గాంధీగారి ప్రస్తావన వచ్చినపుడు శ్రద్ధగా వినడం మధ్యలో వెళ్ళిపోవలసి వచ్చినపుడూ, చర్చ ముగిసినపుడూ భక్తి భావంతో నమస్కరించడం నా చిన్నతనంలో చాలా సార్లు చూశాను…ఇక నెహ్రూగారైతే పెద్దలకు ముచ్చట, యువకులకు హీరో…ముద్దొచ్చినా ప్రేమొచ్చినా బూతుమాటలతో ప్రస్తుతించే అలవాటు పల్లెల్లో వుండేది. సినిమాతారలతో ఇంగ్లీషు దొరసానులతో నెహ్రూగారి స్నేహాలకు రసికతను పులిమి కుర్రవాళ్ళు ముచ్చట్లాడుకోవడం, పెద్దవాళ్ళు ‘ ఎదవ మాటలూ మీరూ’ అని మందలించి వాళ్ళు వెళ్ళిపోయాక అవే కబుర్లు కొనసాగించిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి.ఇదంతా నెహ్రూగారు మరణించాక పదేళ్ళయినా సాగింది. ఆ తరువాత చాలా కాలం నాకు కూడా నెహ్రూయే హీరో. 
 
ఇందిర హయాం ఓట్ల వేటతో మొదలైంది. గెలవడం కోసం మనుషుల్ని ఓటు బ్యాంకులుగా మార్చేసి, చీల్చేసి ఎక్కువ ఓట్లున్న వాళ్ళని పేంపర్ చేయడం వల్ల వాళ్ళ మీద విస్మరించబడిన వారికి ద్వేషం పెరిగేవాతావరణానికి ఉద్ధేశ్య పూర్వకంగా కాకపోయినా ఆమే నాంది పలికింది. ఆమె అధికారవ్యామోహానికి పరాకాష్ట ఎమర్జన్సీ విధింపే. 
 
ఆ సమయంలో కూడా నెహ్రూ యే నాహీరో
 
దేశాన్ని టెక్నాలజీ మిషన్ మీద ఎక్కించిన రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడే. 
 
సోనియా రాజకీయరంగ ప్రవేశమే వికృత శిశుజననం అన్నట్టు జరిగింది. బాధ్యతలు లేని అధికారం, పెత్తనం ఆమెలో ప్రజాదృక్పధం అంటే ఏమిటో తెలియని రాణి గా మార్చేసింది. అవినీతి మయమైన కోటరీ తన ప్రయోజనాలకోసం ఆమెను అలాగే కోనసాగింపజేస్తోంది. ఫలితంగా కాంగ్రెస్ బ్రష్టుపట్టిపోయింది. కాంగ్రెస్ ని ఇప్పటికీ ప్రేమించేవారు నీడా అండా కోల్పోయునట్టు బాధపడుతున్నారు.
 
నరేంద్రమోది విజయాలు నాకైతే ‘చింతకాయలు రాలుతున్న సమయంలో ఆయన బిగ్గరగా చదువుతున్న మంత్రాలే’ అనిపిస్తున్నాయి. జాతీయనాయకుడైన నెహ్రూముందు వల్లభాయ్ పటేల్ కు అంతటి ప్రాచుర్యం రాకపోవడం ఆశ్చర్యమేమీకాదు. అయితే పటేల్ గౌరవాని్న కాంగ్రెస్ భంగపరచలేదు. 
 
పటేల్ ను ప్రపంచంలోనే ఎత్తుగా నిలబెట్టాలని మోదీ తలపెట్టడంలో దేశభక్తి కంటే నెహ్రూ నీడల్ని తుడిచి పెట్టెయ్యాలన్న ఆలోచనే కనిపిస్తోంది. అధికారంలో వున్నవారు కాబట్టి ఏమైనా చేయగలరు…అలాగని కాంగ్రెస్ కు దేశానికి నెహ్రూ సాధించిన వైభవాన్ని, అసమర్ధతతో కాంగ్రెస్ ని అవినీతితో దేశాన్ని పతనం చేసిన సోనియాచరిత్రను ఎవరూ మార్చలేరు కూడా! 
 
వ్యాధుల వల్ల పిల్లల్లో అయిదు నిమిషాలకొకరు చనిపోతున్నారంటే సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ని తప్పుపట్టకుండా కుదరదు..ఇందువల్లే బాలలదినోత్సవ శుభాకాంక్షలు అనలేకపోతున్నాను. 
 
ఒక శకపురుషుడి కీర్తి ప్రతిష్టల్ని కుటుంబపాలనకు కుదించి చివరికి పూర్తిగా దిగజార్చిన హీన వారసుల మీద ఏమాత్రం సానుభూతి కలగడం లేదు. 
 
అయితే దేశానికి స్వాతంత్యం సాధించిన యోధులలో ముఖ్యుడు, తొలి ప్రధాని నెహ్రూగారి 125 వ జయంతినాడు ఆయన్ని భక్తి పూర్వకంగా కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకుంటున్నాను