దెయ్యం సణుగుడు!


దెయ్యం సణుగుడు!
నన్ను చంపేసిన వాళ్ళమీద నేను చచ్చిపోయిన కొత్తలోవున్నంత కోపం ఇపుడు లేదు. నరాలు బిగబట్టేటంత క్రోధావేశాలను ఎంతదెయ్యాన్నైనా కలకాలం వుంచుకోలేనుకదా! అయితే వాళ్ళకు శిక్షపడితే చూడాలన్న కోరిక మాత్రం నన్ను వదలడంలేదు…
బాగా చదువుకుని, చితికిపోయిన కుటుంబీకుణ్ణి…అంటే బాగా చదువుకోవడం వల్ల చితికిపోయిన వాణ్ణనికాదు. చదువువల్ల బుద్ధీ జ్ఞానాలు కాక డబ్బుపెంచుకునే దారులు పట్టి షేర్ మార్కెట్ లో అంతా పోగొట్టుకున్న వాణ్ణని…
అలా చెడిపోయి ఊరు మార్చేసిన వాణ్ణి…బతకడానికి  గోడౌను గుమాస్తాగా చేరి 27 ఏళ్ళు నిత్యదరిద్రంగా బతికిన వాణ్ణి…..
ఆరేళ్ళ క్రితం నన్ను ఎవరో తలమీదకొట్టి చంపేశారు.
*******
“ఎలాబతకాలి దేవుడా” అని ఏడుస్తున్న నా భార్యను, పిచ్చిచూపులు చూస్తున్న పిల్లల్నీ చూస్తూ ఏమీచేయలేక అలాగే వుండిపోయాను.
అదేపనిగా వచ్చిపడుతున్న అవసరాలకు జీతండబ్బులు చాలక, వేరేలా డబ్బు వచ్చే దారిలేక “ఎలా బతకాలి దేవుడా” అని వందలసార్లు అనుకుని వుంటాను. కొన్నసార్లయితే ఏడ్చేశాను. అలాంటప్పుడు నా భార్య నన్ను ఆనుకుని కూర్చుని చేతులు పట్టుకుని “ఊరుకో దేవుడు ఏదో దారి చూపిస్తాడు” అనేది.
అపుడు ఎంత ధైర్యంగా వుండేదో చెప్పలేను.
అపుడు నాకష్టాలకంటే, ఇపుడు నేనులేకపోవడం మూలాన నా భార్యాపిల్లల కొచ్చిన కష్టం చాలా పెద్దదికదా! మా ఆవిడకుధైర్యం చెప్పడానికి నేను లేకపోయానన్న బాధ నన్ను తొలవని క్షణం లేదు…
ఇంతకంటే నరకం ఇంకేముంటుంది.
నన్ను చంపేసిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారని పేపర్లో పడినట్టు ఇరుగుపొరుగువాళ్ళ పరామర్శలు విని తెలుసుకున్నాను. ఎలాగోలా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాను.
********
పోలీస్ స్టేషన్ వాతావరణం చూస్తేనే భయమేసింది. నేను ఎవరికీ కనబడనన్న నిజం గుర్తొచ్చినా కూడా భయం పూర్తిగా పోలేదు.
ఎంత దెయ్యాన్నైనా ఒకప్పుడు పోలీసులున్న ఊళ్ళో తిరిగిన మనిషినే కదా ? భయం లేకుండా కుదురుతుందా?
అటూ ఇటూ తిరుగుతున్న మనుషులకు అడ్డురాకుండా తప్పుకోవడమూ, సర్దుకోవడమూ ఇబ్బందే అయ్యింది. కాస్త పరిశీలనగా చూస్తే పోలీస్ స్టేషన్లో పెద్దవెంటిలేటర్ కనిపించింది. అందులో నడుము ఆనించి విశాలంగా కూర్చోవచ్చు.
సుఖంగా కాదుగాని ముడుచుకుని పడుకోవచ్చు.
లేచింది మొదలు నిద్రపోయేదాకా నడకలో,  పనిలో, పరుగులో, తిండిలో, విశ్రాంతిలో, పడకలో, ఏకాంతంలో, సుఖంలో ముడుచుకునే బతకడం బతికున్నప్పుడే అలవాటైందికనుక…
ఆ ఇరుకుతో పోలిస్తే పోలీస్ స్టేషన్ లో వెంటిలేటరే నయమనిపించింది.
కాస్తకష్టం మీద అందులోకి ఎక్కేశాను.
పడుచు దెయ్యమైతే ఆ పని చకచకా చేసివుండేదే!
నన్ను చంపేసిన కుర్రాళ్ళు కటకటాల గదిలో బిక్కుబిక్కుమని భయం భయంగా చూసుకుంటున్నరు.
రకరకాల కేసుల్లో పట్టుకొచ్చిన వాళ్ళని పోలీసులు విడివిడిగా పిలిచి గద్దిస్తున్నారు.
“నువ్వైపోయావ్ రొరేయ్” అన్న ఒళ్ళు పొగరు ప్రతీపోలీసులోనూ వుంది.
మూర్ఖులైతే నోరుజేసుకుంటారు…దుర్మార్గులైతే చెయ్యిజేసుకుంటారు
పోలీసులు మూర్ఖులూ దుర్మార్గులూ కూడానని బోధపడింది.
అలాంటి పోలీసుల చేతిలో నన్ను చంపిన వాళ్ళ పాట్లు చూడాలని మహా ఉబలాటంగా వుంది…
ఓ పోలీసు కటకటాల తలుపుతీశాడు. నా హంతకుల్లో ఒక కుర్రాణ్ణి బయటికి తెచ్చాడు. ఏదో చెప్పాడు. వాడునంగినంగిగా ఊ కొడుతూ బయటికి వేళ్ళాడు..నాకేమీ అర్ధమవ్వటంలేదు వాణ్ణి వొదిలెయ్యలేదు కదా అని అనుమానం. కాసేపటికి ఆకుర్రాడు వచ్చాడు. పోలీసుకి ఏదో చెప్పాడు.
అలవాటైన పుట్టలోకి జారుకున్న పాములా కటకటాల్లోకి వెళ్ళిపోయాడు.
ఎస్సై వెళ్ళిపోయాక పోలీసులు మాట్లాడుకున్న మాటల్ని బట్టి, పోలీసులు వెళ్ళిపోయాక కటకటాల్లో వున్న కుర్రాళ్ళ మాటల్ని బట్టీ ఈ పోలీసోళ్ళు సెల్ ఫోన్ రీ చార్జ్ లనీ, బళ్ళకు పెటో్రలనీ, కేటుగాళ్ళకు భోజనాలనీ, స్టేషన్ కి స్టేషనరీ అనీ, కోర్టుకెళ్ళడానికి ఖర్చులనీ, సొంతానికి లంచాలనీ డబ్బులకోసం నన్ను చంపేసిన నలుగురు కుర్రాళ్ళనూ కాల్చుకుతినేస్తున్నారని అర్ధమైంది.
పోలీసుల్ని మేపేసి కేసురికార్డు తక్కవజేసి రాయించుకోవాలనుకంటున్న కుర్రాళ్ళ ఆశ చూసి ఒళ్ళుమండిపోయింది.
ఇక డబ్బులు ఇవ్వలేమని ఇంట్లోవాళ్ళు అంటున్నారని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూంటే నా భార్యాపిల్లలు గుర్తొచ్చి – ఆరాత్రంతా నిద్రే పట్టలేదు.
*******
కుర్రగాళ్ళు కూడా అంతా నీవల్లే అని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. వాళ్ళమాటల్ని బట్టి అర్ధమైందేమిటంటే –
నేను బతికి చెడినవాడినైతే వాళ్ళు బతక్కుండానే చెడిన ఇళ్ళవాళ్ళు…అంటే పుట్టుపేదవాళ్ళన్నమాట. చదువులు లేనివాళ్ళు పద్ధతులులేని వాళ్ళు . గాలికి బతికేస్తున్నవాళ్ళు…ఎలాకలిశారో గాని గాలిగాళ్ళకు సావాసం కుదిరింది.
తిండిలేకపోయినా పడుకోడానికి చోటులేకపోయినా మరేమిలేకపోయినా సర్దుకోవచ్చుగాని సావాసగాళ్ళ మద్య మందు లేకపోతే కుదరదుకదా!
అప్పులుచేసి, ఇంట్లో సామాను ఎత్తుకొచ్చి రోజూ “సావాసం” చేసేవారు. ఇక దారులన్నీ మూసుకుపోయినపుడు ఒకడు ఐడియా వేశాడు. ఏదైనా గోడౌన్ నుంచి సరుకులేపేసి అమ్మేస్తే అప్పులు తీర్చేయొచ్చని- ఆప్రకారం గోడౌన్ కి ఆ గ్యాంగ్ రావడం వాళ్ళ అలికిడికి ఎవరది అనినేనడగడం ఎవడో తలమీద కొట్టడం నేను చచ్చిపోవడం జరిగాయి.
ఆకొట్టినోడితో మిగిలినోళ్ళు – ఎందుకురా కొట్టేశావు అనడిగారు
“భయమేసి” అనివాడి సమాధానం
భయమేస్తే భయపడిపోవాలిగాని కొట్టేసి చంపేస్తారా?
ఆలెక్కన  నేనెంతమందిని చంపేసి వుండాలి?
*******
“అన్నా!ఆడికి రేవెట్టేస్తావనుకున్నాను మీద చేయ్యకూడా వెయ్యలేదేంటి” అని ఓపిల్ల పోలీసు ముదురు పోలీసుని అడిగాడు
“నేరం ఒప్పుకునే దాకానే మనం పోలీసుతనం చూపించాల. ఒప్పేసుకున్నాక ఆడి ఎనకున్నోళ్ళని పిండెయ్యాల. కొట్టి ఏడిపించే పాపం మనకెందుకు తమ్మీ!” అంటూ కొత్తపోలీసు కి పనినేర్పుతున్నానన్న సీనియారిటీ దర్పాన్ని ఆ పెద్దతను చూపించాడు.
నాకు నడుం విరిగిపోయినట్టయింది. నన్ను చంపేసిన కుర్రోళ్ళని పోలీసులు కొట్టరని తేలిపోయింది.
ఆదికళ్ళారా చూద్దామనే కదా పోలీస్ స్టేషన్ లో ఇన్నాళ్ళూ పడిగాపులు పడివున్నాను.
నీరసంగా ఇంటికి బయలుదేరాను. భార్యా పిల్లలు టివి చూస్తున్నారు. మధ్యలో చిన్నగా నవ్వుతున్నారు. మనసు చివుక్కుమంది. నన్ను మరచిపోయారని కష్టమేసింది.
నేను మాత్రం ఇన్నాళ్ళూ వీళ్ళని మరచిపోలేదా అని దెయ్యాత్మ నిలదీయడంతో నాకు నేనే నిబ్బరం తెచ్చుకున్నాను.
పోనిలే వాళ్ళు దుఃఖం నుంచీ కష్టం నుంచీ మనుషుల్లో పడుతున్నారని సంతోషపడ్డాను
చాలారోజుల తరువాత నాగదిలో మా మంచంమీద భార్యపక్కనే పడుకోవడం బాగుంది. డబ్బు కష్టమొచ్చినరాత్రి  (అసలు కష్టమంటే డబ్బులేకపోవడమే కదా!  అది నెలకి 15 రోజులు వుండేదే) ఒకళ్ళకొకరం చెప్పుకుని ఒకరినొకరు పట్టుకుని అలాగే నిద్రపోయేవాళ్ళం. ఇవాళ కూడా అలాగే పడుకోవాలనిపించింది…
కానీ!  దెయ్యం కోరికలు తీరవుకదా! కోరిక తీరకపోవడమే దెయ్యం కదా!
*******
కుర్రగాళ్ళని కోర్టులో పెట్టారు. ఏడాదిన్నరో ఏమో రిమాండు మీద రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టేశారు. మా ఇంట్లో వాళ్ళూ నన్ను మరచిపోయారు. ఏదో బతికేస్తున్నారు. రోజులు గడచిపోతున్నాయి. నాకూ ఉత్సాహం తగ్గిపోయింది.
ఏవో దెయ్యాలు అపుడపుడూ ఎదురౌతూంటాయి. హలో అనుకోవడమే తప్ప పెద్దగా కలివిడి తనం లెదు. దెయ్యాన్నయ్యాక కూడా నా తత్వం మారలేదు.
నన్ను చంపేసిన కుర్రగాళ్ళకి ఉరిశిక్ష పడితే ఆతరువాత నా ప్రాణం పోయినా ఫరవాలేదనిపిస్తూంది. ఏదో మాటల్లో ఈ మాటే అంటే ” అంతలేదు ఉరిశిక్ష సమస్యేలేదు మహా అయితే లైఫ్ –
మర్డర్ కేసంటే న్యాయం జరిగినా జరగకపోయినా పోలీసులకూ ప్లీడర్లకూ పంటే పంట” అన్నాడు లోకజ్ఞానం కాస్త ఎక్కువ గా వున్న ఒక  దెయ్యం పిల్లడు
ఉరి శిక్షలు పడటం లేదని తెలిసినా ఏదో ఆశ. ఏపగా కక్షా లేకపోయినా తాగడానికి చేసిన అప్పులు తీర్చడానికి క్రూరంగా చంపేసిన కేసుకాబట్టి రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసుగా చూసి వాళ్ళకి ఉరేసేస్తారని ఆశ. ఈ ఆశే నన్ను ముందుకి నడిపించింది.
అసలు ఏంజరుగుతూందో తెలుసుకోవాలని కుర్రగాళ్ళని అనుసరించడం మొదలుపెట్టాను. వీళ్ళ ప్లీడరిల్లు, కోర్టు చూశాను నేనండటానికి వెంటిలేటర్లు చూసుకున్నాను. ప్లీడరు పెద్దబిల్డప్ ఇవ్వడం.కుర్రాళ్ళ వెధవమొహాలతో చేతులు కట్టుకుని నిలబడటం ఇళ్ళకు వెళ్ళి బాబుల్ని పీడించడం వాళ్ళు తలతాకట్టు పెట్టీ, ఉన్నది అమ్మీ డబ్బివ్వడం ప్లీడర్ అదిమింగేసి ఇంకా తెమ్మనడం నెలనెలా జరిగేది…అది ప్రతి పదిహేను రోజులకీ మారింది…చివరికి వారం వారం ఇదేపనైపోయింది.
కుర్రగాళ్ళ మొహాలు చూస్తే శిక్ష పడిన వాడి దుఃఖం లా వున్నాయి.
ప్లీడరే  డబ్బు పిండేసి వారం వారం శిక్ష వేస్తున్నడనిపించింది. తప్పుచేసిన వాళ్ళనొదిలెసి తల్లిదండ్రులకు శిక్షవేయడం అన్యాయమని పించింది…ఆభావన వచ్చిన క్షణాల్లోనే తేరుకున్నాను. నన్ను చంపేసిన వాళ్ళమీద కనికరమేమిటి? మెత్తబడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను
ఆర్గ్యమెంటే్ల మిగిలాయి. “జడ్జిగారే ప్రశ్నలు వేస్తున్నారు మర్డరంటే లైఫ్ కి తక్కువ వెయ్యడు. ఇప్పటికే 12 లైఫులు వేశాడు..ఇలాంటి మాటలు నాకైతే చెవిలో తేనెపోసినట్టున్నాయి. ప్రాసిక్యూటర్ లా జడ్జిగారే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూండటాన్నబట్టి లైఫ్ ఖాయమేనని కోర్టుగుమాస్తాలూ ప్లీడరు గుమాస్తాలూ అనుకోవడం విని
నా దెయ్యపు జీవితం సఫలమైనట్టే ననిపించింది.
ఆవారం ప్లీడరు అతని గుమాస్తాలూ కుర్రాళ్ళ తల్లిదండ్రుల్నికూడా బాగా నమిలేశారు. ఒకతని ఆస్ధి అప్పటికే అయిపోయిందట. ఇంతా తినేసిన ప్లీడరు మీ అదృష్టమెలావుందో అనేశాడట. తిరగబడిన ఓ తండ్రిని గుమాస్తా పక్కకితీసుకువెళ్ళి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోపని కాస్త ఖర్చు ఎక్కవే అనేశాడట.
అవి నిజాలో వదంతులో నేనైతే స్వయంగా వినలేదు
ప్రతీ ఇంట్లోనూ పెద్దోళ్ళు నన్ను ఖూనీ చేసిన కుర్రాళ్ళని తిట్టిపోసేస్తున్నారు.
నన్ను చంపినందుకు కాదు. వాళ్ళని అప్పుల పాలు చేసినందుకు.
“అతన్ని అన్యాయంగా చంపేశారు కదరా” అని
ఒక్కసారైనా తల్లిదండ్రులు అనలేదు.
ఒక్కసారనా పోలీసులు అనలేదు.
ఒక్కసారైనా ప్లీడరు అనలేదు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేవాడేమో గాని ఆయన ఎప్పుడూ బిజీనే. ఆకోర్టులో వాయిదాకివెళ్ళారనీ, ఇంకోవూరు సర్కారీ పనిమీద వెళ్ళారనీ …అసిస్టెంట్లు చెబుతూండేవారు. ప్రతీసారీ మొహం చిట్లించి ముక్కుమీద కళ్ళజోడు ఎగదోసుకునే వారేగాని జడ్జీగారు ఏమనేవారుకాదు. మరి ఆయనకీ తెలుసును గదా ప్రభుత్వ ప్లీడరుపని ఎంతెక్కువ వుంటుందో…
ఖూనీకోరు కుర్రాళ్ళూ ఒక్కసారికూడా తప్పుచేశామని అనుకోలేదు.
రిమాండులో వున్నప్పుడైనా వాళ్ళతప్పు వాళ్ళుతెలుసుకునే ప్రశాంతతను  జైలు అధికారులు ఇవ్వనే లేదు.
అంతకు ముందూ, ఆతరువాతా నేరం నుండి బయటపడే ఆలోచనలకే, డబ్బుల వేటకే వాళ్ళకు సమయం చాలలేదు.
ఇక నేరం గురించి నేరగాళ్ళకు ఆలోచన ఎక్కడ? పరితాపం ఎక్కడ?
*******
తీర్పుఇచ్చే రోజు వచ్చేసింది. నా ఖూనీకోర్లు, వాళ్ళని కన్నవాళ్ళతోసహా చేరిపోయి ఏడుపుమొహాల తో వున్నారు. గుమాస్తాలు అసిస్టెంట్లు తప్ప అసలు ప్లీడరు కనబడనేలేదు. అతని పెద్ద అసిస్టెంటు మాత్రం బితుకు బితుకు చూపులతో  పోలీసు ఎస్సైల చుట్టూనే తిరుగుతున్నాడు.
శిక్షలు పడ్డాక ఖూనీకోర్ల తల్లిదండ్రులు ” అంత డబ్బూ తినేసి ఇదేంపనయ్యా” అని నిలదీసే అవకాశం వుందికదా మరి!
*******
కోర్టుహాలు నిశ్శబ్దమైపోయింది. జడ్జీగారు తీర్పు చదవడం మొదలు పెట్టేశారు. చెవులు తుడుచుకుని శ్రద్ధగా వింటున్నాను….
కాపలాపనిలో వున్నపుడు ఆ గుమాస్తా బలవంతపు చావు చనిపోవడం అన్యాయమన్నారు….
ఒక విధమైన ఉద్వేగంతో నాకు దుఃఖం వచ్చింది.
అవును మరి …నేను చనిపోయిన ఆరేళ్ళకు మొదటిసారిగా నావిషయంలో ఒకాయన ధర్మం మాట్లాడుతున్నారు !
“ఏపగాలేకుండా కేవలం వ్యసనాలవల్ల పెరిగిన అప్పులు తీర్చుకోడానికే హత్య చేసి వుంటే అది చాలా దారుణం” అన్నారు
నాకు ఆదుర్ధాపెరిగిపోతోంది…ఆయన చదివేస్తున్నారు.
“100 మంది అపరాధులను విడిచిపెట్టినా ఫరవాలేదు…..”
అదెలా కుదురుతుందీ అనుకున్నాను.
కారణమేమైనా కానీ ఓ మనిషి ప్రాణాన్ని సాటిమనుషులే తీసేయడం దారుణం కదా! నేను లేకపోవడంవల్ల దశదిశా నడకా మారిపోయిన నాకుటుంబానికి పరిష్కారం ఏమిటి?
అసలు దేవుడుపోసిన ప్రాణం ఊపిరి ఆపేయడానికి మనుషులెవరు? చచ్చిపోయిన నన్ను మళ్ళీ పూర్వపు మనిషిగా మార్చడం ఆదేవుడివల్ల కూడా కాదుకదా…
ఇలా పరిపరివిధాలా పోతున్న ఆలోచనల్ని అతికష్టం మీద ఆపుకుని జడ్జిగారు చెబుతున్న తీర్పుని చెవులప్పగించి వింటున్నాను.
“నిందితులంతా కుర్రవాళ్ళు …ఎంతో భవిష్యత్తువున్నవాళ్ళు…”
నాకు భవిష్యత్తే లేకుండా చేశారు కదా! అని దుఃఖమొచ్చింది-నేరం చేసిన వాళ్ళని నేరగాళ్ళు అనకుండా ఈ జడ్జిగారు నిందితులు అంటున్నారేంటో
“ఈ నేరం నిజమే,  అయినా ఖచ్చితంగా ఈ కుర్రవాళ్ళే నేరం చేశారని ప్రాసిక్యూషన్ వారు నిస్సందేహంగా నిరూపించలేక పోయినందున కేసు కొట్టి వేయడమైనది” అని చెప్పేశారు.
అపుడు…నాతలమీద వాళ్ళు అదాటుగా కొట్టిన దెబ్బ తాలూకూ నెప్పి తెలియలేదుకాని,
ఈ తీర్పు నా ఆశల్ని ఆరేళ్ళ పడిగాపుల్ని, ఖూనీకేసులో న్యాయం జరిగితీరుతుందన్న నమ్మకాన్ని నిలువునా కూల్చేసింది.
దారుణమైన ఆశాభంగం నమ్మకానికి అనుకోని ద్రోహం ఎంత బాధపెడతాయో అనుభవమౌతున్నపుడు  పగవాడికి కూడా ఈ అవస్ధవద్దు అనుకోకుండా వుండలేకపోయాను
కుర్రాళ్ళ మొఖాలు వెలిగిపోతున్నాయి. కోర్టు బంటో్రతులు గుమాస్తాలు ప్లీడరు గుమాస్తాలు ఆ కురాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళ మీద సంతోషపు మామూళ్ళకోసం వాలిపోయారు.
ఆదృశ్యం పుండుమీద వాలిన ఈగలు కుళ్ళుని ప్రేమగా జుర్రుకుంటున్నట్టుంది. డిఫెన్సు ప్లీడరు, పబ్లిక్ ప్రాసిక్యూటరూ పక్కపక్కనే నిలబడి నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు
అయితే వాళ్ళ చూపుల తోనే పుళ్ళని జుర్రేసుకోవడం అర్ధమైపోతూనే వుంది.
నాకైతే ఆశతోపాటే ఆలోచనలు కూడా చచ్చిపోయాయి. అక్కడవుండబుద్ధికాలేదు…ఇంకెక్కడా వుండాలని కూడా అనిపించడంలేదు
######
రచయిత:
బతికుండగా కాని చచ్చిపోయాకగాని ఇంతటి దిగ్రా్భంతి తగలని దెయ్యం,
దెయ్యం బ్రతుకుకూడా వృధా అయిపోయిందని దిగులుపెట్టుకుంది. తనలోతానే ఏదో మాట్లాడుకుంటూవుండేది
ఎవరి బతుకులు వాళ్ళకే ఇరుకైపోవడం వల్లో, చాదస్తపు సణుగుడుని భరించలేకపోవడం వల్లో ఏనాలుగైదో వున్న దెయ్యం ఫ్రెండ్స్ కూడా మొహం చాటుచేశాయి.
తప్పుచేసినా చేయకపోయినా దోరికిన వాళ్ళని పోలీసులూ ప్లీడర్లూ పీకేసుకు తినేయడం తప్ప న్యాయం లేదు అని గొణుక్కుంటూ తిరిగిన దెయ్యం ఏమైపోయిందో తెలియదు
న్యాయం జరగలేదన్న బెంగతోనే ఆదెయ్యం చచ్చిపోయివుంటుంది
పెద్దాడ నవీన్
%d bloggers like this: