంబాలవాళ్ళు నేలమీద కాళ్ళు బాలజాపుకుని చేతుల మీద శరీరాన్ని ఆనించి తాము చూసిన  ఇతరదేవాల విశేషాలు అక్కడ ప్రసాదాల రుచులగురించి చేబుతున్నారు. మధ్యమధ్యలో వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళని కుతూహలంగా చూసుకున్నాము. మాటకలపడంలో పల్లెటూరి వాళ్ళకు వున్నంత చొరవ పట్టణం వాళ్ళకు వుండదని అపుడే అర్ధమైంది. (మరి మేము పట్టణం వాళ్ళం కదా? )
అలా మాటకలసి “జీతమూ పెంచరు నాపేరు రికార్డుల్లోనూ రాయరు.ఇంత దేవుడికి నేనొక్కదాన్నీ భారమైపోతానా? ఆఫీసర్ గారితో చెప్పేద్దామనుంటుంది. అందరం ఒక ఊరోళ్ళం మొఖాలు చూసుకోవాలి ఎప్పుడు తీరతాయో నా కష్టాలు” అని గుడితుడిచే మనిషి వాళ్ళకు చెబుతోంది
చిన్న సందడి మొదలైంది. ఓసారి దేవుడికేసి చూశాను ఆయన అభావంగానే వున్నారు…విషయం ఏమిటంటే యువకుడైన పూజారి గుడితలుపు తీయడానికి హడావిడిగా వచ్చేశారు. గోత్రనామాలతో అర్చన చేయించుకున్నాము. బాధ్యతగా హుండీలో కానుక, దేవుడితో డైరక్ట్ లింక్ కాబట్టి పూజారికి దక్షిణ ఇచ్చి తృప్తిపడ్డాము. అంతకుముందే కొబ్బరికాయలు వగైరా పూజసామాను పేకెట్ కొనేసి ఆలయానికి అనుబంధంగా వున్న జీవితాల్ని ఉద్ధరించాము అని గర్వపడ్డామేమోకూడా!
మన కోరికలను చెవిలో చెప్పే అవకాశం ఇవ్వడం బిక్కవోలు గణపతి విశేషం. ఏదేవుడికైనా దణ్ణంపెట్టి వచ్చేయడమే తప్ప కోరికలు కోరేఅలవాటు లేదు. అసలు ఎవరినైనా చూడ్డానికి వెళ్ళి అదికావాలి ఇదికావాలి అని అడగడం బాగోదు మొహమాటంగా వుంటుందికదా?
ఈయస సోదరుడు కుమారస్వామికూడా బిక్కవోలులోనే ఇంకో గుడిలో వున్నాడు. నిన్న మాపని ఆయనతోనే రాహు, కేతు, సర్పదోషాలను ఆయనే తీసేస్తాడట. అదీసంగతి..మా పెద్దఅబ్బాయి పెళ్ళితో ముడిపడివున్న ఈ అంశాల గురించి నాభార్య పూజారి మాట్లాడుకున్నారు. త్వరలో మేము ఈగుడికి రావలసివుంటుందని అర్ధమైంది
అక్కడినుంచి జిమామిడాడ లో కోదండరామాలయం సందర్శన. కొదండరాముడు బాగా సంపన్నుడు. ఈ మూడూ కూడా పునరుద్దరించిన ప్రాచీన ఆలయాలే. ఈ దేవుళ్ళ రూపంలో పెద్దల శ్రద్ధాసక్తులు ఆర్ధిక ఉత్సాహాలు ఆప్రాంతపు సౌష్టవం మనకు కనబడుతాయి. 
మూడు ఆలయాల్లోనూ ఆంబియెన్స్ అదుర్స్! కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఆప్రశాంతత జీవితంలో కష్టసుఖాల సింహావలోకనం అవి నేర్పే తాత్విక ధైర్యం తప్ప వేరే ఆలోచనలు వుండవు.
వీటన్నినీ ఒక అంతుచిక్కని రహస్యం అధిగమిస్తుంది. కుతూహలం మెదడుని తొలిచేస్తుంది. బిక్కవోలు గణపతి గుడికి ఎడమవైపు పొలాలమధ్య ఒక పాడుపడిన గుడి వుంది. అదేమిటని అడిగితే “గుడినే పాడుబెట్టారంటే అతిదారుణమైన అపచారం జరిగిందని అర్ధం చేసుకోవాలి. అదేమిటని అడగడం కూడా మంచిదికాదు. అదేమిటో నాకుతెలుసు ఏమీచెప్పకూడదని పెద్దల ఆజ్ఞ వెళ్ళిపోండి” అని గణపతి ఆలయంలో ఒక గుడిపెద్ద లేదా గుడి ఉద్యోగి చెప్పాడు.
తలవెనక్కితిప్పితే గండశిలవైపోతావు అని మునో మాంత్రీకుడో హెచ్చరించిన లెవెల్లో వున్నాయి ఆయన మాటలు… అయినా పాడుపడిన గుడికేసి వెనక్కి వెనక్కి చూస్తూనే వచ్చేశాను
ఎందుకంటే మనిషికి దేవుడంటే భయం దెయ్యమంటే కుతూహలం మరి! 

కాటన్ దేవుడే డెల్టాకు ధీమా!


ఇవి బోదె, కాలవ, గట్టు, చెట్టు, చేను కాదేమో! 
నేలమీద కాటన్ వేసిన సిరిసంపదల నాట్లే నేమో అనిపించింది.
అప్పటి కప్పుడు అనుకుని సకుటుంబంగా నిన్న మధ్యాహ్నం “ర్యాలి” ప్రయాణమయ్యాము. వెళ్ళేటప్పుడు హైవేలో రావులపాలెం మీదుగాను, వచ్చేటప్పుడు కోనసీమ కాల్వ గట్టురోడ్డు మీద బొబ్బర్లంక మీదుగానూ ఈ “పుణ్యం- పురుషార్ధాల” యాత్ర ముగిసింది.ఇక్కడ పురుషార్ధం ఏమంటే నేనూ నాకొడుకూ కారు డ్రయివింగ్ ప్రాక్టీసు చేయడమన్నమాట. 
ర్యాలి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురంమండలంలో  గ్రామం. గోదావరి పాయలైన వశిష్ఠ, గౌతమి మధ్య రాజమండ్రి కి 40 కి.మి., కాకినాడ కు 74 కి.మి., అమలాపురం కి 34 కి.మి. దూరం లో ఈ ఊరు వుంది. జగన్మోహిని కేశవ స్వామి, ఉమా కమండలేశ్వర స్వామి ఆలయాలు ర్యాలి ప్రధాన రహదారి కి ఎదురెదురుగా ఉండడం ర్యాలి విశేషం.
ర్యాలి సన్నగా పొడుగ్గావుంది.సంపన్నంగా వుంది. సంపదవల్ల నాజూగ్గా వుంది.ధీమాగా వుంది..లోకంతెలియని అమాయికత్వం వల్ల కొద్దిపాటి మూర్ఖంగా కూడా వుందనిపించింది.(ఇది పెద్దమాటైతే నన్ను క్షమించాలి ఇంకో పదం తడితే ఎడిట్ ఆప్షన్ ద్వారా మారుస్తా)
ఊరి మధ్యలో శుభ్రంగా వున్న రోడ్డు వెడల్పు రెండువాహనాలు ఎదురెదురైతే ఒకటి ఆగి రెండో దానికి దారివ్వడం ఇరువురికీ శ్రేయస్కరం. రోడ్డు మీద నడిచే రోడ్డు దాటే స్ధానికులు వాహనం హారన్ ను పట్టించుకోరు. కనీసం ఆగి చూడరు స్లో స్లో అన్నట్టు సైగచేస్తూ తమదారినతాము వెళ్ళిపోతారు. రోడ్డుకు ఆనుకుని వున్న అరుగుల మీద ఒక కాలు ఎత్తిపట్టుకుని ఇంకో కాలు వేలాడేసి ఊపుతూ చెయ్యిని బోటుగా ఆనించుకుని గుప్పుగప్పున చుట్టపొగ వదిలే తీరుబాటు మనుషులు ఇదంతా అభావంగా చూస్తూవుంటారు. (ఇది వారిమీద విమర్శకాదు. ఆఊరు యాత్రాస్ధలమైనందువల్ల నానారకాల సందర్శకులకు నచ్చినట్టు వారువుండనవసరంలేదు. ఆఊరికి నచ్చినట్టు సందర్శకులు వుండటమే ధర్మం న్యాయం)
 
ఈ సన్నివేశాల్లో ఆక్కడి ప్రజల కనబడిన ధీమా, ధిలాసా, లెక్కలేనితనం నాకు లేనందుకు వాళ్ళమీద నాకు కాసేపు కొంత అసూయ కలిగిందికూడా!
గోదావరి డెల్డాల కింద ఊళ్ళన్నీ ఇంచుమించు ఇలాగేవుంటాయి. దక్కను పీఠభూమి గూండా ప్రవహించి సారవంతమైన ఒండ్రుని సముద్రంలో కలిపేస్తున్న గోదావరికి ధవిళేశ్వరం దగ్గర ఆనకట్టవేసి ఆసారాన్ని తూర్పు సెంట్రల్ పశ్చిమ డెల్టాలకు మళ్ళించిన సర్ ఆర్ధర్ కాటన్ గారిని ఆలయ ప్రాంగణంలో గుర్తుచేసుకున్నాను. ఆయన గురించి నాభార్యాపిల్లలకు చెబుతూ ఇల్లు చేరుకున్నాము. – పెద్దాడ నవీన్ 
5-20-2014 ఆదివారం శుభోదయం

నేను ఎవరిని?


నన్ను హెచ్చుమంది జర్నలిస్ట్ అంటారు…ఈ మాటవిన్నపుడు నేను ఖచ్చితమైన జర్నలిస్టునేనా అనిపించి అనిపించి మొద్దుబారిపోయి, అస్ధిత్వానికి సంబంధించిన ఒక గుర్తింపు కూడా వుండాలి కాబట్టి, సుదీర్ఘకాలం నుంచి జర్నలిస్టుగానే వుంటున్నాను కాబట్టి జర్నలిస్టునే అని సమాధాన పడిపోతున్నాను
ఇంకొంత మంది రచయిత,కవి, సాహితీవేత్త అంటారు ఈ మాటలు విన్నపుడు సిగ్గనిపిస్తుంది, ఇబ్బందిగా వంటుంది. నేను ఏమీ చదువుకోలేదు ఏమీ రాయలేదు. ఏదైనా అనిపించినపుడు ఆ అనుభూతిని అక్షరాల్లోకి మలచే ప్రయత్నాలు అనేక విఫల ప్రయత్నాలు మాత్రమే చేయగల మనిషిని. అసలు ఏంతెలుసని నన్ను రచయిత కవి సాహితీవేత్త అంటున్నారని చికాకు అసహనాలు కలుగుతూంటాయి. 
ఏమో ఎందుకో తెలియదుకాని హైస్కూల్ దశనుంచి భావ కవిత్వం చదవడం మీద నాకు ఇష్టం (ఆరకం కవిత్వాన్ని భావకవిత్వ మంటారని అప్పుడు నాకుతెలియదు) ఊరిచివర ఏటిఒడ్డున కొండమీద కవిత్వం చదవడం గంటలు గంటలు ఒంటరిగా వుండటం ఇష్టంగా వుండేది. ఇపుడున్న అక్షరజ్ఞానం అపుడువుంటే ఆ ఒంటరితనపు ఆలోచనలు రచనలై వుండేవేమో!
చాలామంది అబ్బాయిల్లాగే అప్పట్లో నేను కూడా ప్రతీ అమ్మాయినీ ప్రేమించాను. ఇప్పటికి కూడా మారలేదు ప్రతి స్త్రీనీ ప్రేమిస్తాను. స్త్రీ అంటే ప్రకృతి కాబట్టి 
ఈ ప్రేమ చుట్టూతిరిగే భావాలు అక్షరాలైతే భావకవిత్వమౌతుందని అర్ధం చేసుకున్నాక నా ప్రేమగురించి కవిత్వం రాయడం మొదలు పెట్టాను. నాకే నచ్చలేదు. గొప్పకవులు రాసినవి చదవడం మొదలు పెట్టాక, తనివి తీరక వాటిమీద వ్యాసాలు రాయానిపించింది. భాష్యాలు వ్యాఖ్యానాలకోసం శాంతా మేడమ్ ని అనేకసార్లు విసిగించి నోట్సు రాసుకున్నాను. ఇదంతా నా 20-25 ఏళ్ళ వయసులో జరిగింది. ఆతరువాత మరో ఐదేళ్ళకు యాహూ ఛాట్ గ్రూపులలో ఒక సరస శృంగార గ్రూప్ కోసం కిరణ్ పేరుతో కొన్ని వ్యాసాలు, అనేక పేరాలూ రాశాను.
అందులో ఈ వ్యాసమొకటి.  ఒక ఫ్రెండ్ తన టైమ్ లైన్ మీద చేసిన బంగారి మామ ప్రస్తావన చూడగానే ఇదంతా గుర్తువచ్చింది. 
పాతిక ముప్పై ఏళ్ళక్రితం నవీన్ ఒక భావకుడని ఇపుడు అర్ధమౌతోంది. అపుడు నేను పైకి చాలా పల్చగా లోపల చిక్కగా వుండేవాడిని..ఇపుడు పైకి బండగా పొట్టగా పొట్టిగా మారిపోయాను.లోపల పూర్తిగా బక్కచిక్కిపోయాను 
భావకవిత్వం ఏమిటో తెలుసుకోవాలనంటే ఓపికతెచ్చుకుని ఫోటోలుగా అటాచ్ చేసిన బంగారిమామ కోడలు పిల్ల వ్యాసం చదవండి 

Blog at WordPress.com.

Up ↑